(2013 సెప్టెంబర్ సంచిక తరువాయి)
24) నాన్నగారి మీద ఒక పాట వ్రాయాలని సంకల్పించాను. అమ్మ, నాన్నగారి అర్థాంగి; అవిభాజ్యం – అర్థనారీశ్వరతత్వం.
ఎంతోమంది అమ్మ దగ్గరికి వెడుతున్నాం. అందరికీ ఆదరణగా అమ్మ అన్నం వండి పెడుతోంది. అది నాన్నగారి ఔదార్యం. అప్పటికింకా అన్నపూర్ణాలయాన్ని ఏర్పరచుకోలేదు. నాన్నగారే వచ్చిన వారందరికీ భోజన, వసతి సదుపాయాల్ని కలిగించారు. ఆయన ఔదార్యం ముందు తక్కిన విషయాలు దిగదుడుపే.
అమ్మ మమకారాన్ని ఆదరణని పంచి ఒక ఆదర్శ సమాజానికి ఆకృతి కల్పిస్తూంటే నాన్నగారు అమ్మకి తోడుగా ఆధారంగా ఉంటూ ఒక మహోన్నత పాత్రధారి అయ్యారు. ఆయన యోగ్యత, పాత్రత, హృదయ సాంద్రతలకు ముగ్ధుడనై వారిపై ఒక పాట వ్రాయాలని సంకల్పించాను. ‘బ్రహ్మాండ వంశాస్ధితిలకా!’ అనే నా 24వ పాటను ది.26.9.57, 27.9.57 తేదీలలో వ్రాశాను.
‘భువిలోని బంగారు మొలకా రావయ్య
బ్రహ్మాండ వంశాబ్ది తిలకా’ – అనేది పల్లవి. ఈ పాట ‘రావోయి బంగారు మామా!’ అనే ఒక ప్రైవేటు పాటను అనుకరించి వ్రాసినది. మొదట్లో నాన్నగారిని నేను ‘మామయ్యా!’ అని పిలిచేవాడిని. మా ఇంటి పేరు ‘మన్నవ’. అమ్మ పుట్టింటివారు ‘మన్నవ’; అమ్మకు మేనల్లుడనవుతాను. కాగా ఆయన అమ్మకి భర్త; కాబట్టి ‘నాన్నగారే’ అని నిర్ధారించుకున్న తర్వాత కాలంలో ‘నాన్నగారూ !’ అనే పిలిచేవాడిని.
‘ఆద్యంతములు లేని – తన్ను తా నెరుగని
అజ్ఞానులకు గూడ విజ్ఞాన మొసగంగ
అనురాగ మొలుకుచు – చిరునవ్వు చిలుకుచు
మా అమ్మ తియ్యగా పలుకా రావయ్య
అమ్మకాధారమౌ చిలుకా ॥ భువిలోన బంగారు మొలకా!” అనేది ప్రధమ చరణం. “తనని తాను తెలుసుకున్ననాడు సర్వాన్నీ తెలుసుకుంటాడు” అని స్పష్టపరిచింది అమ్మ.
“ప్రతి వస్తువుకి నువ్వు ఒక వైపు మాత్రమే చూస్తున్నావు, నాన్నా! ప్రతి వస్తువుకి రెండవవైపు కూడా ఉంది. అది ఏమిటి? ఆ రెండో వైపు నువ్వే. అన్నింటినీ చూసే నువ్వు నిన్ను చూసుకోలేవు” – అని ఒక వినూత్న సత్యాన్ని ప్రప్రధమంగా ఆవిష్కరించింది. నిండు పున్నమి –
అమావాస్య చీకటి; పండుగలు ప్రకృతి వైపరీత్యాలు, ఆగర్భ శ్రీమంతులు – గర్భదరిద్రులు ఇలా ఎందరినో ఎన్నింటినో మనం చూస్తున్నాము. ఆయా సందర్భాల్లో నవ్వు, దుఃఖం మనల్ని ముంచెత్తుతుంది. కానీ వాటన్నింటికీ రెండవ వైపు ఆ ద్రష్టే – ఇన్నింటినీ చూచేవాడే నని అమ్మ వివరిస్తోంది. అది అద్వైత – స్థితికి పరాకాష్ఠ; అన్నీ ఒకే శక్తి తత్త్వరూపాంతరములేనని.
ఈ విధంగా నిత్య సత్య వస్తు తత్త్వ జ్ఞానము లేని అజ్ఞానులకు గోరుముద్దల రూపంగా జ్ఞానభిక్షను ప్రసాదిస్తోంది. “కనిపించేదంతా నిజస్వరూపమే; మిధ్య ఏమీ లేదు, నాన్నా!. అంతా సత్యమే” అంటుంది జ్ఞాన ప్రసూనాంబ అమ్మ. అట్టి చక్కని చక్కెర పలుకుల చదువుల తల్లి అమ్మకి ఆధారం. నాన్నగారు (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు). అమ్మ – నాన్నగార్ల జంట చిలుకా గోరింకల వలె చూడ ముచ్చటైనది అని నా భావం – కనుకనే ‘చిలుకా’ అని సంబోధించాను.
‘పంజరమ్ములు లేక – బంధమ్ములును లేక
నవనవోన్మేషమై – నిత్యసంతోషమై
పొంగారు ప్రాణులకు – బంగారు వసుధపై
మా అమ్మ ముత్యాలు ఒలుకా రావయ్య
బ్రహ్మవై పన్నీరు చిలుకా ॥భువిలోన బంగారు మొలకా అనేది రెండవ చరణం.
కొన్ని పరిధులు, పరిమితులను నిర్దేశించి విధి నిషేధాల ఇనుపచట్రాన్ని బిగించి, ‘వీళ్ళు రావాలి, వీళ్ళే రావాలి’ వీళ్ళు ఉంటున్నారు, నీ దగ్గర ఇలా ఉండాలి’ అని నాన్నగారు ఏనాడూ అమ్మకి గానీ మనకి గానీ షరతులు విధించలేదు; అవరోధాలు కల్గించలేదు. వారి దయవలననే జగన్మాత దర్శన స్పర్శ సంభాషణల మహద్భాగ్యానికి ఎల్లరూ నోచుకున్నారు. ఆజన్మాంతం వారి శ్రీ చరణాలకు శతసహస్రాధిక వందములు, కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను.
కనుకనే ‘పంజరమ్ములు లేక బంధమ్ములును లేక’ అని ప్రస్తుతించాను నాటి స్థితిగతుల్ని. అవి సాలోక్యము, సారూప్యము, సాయుజ్యమును ప్రసాదించాయి. ‘స్వరాజ్యము నా జన్మహక్కు’ అని తిలక్ మహనీయుడు అన్నట్లు ‘అమ్మ నాది’ అనుకుంటూ సరాసరి అమ్మ వద్దకు వెళ్ళటమే తెలుసు అందరికీ..
ఇక్కడ ‘పొంగారు ప్రాణులు’ అంటే బిడ్డలు; అమ్మ అశేష సంతానము. ‘నవనవోన్మేషమై, నిత్య సంతోష’ అన్నాను. సృష్టిలో అహరహం అనుక్షణం సృష్టి స్థితి లయాలు సంభవిస్తూనే ఉన్నాయి. బాల్యయౌవన కౌమార వార్ధక్యదశలూ, జనన మరణాలూ జీవులకే కాదు నిర్జీవులబడే మట్టి, మాణిక్యం, రాయి, రప్ప అన్నింటికీ ఉన్నాయి. ఈ విశేష గుణ ఔన్నత్యాన్ని వేదాలు ‘సద్యోజాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః’ అని శ్లాఘిస్తున్నాయి.
ఈ పాటలో ‘ముత్యాలు’ అంటే ఆణిముత్యాలని మురిసిపోయే అమ్మ అశేష సంతానం. ‘బంగారు వసుధ’ అంటే అమ్మ గర్భవాసం. అమ్మ తన మహత్సంకల్పం నుంచే ఆణిముత్యాల్లాంటి బిడ్డల్ని భూమిపై చిలుకుతున్నది. అమ్మ చిలుకరించిన ఆ విత్తనాలు మొలకెత్తి స్వయంపోషకాలు కావాలంటే వారిపై నీరు చల్లాలి. అది నాన్నగారి కర్తవ్యం. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ‘బ్రహ్మవై పన్నీరు చిలుక రావయ్యా’ అన్నాను.
‘నాన్నగారూ! బ్రహ్మవై నీరు పోయటానికి రండి’ అని స్వాగతిస్తున్నాను. మరి ఆయన భువిలోన ‘బంగారు మొలక’ బంగారు తండ్రికదా ! కాగా ఆ పాట నేను పాడినపుడు ‘బంగారు మొలక’ అనటానికి ‘బంగారు గిలక’ అన్నాను.. అందుకు నాన్నగారు నవ్వుకుంటూ వెళ్లారు. అమ్మ ముసి ముసి నవ్వులు విరజిమ్ముతోంది. అది సహజం. పసిబిడ్డ గుండెలమీద గంతులేసినపుడు తల్లిదండ్రులు మురిసిపోతారు గాని కన్నెర్ర చేయరు కదా !