పరతత్త్యోపదేశం చేస్తూ కృష్ణయజుర్వేదీయ నారాయణ ప్రశ్న –
‘అణోరణీయా న్మహతో మహీయా
నతాత్మా గుహాయాం నిహితో స్య జన్తోః ।
త మక్రతుం పశ్యతి వీత శోకో
ధాతుః ప్రసాదా న్మహిమాన మీశమ్ ।’
ఆ పరతత్త్వం అణువుకంటె మిక్కిలి చిన్నవాడు, మహత్తుకంటె మిక్కిలి గొప్పవాడు. అంతేకాదు. సమస్త జీవుల హృత్పద్మాల్లో కొలువై ఉన్నాడు. ఈశ్వరానుగ్రహం వలన అట్టి సాక్షాత్కార భాగ్యాన్ని పొంది అఖండానందాన్ని పొందుతున్నాడు – అని ప్రబోధిస్తోంది.
అట్టి దర్శన భాగ్యాన్ని ‘అమ్మ’ వంటి అవతార మూర్తులు, సిద్ద పురుషులు, బ్రాహ్మీమయ మూర్తులలో సామాన్యులు సులభంగా పొందుతారు.
అమ్మకి ఐదేళ్ళ ప్రాయంలో మస్తాన్ అనే పోలీసు అమ్మలో అనేక దివ్యదర్శనాలూ, అలౌకికానుభూతులూ పొంది “అమ్మ రూపం పరిమితం, కానీ శక్తి అనంతం’ అన్నాడు. ఆ సమయంలో ఆ వాక్కు సత్యం అని రూఢి చేస్తూ (ప్రకృతి) ఒక్కసారి అన్ని దిక్కులూ అరుణోదయ కాంతితో వెలిగాయి. ఈ సత్యాన్నే ఋజువు చేస్తూ ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానం (Modern Physics) స్పష్టంగా కట్టెదుట చూపింది – అణు విస్ఫోటన (Atom Bomb) సమయంలో అతి స్వల్ప పదార్ధం అగణిత శక్తిగా బహిర్గతమవుతున్నది- అని; దానిని మన చర్మ చక్షువులతో చూశాం.
అణువు, మహత్తు అనగానే శ్రీమద్భాగవతంలో వామనావతార ఘట్టం స్ఫురించక మానదు.
బలిచక్రవర్తి యాగశాలకి వెడుతున్న వామనమూర్తిని వర్ణిస్తూ
పోతనగారు
‘సర్వ ప్రపంచ గురుభర నిర్వాహకుడగుట జేసి నెఱి జనుదేరన్
ఖర్వుని వ్రేగు సహింపక, యుర్వీస్థలి గ్రుంగె, మ్రొగ్గ నురగేంద్రుండున్’ – అన్నారు.
అంటే – శ్రీమహావిష్ణువైన వామనమూర్తి తన కుక్షిలో సమస్తలోకాలను భరిస్తాడు. అందువలన ఆ బాలుడు ఎంత ఒయ్యారంగా నడిచినా ఆతని భారానికి తట్టుకోలేక భూమి క్రుంగింది. ఆదిశేషుడు వంగి పోయాడు అని. అంతేకాదు. ఆ = వామనమూర్తి ‘కొందరితో జర్చించును. కొందరితో జటలు సెప్పు గోష్టిం చేయుం, గొందరితో దర్కించును, గొందరితో ముచ్చటాడు; గొందఱ నవ్వున్’ – ఆ వటువు కొందరితో వాదోపవాదాలు, కొందరితో వేదపఠనం, కొందరితో సల్లాపాలు, కొందరితో వాదన, కొందరితో ముచ్చట్లు, కొందరితో నవ్వులు సాగిస్తూ మెల్లగా అడుగులు వేసెను – అని.
బలిచక్రవర్తి వద్ద కేవలం మూడు అడుగుల నేల దానంగా స్వీకరించిన పిదప – ‘ఇంతింతై వటుడింతయై మఱియు దానింతై నభోవీధిపై సంతై’ – రీతిగా సత్యలోకం వరకు పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండి పోయాడు.
ఆ బుడతడు విశ్వాంతరాత్మగా ఎదిగాడు – అంటే అక్కడ మాయ, మంత్రం, మాహాత్మ్యం ఏమీ లేవు. అది ఆయన నిజ స్వరూపం, నిత్యసత్య స్వరూపం. బుడతడుగా ఉన్నప్పుడు పోయిందీ లేదు. విశ్వరూపుడైనందున వచ్చిందీ లేదు. పరిమితరూపం అనంతమైనది.
మాయా మానుష విగ్రహ అమ్మ. మనయందు దయ తలచి తనను గురించి తానే స్పష్టం చేసింది, అమ్మ అంటే నాలుగు గోడల మధ్య మంచం మీద కూర్చున్నది కాదు. ఆద్యంతములు లేనిది – అన్నిటికి ఆధారమైనది – తొలి – అని. ఒక బాలికగా జన్మించింది, సామాన్య గృహిణిగా ముగ్గురు బిడ్డల తల్లిగా ధర్మాన్ని నిర్వర్తించింది, ‘విశ్వజనని’గా ‘పరదేవతా స్వరూపిణి’ గా ఆరాధించ బడింది.
వామనావతార ఘట్టంలో ఇతఃపూర్వం చెప్పుకున్న వామనమూర్తి అతిలోక వైభవం అమ్మలో సుస్పష్టం. ఉదాహరణకు కొన్ని :
– అమ్మ రంగమ్మ అమ్మమ్మ గర్భాన చేరినప్పటి నుండి ఆమెకు భూభారం మోస్తున్నంత బరువుగా ఉండేది.
– 19 నెలల ప్రాయంలో దానిమ్మ చెట్టు క్రింద శాంభవీముద్రను వేసిన
యోగేశ్వరేశ్వరి.
– రెండేళ్ళ వయస్సు. పాలుతాగే పసిపిల్ల. మన్నవలో మౌనస్వామి వారు రాజ్యలక్ష్మీ అమ్మవారి విగ్రహం క్రింద ‘రాజ్యలక్ష్మీ యంత్రం వేసారని అంటే, నిర్ద్వంద్వంగా అది రాజ్యలక్ష్మీ యంత్రం కాదు, రాజరాజేశ్వరీ యంత్రం అని పల్కిన సర్వసిద్ధాంత సార్వభౌమ: తర్వాత కాలంలో ఋజువు చేసింది కూడా.
– 4 ఏళ్ళ వయస్సులో తన కన్నతల్లి శాశ్వతంగా కనుమరుగైతే ‘దైవం పంపినమనిషి దైవం ఇష్టప్రకారం దైవంలోకిపోతే, మధ్యలో మనకి
ఏడుపెందుకు?’ అని విచారణ చేసిన ఉపనిషన్మూర్తి.
– బాల్యంలోనే పెమ్మరాజు సత్యనారాయణగారు, రామాచార్యులు, మాచెమ్మ, రామయ్య వంటి పెడదారి పట్టిన వారిని గడగడలాడించి వారి మాలిన్యాన్ని క్షాళన చేసి సంస్కరించిన సముద్ధరణ శక్తి.
– ముక్కు పచ్చలారని వయస్సులో సృష్టిలోని సర్వాన్నీ తనలోనూ, తనను సృష్టి అంతటా సందర్శించిన, తాదాత్మ్యం చెందిన ఆత్మావలోకి.
– నేను సర్వసృష్టి కారిణిని అని నిజస్వరూపాన్ని ఎరుకపరిచి, ‘అందరికీ సుగతే’ అని హామీ నిచ్చి, ‘మనుషులందరూ మంచివాళ్ళే’ అని ప్రకటించిన విలక్షణ విశిష్ట మాననీయ మానవీయ సంపూర్ణమూర్తి.
– ‘రాధ అంటే ఆరాధన’, ‘విరామం లేనిది రామం’ అంటూ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, సీత, గోపికలు మున్నగు లోకోత్తర ఉత్తమ పాత్రలను మహోన్నతంగా నిర్వచించి, సమున్నతమైన సముచిత మైన వాస్తవ చిత్రణ చేసిన సనాతనధర్మ స్వరూపిణి, మహాప్రవక్త.
– బాల్యంలో మస్తాన్, ముసలితాత, చిదంబరరావుగార్లతోనూ, తర్వాత కాలంలో డా॥శ్రీపాదగోపాలకృష్ణమూర్తిగారు, శ్రీ వీరమాచనేని ప్రసాదరావు గారు ఇంకా అసంఖ్యాక సందర్శకులతో తత్త్వవిచారణ చేసింది. ఆశ్చర్యం. అమ్మ ప్రాథమిక పాఠశాలకు కూడా వెళ్ళలేదు.
‘సృష్టికి కారణం అకారణం’ అనీ, ‘కర్మ వ్యష్టి కాదు సమష్టి’ అనీ, ‘జగన్మాత అంటే జగత్తుకి మాతకాదు, జగత్తే మాత, సృష్టే దైవం’ అనీ, ‘అనుభవిస్తున్నదే సత్యం’ అనీ, ‘సంసార బాధ్యతలూ ఆధ్యాత్మిక సాధనే’ అనీ, ‘శరీరం ఆత్మకాక పోలేదు’ అనీ ప్రబోధిస్తూ జ్ఞానభిక్షను పెట్టింది.
భ్రుకుటీ భేదనం, కపాల భేదనం వంటి అత్యున్నత యోగసిద్ధులు అమ్మకు అత్యంత సహజంగా కలిగినవి. ‘నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీపప్రభ’ అమ్మ అనే వాస్తవం అమ్మకి సన్నిహితంగా మెలిగిన వారికి దినచర్యలో భాగమే.
అమ్మ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది, వామనమూర్తి. కానీ, కొన్ని చిత్రాల్లో భారీ విగ్రహంగా కనిపిస్తుంది. ఒక సందర్భంలో తాను త్రికాలాబాధ్య అనే సత్యాన్ని వివరించింది – “చూడటానికి పొట్టిగా ఉన్నాను. కానీ నాకు చాలా వయస్సు ఉన్నది. ఇంత అని చెప్పలేను – చెప్పేది కాదు కనుక. చెబితే తెలుసుకుండేది కాదు” అని. ఆ వివరణ, వర్ణన అమ్మ విరాట్స్వరూపాన్ని సహస్రకోణాల అభివర్ణిస్తాయి.
అమ్మ అవాజ్మానస గోచర,
నిత్యసత్య తేజోమయి,
ఆది, అనాది, కాలాతీతమహాశక్తి,
కారుణ్యావతారమూర్తి.
అమ్మరూపం పరిమితం, కానీ శక్తి అనంతం. పరుగు పరుగున వెళ్ళి బాధితుల కన్నీటిని తుడిచి సుఖ శాంతులను ప్రసాదించడమే లక్ష్యంగా, తర తమ భేదం లేక ఆదరణ, ఆప్యాయతలను పంచడమే నిత్యకృత్యంగా, అందరినీ అన్నిటినీ తన కన్నబిడ్డలుగా, కంటి పాపలుగా ఎంచి సంరక్షించటమే కర్తవ్యంగా, వ్యక్తుల దౌష్ట్యాన్ని ధ్వంసంచేసి సంస్కరించడమే లక్ష్యంగా, ఏకోదర రక్త సంబంధ బాంధవ్యాన్ని ప్రోదిచేయడమే ఆచరణాత్మక ప్రబోధంగా, నిఖిల జీవాళిని ఉద్దరించడమే దివ్యమాతృధర్మంగా అమ్మ ఈ అవనీస్థలిపై నడయాడి 12.6.1985న శరీరత్యాగం చేసి 14.6.1985న ఆలయ ప్రవేశం చేసింది, మహాభినిష్క్రమణం చేసింది.
ఎవరి కోసం? మనందరి కోసం. అమ్మ మహితవాక్కు “మీతో నేను, నాతో మీరు. అంతే. నేనెక్కడకూ పోను” – అన్నది. ‘ప్రకృష్టేన తిష్ఠతి ఇతి ప్రతిష్ఠా’ – అనే ఆర్షనిర్వచనం అమ్మ పరంగా ప్రత్యక్షర సత్యం.
12.6.2022 నుండి 14.6.2022 వరకు త్రయాహ్నిక దీక్షగా జిల్లెళ్ళమూడిలో నిర్వహించుకునే అమ్మ అనంతోత్సవాల్లో పాల్గొందాం, మానవ సౌభాగ్య దేవతను అర్చించి తరిద్దాం.