1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లోకైక దీపాంకురా

లోకైక దీపాంకురా

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022

దైవం మానవరూపంలో అవతరించి ఈ భూమిపై నడయాడడం ఒక అద్భుత సన్నివేశం. అనంతమైన శక్తి పరిమితరూపంలో మాతృమూర్తిగా ఈ భూమిపై అవతరించి ఆ అద్భుతాన్ని దర్శించే అవకాశాన్ని కల్గించింది. ఏ మహత్తర సందేశాన్ని అందించడానికి అమ్మ అవతరించిందో ఆ సందేశం అమ్మ బాల్యంలో జరిగిన సన్నివేశాలన్నింటి లోనూ అంతర్లీనంగా కన్పిస్తుంది. మూడేండ్ల వయస్సులోనే తన తల్లి రంగమ్మ గారితో ‘నీవులేనపుడు నేనే అమ్మనై ఉంటాగా’ అన్న వాక్యం అమ్మ అవతారతత్త్వమైన ‘నేను అమ్మను మీరు బిడ్డలు’ అన్న ప్రకటనకు మూలం.

అమ్మ జన్మించిన 1923 మార్చి 28 వ తేది మొదలు 1985 జూన్ 12 వరకు ఉన్న అమ్మ జీవితం ఒక మహోదధి. సముద్రజలం కంటె తరంగానికి ఉనికి లేనట్లుగా అమ్మ జీవితంలోని సన్నివేశాలన్నీ అమ్మ తత్త్వాన్ని మనకు తేటతెల్లం చేస్తాయి.

ఆధ్యాత్మిక తత్త్వాన్ని సాంఘిక సహజీవన – వైభవాన్ని సమన్వయించి చూపించిన ఉదాత్తత అమ్మ జీవితచరిత్రలోని ముఖ్యాంశం. వ్యక్తుల ఆధ్యాత్మిక ఉన్నతి సాంఘిక, సహజీవన భావనలోనే పరిపక్వమవుతుందని అమ్మ చరిత్ర మనకు చెప్తున్నది. అనేక సందర్భాలలో అమ్మ ఈ అభిప్రాయాన్ని ప్రకటించింది. అమ్మ బాల్యం అయిదవ ఏట జరిగిన పిల్లవాడి సంఘటన ఈ అంశాన్ని నిర్ధారిస్తుంది. ఆ సందర్భంలో అమ్మ నోట వెలువడిన వాక్యం ‘బ్రహ్మతత్త్వమే బ్రాహ్మణత్వం’ అని. ఈ నిర్వచనం. అమ్మ ద్వారా వర్గ రహిత సమాజానికి ఆనాడే శంకుస్థాపన చేసింది అమ్మ.

మానవరూపంలో అవతరించిన మహనీయుల జీవిత సన్నివేశాలు లోక రీతికి భిన్నంగా ఉంటాయి. కేవలం మానవులనే కాక సృష్టిలోని సకల ప్రాణికోటిని తన బిడ్డలుగా భావించి ప్రేమించి లాలించిన అమ్మ ఈ ప్రేమను అన్నం పెట్టడం రూపంలో వ్యక్తం చేసింది. బిడ్డల ఆకలి బాధను చూడలేని తల్లిగా అమ్మ అందరికీ సుపరిచిత అయింది. కానీ అదేమి చిత్రమో చిన్నతనంలో అమ్మకు అన్నప్రాశన జరుగలేదు. తరువాత కాలంలో అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే అమ్మ మనలాగా భోజనం చేసిన సన్నివేశాలు కన్పించవు. ‘మీరు తింటే నేను తిన్నట్లే నాన్నా’ అని ప్రకటించిన అమ్మ జీవితంలో అందరికీ అన్నం పెట్టుకోవడమే కాని తాను అన్నం తిన్న సందర్భం మనకు కన్పించదు.

ఆధ్యాత్మిక సాధనకు పర్యవసానం సేవా ధర్మమే. అందుకే ప్రవక్తలందరూ మానవసేవే మాధవసేవ అని ప్రబోధించారు. అరుదయిన ఈ అత్యుత్తమ గుణం అమ్మలో స్వభావ సిద్ధంగా ఉన్నది. ఈ సత్యాన్ని నిరూపించే సన్నివేశాలు అమ్మ బాల్యంలోనే మనకు ఎన్నో కనిపిస్తాయి. తాను పెద్దల మీద ఆధారపడవలసిన వయస్సులో అమ్మ చేసిన సేవలు బాల్యంలోనే వికసించిన అమ్మ విశ్వమాతృత్వానికి ప్రత్యక్ష నిదర్శనం.

అమ్మ బాల్యంలో బాపట్లలో ఉన్నపుడు ఒకసారి ఒక దారపు ఉండ, సూది కొనుక్కుని రావాలని పావలా తీసుకుని వీధిలోకి వచ్చిన అమ్మ అక్కడున్న బిచ్చగాళ్లను చూసి ఆ పావలా వారిచేతికి ఇచ్చింది. మరికొంత ముందుకు సాగి బ్రహ్మాండం వారి సత్రం సమీపించే సరికి అక్కడ ఎందరో బిచ్చగాళ్లు కలిసి భోజనం చేస్తూ కనిపించారు. ఆది సత్రం అని తెలుసుకున్నది. అమ్మ సత్రం అంటే సర్వులకూ స్వతంత్రమైనదేనా అని ఆలోచన కలిగింది. అంతలో గుడిగంటలు వినిపించాయి. దేవాలయం లేని గ్రామంలో దేవాలయ నిర్మాణమూ, సర్వులకూ స్వతంత్రమైన భవన నిర్మాణమూ జరగాలని ఆ క్షణంలో అమ్మ మనసులో సంకల్పం కల్గింది. ఆనాడు అమ్మ మనసులో కలిగిన సంకల్పమే తరువాతి కాలంలో ఆచరణ రూపాన్ని పొంది జిల్లెళ్లమూడిలో అన్నపూర్ణాలయం, హైమాలయం, అనసూయేశ్వరాలయం మొదలైనవి ఆవిర్భవించాయి. బాల్యంలో అమ్మ చేసిన సంకల్పం కాలాంతరంలో సత్యమయింది. ఆనాడు అమ్మకు సంకల్పం కల్గిన వెంటనే అక్కడి గుడిగంటలు మ్రోగాయి. తరువాత కాలంలో ఆ సంకల్పం కార్యరూపం ధరించి జిల్లెళ్లమూడిలో అమ్మ ఆశయమనే గుడిగంటలు మ్రోగుతూనే ఉన్నాయి.

అమ్మ నాలుగు, అయిదేళ్ల వయస్సులో బాపట్లలో భావనారాయణస్వామి ఆలయంలో భూమిని గురించి తత్త్వ విచారణ చేసింది. మంచి, చెడు అన్నింటినీ భరిస్తూ అగ్ని పర్వతాలు తన గుండెల్లో దాచుకుని పైకి నిశ్చలంగా కనిపిస్తూ, ఈ సర్వజగత్తుకూ ఆహారమిచ్చి పోషించే తల్లి సహనమూర్తి భూమాత. సహనానికి మరోరూపమే అమ్మ. అందుకే అమ్మే అవని. అవనియే అమ్మ. ‘అవనియే ఆరాధ్యదైవం’ అంటూ అవని గురించి చెప్తూనే తన తత్త్వాన్ని తెలియచేసింది. తరువాతి కాలంలో అమ్మ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎన్నో ఎదురయినాయి.

ఎవరికయినా మరణమాసన్నమయినపుడు అమ్మ తానే వారి దగ్గర ఉండడం. అంత్యక్రియలకు శ్మశానానికి వెళ్ళడం వంటి సన్నివేశాలు అమ్మ జీవితంలో మనకు కన్పిస్తాయి. ఆ నిశ్చలస్థితే బాల్యంలో జరిగిన సంఘటనలో మనం దర్శించవచ్చు. తనను ఎవరయినా ఎత్తుకునే వయస్సులో మరణించిన ఒక పిల్లవాడిని భుజాన వేసుకుని వెళ్లడం, ఆ పిల్లవాడికి మట్టి కప్పడం వంటి అసాధారణమైన విషయాలను చూస్తే అమ్మ బాల్యం ఒక సూత్రమయితే అనంతర జీవితం దానికి విద్యాభ్యాసంలా అనిపిస్తుంది.

దోషులను సానుభూతితో అర్థం చేసుకుని ప్రేమతో వాళ్లలో పరివర్తన తీసుకురావాలన్నదే అమ్మ ఆశయం, ఆరాటం. అందరినీ బిడ్డలుగా చూసే మాతృభావనలో బిడ్డల తప్పు గ్రహించినా శిక్షించకుండా ప్రేమతో వారికున్న మనో వైకల్యాన్ని సరిచేసి అద్భుతమైన పరిణామం తీసుకువచ్చింది. అమ్మ. రంగమ్మ రామయ్య దంపతుల దాంపత్యజీవితాన్ని సంస్కరించిన ఒక సంఘటన అమ్మ. బాల్యంలో జరిగింది . భార్యభర్తలు ఇద్దరూ తమ తమ ధర్మాలను చిత్తశుద్ధితో పాటించాలన్న అమ్మ ప్రబోధంలో మేల్కొన్న రామయ్య తన తప్పు తాను తెలుసుకుని తనను తాను దిద్దుకున్న సన్నివేశం ఇది. ఈ సంఘటన అమ్మ కేవలం వేదాంత బోధ చేసే గురువు మాత్రమే కాదనీ, నిత్యజీవిత నిర్వహణ సక్రమంగా సాగడమే ఆధ్యాత్మిక సౌధానికి సోపానం అన్న అమ్మ ప్రబోధాన్ని తెలియ- చేస్తున్నది. సమాజంలో మంచి చెడు కలిసి ఉంటాయి. అనివార్యమయిన చెడును నిందించడమో. ఖండించడమో కాక సరిచేయడం కర్తవ్యమని సూచించింది అమ్మ. చెడును శిక్షించక సంస్కరించటం విశ్వప్రేమ తత్త్వలక్షణం. ఈ విధానం అమ్మ అవతార ప్రణాళికలో ఒక భాగం. అమ్మ అరవయ్యేళ్ల జీవితంలోనూ ఆచరించిన ఈ విధానం అమ్మ బాల్యంలోనే మొగ్గతొడిగి వేయిరేకులుగా విప్పారింది.

ఒక వయస్సు వచ్చాక తాత్త్వికత గురించి సంభాషణలు చేయడం కాదు చిన్నతనంలోనే అమ్మ తాత్త్విక విషయాలను అలవోకగా సంభాషించేది. రైల్లో తారనపడ్డ ఒక తాత అమ్మను ఉద్దేశించి బాల వాక్యం బ్రహ్మ వాక్యం అంటే ‘బాల వాక్యం బ్రహ్మ వాక్యం కాదు. భ్రాంతిలేని వాక్యమే బ్రహ్మ వాక్యం’ అనే మహావాక్యాన్ని తెలియచేసింది.

అమ్మ వివాహం జరిగే నాటికి అమ్మ వయసు 13 సంవత్సరాలు, అంతకు పూర్వం రెండు మూడు సంవత్సరాల ముందునుండే అమ్మ వివాహం ప్రస్తావన ఇంట్లో వస్తూ ఉండేది. పుట్టినప్పటి నుండి అమ్మప్రత్యేకత గుర్తించిన అమ్మ చినతాతగారు చిదంబరరావుగారు అమ్మతో ‘నీకీ పెండ్లి ‘ఎందుకమ్మా!’ అని అడిగితే ‘లోకంలో ఉన్న కష్టాలన్నింటినీ భరిస్తూ, సంసార జీవనం ఎలా సాగించాలో లోకానికి నేర్పడం కోసమేననీ, అన్నీ అనుభవిస్తూ ఏదీ మననుకు అంటకుండా ఉండడం సాధ్యమేనని నిరూపించడానికి’ అనీ, పెళ్లిలో పెద్దపులి ఉందని భయపడే వారి భయాన్ని పోగొట్టడం కోసమే వివాహం చేసుకుంటానని చెప్పింది.

‘కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమే కల్యాణం’ అనీ ‘ఒక పెన్నిధి. అండన చేరడమే పెండ్లి’ అని అమ్మ తన వివాహం సందర్భంగా లోకానికి అనేక నిర్వచనాలను ప్రసాదించింది. అంత చిన్నతనంలో వైవాహిక జీవితాన్ని గురించి అమ్మ మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించకమానవు. వివాహవ్యవస్థలో కనుమరుగయిపోతున్న విలువలను పరిరక్షించడం కోసం, వైవాహిక బంధంలో ఉన్న పరమార్థాన్ని బోధించడం కోసం అవతరించిన అమ్మ తన ప్రణాళికను బాల్యంలోనే సిద్ధంచేసుకున్నది.

ఈ విధంగా లోకైక దీపం అయిన అమ్మ అవతారతత్త్వమంతా అంకురప్రాయంలోనే వెల్లడి అయింది. లోకానికంతటికీ వెలుగును ప్రసాదించే జ్ఞాన జ్యోతి అమ్మ ‘అన్ని బాధలకంటే ఆకలి బాధ భరించటం కష్టం నాన్నా’ అంటూ పసిప్రాయంనుంచి ఆకలిని రూపు మాపటానికి ప్రయత్నం చేసిన అన్నపూర్ణేశ్వరి అమ్మ, ‘సాటి వారి కష్టాలను చూసి స్పందించటమే మానవత్వం అదే దైవత్వం’ అంటూ మాటలుకూడ వచ్చీరాని వయసులోనుంచే ఎదుటి వారి కష్టాలను చూసి స్పందించిన మహామానవతామూర్తి అమ్మ. ‘నాది విచక్షణలేని వీక్షణ’ అంటూ ఏ విచక్షణలేకుండా అందరికీ తన ఎనలేని ప్రేమను పంచి పెట్టిన ప్రేమ స్వరూపిణి అమ్మ. ‘సరే మంత్రం’ తో వైవాహిక జీవితాన్ని ఎలా సాగించాలో ఆచరణాత్మకంగా ప్రబోధించిన ఆదర్శ గృహిణి అమ్మ. ఎలా జీవిస్తే మనిషికి సుఖం, శాంతి, తృప్తి, ధైర్యం కల్గుతాయో మనకు నేర్పిన గురుత్వాన్ని నింపుకున్న మహనీయ మాతృమూర్తి అమ్మ. లోకాలన్నింటికీ ఏకైక వెలుగు అయిన అమ్మ చరణారవిందాలకు శతాధిక వందనాలు సమర్పించుకుంటూ…… జయహెూమాత.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!