- సంకల్పమేమిటో – అమ్మా!’ అనే నా 25వ పాటను ది. 1.10.1957, 3-10-1957 తేదీలలో గుంటూరులో పనిచేసే రోజుల్లో వ్రాశాను.
ఆ రోజుల్లో నాకు విపరీతంగా కడుపులో నెప్పి . మంట వచ్చేవి. రోజుకి పదిహేను ఇరవై సార్లు బహిర్భూమికి వెళ్ళేవాడిని. అలా కొంత ఉపశమనం కలిగేది. ఇలా మూడు, నాలుగు నెలలు గడిచింది. ఒకనాడు నోరి వెంకటేశ్వరరావుగారు, గంగరాజు వెంకటేశ్వర్లు గారలు వచ్చి ‘సంక్రాంతికి జిల్లెళ్ళమూడి వెడదాం’ అన్నారు.
జిల్లెళ్ళమూడి వెళ్ళటానికి మొహం చెల్లటం లేదు. అమ్మమీద అలిగి వచ్చాను కదా ! అమ్మను చూడాలనే తపన ఉంది. అమ్మ మహాశక్తివంతురాలై ఉండి కూడా ఒక సామాన్య స్త్రీలా బాధలు పడటం నేను చూడలేకున్నాను. అమ్మ తన బాధల్ని తొలగించుకోవచ్చుగా – అని నా ప్రార్థన, అలక. అమ్మపై అలిగి నేను చేసేదేమున్నది ? అయినా నా విజ్ఞప్తి తెలియపరచటానికి అలా మారాం చేసేవాడిని. ఆ విధంగా పరోక్షంగా అమ్మనే బాధపెట్టేవాడిని.
జిల్లెళ్ళమూడి వెళ్ళి నాలుగు రోజులున్నాను. ఎన్ని మందులు వాడినా నయం కాని నా రుగ్మత మాయమైంది. అది అలౌకిక శక్తి సంపన్న అమ్మకే సాధ్యం.
‘సంకల్ప మేమిటో – అమ్మా!
సంకల్ప రహితవౌ నీ సంకల్పమేమిటో!’ అనేది పల్లవి.
సృష్టి స్థితిలయాలకు కారణం ఏమిటి ? అంటే అమ్మ, “అకారణమే కారణం” అన్నది. ఈ విషయమై శ్రీ రాధాకృష్ణశర్మ గారితో అమ్మ, “సంకల్పరహిత: అసంకల్ప జాతః” అని అన్నది. అది అద్భుతమైన సత్యం.
‘విరాగమే నీ రాగమా
అనురాగమే నీ తాళమా
సమభావమే నీ భావమా
రాగ తాళ భావ భరితమౌ
నీ సంగీత మేమిటో…… ప్రధమ చరణం. ॥సంకల్పమేమిటో॥ అనేది ప్రధమ చరణం.
అమ్మకి సర్వం ఒకటిగానే కన్పిస్తుంది. దేనిమీద ప్రత్యేకించి అనురాగం లేదు, ద్వేషం లేదు. ఒక వైపు అన్నీ కావాలి, మరొక వైపు ఏదీ అక్కరలేదు. తామరాకు మీద నీటిబొట్టులా సంగరహిత, వాసనారహిత అమ్మ. అదే సమయంలో రాగభరిత, రాగసహిత, రాగరహిత. అంతా హాయిగా ఉండాలి, అందరికీ అన్నం, బట్టలు పెట్టుకోవాలి – అందు తాను మురిసి పోవాలి. “మీరంతా నా బిడ్డలు” అని అంటుంది. సర్వసంగ పరిత్యాగిని అంటూ కాషాయ గుడ్డలు ధరించి దేనినీ విసర్జించలేదు. అందరి యోగక్షేమాల్ని కోరి తపిస్తుంది. ఒక రకంగా ఏ బాదర బందీ లేదు. అందరిలో ఉండీ దేనికీ అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. మమకారాకృతి, నిర్మమ, మమతాహంత్రి అయిన అమ్మ చూపే ఆశ్చర్యకర వాత్సల్యానికి ప్రపంచమంతా దాసోహం అన్నది. అమ్మ యొక్క అసలు వైఖరి, సంకల్పం ఏమిటి?
సాధారణంగా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు . ‘జంబూద్వీపే, భరతవర్షే, శ్రీశైలస్య, ఈశాన్యప్రదేశే … గోత్రోద్భవస్య…” అంటూ అవనీతలంపై ఫలానా చోట ఉన్న ఫలానా వ్యక్తిని నేను. చతుర్విధ పురుషార్థ సిధ్యర్థం… ఇందుకోసం నిన్ను పూజిస్తున్నాను అని దేవునికి మొరపెట్టుకుంటాం.
మరి అమ్మ సంకల్పం ఏమిటి? అమ్మ ఉనికి ఏమిటి? అమ్మ కోరిక ఏమిటి? అమ్మ ఏమని సంకల్పిస్తుంది?
మేరోర్దక్షిణ దిగ్భాగే అని అంటుందా? భూమండలం
ఏమిటి? ప్రపంచం అంతా తానే. నేను అమ్మదగ్గరే ఉన్నాను. నా నెలవు నాకు తెలుసు. మరి అమ్మ నెలవు ఏమిటి? కనుకనే ‘నీకు నాకు భువిలోన నెలవు ఏమిటో!’ అన్నాను.
‘నీ తోడుగ నన్ను ఎరుక పరుచుటేమిటో!’ అన్నాను. అంటే ‘అమ్మా! నువ్వులేకుండా నేను లేను. సర్వం నీ సృష్టే. నేను కూడా ఈ సృష్టిలో భాగం. నువ్వు సంకల్పిస్తేనే, నేను ఇక్కడ ఉండగలను. ఈ మహిమాన్వితమైన అనంత సృష్టిలో నేను ఒక అల్పుడిని. నేనెంత ? ఈ మన్నవ బుచ్చిరాజు శర్మ (రాజు) నీ పూజ చేస్తున్నాడనే ఎరుక, నీకెట్లా కలుగుతుంది. 84 లక్షల జీవరాశిలో నా ఉనికి ఎంత?’ అని. – ‘నిన్ను నీవు తెలుసుకున్న నీ మది సంతోషమేమిటో!” అన్నాను. అంటే ‘అమ్మా! నువ్వు ఎవరో నీకు తెలుసు. నిన్ను నీవు తెలుసుకున్నావు. కనుకనే ఇంత మహోన్నత స్థితిలో ఉన్నావు. దీనికి ఆనందించాలి. నీమది సంతోషమేమిటో ! సంతోషం మనస్సుకి సంబంధించినది. సుఖం శరీరానికి సంబంధించినది. ఆనందం అనేది ఆత్మకి సంబంధించినది’ అని.
లోకంలో మరొకరకమైన సంతోషం ఉన్నది. మనకి కిట్టనివాడు కష్టపడినా దుఃఖపడినా మనం సంతోషపడతాం. ఏదీ తెలియకుండా కూడా సంతోషం కలుగుతుంది. ఒక కుక్కపిల్ల నిద్రపోతున్నది; ఒక పసివాడు నిద్రపోక ఏడుస్తున్నాడు. వాడిని సముదాయించడం కోసం ఆ కుక్క పిల్లమీద ఒక రాయి వేస్తాం. అది కుయ్ కుయ్ అని అరుస్తుంది. అందుకు పిల్లవాడు ఏడుపు ఆపి నవ్వుతాడు. ఒకరి సంతోషం కోసం ఇంకొకరిని బాధిస్తాం. ఇంతమంది ఇన్ని విధాల సంతోషాన్ని పొందుతున్నారు. నీ సంతోషం ఏది? ఇవన్నీ నువ్వా ? ఇందులో ఏదీ నీది కాదా?
‘మహియే నీవౌచు మహిని మెలగు టేమిటో
ఊహల కందని నా అనుభవము లేమిటో
అనుభవ అవలోకివే
నీ హృది సంజనిత మేమిటో IIనీ సంకల్పమేమిటో||’
అనేది 3వ చరణం. అంటే ‘అమ్మా ! నువ్వు భూమాత లాంటి సహనమూర్తివి. నువ్వు భూమాత అయి ఉండీ భూమిమీదే ఉన్నావు. సహజ సహన లక్షణ సమన్వితమైన ధరణివే నువ్వు. మళ్ళీ ఒక స్త్రీమూర్తిగా ఎందుకు వచ్చావు ? ఇట్లాంటి ఊహలు నాకెందుకు వస్తున్నాయి. నువ్వు ‘అనసూయాదేవివి. కరణంగారి భార్య. ముగ్గురు బిడ్డలు గల సామాన్య గృహిణి’ అని అందరూ అంటున్నారు. కాదు; నువ్వు ధరణివి అని నాకు అనిపిస్తోంది. ఈ నా భావాలతో నువ్వు నా ఊహకి అందటం లేదు. అవలోకనం అంటే ఆత్మావలోకనం; అంటే నీలో నువ్వు నిన్ను చూసుకోవటం. ఆ సమయంలో నీ హృదయంలో కలిగే స్పందనలు, ఆలోచనలు ఏమిటి? నీలో ఏమి జనిస్తున్నది ? దానివలన నాకూ, ఈ ప్రపంచానికి ఉపయోగం ఏమిటి? అని. ఈ విధంగా నాకూ అమ్మకూ, పరిమితికి- మధ్య బేరీజు వేసుకుని వ్రాసిన పాట ఇది. అపరిమితికి మధ్య బేరీజు వేసుకుని వ్రాసిన పాట ఇది.