‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ – SVBC వారి ఒక episode లో ఒక గాయని ‘పనిలేదు, పాటలేదు…’ అనే అన్నమాచార్య గీతాన్ని అవ్యక్తమధురంగా గానంచేసింది. నాటి కార్యక్రమంలో గీత వ్యాఖ్యాతగా ఆసీనులైన సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు అద్భుతమైన వివరణ ఇచ్చారు. ‘భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అంటే ఋషులు తర్కించి తర్కించి తర్కించి ‘లీల’ అని చెప్పారు. బ్రహ్మసూత్రాలలో ‘లోకవత్తు లీలా కైవల్యమ్’ అని ఉంది” అని.
అమ్మని “ఈ సృష్టికి కారణం ఏమిటి!” అని అడిగితే, “అకారణమే కారణం” అన్నది.
బ్రహ్మసూత్రాలలో (ప్రయోజన వత్త్వాధికరణమ్) సూత్రము 2.1.32 ‘న ప్రయోజనవత్త్వాత్’ అని – ఉంది. ఏ కార్యమైనా చేపట్టడానికి ఏదో ఒక ప్రయోజనమంటూ ఉండాలి. ప్రయోజన మనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే. కానీ, జగత్ సృష్టి అనే మహత్కార్యాన్ని చేపట్టడానికి బ్రహ్మమునకు ఎట్టి ప్రయోజనము కనబడదు అని అర్థం.
సూత్రము 2.1.33 ‘లోకవత్తు లీలా కైవల్యమ్’ అంటే విశ్వసృష్టి పరమాత్మ లీల – అని ప్రబోధిస్తోంది. ”అంటే వినోదం, సంతోషం.
ఒక సందర్భంలో అమ్మ నాతో అన్నది “జగన్మాత అంటే జగత్తే మాత. సృష్టే దైవం. దైవం సృష్టి చేయటం కాదు” అని. వేదం కూడా “తత్ సృష్ట్వా తదేవా ను ప్రావిశత్ తదను ప్రవిశ్య” అని ప్రారంభించి ‘నిరుక్తంచ అనిరుక్తంచ .. విజ్ఞానం అవిజ్ఞానం, సత్యంచ అనృతం చ సత్య మభవత్’ అంటూ సామాన్య దృష్టికి విభిన్నముగా వైరుధ్యముగా కానరావచ్చు, కానీ బ్రహ్మ పదార్ధం కానిది లేదు అని ఘంటాపథంగా చాటి చెప్పింది.
ఒకసారి శ్రీ చిదంబరరావు తాతగారు అమ్మను “ఏమమ్మా! ఒంటరిగా ఏం చేస్తున్నావిక్కడ?”అని అడిగినపుడు అమ్మ “నేనెప్పుడూ ఒంటరిదాన్ని కాను. నాలో అందరూ ఉన్నారు. అంటే నా మనస్సులో అందరూ గుర్తు వస్తూనే ఉన్నారు. అనేకం, అనేకులు, అనేక విషయాలు ప్రపంచమంతా మనసులో నెమరువేసుకుంటున్నాను” అన్నది.
శ్రీ లలితా సహస్ర నామాలలో ‘పంచకృత్య పరాయణ’ అనే నామము ఉన్నది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు పంచకృత్యాలు. పరాశక్తి సంకల్పం చేతనే ఇవి జరుగుతున్నాయి – అని అర్థం. అందుకు ఉదాహరణ ‘విశ్వరూప సందర్శన యోగము’ అధ్యాయములో శ్రీకృష్ణపరమాత్మ –
“ద్రోణంచ భీష్మం చ జయద్రధం చ
కర్ణం తథా న్యానపి యోధవీరాన్
మయా హతాన్”
-భీష్మాది యోధులందరూ నాచే యిదివరకే చంపబడ్డారు – అని తేటతెల్లం చేశారు.
మరొక సందర్భంలో అమ్మ “నాతో నేనే ఆడుకుంటున్నాను” అన్నది. కాగా, ఇన్నిరూపాలలో, ఇన్ని నామాలతో, ఇన్ని స్థితులలో విరాజిల్లుతున్నది ఒకటే – ఆ నిత్య సత్య స్వరూపం, అమ్మ నిజస్వరూపం.
ఇట్టి మహత్వపూర్ణమైన సృష్టి సంచాలకశక్తి సృష్టిని ఒక లీలగా, ఒక ఆటగా నడిపిస్తోందా? ఏమో! ఒకనాడు ప్రసంగవశాన అమ్మను “నీదంతా నాటకం” అన్నాను; వెంటనే “నాన్నా! ఇది ఏకపాత్రాభినయం కాదు; మీరూ పాత్రధారులే” అన్నది. మన పాత్రలు ఎంతవరకు అంటే మట్టిబొమ్మలు, ఆటబొమ్మలు, తోలుబొమ్మలు. తోలు బొమ్మలు (Puppets) ని ఆడించేవాడు తెరవెనుక మరుగున ఉంటాడు అవ్యక్తంగా. ప్రేక్షకులకి మాత్రం తెరమీద బొమ్మలు కనిపిస్తాయి, వాళ్ళ హావభావాలు, అర్థమవుతాయి, వాళ్ళ సంభాషణలు వినిపిస్తాయి, వాస్తవం అనిపిస్తాయి. వాస్తవానికి ఆ మాటలు, చేతలు, కథా కథనం సర్వం ఆడించేవాడివే. కనుకనే విశ్వాంతరాత్మ అమ్మ అంటుంది, “నేను అనుకోనిదీ చేయించనిదీ, నువ్వు అనుకోలేవు చెయ్యలేవు” అని. మనం పూర్ణ స్వతంత్రులుగా కనిపించే అనిపించే అస్వతంత్రులం. ఇందుకు ఒక ఉదాహరణ.
ఆ రోజుల్లో నరసాపురం డా॥ ఆచంట కేశవరావు గారు, మా మామయ్య గారు, జిల్లెళ్ళమూడిలో ‘ఆదరణాలయం’ స్థాపించాలని ఆ రూపేణా అమ్మ సేవ చేసుకోవాలని విరాళాలు సేకరిస్తున్నారు. నేను జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో ఉన్నాను. ఒకనాడు వారినుండి ఫోన్ వచ్చింది. అమ్మ, తర్వాత రామకృష్ణ అన్నయ్య వారితో మాట్లాడారు. అన్నయ్య నాతో చెప్పాడు – “డాక్టర్ గారు తనకు సహాయంగా నిన్ను పంపమన్నారు” అని. అందుకు నేను అమ్మతో అన్నాను “అమ్మా! అక్కడ నేను చేసేదేమీ లేదు. కారులో ఆయనే తిరుగుతారు. నేను ఊరికే ప్రక్కన ఉండటమే” అని. వెంటనే అమ్మ అన్నది, “నువ్వేకాదు, నాన్నా! ఎవరైనా అంతే. ప్రక్కన ఉండాల్సిందే. చేసేదేమీ లేదు” – అని. అది ఒక మహెూపదేశం, పరమ సత్యం, నమ్మలేని నమ్మశక్యంగాని నిజం; అంతా ఆ శక్తి చేయిస్తుంది, చేస్తుంది – అనేది.
ఈ సృష్టిలో అమ్మ లేనిదీ, అమ్మ కానిదీ ఏదీ లేదు; సర్వతంత్ర స్వతంత్ర సార్వభౌమ. సర్వకార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలనూ నడిపించే సగుణమూర్తి. అవ్యక్తమే పరిమిత రూపంతో కట్టెదుట నడయాడే అనసూయమ్మ కేవలం అనుగ్రహస్వరూపం, అనంతమ్మ అయికూడా అమ్మ అనేదీ అదేమాట “నాకు పనీ, పాటా లేదు” అని. ఈ సందర్భాన్ని వివరిస్తా.
04-06-1971 తేదీ రాత్రి గం 12.00 లు దాటింది. రామకృష్ణ అన్నయ్య సామానుతో గుంటూరు నుంచి వచ్చాడు. సామాను సర్దించి అమ్మ నివాసానికి వచ్చాడు. అక్కడే తనూ పడుకోవటం అలవాటు కనుక. తలుపు తట్టాడు, ఎవరూ పలకలేదు. పెద్దగా పిలిచాడు. ఎవరూ జవాబివ్వలేదు. ఆ రాత్రి అమ్మ మంచం ప్రక్కన నేను మెలకువతోనే ఉన్నాను.
అంతలోనే అడుగుల సవ్వడి మెత్తగా విని పించింది. క్షణంలో తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా అమ్మ! అన్నయ్య ఆనందానికీ ఆశ్చర్యానికీ అవధుల్లేవు.
“అదేమిటమ్మా! నీవు వచ్చావు? ఎవరూ లేరా?” అని ప్రశ్నించాడు. అందుకు అమ్మ చిద్విలాసంగా నవ్వుతూ, “అందరూ నిద్రపోతున్నారా. వాళ్ళను లేపటం ఎందుకూ, అని నేను వచ్చాను. అదీగాక వాళ్ళు పగలల్లా యీ పనీ ఆ పనీ చేసి ఉంటారా అలసటచెంది ఒళ్ళు మరచి నిద్రపోతారు. ఈ నిద్ర లేకపోతే వారికి పగలల్లా మత్తుగా ఉంటుంది. నేనంటావా? ‘పనీపాటా లేని దానను’. కనుక అలసటా ఉండదూ, ఆకలీ ఉండదూ, నిద్రా ఉండదు, నీరసమూ ఉండదు” అన్నది. అమ్మ నిరాహార, నిర్నిద్ర, నిర్నిమేష అనేది పరమ సత్యం. కానీ ‘అమ్మకి పనీ పాటా లేదా?’ మూలానికి పోతే స్థూలంగా దశావతారాలు – దుష్టశిక్షణ – శిష్టరక్షణ సర్వం లీలేకదా! సనకసనందనాదుల శాప ఫలితంగానే కదా!
కనుకనే అమ్మ “సంకల్ప రహితః అసంకల్ప జాతః” అనే ఒక అద్భుతసత్యాన్ని ఆవిష్కరించింది.
ఏతావాతా, పరిమిత దృష్టి మేథ శక్తి మనుగడగల సామాన్యునికి సృష్టివైచిత్రి ఎట్లా అవగతమవుతుంది, తత్వతః? నాకు తెలిసిన నా మనస్సుకి తాకి నాకు అందిన ఒక సత్యాన్ని ప్రస్తావిస్తాను – “కరుణ లేకపోతే మనమే లేము. మనము చేసే పనులన్నీ కరుణవల్లనే. ప్రతి చిన్నపనీ మన చేతులతో చేస్తున్నామనుకున్నా, మనం ఎట్లాచేసినా – వాడి (ఆ శక్తి) కరుణ వల్లనే” అనే అమ్మ వాస్తవ చిత్రణ.
కనుపించని దైవానికి కనిపించే రూపం కరుణ (Mercy). కరుణారససాగర అమ్మ అనుగ్రహరోచిస్సులే శ్రీరామరక్ష సర్వజీవ జీవన సంజీవని (LIFE ELIXIR).