1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లోచూపు

లోచూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : November
Issue Number : 4
Year : 2014

(సెప్టెంబరు సంచిక తరువాయి)

  1. ది.18.11.57 తేదీన ‘దిగులొందనేల?’ అనే నా 27వ పాటను వ్రాశాను.

‘దిగు లొందనేల – వెతచెంద నేల.

సాగిలరాదా యీ తల్లి మ్రోల’ – అనేది పల్లవి. 

దొంగసాధువులు, బాధగురువులు దైవాన్ని అడ్డుపెట్టుకొని అసభ్యపనులు చేస్తున్నారు. మోసం చేస్తున్నారు. ఈ లోకం పోకడని గుర్తించి అసలైన అమ్మ పాదాల చెంత సాగిలపడరాదా? అని సలహానిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను.

‘అడుగడుగునకు ఆచారములని

గడియ గడియకును శాస్త్రంబులని

సతమతమౌచు చింతించ నేల

బ్రతుకంతా రాళ్ళని ముళ్ళని ॥దిగులొందనేల|| అనేది ప్రధమచరణం. ఇందుకు స్ఫూర్తి నిచ్చిన సన్నివేశాలు రెండు ఉన్నాయి.

ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అమ్మ దూరంగా కూర్చొని ఉంది. హైమ చెప్పింది, “అమ్మ బయట చేరింది” అని. నేను వెళ్ళి దూరంగా నిలబడి నమస్కారం చేశాను. అమ్మ అన్నది, “అవునురా, రోజూ పాదాలు తాకి నమస్కారం చేసేవాడివి కదా, ఎందుకని అలా దూరంగా ఉన్నావు?” అని, ‘నువ్వు బయటచేరేవు కదమ్మా, వేరే ఉన్నావు, తాకటమెందుకని’ అన్నాను. అందుకు అమ్మ, “బహిష్ఠు అంటే ఏమిటి ? విడిగా కూర్చోవటం అంటే ఏమిటి? స్త్రీలకి ఋతుక్రమం అని ఉన్నది. నెలకొకసారి చెడురక్తం బయటికి పోవటానికి ఒక ఏర్పాటు. మూడురోజుల పాటు ఆ క్రమం జరుగుతుంది. ఆ సమయంలో స్త్రీకి అసౌకర్యంగా ఉంటుంది. అందువలన ఏ పనీ శ్రద్ధతో చేయలేదు. అందుకని విడిగా విశ్రాంతిగా కూర్చోమని చెప్తారు. అంతకంటే ఏమీ లేదు.

అయినా నాకు తెలియక అడుగుతున్నాను రా. ఒక గంట క్రితం వరకు నువ్వు నన్ను తాకుతూ ఉన్నావనుకో. అప్పటికి నేను ఇంకా బహిష్ఠు కాలేదు. అంటే ఆ మైలరక్తం నాగర్భంలోనే ఉన్నది. అది నాలో ఉన్నంతకాలం నువ్వు నన్ను తాకావు. అది బయటికిపోయింది, నాలో లేదు అది. మరి నన్ను తాకేందుకు నువ్వు ఎందుకు సంకోచిస్తున్నావు? ఇది తప్పుకదా, నాన్నా!” అని. ‘ఏమో నమ్మా. ఇది ఆచారం కదా’ అని అంటే అమ్మ, “ఆచారమే తప్పు. ఆ సమయంలో స్త్రీకి అసౌకర్యంగా ఉంటుంది. దానివలన ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు” అన్నది. వాస్తవంగా ఇదే సత్యాన్వేషణ, హేతువాదం.

అనూచానంగా వస్తున్న ఈ ఆచారానికి ఆధారంగా ఒక పౌరాణిక కధ కూడా వినవస్తుంది. త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుని ఇంద్రుడు సంహరించి బ్రహ్మహత్యాపాతకాన్ని పొందుతాడు. దాని నుంచి విముక్తుడు కావటం కోసం ఆ మహాపాపాన్ని నీరు, నేల, మొక్కలు, స్త్రీలకు నాలుగు సమానభాగాలుగా పంచి ఇచ్చాడు అని; దాని ఫలితమే ఋతుసామ్రం అని.

మరొక సన్నివేశం లోగడ వివరించాను. మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చినపుడు అమ్మ స్వయంగా వంట చేసి అన్నం పెట్టింది. పొట్లకాయ కూర వేసింది. అది తింటే జపిస్తున్న పాము మంత్రం నిర్వీర్యమై పోతుందని నేనన్నాను. ఇటువంటి మూఢనమ్మకాలు పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని, అంత శక్తే ఈ పొట్లకాయకి ఉంటే పాము మంత్రాన్ని వదిలేసి పొట్లకాయ జపం చేయమన్నది. అమ్మ యదార్థవాది. 

‘మిణువురు పురుగుల మిలమిల జూచి

జాబిలి జ్యోత్స్నని భ్రమచెందనేల

దీపిక గైకొని దీపిక వెదకుచు

దారి చూపు వారిల లేరే యని ॥ దిగులొందనేల|| ’

అనేది రెండవ చరణం.

ఎందరో ఎన్నో ప్రవచనాలు చేస్తున్నారు. శాస్త్రజన్యజ్ఞానం ఎప్పటికీ అనుభవం కాదు. అనుభవం నిశ్చయంగా శాస్త్రసారాన్ని వ్యక్తం చేస్తుంది. ఒక్కసారి అమ్మ ఆచరణాత్మక ప్రబోధనాన్ని వినండి. అమ్మ పాదాలను ఆశ్రయించండి. అమ్మ స్వయం ప్రకాశమాన మూర్తి, జ్ఞానజ్యోతి. కరదీపికకాంతితో సూర్యకాంతిని గుర్తించలేము. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అమ్మే.

  1. ‘ఓ దయానిధీ!’ పాటను ది. 8-11-57 మరియు ది.1-12-57 తేదీలలో (రెండు రోజులలో) వ్రాశాను.

ఈ పాట వ్రాసిన తర్వాత 40 పాటలు వ్రాశాను. కానీ దీనినే చివరి పాటగా ఎంచుకున్నాను. ఇందుకు బలీయమైన కారణం ఉంది. ఇది ఒక sentiment లాంటిది. ఈ పాట పాడినపుడు కొన్ని చేదు అనుభవాలు, విషమ పరిస్థితులు ఎదురైనాయి. మొదట్లో పాడినపుడు అంతగా గమనించలేదు.

1980 లో చి||రావూరిప్రసాద్ని ఈ పాట పాడమని అమ్మ కోరింది. తక్షణం అతడు పాడి వినిపించాడు. తదనంతరం Lung Abscess వలన తీవ్ర అనారోగ్యానికి గురై అమ్మ హైదరాబాద్ వెళ్ళింది. ఏమీలేదని నమ్మించి, కులాసాగా ఉన్నానని నచ్చచెప్పి చిరునవ్వుతో మళ్ళీ మన మధ్యకు వచ్చింది.

తర్వాత ఈ పాట అమ్మ వద్ద పాడాలంటే భయం వేసేది.

1985 జూన్ నెలలో ఒకనాటి ఉదయం ప్రసాద్ని నన్ను అమ్మ తన గదికి పిలిపించింది. అనుభవసారం పాటల్ని పాడమంది. పాడుతున్నాం. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. గంపెడు అనారోగ్యంతో ఉంది. గాజుబొమ్మ వలె కన్పిస్తోంది. మా పాటలు వింటూ కళ్ళ వెంట నీరు ఏకధారగా వర్షిస్తోంది. చిట్టచివరిగా ‘ఓ దయానిధీ’ పాటను పాడమని ప్రసాద్ ని కోరింది. అతని గుండె దడదడలాడింది. ‘పాడనమ్మా! పాడలేనమ్మా!’ అని మొండికేశాడు. అమ్మ నావైపు చూసి ‘పాడరా’ అని ఆజ్ఞాపించింది. అమ్మ ఆజ్ఞను ధిక్కరించలేను. పాడితే అమ్మ ఏమౌతుందో – అనే భయం వెంటాడుతూనే ఉంది. ఎక్కడలేని ధైర్యాన్ని కూడగట్టుకుని అమ్మ పాదాలపై దృష్టి పెట్టి పాడాను. అంతే. కొద్దిరోజులకే అమ్మ మనల్నందరినీ విడిచి శాశ్వతంగా కనుమరుగైంది.

అమ్మ కనిపించే దైవం, సృష్టిస్వరూపం; అమ్మ, అమ్మ శక్తి, అమ్మ తత్త్వం, ఎప్పుడూ ఉంటాయి – అని తెలుసు. కానీ నాకు నేనే సమాధానపడలేకపోతున్నాను. ఆ మమకారాకృతి ఇక నా కళ్ళకి కనిపించదు అంటేనే నా కళ్ళ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. హృదయం అతలాకుతలం అవుతోంది.

ఈ పాటను నేను వ్యాఖ్యానించలేను.

నా నోరు పెగలదు, కలం కదలదు. ఈ పాటను నా అంతిమగీతంగా భావిస్తున్నాను. ఇది కూడా అమ్మ ప్రసాదమే కనుక నా తోడబుట్టినవారినందరినీ సహృదయంతో స్వీకరించమని కోరుకుంటున్నాను.

అమ్మ సన్నిధిలో పాడిన చిట్టచివరిపాట ఇదే; అలా కట్టకడపటిసారి గానం చేసిందీ నేనే.

నేను పాడి ఉండకపోతే అమ్మ మరికొంతకాలం మన మధ్య ఉండేదేమో! ఏమో! తెలియదు.

29.’మోయలేని భారమామ్మా!’ అనే నా 29వ పాటను గుంటూరులో ఉండగా ది.8.12.57,

9.12.57 తేదీలలో వ్రాశాను.

‘అమ్మా!

మోయలేని భారమమ్మా

భారమైన బ్రతుకు గాధ’ – అనేది పల్లవి. ఈ పాటలో నా బ్రతుకు గాధ, వ్యధ కూడా ఉన్నాయి. నాకు శారీరక శక్తి, ఆర్థిక పరిపుష్టి లేదు. అమ్మకి ఏ విధంగానూ సాయం చేయలేని వాడిని. ఇన్నాళ్ళకి అమ్మ రుగ్మత తగ్గుతుంది అనే ఆశలేదు. అమ్మ నిరుపమాన శక్తి సంపన్న. కనుకనే ఆ పాదాలను అంత గట్టిగా పట్టుకున్నా. అమ్మ పడే బాధల తోరణాన్ని, బాధలతో రణాన్ని చూస్తే అమ్మ మన మధ్య ఎక్కువకాలం ఉంటుందా? ముందస్తుగానే ఆయుర్దాయాన్ని తగ్గించుకుని అర్థాంతరంగా తన తనువుని చాలిస్తుందా? అనే భయం; అపురూపమైన అమ్మ మనమధ్య లేకుండా శాశ్వతంగా దూరమై పోతుందా అనే బాధ నిరంతరం నన్ను తీవ్రమనస్తాపానికి గురిచేసేవి.

నా పాటలు భట్రాజు పొగడ్తల వంటివి కాదు. నా రచనలకి అమ్మ అనుగ్రహించిన అనుభవాలే ఆధారం. నేను వాడిన పదాలు, సాహిత్య సంపద, భావనా పటిమ నా స్వంతం కానేకాదు. అమ్మని హింసించే వాళ్ళని ఎదుర్కోవటానికి నాకు ఏ సాధన సంపతీ, శక్తిసామర్థ్యాలు లేవు. వాడిపోయిన పుష్పాన్ని నేను.

‘నీ కొరకై నిఖిల జగము

చూచినాను వేచినాను

గుండె మీది కుంపటితో

వెతుకలేను బ్రతుకలేను –

॥మోయలేని భారమమ్మా॥’ – అనేది ప్రధమ చరణం.

ఒక ప్రక్క అమ్మ సర్వసమర్ధ అనే విశ్వాసం ఉంది. మరొక ప్రక్క ఆశరీరం ఉంటుందో ఉండదో ననిపిస్తుంది. ఈ ద్వంద్వాల మధ్య సతమతమయ్యేవాడిని. అమ్మను ఒక రైలు ఇంజను వేగంగా వచ్చి ఢీ కొంటే అదే తుత్తి నియలు అవుతుంది; స్థాణువై నిలబడి పోతుంది. కానీ నాకంటితో అమ్మ శారీరకంగా పడే బాధల్ని చూసి నేను బ్రతుకలేను.

‘ఎండమావులైన లేని ఎడారివోలు బ్రతుకులోన

యిసుక తుఫానును కోరే ఆశకలదు మాసిపోదు”

||మోయలేని భారమమ్మా॥’ అనేది రెండవ చరణం.

ఎండమావుల్లో నీరు ఉండదు. అట్లాంటి ఎడారి వంటి బ్రతుకు లోన ఇసుక తుఫానును కోరే మహోన్నత వ్యక్తి, శక్తి అమ్మ. అది అమ్మకి మోయలేని భారము కాదు. నావంటి అల్పునికి నిస్సందేహంగా చూచేందుకూ భారమే. “శిల ఉలిదెబ్బలతో శిల్పం అయినట్లు బాధలు జీవితాన్ని. చైతన్యతరంగితం చేస్తాయి” అనే అమ్మ వాక్యం శుష్క వేదాంతసారం కాదు; అనుభవైకవేద్యం ఎవరికైనా.

‘అంధకారమైన నిశిలో సంధి యుగపు సమరములో

ఎదురుగ నిలిచి ఏకాకిగ పోరలేను పారలేను ॥మోయలేని॥’ అనేది తృతీయ చరణం.

అమ్మను గురించి చెప్పాలంటే పాటల రచనే నాకున్న మాధ్యమం; అదీ అమ్మ ఎంపిక చేసినదే. దీని ద్వారా చెప్పదలచుకున్నా చీకటిరాత్రి వేళ ఒంటరిగ పయనించలేను; దారిలో అడ్డగించే వాళ్ళని ఢీకొని పోట్లాడలేను. పోనీ వెనక్కి తిరిగిపోదామా అంటే పిరికి పందలా పారిపోలేను.

నాడు అది ఒక సంధియుగం. అమ్మ పూర్తిగా తెలియబడలేదు. అప్పుడే తెలియబడుతోంది ప్రపంచానికి. అప్పటికి అందుకు ఇంకా కొంతకాలం అవసరం. అమ్మను గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇవన్నీ తెలుస్తాయి. అప్పట్లో అందరికీ చెప్పి వాళ్ళను ఒప్పించలేను. ఒప్పించకుండా తోక ముడుచుకొని వెనుతిరగలేను.

-(సశేషం)

సమర్పణ: రావూరి ప్రసాద్, ఎ.వి.ఆర్.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!