1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లోచూపు

లోచూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2014

(2013 సెప్టెంబర్ సంచిక తరువాయి)

  1. ది.16.9.57 తేదీన ‘నీవేనమ్మా ధరవూ’ అనే నా 22వ పాటను వ్రాశాను.

      ‘నీవే నమ్మా ధరవూ నీవేలే విశ్వంభరవూ

      ఓ అమ్మా ! నా అమ్మా !’ అనేది పల్లవి.

      ‘నా అమ్మా !’ అని సంబోధించాను. అమ్మ నాది; నాదే. మరెవరిదీ కాదు; నా సొంతం. ఈ భావన నాకేకాదు అందరికీ ఉన్నదే. ఇదే వస్తుతః గోపికాభక్తి. ‘ధరవూ, విశ్వంభరవూ’ అని అనటంలో అమ్మ మేదినీ స్వరూపిణి అనేకాదు, గ్రహాలూ – గ్రహరాజులూ చరాచర దృశ్యాదృశ్య జడచైతన్యాత్మక సకలసృష్టికి మూలం అమ్మ. అది నా అనుభవ సంజనిత విశ్వాసం.

       ‘నీ నీడలోనే వెలిశాయిలే జగాలు

       నీ జాడలోనే నిలిచాయిలే పథాలు

       నీతోడు నీడలోనే కలిశాయిలే మతాలు

       మతంబులు ఏకమౌ రహదారిలో ధ్రువతారకా

    ॥నీవేనమ్మాధరవూ||

అనేది ప్రథమచరణం.

      ‘నీ నీడలోనే వెలిశాయిలే జగాలు’ ఆశ్రయించే పధ్నాలుగు భువన భాండాలు ఉన్నాయి; వాటి ఉనికి – అస్తిత్వం – మనుగడలకి హేతువు – మూలం. అమ్మ.

         ‘నీ జాడలోనే నిలిచాయిలే పథాలు’

         సృష్ట్యాదిగా సత్యాన్వేషణలో నేతి సిద్ధాంతం, కర్మసిద్ధాంతం, అచలమతం… ఎన్నో మార్గాలు వెలిశాయి. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అలాగే మతాలన్నీ అమ్మ తత్త్వంలో ఇమిడి ఉన్నాయి; అమ్మ అభయహస్తంతో క్షేమంగా ఉన్నాయి. కనుకనే ‘నీతోడు -నీడలోనే కలిశాయిలే మతాలు’ అని వ్రాసుకున్నాను.

           ఆ చరణంలో నాల్గవ పంక్తి ‘మతంబులు ఏకమౌ రహదారిలో ధ్రువతారకా! అనేది. మనదేశంలో ముఖ్యంగా మూడు మతాలు ఉన్నాయి. హిందూ, క్రైస్తవ, ఇస్లాం. భారతదేశ త్రివర్ణ పతాకంలోని కాషాయరంగు హిందుమతానికి, తెలుపురంగు క్రైస్తవమతానికి, ఆకుపచ్చరంగు ఇస్లాం మతానికి సంకేతాలు అని విన్నాను.

“సర్వసమ్మతమే నామతం” అని అమ్మ స్పష్టం చేసింది. సర్వమత సమ్మతమే అమ్మ మతం. తనకు అన్ని పద్ధతులూ నచ్చుతాయని అంటుంది. పరస్పర విరుద్ధంగా కనిపించే మతాలన్నింటికీ అమ్మ మాతృమూర్తి. కనుకనే ప్రతిదానిలో ఒక విశేషాన్ని ఔన్నత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అదే అమ్మ లోని ప్రత్యేకత. ఒక ఉదాహరణ. “జగన్మాత అంటే జగత్తే” అని అంటుంది. ‘నేతి సిద్ధాంతం’ ఇది కాదు, ఇదికాదు అంటూ సాగిపోతుంది. అమ్మ అంటుంది, “అలా పోగా పోగా చివరకు “అంతా అదే” అనే సత్యం సుబోధకం అవుతుంది. అందుకనే అలా చెప్పి ఉంటారు” అని. అన్నిదారులకూ, మతాలకూ దిక్సూచి, ధ్రువతార అమ్మే. త్రిమతాచార్యుల ప్రబోధాన్ని సమన్వయం చేస్తుంది. త్రిశక్తిరూపిణి అమ్మ. అంతేకాదు.

అమ్మ ఎప్పుడూ సహజంగానే మాట్లాడుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఒక అంశాన్ని గురించి మాట్లాడాలంటే ముందుగా రంగాన్ని సిద్ధం చేసికోవాలి. గాఢనిద్రలో ఉన్న అమ్మను తటాలున తట్టి లేపి అడిగితే ఏం చెపుతుందో, పదిమంది ప్రయత్నపూర్వకంగా చుట్టూ చేరి ప్రశ్నించినపుడూ అదే సమాధానాన్ని ఇస్తుంది. అలవోకగా మామూలుగా మాట్లాడే మాటలూ వేదసమ్మితాలు, సత్యసంశోభితాలు.

ఈ పాటలో రెండవ చరణం – 

‘చెప్పేది చేసేది చూసేది ఒకటేలే యని

తప్పంచు ఒప్పంచు తలచేది తానేలే యని

చెప్పేది చేసి చూపించేటి జగముల తల్లివా ?

సాంఖ్యము తారకం అమనస్క మార్గదర్శికా! ॥నీవేనమ్మా ధరవూ॥’ అనేది..

అమ్మ మాటలు సర్వదా విశ్వజనీనంగా ఉంటాయి. ఒక వ్యక్తితోకోసం చెప్పినట్లు ఉన్నా అవి సార్వత్రికంగా ఉంటాయి; దేశకాలమాన అవస్థలకి అతీతంగా అన్ని వర్గాల వారికీ సరిపోయేట్లు ఉంటాయి. ఒక ఉదాహరణ. ఒకసారి (మంచం మీద) ‘దిండు ఎటువైపు (ఏ దిక్కున) పెట్టమంటావు?” అని అడిగితే, “ఏ దిక్కున అయినా ఒక్కటే, నాన్నా! అన్నిటికీ వాడే దిక్కు” అన్నది. అమ్మ మాటలు మారుమాటలేని మహామంత్రాలు. అవి అమ్మ ఇచ్చే నిర్వచనాలు, ప్రవచనాలు, వివరణ, విధానం, రీతి, శైలి. తాను ఏదైతే చేస్తుందో అదే చెపుతుంది.

ఒక ముఖ్యాంశం. నేను ఈ పాట వ్రాసిన నాటికి సాంఖ్యం, తారకం, అమనస్కం… పదాలకి అమ్మ ఇచ్చిన నిర్వచనాలు తెలియవు. కొంతకాలానికి ‘మాతృశ్రీ జీవితమహోదధిలో తరంగాలు’ గ్రంథాన్ని చూసినపుడు (218 పేజీలో) అమ్మ తన ఐదవ ఏటనే, “సాంఖ్యం, తారకం, అమనస్కం ఈ మూడింటి స్థితి చెప్పేది, చేసేది, చూచేది. చెప్పేది సాంఖ్యం, చేసేది తారకం, చూచేది అమనస్కం” అని వివరించింది శ్రీ చిదంబరరావు తాతగారితో – అని చదివి ఆశ్చర్యపోయాను. నా ప్రమేయం లేకుండా అమ్మ అనుగ్రహంతో సరియైన మాటల్ని సరియైన స్థానాల్లో ఉపయోగించాను. అంటే ఇది స్వోత్కర్ష కాదు. ఇది నా రచనా వ్యాసంగానికి ఒక గీటురాయి, పరాకాష్ఠ. అసలే డొక్క శుద్ధిలేదు; శాస్త్రజన్య జ్ఞానం లేదు, పాండిత్య ప్రకర్ష కాదు. సంప్రదాయ ఆధ్యాత్మికరంగ పదకోశం అర్థాలు తెలియవు. నా పరిధులు, నా పరిమితులు నాకున్నాయి. వాటిని అధిగమించి అమ్మ నా చేయిపట్టుకొని వ్రాయించింది; నా నోట పాడించింది.

శ్రీరాధాకృష్ణశర్మగారు, ‘భక్తి ప్రపత్తిరహితో 2 హమశిక్షితాత్మా, కుర్వే తవస్తవం, అహో ! (అమ్మా! భక్తి, శరణాగతి, శిక్షణ లేనివాడిని. ఆశ్చర్యం. అయినా నిన్ను ప్రస్తుతిస్తున్నాను) అన్నారు. విద్యావైదుష్యం లేని నా బోటి పామరునిపరంగా ఈ భావనని చక్కగా అన్వయించుకోవచ్చు.

 

– సశేషం 

సమర్పణ : రావూరి ప్రసాద్,

ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!