నేను 1971-80 సంవత్సరంలో అమ్మ ప్రెసిడెంటుగా, రామకృష్ణ రెసిడెంటు సెక్రటరీగా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న రోజులలో ఒక రోజున అన్నపూర్ణాలయంలో బియ్యం పూజ్యమైనవి. ఆ రోజు వంటకే సమస్య. అటువంటి పరిస్థితిలో నేను అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా ! ఈ రోజు అన్నపూర్ణాలయంలో బియ్యం వంటకు సరిపోయేటంత సరుకు లేదు అని అమ్మతో నసుగుతూ మెల్లగా అన్నాను. నేను లేదు అనటం. అమ్మకు కోపం తెప్పించింది కాబోలు అమ్మ “నీవు ఎప్పుడూ, లేదు అని అనవద్దు”, ఏమి లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాల నుండి జరగటం లేదా ? ఎప్పుడు ఏమి తక్కువైనవి ? ఇప్పుడైనా అంతే అన్నది. ఆ మాట నిజమే. అన్నపూర్ణాలయం 1958 ఆగష్టు 15న ప్రారంభించి ఇంతవరకు నిరంతరం అన్నవితరణ జరుగుతూనే ఉన్నది. ఎప్పుడూ ఏదీ ఆగలేదు. మరి ఇప్పుడు ఎట్లా ? ఏమి చెయ్యాలి ? అనే సందిగ్ధతో అమ్మను మెల్లిగా ఇప్పుడు ఏమి చేసేది ? అన్నాను. అమ్మ హుండీ తీశారా ? అన్నది. తియ్యలేదు అన్నాను. అయితే తియ్యండి అన్నది. నేను హుండీ తియ్యాలంటే నాకు ఎస్కార్టు కావాలి అన్నాను. అమ్మకు అది నేను వ్యంగ్యంగా అన్నట్లుగా తోచింది కాబోలు అమ్మకు కోపం వచ్చింది. కళ్ళు ఎర్రగా చింతనిప్పులవలె వున్నవి. ముఖం కందగడ్డ అయ్యింది. అప్పుడు అమ్మ అన్నది. “అవునురా ! ఎస్కార్టు కావలసిందే. ఆ రోజులూ వస్తాయ్. తప్పకుండా వస్తాయ్” అని అమ్మ Stress చేసి అన్నది. అమ్మతో నేను అమ్మా! ఆ మాట చాలు నీ మాట తాలు మాట కాదు కదా ! అని అక్కడనుండి లేచి హుండీ తీయటానికి వెళ్ళాను. హుండీ లెక్క వేస్తే ఆ రోజుకు కావలసినంత వచ్చింది. తర్వాత ఇది జగన్నాధరధం కదా! ఇది బయలుదేరితే ఆగదు. తర్వాత 1973 లో ఒక్క పంక్తిన లక్షమందికి బువ్వపెట్టిన అమ్మ తీరు ఇక చెప్పేదేముంది.
నిరంతరం అన్న వితరణ జరుగుతూనే ఉన్నది.
ప్రతి మనిషికీ మనస్సు ఉంటుంది. కాని మనస్సు కోతిలాంటిది అన్నారు. అంటే ఒక స్థిరత్వం లేదు అన్నమాట.
స్థిరత్వం ఎందుకు లేదు ? అది కోతిలాగ ఈ కొమ్మ మీదు నుండి ఆ కొమ్మకు దూకుతూ వుంటుంది. అందుకనే కోతి మనస్సు అన్నారు. కాని మనస్సుకు స్వభావమే అటువంటిదా? “స్వభావం మారనిది. భావం మారేది”. అన్నది అమ్మ. కనుక దాని కున్నది స్వభావం కాదు అది భావమే. భావము మారుతూ వుంటుంది, కాలమాన పరిస్థితులను బట్టి, తాను వుండే పరిసరాల, ప్రాంతాల, తనకున్న స్నేహితులు వారి వారి దృక్పథాలు కూడా ఈ మార్పులకు కారణాలవుతవి. వాటి ప్రభావం ఈ మనస్సు మీద కొంత పనిచెయ్యటం సహజము. ప్రతి మనిషికీ ఒకమనస్సు ఉంటుంది. మరి అందరి మనస్సులలోను ఒకటే ఉంటుందా ? వుండదు. అది ఒక్కొక్క మనిషి తీరు బట్టి కూడా ఉంటుంది. కనుక అందరికీ మనస్సున్నా, అందరి మనసులు ఒకటి కాదు. మరి మనస్సున్న మనిషి మనస్సులేని మనిషి అంటే ఎవరు ? మనసున్న మనిషి అంటే తోటి జీవులకు సహాయ సహకారాలు అందించే మనస్సు గల మనిషి. అంటే Positive Thinking వున్న మనిషి అన్నమాట. అది లేకుండా Negative thinking అంటే ఇతర జీవులకు బాధ కలిగించే క్రోధం, ఈర్ష్య, అసూయ, నష్టపరిచే ఆలోచనలు గల మనసు గల మనిషి. ఒక మాటలో వ్యతిరేక భావాలు గల మనస్సున్న మనిషి అన్నమాట. వాడు మనసు లేని మనిషి అన్ని భావాలు ఇచ్చేది ఒక్కటే అయినప్పుడు కొంతమందికి positive thinking, కొంతమందికి Negative thinking రెండు ఎందుకు ఇవ్వాలి ? ఆలోచనలు ఎక్కడ నుండో రావటం లేదు. అవి మనవే అనుకుంటే మంచి ఆలోచనలే చేయవచ్చు గదా ! చెడు ఆలోచనలు ఎందుకు చేస్తాం. అవి మన పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చేవి అని పూర్వ జన్మమీద త్రోసేస్తే మరి దానికి పూర్వం, మరి అద్దాని పూర్వం సంగతేమిటి? అంటే పూర్వజన్మకు కూడా ఇటువంటి Negative ఆలోచనలే వున్నట్లుగా ద్యోతకమవుతున్నది. మరి దానికి మార్పు ఎప్పుడు? అసలు ఉండదా ? దానికి ఒక చిన్న లింకు ఇచ్చేరు. ఏమిటది ? భగవన్నామస్మరణ. భగవంతుని తలచుకొంటే, ప్రార్థిస్తే అది రావచ్చు. అంటే దానిని మార్పు చేసే భగవంతుడు కనుకనే గాయత్రి మంత్రంలో
ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితర్వరేణ్యమ్ ।
భర్గోదేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్!
అంటే అందరికి శ్రేయస్సును కలుగచేయుటలో కోర తగినదనియు, మన బుద్ధులను, ప్రేరేపించునదియు అయిన ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల పవిత్రమూర్తి యొక్క స్వయం ప్రకాశ ప్రసార గుణ సమిన్వితమైన తేజస్సును ధ్యానించెదము గాక!” అని
ఇదే విషయమును “కలి సంతరణోపనిషత్తు” కూడా వ్యాఖ్యానిస్తున్నది.
కనుక సంకల్పాలు ఇచ్చేది “వాడు” కాని మనము తెచ్చుకొన్నవి కావు. మరి వాడు ఇచ్చేటప్పుడు మంచి సంకల్పాలే ఇవ్వవచ్చును గదా ! చెడు సంకల్పాలు ఎందుకు ఇచ్చినట్లు ? వాడికి మంచి, చెడు అనేవి రెండు లేవు కనుక. ఈ భావం రావటానికే కాబోలు మంచి చేస్తే పుణ్యం వస్తుంది. స్వర్గం వస్తుంది, చెడు చేస్తే పాపం వస్తుంది. నరకలోకాలకు పోతాడు అన్నారు. ఈ భయం చేతనైనా మంచి చేస్తాడేమో అన్న ఆశ కాబోలు. కనుక పాపపుణ్యాలు, స్వర్గం నరకాలు మన చేతులలో ఉన్నట్లే కనపడుతున్నా“చేతలు చేతుల్లో లేవు మన చేతుల మీదుగా చేస్తున్నాం కాబట్టి ఆ చేతలు మనవే అనుకుంటున్నాము” తోచేదేదో చెయ్యి తోపించేవాడు వాడేగా!” అనే అమ్మ సూక్తులను బట్టి అన్ని సంకల్పాలు వాడివే అనే తోస్తుంది. కనుక స్వర్గ నరకాలు పాపపుణ్యాలు అన్న ద్వంద్వాలు వాడివ్వవలసినవే కాని మనం తెచ్చుకోవటం కాదు.
“నీకున్నది నీవు తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అది ఎవరి కోసమో కాదు నీ తృప్తి కోసమే. తృప్తే ముక్తి కదా ! కనుక భగవంతుడు మన కిచ్చింది. తృప్తిగా అనుభవించి ఇతరులకు ఆదరంగా పెట్టుకో అనటంలో ఆదరంగా పెట్టవలసినది నీకిచ్చిన ఆస్తి నీవు దాచుకుంటానికి కాదు. నీవు అనుభవిస్తూ ఇతరులను భాగస్వాములను చెయ్యమని అమ్మ సూచన. అమ్మ మనకు పెట్టటంలో, ఇవ్వటంలో మనము ఇతరులకు పెట్టమని, ఇవ్వమని, మనము ఇచ్చిన కొలది అది పెరుగుతూనే ఉంటుందని, మనకు లేదు, లేదు అని అన్నంత కాలం అది మనకు లేకుండా పోతుందని. అందుకే ఎప్పుడు లేదు అనవద్దు అని అమ్మ సందేశంలోని ఆంతర్యము. అదే Positive thinking అపుడే మనసున్న మనిషి అవుతాడు. లేకపోతే వాడి గతి ఇంతే అన్నమాట. మనసు లేని మనిషి అవుతాడు. దుర్గతి పాలౌతాడు. అందువల్ల జిల్లెళ్ళమూడి పదకోశంలో లేదు అనేది లేదు. లేదు అనే మాట ఎవ్వరూ ఎప్పుడూ అనవద్దు.