”అమ్మకు అక్షరార్చన అనే అంతర్జాల వేదికపై 7-11-2021న జరిగిన నా ప్రసంగంలోని విషయమే ఈ వ్యాసము.
మనం ఎన్నో థాబ్దాలుగా జిల్లెళ్ళమూడిలో ”అమ్మ”ను లలితాస్వరూపిణిగా, అవతారమూర్తిగా భావిస్తూ ఆరాధిస్తున్నాం. సోమ, శుక్రవారాల్లో లలితా లక్షనామార్చనలు, హైమ జయంతి వంటి ప్రత్యేక సందర్భాలలో లలితాకోటి నామ పారాయణలు నిర్వహించుకుని, ”అమ్మ” కరుణకు పాత్రుల మవుతున్నాం. ఇది కేవలమూ మన భావన మాత్రమే కాదని, ”అమ్మ” మాటలు, చేతలూ పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ”అమ్మ” లోని ప్రతి కదలికా మనకు లలితా త్రిపురసుందరినే స్ఫురింప చేస్తుంది.
”జిల్లెళ్ళమూడిలో స్త్రీరూపధారిణియై దిగివచ్చి నిల్చినది దివ్యమాతృప్రేమ” అని ఒక భక్త కవి ప్రకటించినట్లు మనం చూసిన ”అమ్మ” ప్రేమమూర్తి. ఎందరో ”అమ్మ”ను తమ తమ ఇష్టదైవాలరూపాలలో దర్శించి, పులకించిన వారున్నారు. కానీ, ”అమ్మ” మాత్రం-
”నేను దైవాన్ని కాను; మీరు భక్తులు కారు.
నేను గురువును కాను; మీరు శిష్యులు కారు;
నేను అమ్మను, మీరు బిడ్డలు” అని చాలా స్పష్టంగా చెప్పింది. ‘మీరు’ అంటే ఒక్క మానవులమైన మనం మాత్రమే కాదు; పశుపక్ష్యాదులూ, క్రిమి కీటకాదులూ కూడా ”అమ్మ”కు బిడ్డలే. ”నేను మీకు, మీకు, మీకు, మీకు – క్రిమికీటకాదులకు, పశుపక్ష్యాదులకు కూడా తల్లిని” అని ప్రకటించిన ”అమ్మ” ”విశ్వమాత” అయిన లలితాదేవికి ప్రతిరూపమే. తనకు వచ్చిన ‘గడ్డ’ కూడా ”అమ్మ”కు బిడ్డే. పత్రిక కూడా పుత్రికే.
చిన్నతనంలోనే గారెలకు పప్పు కడుగుతూ పప్పులో, పొట్టులో, గిన్నెలో, నీళ్ళల్లో అంతటా చైతన్యాన్ని గుర్తించి, వాటితో మాట్లాడిన తల్లి. ”అంతా జీవమయం. నా దృష్టిలో జడమే లేదు” – అని ప్రవచించిన ”అమ్మ” – గణాంబ. గణమంటే ప్రపంచంలోని సమస్త పదార్థాల సమూహం. చరాచరసృష్టికి తల్లి అయిన లలితాదేవి గణాంబ. వరదను ఆడబడుచుగా భావించి, చీరసారెలతో సంభావించి, సాగనంపిన తల్లి. తన బుగ్గమీద దోమకుట్టి దద్దురెక్కితే, దోమ ముద్దుపెట్టుకున్నదని మురిసిపోయిన తల్లి. ఇలా సృష్టిలోని చరాచరములను తన బిడ్డలుగా ప్రేమించిన ”అమ్మ” ”గణాంబ”.
చిన్నతనంలోనే చింతచెట్టు ఎక్కి, అక్కడ ఉన్న కాకి, కోకిల, చిలుక, గోరువంక, ఉడుతలను లాలించి, ఆటలాడుకున్నదీ బుజ్జితల్లి. ఆ పసిప్రాయంలోనే తన వంతు ఆహారాన్ని పిల్లలతో ఉన్న తల్లి పందికి పెట్టి ఆనందించిన ”అమ్మ” – ”ఆబ్రహ్మకీటజనని” అయిన లలితాదేవి ప్రతిరూపమా అనిపించక మానదు.
”అమ్మ” ప్రేమ కారణాలతో ముడిపడినది కాదు. అది అవ్యాజం. అంటే కారణాలతో పనిలేనిది. మొండి మొలతో వచ్చినవాడికి తన పైటకొంగు చించి గోచీగా పెట్టడం, వర్షంలో తడిసిముద్దయిపోయి, నీళ్ళుకారుతూ వచ్చి స్త్రీమూర్తికి తాను కట్టుకోవటానికి ఉన్న పట్టుచీరను కట్టబెట్టడం, చిన్నతనంలోనే బట్టలు లేని చిన్న పిల్లకు తాను ధరించిన బట్టలు ఇచ్చివేయడం – ”అమ్మ”లోని అవ్యాజకరుణకు నిదర్శనాలు.
పాలుగారే ప్రాయంలోనే తనకు ప్రసాదంగా ఇచ్చిన వడపప్పులో కాసిని మిరపకాయలు, కొంచెం ఉప్పువేసి రోట్లో రుబ్బి, పచ్చడిగా చేసి బీదవారికి అన్నంలోకి ఆధరువుగా ఇచ్చిన ”దయామూర్తి” – ”అమ్మ”. జీడిపప్పు అమ్మే పిల్లకు ఒక కానీ జీడిపప్పు కొని, ఇచ్చి, తినమని చెప్పిన ”కరుణారససాగర” – ”అమ్మ”. ఇద్దరు బిడ్డలున్న ఒక అంధురాలికి తన చేతి బంగారుగాజు నిచ్చిన ”సాంద్రకరుణ”.
ఇలాంటి సన్నివేశాలు ”అమ్మ”లోని సహజ సిద్ధమైన దయాగుణాన్ని ప్రకటిస్తూ – ”దయామూర్తి”, ”సాంద్రకరుణ”, ”కరుణారససాగర”, ”అవ్యాజకరుణా మూర్తి” అనే లలితాదేవి నామాలకు సాకారమే ”అమ్మ” అని తెలియచేస్తాయి.
”సృష్టే ప్రేమమయం. సృష్టంటేనే మాతృత్వం” అనే వాక్యం ”అమ్మ”లోని విశ్వజనీనమైన ప్రేమ తత్త్వాన్ని ప్రకటిస్తోంది. ”ప్రేమే తల్లి కానీ తల్లి ప్రేమ కాదు” అని చెప్పిన ”అమ్మ”. జిల్లెళ్ళమూడి మీదకు దాడిచేసిన నక్సలైట్లను కూడా తన బిడ్డలుగా ఆదరించిన ఆదర్శ మాతృమూర్తి. ఆ దొంగలను గుర్తించమని ”అమ్మ” ముందు వారిని నిలబెట్టినప్పుడు ముందువారి ఆకలి తీర్చమని చెప్పిన ”ప్రేమరూప”. సున్నపు పని చేసి, చేతులు పుళ్ళు పడి, అలసటతో నిద్రించిన పిల్లలు ఆకలి తీర్చడానికి తనకు లేని ఓపికను కూడ గట్టుకుని, వారికి అన్నపు ముద్దలు నోటి కందించిన ఆ ప్రేమకు మాటలు లేవు. పనులు చేసే పిల్లలకు ఇడ్లీలు పెట్టి, తియ్యటి పెరుగు వేయమని చెప్పిన ఆ ప్రేమకు కొలతబద్ద ఏది? ”ప్రేమరూపా” అనే లలితాదేవి నామానికి నిలువెత్తు నిదర్శనమే మన ”అమ్మ”.
”అమ్మ” అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది అన్నపూర్ణాలయం. పేరుకు అనసూయే కానీ తీరుకు మాత్రం అన్నపూర్ణాదేవి మన ”అమ్మ”. ”ఎందరు గానీ, ఎప్పుడు రానీ ముందుగ విందులు చేయును జననీ” అన్నట్లు ఏ వేళప్పుడు వచ్చినా, ఎవరు వచ్చినా అన్నపూర్ణాలయంలో అన్నం సిద్ధంగా ఉంటుంది. అందుకే ”ఆకలేసి కేకలేసి నారెందరొ తొల్లి; ఆకులేసి కేక లేసె ఈ అందరి తల్లి” అన్నారు నదీరా. ”అడిగితే గాని అమ్మయినా పెట్టదు” అనేది పాతసామెత. ”అడక్కుండా పెట్టేదే అమ్మ” అని సరికొత్త నిర్వచనాన్ని చెప్పింది అమ్మ. ”మనిషికి అన్ని బాధలకంటే ఆకలిబాధే ఎక్కువ అనిపిస్తుంది నాకు” అని చెప్పి ”అమ్మ” – ”అన్నం పెట్టడానికి ఆకలే అర్హత” అని ప్రకటించింది. అందుకే డ్రస్సును బట్టి, ఎడ్రస్సును బట్టికాదు. ఆకలిని గమనించి అన్నం పెట్టాలనేదే ”అమ్మ” మనకు అందించిన సందేశం. లక్షమంది తిన్నప్పటికీ ఒక్కడు తినకపోతే ”అమ్మ” మనసు విలవిల్లాడిపోతుంది. ”ఒక్కడు చాలడూ తినకుండా వెళితే” అని వాపోతుంది ఆ మాతృ హృదయం. ఎవరైనా ఆకలితో జిల్లెళ్ళమూడి నుంచి వెళ్ళకూడదనేదే ”అమ్మ” సిద్ధాంతం. ”గుండిగ దిగితే గుండిగ ఎక్కాలి” అనేది అన్నపూర్ణాలయ సిబ్బందికి ”అమ్మ” ఆదేశం. ‘అమ్మా! నీ రాశి ఏమిటి?’ అని ఒకరు అడిగితే ”నా రాశి బియ్యపురాశి” అని చెప్పింది ”అమ్మ”. ఎంత గొప్పమాట! బియ్యపురాశి అంటే అన్నపు ప్రోగు యేగా! అంటే ”అమ్మ” – అన్నపూర్ణాదేవియేగా! అన్నపూర్ణాలయం ”అమ్మ”కు గుండె అయితే, ఆ గుండె చప్పుడే అక్కడి ఘంటారావం. తన శరీరాన్ని వదిలివెళ్ళే సమయంలో కూడా అన్నపూర్ణాలయంలో గంట కొట్టించి, అందరికీ భోజనం ఏర్పాటు చేసిన ”అన్నద” మన ”అమ్మ”. ”అన్నదా” అంటే అన్నం ప్రసాదించే తల్లి అని అర్థం. ”నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అన్నదే ”అమ్మ”. మనకు చేసిన ఉపదేశం. ”ఆదరంగా పెట్టుకో” అనడంలో ఒక తల్లి తన బిడ్డకు ఎంతప్రేమగా, ఆప్యాయంగా తినిపిస్తుందో అంత ప్రేమగా పెట్టుకొమ్మని ”అమ్మ”చేసిన ప్రబోధం. పదమూడేళ్ళ ప్రాయంలోనే తన పెళ్ళికి వచ్చిన అందరికీ భోజనం చేసి వెళ్ళమని సైగ చేసింది ”అమ్మ”. చిన్నతనం నుంచీ తన వంతుల ఆహారాన్ని బిచ్చగాళ్ళకూ, బీదవారికీ మాత్రమే కాక జంతువులకు కూడా పెట్టి ఆనందించేది ”అమ్మ”. ”అన్నద” అయిన లలితాదేవియే భువిలో వెలసిన ”అమ్మ”.
”జిల్లెళ్ళమూడిలో మంచం మీద కూర్చున్న అమ్మకాదుగా అమ్మ అంటే – ఆదీ, అంతమూ లేనిది” అని ప్రకటించింది ”అమ్మ”. ”నాలుగు గోడల లోపల మంచం మీద కనపడుతున్న రూపం పరిమితమూ, బయట అనంతమూ” అని స్పష్టంగా తన విశ్వవ్యాప కత్వాన్ని తెలియచేసింది. ”అందరూ ఎప్పుడూ చూడరు నన్ను, నేను అందర్నీ ఎప్పుడూ చూస్తాను” అని కూడా చెప్పింది. ”వ్యాపిని” అనే లలితాదేవి నామం ఈ సందర్భంలో మనకు స్ఫురిస్తుంది.
అయితే సర్వత్ర ఉన్న ”అమ్మ” ఎలాగ ఉంటుంది? ”చీమగా, దోమగా ఉన్నది వాడే” అనే ”అమ్మ” వాక్యాన్ని బట్టి వివిధ రూపాల్లో ఉంటుంది అని తెలుస్తోంది. అయితే వాచ్యంగా ”అమ్మ” తన సర్వవ్యాపకత్వాన్ని చెప్పకపోయినా, కొన్ని కొన్ని సందర్భాలలో ”అమ్మ” మాటలు చేతలు మనకు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తిథి పెట్టుకున్న రోజున మడిగా వండిన పదార్థాలను పిల్లి ముట్టుకుందని బాధపడుతున్న వారితో ”పిల్ల ముట్టుకుంది” అని ఊరడించింది. సంచిలోని మామిడి పళ్ళను ఎలుక కొరికిందని కలత చెందిన ఒక సోదరునితో ”ఎలుకరూపంలో వచ్చి అమ్మే తిన్నదేమో!” అని ఓదార్చింది. తిరుపతిలో ఒక అన్నయ్యకు ముత్తయిదువగా కనిపించి, ప్రసాదం చేతిలో పెట్టింది. మద్రాసు రైల్వేస్టేషన్‌లో టికెట్టు పోగొట్టుకున్న రామకృష్ణ అన్నయ్యకు కూలీగా కనిపించి ఏ ఇబ్బందీ కలుగకుండా స్టేషన్ బయటకు తీసుకు వచ్చింది. వేరొక సోదరునికి డాక్టరుగా దర్శనమిచ్చి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి కోడలికి జరిగిన శస్త్రచికిత్సను విజయవంతం చేసింది.
ఇలా ”వ్యాపిని”గా ”వివిధాకార”గా మనకు దివ్యానుభూతులను అనుగ్రహించిన ”అమ్మ” లలితాదేవికి అపరావతారమే అనిపిస్తుంది.
”నాకు అడ్డుగోడలు లేవు” అని చెప్పిన అమ్మకు గోడచాటు లేదు. ఎవరో, ఎక్కడో మాటాడుకున్న మాటలు ఆమెకు తన సమక్షంలో జరిగిన సంభాషణగా అనిపిస్తుంది. ”అమ్మా! మద్రాసులో మౌంటురోడ్డు మీద వెళుతున్న నేను నీకెలా కనిపిస్తాను అన్న ఒక సోదరునితో ”నా ముందు రోడ్డు మీద వెళుతున్నట్లు కనిపిస్తావు” అని చెప్పింది ”అమ్మ”.
ఒకసారి నేను నా స్నేహితురాలితో కలిసి జిల్లెళ్ళమూడికి వెళ్ళాను. ఆమె అదే మొదటిసారి జిల్లెళ్ళమూడికి రావడం. అందువల్ల 7వ మైలు దగ్గర బస్సు దిగి లోపలికి వెళ్తూ, దారిలో ”అమ్మ”ను గురించే మాటాడుకున్నాము. ఇద్దరం ”అమ్మ”గదిలో ”అమ్మ” సన్నిధిలో కూర్చున్నాం. అప్పుడు ”అమ్మ” మేము దారిలో మాటాడుకున్న విషయాలనే ప్రస్తావించింది. నా స్నేహితురాలు చాలా ఆశ్చర్యపోయింది. మేము మాటాడుకున్న సంగతులు ”అమ్మ” కెలా తెలిసాయో అని ఎన్నో సార్లు అనుకుంది. ఇందులో ఆశ్చర్యమే ముంది? సర్వతోముఖి అయిన ”అమ్మ”కు తెలియని వేమి ఉంటాయి? ఈ సన్నివేశాలు మనకు ”సర్వతోముఖి” అనే లలితాదేవి నామాన్ని స్ఫురింప చేస్తున్నాయి.
జిల్లెళ్ళమూడిలో తన గదిలో తన బిడ్డలతో కబుర్లు చెపుతున్న ”అమ్మ”కు పిస్తోలు చప్పుడు వినిపించింది. ”ఏదో ఠపేలుమని పేలిన చప్పుడయ్యిందిరా” అన్నది. అక్కడున్న ఎవ్వరికీ ఏ చప్పుడూ వినిపించలేదు. ఆ మరునాడు దినపత్రికలో ‘అమెరికా అధ్యకక్షుడు కెనడీని ఎవరో తుపాకీతో పేల్చి చంపారు’ అనే వార్త వచ్చింది.
మరొక సందర్భంలో ‘నేను చేసే ప్రతి పనీ చూస్తూనే ఉంటావా అమ్మా’ అని అడిగిన ఒకరితో ”నువ్వొక్కడివేనా?” అని ప్రశ్నించింది ”అమ్మ”. ”విశ్వసాక్షిణి” అయిన లలితాదేవియే ”అమ్మ” అనిపించే ఇలాంటి సందర్భాలు ఎన్నో!
- (సశేషం)