1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లోక కళ్యాణ వేదిక

లోక కళ్యాణ వేదిక

L. Satyanarayana (laala)
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : February
Issue Number : 7
Year : 2013

ఏ క్షేత్రంలో కాలిడితే మనస్సు భగవంతుని యందు

లగ్నం అవుతుందో అదే మహాపుణ్యక్షేత్రం

– వివేకానందుడు 

చెరుకుగడ ఎక్కడ కొరికి నా మధురమే. జిల్లెళ్ళమూడిలో ప్రతి అడుగూ పవిత్రమే. దాదాపు మూడు దశాబ్దాలు ‘అమ్మ’కు అలవాలమైన వాత్సల్యాలయం ఎంత పవిత్రమో ఎలా వివరించగలం?

` మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది బిడ్డలను కరుణిస్తున్న అనసూయేశ్వరాలయం, హైమాలయం పవిత్రతను వర్ణించడానికి ఎన్ని నోళ్ళు కావాలి?

ఎన్ని కోట్లమందికి ‘అమ్మ ప్రసాదం’ అందించిందో అన్నపూర్ణాలయం. ఆ ఆలయ పవిత్రత వర్ణించడానికి ఎవరితరం?

ఎంతమందినైనా తన గర్భంలో దాచుకోగల్గినా ‘అందరి’ పవిత్రత నిజంగా ఆకాశమంత,

కాని అందరింటిలోని పూజావేదిక ప్రత్యేకత వేరు. ఆ ‘వేదిక’ గురించి తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మనస్సు ఆనందతరింగిత మవుతుంది. ఆహా ! ఏమా వేదిక! ఆ వేదిక అణువణువు ప్రతిరాయి, ప్రతిసిమెంటు రేణువు ఎంత పుణ్యం చేసికొన్నాయో? ఆ వేదిక మీద నుండి ‘అమ్మ’ ఎన్ని వేలమంది దంపతులు చేత పూజలందుకున్నదో? ఎన్ని లక్షలమంది ఆ జగజ్జననికి పాద నమస్కారాలు చేసికున్నారో?

ఎన్ని కోట్లమంది బిడ్డలమీద అమ్మ తన వాత్సల్యపు దృక్కులు ప్రసరింపచేసిందో ? ఎంతమంది చిన్నారులకు అమ్మ నామకరణాలు, అన్నప్రసనలు చేసిందో? ఎంతమంది పసిబిడ్డలకు ‘అక్షరాభ్యాసం’ చేయించిందో? ఎన్ని సాహిత్య సభలు అమ్మ సమక్షంలో ఆ వేదికపై వెలుగులు విరజిమ్మాయో?

ఆ వేదిక నిజంగా లోక “కళ్యాణవేదిక” ఎన్ని వేల మంది కళ్యాణాలు అమ్మ స్వయంగా పాల్గొని, తన చేతుల మీదకుండా చేసి వారిని ఆశీర్వదించిందో!

అకళ్యాణవేదిక మా లక్కరాజు, బూదరాజు, కొండముది కుటుంబాలకు ఒక యజ్ఞవేదిక. శ్రీ బూదరాజు వెంకటరత్నం, వసుమతి దంపతుల సంతానంలో ఇద్దరి వివాహాలు శ్రీ లక్కరాజు హనుమంతరావు – సీతమ్మల సంతానం మొత్తం అయిదుగురి వివాహాలు, శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య – పద్మావతి దంపతులు మొత్తం సంతానం అయిదుగురు వివాహాలు ఈ కళ్యాణ వేదిక మీదే!

అమ్మకు మేనత్త వరసైన శ్రీమతి కొండముది లక్ష్మీనరసమ్మగారి ముదిమనుమడి సంతతి అవటమే ఈ కరుణకు కారణమా?

జిల్లెళ్ళమూడికి మార్గాలు వేసిన శ్రీ కొండముది వెంకట సుబ్బారావు గారి మనవడి సంతతి కావటమే మా ఈ అదృష్టానికి కారణమా?

శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్యను ‘అమ్మ’ దత్తత ఇచ్చిన మనస్విని శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి మనవడి సంతతి కాపటమే మేము చేసికొన్న పుణ్యమా? అమ్మకు ఉపకరణమై, ఆంతరంగిక కార్యదర్శి అయి అమ్మ సేవకు తన జీవితాన్నే అంకితం చేసిన శ్రీ రామకృష్ణ అన్నయ్య వారసులం కావటమే ఈ యోగానికి కారణమా?

మనసా, వాచా, కర్మణా, అమ్మనే నమ్మిన శ్రీ బూదరాజు వెంకటరత్నం – వసుమతి, శ్రీ లక్కరాజు హనుమంతరావు – సీతమ్మ గార్ల సంతతి కావటమే ఈ అవకాశం కల్గించిందా?

ఏమో ! అవ్యాజకరుణామూర్తి ‘అమ్మ’ కరుణకు కారణం కావాలా? అమ్మ కరుణించింది. అంతే మేమంతా

ధన్యులము.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!