దసరా పండుగలలో అమ్మను లలితా పరమేశ్వరిగా దర్శించి, జిల్లెళ్ళమూడిలో విశేష అర్చనలు చేస్తూ ఉంటాం మనం. ‘అమ్మ లలితాస్వరూపిణి’ అనే వ్యాసం దసరా ప్రత్యేకం సంపాదకులు.
మనల్ని అనుగ్రహించడానికి అవనిపై అవతరించిన శ్రీ లలితాదేవియే మన అమ్మ. ఈ భావంతోనే అందరింటిలో నిత్యమూ శ్రీ లలితాసహస్రనామ స్తోత్రం పారాయణం జరుగుతోంది. అమ్మ స్వభావం లలితం, మధురం, మనోహరం, ప్రేమమయం, కరుణారసస్లావితం. ఈ లక్షణాలు లలితాదేవికి ఉన్నట్లు మన ఆర్షవాఙ్మయం పేర్కొంటుంది. అమ్మను లలితాస్వరూపంగా గుర్తించాలనుకునేవారికి అమ్మ పలుకులే ఆధారభూమికలు.
ఈ సృష్టికంటే పూర్వమే ఉండి, ఈ సృష్టి ఏర్పడటానికి కారణమైన శక్తి ఏదైతే ఉన్నదో దాన్నే మనం భగవంతుడు అంటున్నాం. “తల్లి అంటే తొల్లి” అనే నిర్వచనంలో ఈ భావమే వ్యక్తమవుతోంది. “నా ఆది ఎవరికీ తెలియదు. నేను ఆదెమ్మను” అనే ప్రకటన అమ్మను – ఆదిలో ఉన్న అమ్మగా స్పష్టం చేస్తోంది. అందువల్ల అమ్మ పూర్వజ.
అందరికంటే, అన్నిటికంటే పూర్వమే ఉన్న శ్రీ లలిత – పూర్వజ, పురాతన. అందువల్ల ‘ఆదెమ్మ’ అయిన అమ్మ శ్రీ లలితాదేవియే.
ఈ సృష్టి అంతటికీ ప్రారంభంగా ఉన్నది తానే అంటూ “సర్వానికీ నేనే మూలం” అని ప్రవచించిన అమ్మ – సర్వానికీ మొదటిదైనది శ్రీమాత అనే అర్థం గల “ముఖ్యా” నామానికి మూర్తిమత్వంగా భాసిస్తోంది..
“జననీ అంటే మూలస్థానమేగా” అనే అమ్మ వాక్యం ఈ సమస్త సృష్టికి మూలం తల్లి అనే అర్థాన్ని స్ఫురింపజేస్తోంది. ప్రకృతికి మూలమైన శ్రీమాత మూలప్రకృతి” లలితాదేవి అనే నామానికి వివరణే ఈ వాక్యం. అందుకే మూర్తీభవించిన మూల ప్రకృతిగా అమ్మ దృక్ గోచర మవుతోంది.
అంతటా నిండి ఉన్న భగవంతుడు సర్వాంతర్యామి. ఇందుగలడందులేడనే సందేహం వలదు అన్నాడు తెలుగులు పుణ్యపేటి పోతనామాత్యుడు.
“అంతటా ఉన్న అమ్మ తెలియటానికే ఈ అమ్మ” అని అమ్మ తన సర్వవ్యాపకత్వాన్ని తెలియచేసింది. ‘నాది విశ్వ సంసారం” అని చెప్పిన అమ్మ విశ్వజనని కాకపోతే కదా! ఈ విశ్వమే సంసారంగా కల అమ్మ ఈ సమస్త సృష్టికీ సామ్రాజ్ఞి. అందుకే “నేను సర్వసిద్ధాంత సార్వభౌమను” అని ప్రకటించింది అమ్మ. ‘శ్రీ మహారాజ్ఞి’, ‘శ్రీమత్సింహానేశ్వరి’ అనే లలితాదేవి నామాలకు దీటైన మాట అమ్మ పలకడం – ఆమె సార్వభౌమత్వాన్ని వ్యక్తం చేస్తోంది.
సర్వ ప్రపంచానికి సామ్రాజ్ఞి అయిన అమ్మకు నివాసమేది? అని అనిపించక మానదు. మన సందేహాన్ని తొలగించేటందుకే అమ్మ “మా మందిరం మణిమందిరం” అని తన చిరునామాను తెలియజేసింది. మణిమందిరంలో కొలువై ఉన్న దేవత ఎవరు ? ఇంకెవరు? ‘చింతామణి గృహాంతస్థ’ అయిన లలితాదేవియే. అంటే అమ్మ సాక్షాత్తూ శ్రీలలితే.
ఈ సకల చరాచర జగత్తును సృష్టించిన పరమాత్మ జగత్పితగా, సృష్టికర్తగా, విశ్వస్రష్టగా మన పూజలు అందుకుంటున్నాడు.
“ఈ సృష్టి నాది. అనాది” అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన అమ్మ ప్రసవిత్రిగా ప్రకాశిస్తోంది. “నేనెప్పుడూ పచ్చి బాలింతనే” అని ప్రకటించిన అమ్మ ప్రసవిత్రిగా ప్రత్యక్షమవుతోంది. లలితాసహస్ర నామాల్లో ‘ప్రసవిత్రీ’ అనే నామం ఒకటి, స్థావర జంగమాత్మకమైన జగత్తును సృష్టించిన శ్రీలలిత ప్రసవిత్రి. ఈ సృష్టిలోని సకల జీవరాసులకూ తల్లి, తండ్రి, దైవము, భగవంతుడే. అతడు జగత్పిత, జగద్గురువు.
“జగన్మాత అంటే జగత్తుకు మాత అని కాదు; జగత్తే తల్లి” అని నిర్వచించింది అమ్మ. అంటే జగత్తులోని ప్రతి అణువులో నిండి ఉన్నదీ తానే అనే సందేశాన్ని మనకు అందించింది. “చీమలో దోమలో కాదు, చీమగా, దోమగా ఉన్నది తానే” అని విడమరచి చెప్పింది. “అందరి పిల్లల్ని ప్రేమిస్తే విశ్వమాత కాదూ!” అని చెప్పడంలో, కేవలం మానవజాతి మాత్రమే కాదు. సకల జీవకోటి పట్ల అమ్మ తనకు గల ప్రేమను వ్యక్తం చేసింది. పందిపిల్ల, పేను, కాకిపిల్ల, పాముపడగ ఇది అది అనేమిటి? అన్ని జీవరాసులూ అమ్మకు ముద్దువస్తాయి. అదే విశ్వమాతృత్వం ‘విశ్వమాతా’ అంటే సమస్త విశ్వానికి తల్లి శ్రీమాత అని అర్థాన్ని వ్యాఖ్యానాలు చెప్పాయి. విశ్వమాత నామానికి సాకారంగా సాక్షాత్కరించిన మానవరూపమే మన అమ్మ. అందుకే అమ్మ శ్రీమాత.
పరమాత్మకు లోపల, వెలుపల ఎన్నో లోకాలు ఉంటాయి. అందువల్లనే బాలకృష్ణుడు తన తల్లి యశోదమ్మకు తన నోట్లోనే విశ్వమంతటినీ చూపి, విశ్వరూప సందర్శనాన్ని అనుగ్రహించాడు. క్షీరసాగర మథన సమయంలో ఆవిర్భవించిన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు మింగకుండా తన కంఠంలో బంధించి, తన లోపలి, వెలుపలి లోకాలను రక్షించాడు.
“అందరూ నా ఒడిలోనే ఉన్నారు. ఒడి విడిచి ఎవరూ లేరు” అని చెప్పిన అమ్మ విశ్వగర్భ. తన ఒడి అంటే అది జిల్లెళ్ళమూడికే పరిమితం కాదని, అది సర్వత్ర విస్తరించి ఉందని, ఒక సందర్భంలో వివరించి, ఈ సమస్త విశ్వమూ తన ఒడే అని చెప్పిన అమ్మ విశ్వగర్భేగా మరి,
విశ్వమంతా తన గర్భంలో కలది విశ్వగర్భ. సమస్త ప్రపంచమూ శ్రీమాత గర్భంలో అంతర్భాగమే అనే అర్థంలో విశ్వగర్భ అనే నామం లలితా సహస్రనామాల్లో కనిపిస్తుంది. ఈ నామానికి వివరణగా అనిపించే అమ్మ వాక్యం “నా గర్భతీపి సర్వత్రా ఉంటుంది” సర్వత్ర అంటే అంతటా అని అర్థం. చరాచరాత్మకమైన ఈ సృష్టి ఆమె గర్భం నుంచి పుట్టినందువల్లనే ఆమె గర్భతీపి అంతటా వ్యాపించి ఉంది. అందువల్లనే అమ్మ విశ్వగర్భగా దర్శనమిస్తోంది.
విశ్వమంతా తన గర్భంలో కలది విశ్వగర్భ. సమస్త ప్రపంచమూ శ్రీమాత గర్భంలో అంతర్భాగమే అనే అర్థంలో విశ్వగర్భ అనే నామం లలితా సహస్రనామాల్లో కనిపిస్తుంది. ఈ నామానికి వివరణగా అనిపించే అమ్మ వాక్యం “నా గర్భతీపి సర్వత్రా ఉంటుంది”. సర్వత్ర అంటే అంతటా అని అర్థం. చరాచరాత్మకమైన ఈ సృష్టి ఆమె గర్భం నుంచి పుట్టినందువల్లనే ఆమె గర్భతీపి అంతటా వ్యాపించి ఉంది. అందువల్లనే అమ్మ విశ్వగర్భగా దర్శనమిస్తోంది.
భగవంతుడు సర్వవ్యాపకుడు. అణువణువులో నిండి వున్న భగవంతుడు లేని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు “నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా ?” అని ప్రశ్నించి, ఆ స్తంభాన్ని బ్రద్దలు కొట్టాడు. ఎందుకంటే ఆ స్తంభం తన పనివాళ్ళ చేత తాను కట్టించుకున్నది. అందులో తనకు తెలియకుండా విష్ణువు ప్రవేశించే అవకాశం లేదనుకున్నాడు అమాయకంగా హిరణ్యకశిపుడు. కాని సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు – ఉగ్రనరసింహుడిగా అందులో నుంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుని సందేహాన్ని పటాపంచలు చేశాడు. దేహాన్ని తునాతునుకలు చేశాడు.
“నేను నేనైన నేను” అంటే – “అన్ని నేనులూ నేనైన నేను” అని వివరించిన అమ్మ అన్ని నేనుల్లోనూ నిండి వున్నది తానే అని స్పష్టం చేస్తోంది. ఈ జగత్తంతా తాను వ్యాపించి ఉన్నట్లు మనకు తెలియజేసింది అమ్మ.
స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తులో వ్యాపించివున్న శ్రీ లలిత “సర్వగ”. “నేను నేనైన నేను” అనే అమ్మ వాక్యం ఈ నామానికి వ్యాఖ్యాన వాక్యంగా భాసిస్తోంది. సర్వగా అయిన శ్రీ లలితా స్వరూపమే అమ్మ అని ఈ వాక్యం తేటతెల్లం చేస్తోంది. కనుక అమ్మ సర్వవ్యాపిని అయిన లలితాదేవి అని మనకు అర్థమవుతుంది.
ఈ సమస్త భువనాలను భరించేవాడు పరమాత్మ. వేయి పడగల ఆదిశేషుని అవతారంతో ఈ సమస్త భువనాలనూ భరిస్తూ ఉన్న పరమాత్మ విశ్వంభరుడు.
అం” అనే అక్షరద్వయం అమ్మ సంతకం. అం-అంటే అంతులేనిది. ఆ అంటే ఆధారమైనది అని విడమరచి చెప్పింది అమ్మ. అంతంలేని అనంతస్థితిని, సకల సృష్టికి ఆధారం తానే అనీ ఈ రెండు అక్షరాల్లో పొందుపరిచింది అమ్మ. సమస్త విశ్వాన్ని ధరించిన శ్రీలలిత విశ్వధారిణి. సమస్త లోకాలకూ ఆధారం అయిన అమ్మ విశ్వధారిణి అయిన శ్రీ లలితయే. ఆదిమధ్యాంతరహితుడైన దేవదేవుడు సర్వకాల సర్వావస్థల యందు ఎలాంటి మార్పు చెందకుండా స్థిరంగా ఉంటాడు. “జిల్లెళ్ళమూడిలో మంచం మీద కూర్చున్నదే అమ్మ కాదుగా. అమ్మ అంటే ఆదీ అంతమూ లేనిది. ఈ సర్వానికీ ఆదీ అంతమూ అయినది” అని. “నాకు అంతు అంటూ ఉన్నదని నాకు తెలియదు” అని చెప్పిన అమ్మ. ఆది మధ్యాంతరహిత అయిన అనాదినిధన. ఆద్యంతరహితయైన శ్రీ లలితాదేవి నామాల్లో ఒకటి అనాది నిధన.
ఈ సృష్టిలోని అన్ని పదార్థ సమూహాలకూ నాథుడు భగవంతుడు. కనుక అతడు జగన్నాథుడు. “నేను మీకు, మీకు, మీకు క్రిమికీటకాదులకు, పశుపక్ష్యాదులకూ కూడా తల్లిని” అమ్మ. ఈ వాక్యం అమ్మను గణాంబగా ప్రకటిస్తోంది. చిన్నతనంలోనే గారెలకు పప్పు కడుగుతూ పప్పులో, పొట్టులో, నీళ్ళల్లో, గిన్నెలో అంతటా చైతన్యాన్ని గుర్తించి, వాటితో సంభాషించిన అమ్మ గణాంబేగా మరి.
గణమంటే సమూహం. ప్రపంచంలోని సమస్త పదార్ధ సమూహాలకు తల్లి అయిన శ్రీమాతకు మరొక పేరు గణాంబ.
భగవంతుడు నామరూప రహితుడు. ఎవరు ఏ రూపంతో భావిస్తే ఆ రూపంలో దర్శనమిస్తాడు. ఏ నామంతో సంకీర్తన చేసినా అనుగ్రహిస్తాడు. వేనవేల జన్మల తపస్సు ఫలితంగా మాత్రమే భగవత్సాక్షాత్కార మవుతుంది. ‘నన్ను చూడడమే పుణ్యం” – అమ్మ: మనం చేసుకున్న పుణ్యఫలితంగా అమ్మ దర్శనం లభిస్తుందని వివరించే ఈ వాక్యం అమ్మను ‘పుణ్యలభ్య’గా ప్రత్యక్షం చేస్తోంది.
పూర్వజన్మల పుణ్యకర్మల ఫలం చేత పొందదగిన శ్రీమాత ‘పుణ్యలభ్య’ అనే నామంతో కీర్తించబడుతోంది.
పంచమ వేదమైన మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో శ్రీకృష్ణ భగవాన్ విశ్వరూపం ప్రదర్శిస్తాడు. ఆ విరాడ్రూపాన్ని దర్శించలేని దుర్యోధనుడు మొదలైనవారు వివశులైనారు. పరమాత్మ అనుగ్రహ విశేషం చేత జాత్యంధుడు (పుట్టు గుడి) అయిన ధృతరాష్ట్రుడు ఆ విరాట్పురుషుని దర్శించి ధన్యుడైనాడు.
“నేను కనబడితే మీరు చూస్తారు. మీరు చూస్తే “నేను కనబడను” అని ప్రకటించిన అమ్మ సాక్షాత్తూ శ్రీ లలితా పరమేశ్వరియే. మనం చూడాలనుకుంటే కనిపించని | అమ్మ, మనల్ని కరుణించి మనకు కనిపించి, కనువిందొ నరించింది. కనుకనే అమ్మను చూడగలిగాం, మాట్లాడ గలిగాం, పూజించు కోగలిగాం.
గుణరూపరహితమైన ఆత్మతత్త్వమే శ్రీమాత. ఆమె ఇంద్రియ గోచరం కాదు – అని తెలియజేసే నామాలు “అదృశ్యా, దృశ్యరహితా”. ఈ నామాలలోని లలితాదేవికి ప్రతిరూపమే అర్కపురీశ్వరి అనసూయాదేవి. సర్వాంతర్యామి అయిన పరమాత్మ చూడలేని ప్రదేశం లేదు. వినలేని శబ్దం లేదు. అతడు సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు.
“నాకు అడ్డుగోడలు లేవు”, “నేను ఈ మంచం మీద కూర్చున్నానని, నాకేమీ తెలియదనుకుంటున్నారు. కాని నాకు గోడ చాటు లేదు. ఈ ఆవరణలో ఎవరేం చేస్తున్నదీ, ఎక్కడ ఏం జరుగుతున్నదీ నాకు తెలుసు” అని హెచ్చరించిన అమ్మ సర్వతోముఖి. ఎక్కడ ఉన్నా మనందరి మాటలు వినగలదు. మనం చేస్తున్న పనులను గమనించగలదు అమ్మ. ఆమెకు ఏ గోడలూ అడ్డురావు. అంతా అమ్మకు ప్రత్యక్షమే. కనుక, అమ్మ సర్వతోముఖి. అన్నివైపులా ముఖాలు కల శ్రీ లలితాదేవి, అన్ని వైపులకూ చూడగలదు. అన్నింటినీ వినగలదు. అందువల్ల శ్రీమాత సర్వతోముఖి.
ఇలా అమ్మ పలికిన ఆణిముత్యాలు అమ్మను లలితగా మనకు తేటతెల్లం చేస్తున్నాయి. మనల్ని అనుగ్రహించడానికి మానవిగా అవతరించిన శ్రీ లలితా పరమేశ్వరియే అర్కపురీశ్వరి అనసూయాదేవి. కనుక, శ్రీ లలితాస్వరూపిణి అమ్మ అని గుర్తించి ఆమెను స్మరించి తరించుదాం..