1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లలితా పరమేశ్వరే అమ్మ

లలితా పరమేశ్వరే అమ్మ

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : February
Issue Number : 7
Year : 2022

(క్రిందటి సంచిక తరువాయి భాగం)

“అందరూ నా ఒడిలోనే ఉన్నారు. నా ఒడి విడిచి ఎవ్వరూ లేరు” అని చెప్పి, తన ఒడి అంటే జిల్లెళ్ళమూడికే పరిమితం కాదని, అది సర్వత్రా విస్తరించి ఉందనీ చెప్పింది “అమ్మ”. ఇక్కడి వాళ్ళే కాదు. దూరంగా ఉన్న వాళ్ళు కూడా నాకు బిడ్డలే. నేను అందరినీ చూచు కోవలసిందే కదా! పొలం వెళ్ళినవాడికి సమయానికి అన్నం అందించాలా! వాడికి పంపకపోతే ఎలా?” అని చెప్పిన “అమ్మ” ‘విశ్వగర్భ’ అనే లలితాదేవి నామాన్ని – మనకు జ్ఞాపకం చేస్తోంది.

“జిల్లెళ్ళమూడిలో మంచం మీద కూర్చున్నదే అమ్మకాదుగా. అమ్మ అంటే ఆది, అంతమూ లేనిది” అని చెప్పిన “అమ్మ” – “నాకు అంతు అంటూ ఉన్నదని నాకు తెలియదు” అని కూడా ప్రకటించింది. ఆదీ, అంతమూ లేని ‘అనాదినిధన’ అయిన లలితాదేవి “అమ్మ”గా అవతరించిందని ఈ మాటలవల్ల మనకు అర్థమవుతుంది.

“ధర్మం కోసం తల్లి కాదు, తల్లిధర్మం చూపించటానికే” అని తన అవతార ప్రయోజనాన్ని తెలియచేసింది “అమ్మ”. ఈ వాక్యాన్ని రెండురకాలుగా అర్థం చేసుకోవచ్చు. “తల్లిధర్మం” అని కలిపి చదివితే తల్లి యొక్క ధర్మం ఏమిటో తన ప్రవర్తన ద్వారా మనకు తెలియచేయటానికి ఈ లోకానికి “అమ్మ”గా దిగివచ్చిందని ఒక అర్థం. “తల్లి, ధర్మం చూపించటానికే”. అని ‘తల్లి’ని ‘ధర్మం’ నుంచి విడగొట్టి చదువుకుంటే – ధర్మం అంటే ఏమిటో మనకు చెప్పడానికి అవతరించిన తల్లి అని మరొక అర్థం. అంటే ధర్మానికి ఆధారమైన తల్లి: ధర్మాన్ని ఆచరించే తల్లి; ఆ ధర్మాన్ని మనకు తెలియచెప్పి, మనలో ధర్మప్రవర్తన కలిగించటానికి వచ్చిన తల్లి అని బోధపడుతుంది. అందుకే ధర్మాన్ని బోధించే ఆణిముత్యాల వంటి వాక్యాలనెన్నింటినో చెప్పింది. “అమ్మ”, “నాకు ధర్మాలు పనికిరావు. నాది ప్రేమతత్వం అని చెప్పిన ఒక అక్కయ్యతో “నీది ప్రేమతత్వమైతే ధర్మాన్ని ప్రేమించు” అని ప్రబోధించింది “అమ్మ”. కొన్ని వందల మైళ్ళదూరం నుంచి “అమ్మ” కోసం పరితపిస్తూ వచ్చిన ఒక అక్కయ్యను ఆమె భర్త వద్దకు పంపుతూ ‘ప్రేమ ఉన్నా ధర్మానికి కట్టుబడక తప్పదు. అది అన్ని. వందల మైళ్ళ దూరం నుంచి నాకోసం పరిగెత్తుకు వచ్చినా భర్త దగ్గరకు పంపించటం నా ధర్మం. ప్రేమకంటే ధర్మం గొప్పదని ఋజువు చేసింది. ఈ అర్జెంటు ప్రయాణం” అని చెప్పిన ధర్మస్వరూపిణి “అమ్మ”.

ధర్మమే శీలంగా గల “ధర్మిణి”, ధర్మానికి ఆధారమైన “ధర్మాధార”, మనలో ధార్మికతను పెంపొందింప చేసే “ధర్మవర్ధిని” – “అమ్మ” ఈ మూడు లలితాదేవి. నామాల్లోని లలితాదేవి స్వరూపమే మన “అమ్మ” అనిపించే 3. సంధర్భాలు ఎన్నో “అమ్మ”జీవితంలో మనకు కనిపిస్తాయి.

లలితాదేవి నామాల్లో ఒక నామం “జ్ఞానజ్ఞేయ స్వరూపిణి”, “అంతా జీవమయం. నా దృష్టిలో జడమే లేదు” – అని చెప్పిన జ్ఞానస్వరూపిణి “అమ్మ”, “క్షరం. కాదని తెలుసుకోవటమే జ్ఞానం” అన్నది “అమ్మ”. సృష్టికి మార్చీ కాని నాశనం లేదు అని “అమ్మ” ఎన్నో సందర్భాలలో తెలియచేసింది. “జగన్నాథుడిలో జగత్తును చూడలేరు. జగత్తులో జగన్నాథుడిని చూడలేరు” – అని జగత్తుకు జగన్నాథుడికీ భేదం లేదని స్పష్టంగా చెప్పింది. “అమ్మ”. ఒకే శక్తి అన్ని గుణాలతో, అన్ని రూపాలతో ఉన్నది. ఈ సర్వమూ దైవమే. ప్రత్యేకించి ఒక రూపంతో లేడు” అని చెప్పిన జ్ఞానస్వరూపిణి “అమ్మ”.

 జ్ఞానం చేత తెలుసుకోగలిగిన తత్త్వమే జ్ఞేయం. జ్ఞానస్వరూపిణి అయిన “అమ్మే” మనం తెలుసుకోవాల్సిన తత్త్వం. అంటే జ్ఞేయం. అందుకే “అమ్మ” – “అందర్నీ తానుగా (అంటే అమ్మగా) చూసినా, తనలో (అంటే అమ్మలో) అందర్నీ చూసినా ఒకటే” అని చెప్పింది. ఇంకా స్పష్టంగా చెప్తూ “నేను మీరు కాకపోతేగా” అన్నది. జ్ఞానమూ “అమ్మే”, ఆ జ్ఞానంతో మనం తెలుసుకోవాల్సిన తత్త్వమూ “అమ్మే”. జ్ఞానమంటే “అంతా ఒక్కటే” అని తెలుసుకోవడం. “అమ్మ” దేన్నీ తనకు భిన్నంగా చూడలేదు. అందుకే “నేను నేనైన నేను” అని అన్నింటిలో ఉన్న ‘నేను’ అనేది తానే అని తెలిపింది. ఈ ఉద్దేశంతోనే ఒకరితో “నేను నిన్ను తాకే ఉన్నానుగా” అన్నది “అమ్మ”. అంటే ఆ వ్యక్తిలో ఉన్న ‘నేను’, తనలో ఉన్న ‘నేను’ ఒక్కటే. కనుక “అమ్మ” ఆ వ్యక్తిని తాకి ఉన్నట్లేగా మరి. అందరిలో, అన్నింటిలో తానే ఉన్నాను అని చెప్పిన “అమ్మ” – జ్ఞానమూ, జ్ఞేయము తన స్వరూపంగా గల తల్లి. కనుక “జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి” అయిన లలితాదేవి మన “అమ్మే”.

“భగవంతుడు భర్తకాదు. భర్తే భగవంతుడు” అని చెప్పి, మహిళాలోకానికొక మహత్తర సందేశాన్ని అందించింది “అమ్మ”. పతియే ప్రత్యక్ష దైవము అని చెప్పటంతో ఆగక తన ప్రతి చర్యలో నాన్నగారి పట్ల ఆ భావంతోనే మెలగింది “అమ్మ”. ‘మేనత్త కొడుకూ మొగుడేనా’ అని ఒకరంటే “మొగుడని ఎవరను కుంటున్నారు? దేవుడనుకుంటున్నాను” అని వాచ్యంగా నాన్నగారిని దేవుడిగా ఆరాధిస్తున్నట్లు స్వయంగా “అమ్మే” చెప్పింది. తన మంగళ సూత్రాలను అభిషేకించి, ఆ నీటిని కళ్ళకు అద్దుకుని, తీర్థంగా మూడుసార్లు స్వీకరించే “అమ్మ”కు నాన్నగారు ఆరాధ్యదైవం. “ఈ తీర్థమే నాన్నా! నన్ను పావనం చేసేది. ఈ తీర్థంతో నేను పావనమైతే మీకు తీర్థం ఇవ్వటానికి అర్హత కలుగుతుంది” అని చెప్పిన “అమ్మ” సాధ్వి’.

 నాన్నగారికి నలతగా ఉంటే తాను ప్రక్కనే ఉండి సేవలు చేసేది. తన కోసం తెచ్చిన పళ్ళను ముందుగా నాన్నగారికి ఇవ్వమని చెప్పేది. కొత్త వస్తువు ఏదైనా ముందుగా నాన్నగారిచే ప్రారంభించాలనే కోరుకునేది “అమ్మ”. భోగిపళ్ళరోజున ముందుగా నాన్నగారి పాదపద్మాలకు భోగిపళ్ళు సమర్పించి, తరువాతే తన బిడ్డలకు భోగిపళ్ళు పోసిన “సదాశివ పతివ్రత “అమ్మ”. ఉగాది పండుగరోజున నాన్నగారికి నమస్కరించి, వేపపూత ప్రసాదం ఆయనకు ముందుగా సమర్పించి ఆ తరువాతే తన బిడ్డలందరికీ పంచిన “అమ్మ” – ‘సతి. ఇలా ఎన్నో విషయాలలో నాన్నగారిని తన దైవంగా ఆరాధించింది “అమ్మ”. ఈ సందర్భాలను ఈ పరిశీలించి చూస్తే “సాధ్వీ”, “సతీ”, “సదాశివపతివ్రతా” వంటి నామాలలోని లలితాదేవికి ప్రతిరూపమా “అమ్మ” అనిపించకమానదు.

“భర్త అంటే శరీరం కాదు భావన” అని చెప్పిన “అమ్మ” ఎప్పుడూ నాన్నగారిని గురించిన ఆలోచనల్లోనే ఉండేది. అందుకే ‘పరధ్యానంగా ఉన్నావా అమ్మా’ అని అడిగిన వారితో “పరధ్యానం కాదు, పతిధ్యానం’ అని సవరించింది. “ధ్యాసే ధ్యానం” అని ధ్యానాన్ని నిర్వచించిన “అమ్మ”నిరంతరం నాన్నగారి ధ్యాసలో ఉండటం అంటే ఆయనను గూర్చి ధ్యానించటమే కదా! నాన్నగారు ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఆయన చేయవలసిన పనులకు సంబంధించిన స్ఫురణను ఎప్పటికప్పుడు కలిగించేది “అమ్మ”. నాన్నగారు కూడా “అమ్మ”ను గురించి నిరంతర చింతనలోనే ఉండేవారు. అంటే వారిద్దరూ పరస్పరం ఒకరి ధ్యాసలో (ధ్యానంలో) మరొకరు ఉండేవారన్నమాట. “రూపం పురుషుడు; లోని శక్తి ప్రకృతి” అని చెప్పిన “అమ్మ” నాన్నగారిలోని శక్తి. అందుకే వారిరువురికీ అభేదం. “శివశక్యైక్యరూపిణి” అనే లలితాదేవి నామానికి సాకారమే “అమ్మ”.

“ఈ సృష్టి అనాది; నాది” అని ప్రకటించింది. “అమ్మ”. సృష్టి అంటేనే చైతన్యం కదా! అంటే ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టికి మొదలు ఎప్పుడో మనకు తెలియదు. అనాది అయిన సృష్టిని ‘నాది’ అని చెప్పింది “అమ్మ”. అంతే కాదు. “నా ఆది నాకు తెలియదు; నేను ఆదెమ్మను” అని ప్రకటించింది. ఆది – అమ్మ – ఆదెమ్మ. అంటే మొదటి నుంచీ ఉన్న తల్లి. “తల్లి అంటే తొలి” అని చెప్పిన “అమ్మ” అన్నింటి కంటే పూర్వనుంచీ ఉన్నది. అంటే ‘పూర్వజ’. తాను ఎప్పుడూ బాలెంతరాలినని చెప్పింది “అమ్మ”. ఈ వాక్యాలు “ప్రసవిత్రీ”, “పూర్వజా” అనే లలితాదేవి నామాలను స్ఫురింపచేస్తూ, ఆ శ్రీ మాతే ఈ మాతృశ్రీ అని తెలియ చేస్తున్నాయి. –

అమ్మకాలివేళ్ళకు విగ్రహాలు ఉన్న మెట్టెలు చూసి “కాళ్ళకు విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నావు ? అని ఒకరు ప్రశ్నిస్తే, “పిల్లలను దగ్గర పెట్టుకున్నాను” అని చెప్పి, ఇంకా వివరిస్తూ “వీళ్ళు కూడా మీ సోదరులే అని చెప్పటం కోసం” అన్నది “అమ్మ”. ఒకసారి “అమ్మ” నెల్లూరులోని శ్రీరంగనాయకస్వామి ఆలయానికి వెళ్ళింది. అక్కడ గర్భగుడిలోకి వెళ్ళి, స్వామి విగ్రహాన్ని ప్రేమగా, ఆప్యాయంగా నిమిరి, పుత్రగాత్ర స్పర్శతో పులకించి పోయింది “అమ్మ”. ఒకానొక సందర్భంలో తలనీలాలు తిరుపతిలో ఇవ్వాలా? జిల్లెళ్ళమూడిలో ఇవ్వాలా? అనే ఆలోచనలో ఉన్న ఒకరితో “నా కొడుకు దగ్గర ఇచ్చినా, ఇక్కడ ఇచ్చినా ఒకటే” అన్నది. ఇలాంటి సన్నివేశాలను, “నాది విశ్వసంసారం” అనే వాక్యంతో జోడిస్తే “విశ్వమాతా” అనే లలితాదేవి నామం “అమ్మ”కు ఎంత చక్కగా సమన్వయిస్తుందో అర్థమవుతుంది.

“సర్వానికి నేనే మూలం” అనే “అమ్మ” వాక్యంలో ఈ సృష్టి అంతటికీ తానే మూలం అనే భావం వ్యక్తమవుతోంది. అన్నింటి కంటే ముందుగా ఉన్నది శ్రీ లలితాదేవి అనే అర్థంలో “ముఖ్యా” అనే నామం కనిపిస్తుంది. ఆ నామం ఇక్కడ మనకు స్ఫురిస్తుంది.

చిన్నతనంలోనే వెంకట సుబ్బారావు తాతగారితో “నేను మహారాణిని కాదు తాతగారూ! సర్వసృష్టికారిణిని” అని చాలా స్పష్టంగా చెప్పింది “అమ్మ”. ‘నేనే కని మీ మీ తల్లులకు పెంపుడిచ్చాను” అని చెప్పిన “సృష్టికర్తి”, మనపోషణకు అవసరమైన అన్నాన్ని ప్రసాదంగా పంచిపెట్టిన “గోపి”, మనందరికీ సుగతిని అనుగ్రహించిన “సంహారిణి” “అమ్మే”, “సృష్టికర్తీ – బ్రహ్మరూపా”, “గోప్రీ – గోవిందరూపిణీ”, “సంహారిణీ – రుద్రరూపా” అనే లలితాదేవి నామాలలోని సృష్టి స్థితి లయాలకు సంబంధించిన తత్త్వమే “అమ్మ”గా అవనీతలంపై అవతరించింది అనిపిస్తుంది.

“నేను సర్వసిద్ధాంత సార్వభౌమను” అనే “అమ్మ” వాక్యం “శ్రీమత్సింహాసనేశ్వరీ” అనే లలితాదేవి నామాన్ని జ్ఞాపకం చేస్తోంది.

ఒకసారి “అమ్మ” మీద పిచ్చుక గడ్డిపరకను పడేసింది. వెంటనే “అమ్మ” – “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు; బ్రహ్మ మీద పిచ్చుకాస్త్రం” అని చమత్కరించింది. ఇలా కొన్ని కొన్ని సార్లు చమత్కారంగా చెపుతున్నట్లుగా అనిపిస్తూ, తన నిజతత్వాన్ని వ్యక్తీకరించేది “అమ్మ”. ఆ పరబ్రహ్మతత్త్వమే “అమ్మ”గా దిగివచ్చింది అనడంలో అనుమానమేమీ లేదు.

ఇన్ని మాటలెందుకండీ? ఒక సందర్భంలో “అమ్మ” – “మా మందిరం మణిమందిరం” అని ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. మణిమందిరం ఎవరిదండీ? “చింతామణి గృహాంతస్థా” అయిన లలితాదేవిదే కదా! అందుకే అమ్మ – లలితా స్వరూపిణి.

 “అమ్మకు అక్షరార్చన” – అంతర్జాల వేదికకు ధన్యవాదాలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!