26.’కలకల్లయితే’ పాటను ది. 27-10-57 తేదీ మరియు ది.1-11-57 తేదీన (2 రోజులలో) పూర్తి చేశాను. దీనినీ గుంటూరులోనే వ్రాశాను.
‘కల కల్లయితే – యిల నిజమయితే
కల నిజమే కాదా ! అమ్మా ! యిల కల్లే కాదా’ అనేది పల్లవి.
ఒకనాడు నిద్రపోతుంటే అమ్మ నాకు కలలో సాక్షాత్కరించింది. తర్వాత పది, పదిహేనురోజులకు జిల్లెళ్ళమూడి వెళ్ళాను. ఆశ్చర్యం. నాటి కలలో కనిపించిన రూపమే సాక్షాత్తూ కళ్ళముందు నిలిచింది. ఆనాడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. అతఃపూర్వం కలలో దర్శించాను.
‘తలపులలోన మెలకువ లోన
మెలకువకాని మెలకువౌ కలలో
వదలలేని నాముద్దు నిదురలో
కదలెడు బ్రహ్మే కలలో అమ్మే ॥కల కల్లయితే॥” అనేది ప్రధమచరణం.
అవును. ఆ నిద్ర నాకు ఎంతో మురిపెంగా ఉన్నది. కారణం. అది రోజూ నిద్రకాదు; ప్రత్యేకమైన నిద్ర. ఆ కల నాకు మురిపాన్నిచ్చింది. అమ్మ కాదు; ఆ కల. అమ్మదర్శన, స్పర్శ, సంభాషణ, స్మరణలు నిత్యం మహదానంద దాయకములు.
అట్టి కలను ఆధారంగా చేసికొని వ్రాసిన పాట ఇది. కలలో చూసినదీ, కళ్ళతో చూసినదీ ఒకటే. ‘కళ్ళతో’ చూసిన దానిని ‘యిలలో’, అన్నాను. ఆ రెండు దర్శనాల్లో తేడా లేదు.
‘మది మురిపించే మైమరపించే
నిదురలోన నీ నీలకాంతులచే
ఉదయించెడు నా స్వానుభవంబులు
నిజమౌ కలలే కల్లా యిలలో ॥ కలకల్లయితే॥’ అనేది ద్వితీయ చరణం.
బ్రహ్మజ్ఞాన సారాన్ని అమ్మ ఎక్కువగా ‘నేనునేనైన నేను’ అని చెపుతుంది; అన్ని నేనులూ నేనైన నేను అని వివరిస్తుంది. ఈ సందర్భంగా నా అనుభవాన్ని వివరించాలి.
ఒకసారి అమ్మ ఏదో పని చేసుకుంటోంది లేక ఎవరితోనో మాట్లాడుతోందో. నేను మాత్రం మంచం మీద నిద్రపోతున్నాను. నాకు ఒక కల వచ్చింది. ఆ స్వప్నంలో నేను పైన ఒక విమానంలో పోతున్నాను.
విమానంలో ఉన్న ‘నేను’ భూమిమీద ఉన్న ‘నేను’ కు టాటా అనో, సెలవు అనో అన్నట్టు చేయి ఊపుతున్నాను. ఇక్కడ మూడు ‘నేను’లు ఉన్నాయి; కలకంటున్న ‘నేను’, విమానంలో పోతున్న ‘నేను’, విమానంలో చేయి ఊపటానికి కారణమైన ‘నేను’. ‘నేను నేనైన నేను’ అనే ‘నేను’ ఇదేనా -అని అమ్మని అడిగా. అమ్మ ఏమీ చెప్పలేదు. చిరునవ్వు నవ్వింది.
నిదురలోని నీలికాంతులు – అంటే అతినీలలోహిత కిరణాలు (Ultra Violet rays). అవి అమ్మ నాపై ప్రసరింపజేసిన వాత్సల్య కిరణాలు. అందుండి నా స్వానుభవం ఉదయించింది. ఇది నిజమైన కల. ఇల కూడా కల్ల ఒక విధంగా. ఈ రోజున ఉన్నది మరొకరోజు మారుతోంది లేక మాయమవుతోంది. అంతేకాదు. నేను ఉన్నంతకాలం ఇల నిజం. నేను పోయిన తర్వాత ! నేనే లేకపోతే ఇల లేదు, కలలేదు. తర్వాత కల్ల అవుతుంది.