(గత సంచిక తరువాయి)
- 2-1-1957 తేదీన ఓ భాగ్యహీన హృదయవీణా’ అనే నా పదవ పాటను వ్రాశాను.
కార్తీకపౌర్ణమికి అమ్మ తన శరీరాన్ని చాలిస్తుందనే గండం గడచింది. అమ్మ సమాధిలో ఉన్నపుడు సన్నగా మాట్లాడేది. కావున మేము అమ్మనోటి వద్ద చెవి పెట్టి వింటూండేవాళ్ళం. అమ్మ సమాధిలోకి వెళ్లాలంటే సిద్ధాసనం అనో, పద్మాసనంఅనో, అర్ధనిమీలిత నేత్రాలతో అనో… ఒక POSTURE, ఒక విధానం అంటూ ఏమీలేదు. పడుకొని, కూర్చొని ఏ భంగిమలోనైనా వెళ్ళేది. అందుకు నిర్దిష్టంగా ఒక ప్రక్రియ, ఒక విధానం అంటూ ఏమీలేవు. ఆ స్థితిలో అప్పుడప్పుడు, “రెండు పొరలు ఉన్నాయి. అందులోంచి చూస్తూంటే చెవిదుద్దులా సన్నాయి పీకలా కనిపిస్తోంది. ఆ రెండు పొరలు పలచబడి పోతున్నాయి. ఏమిటది? ఏమిటది, నాన్నా?”- అవి పలచబడితే ఏమౌతుంది?’ అని అంటూండేది. సమాధి నుంచి బయటికి వచ్చాక ‘ఏమిటమ్మా, ఇది ?’ అని అడిగితే, “ఏమిటో, నాన్నా! అలా కనిపిస్తోంది” అనేది. ‘అలా పలచబడితే ఏమౌతుంది?’ అని అన్నాను. ‘ఏమౌతుంది, నాన్నా! అయిపోతుంది” – అని అన్నది. అంటే అటుపై ఆ శరీరం ఉండదు అని నేను అర్థం చేసుకున్నాను.
ఒక గండం గడిచింది; రెండవది పొంచి ఉన్నది. మళ్ళీ దిగులు పట్టుకుంది. నా మనస్సు అనే చంద్రునికి రాహుగ్రస్తము – విమోచనము అయిన వెనువెంటనే కేతుగ్రస్తమైనది. మరలా మొదలైంది నా ఆవేదన, అంతర్మధనం. మానుతున్న గాయానికి గాటు పడ్డట్టయ్యింది. కనుకనే –
‘నింగినేలు నెలరాజును
తొంగిచూచె రాహు వనుచు
పున్నమచంద్రుని కున్నవి.
కృష్ణపక్షతిధులేనని ||పాడవేలనే॥
అని వ్రాసుకున్నాను మొదటి చరణంగా.
‘తల్లి వ్రేళ్ళ తలవాల్చుట
మల్లెలు నైజమని
అయోగ్యుని యోగ్యత
నెన్నగ ఆధారములేలనని|| పాడవేలనే!|
అనేది రెండవ చరణం.
మల్లెపూవు విరిసిన కొద్ది కాలానికే వాడిపోయి రాలిపోతుంది; మొక్క మొదట్లో ఊపిరి విడుస్తుంది. నేనూ అంతే. ఒక అయోగ్యుడను. అమ్మను దక్కించుకోలేను. అటువంటి నిర్భాగ్యునికి యోగ్యతేమున్నది? కృతార్థుడైన వానికి ఉత్తీర్ణుడైనవానికి యోగ్యత; ఆధారం యోగ్యతాపత్రం. పరీక్ష తప్పిన వానికి యోగ్యతేమిటి?
అమ్మను పోగొట్టుకున్న తర్వాత నాకు కృష్ణపక్షమే! నాకు వికాసం ఎక్కడిది? ఇక ఆధారమేది! అయోగ్యుని ‘అయోగ్యుడు’ అనే అంటారు; కోతిని కోతి అనే అంటారు. అంతే. ఎట్లా అంటే దాని ముఖమే అట్లాంటిది. సూర్యప్రకాశం లేనపుడు చంద్రప్రభకు అవకాశమే లేదు; అమ్మ లేనినాడు నేను ఉన్నా లేనట్లే.
‘ఒకటి రెండు అవగానే
ఆ వెనుక అనేకం బని
రెండు ఒకటి అయిన పిదప
మిగులున దింకేమిటని ||పాడవేలనే॥
అని వ్రాసుకున్నాను మొదటి చరణంగా.
‘తల్లి వ్రేళ్ళ తలవాల్చుట
మల్లెలు నైజమని
అయోగ్యుని యోగ్యత
నెన్నగ ఆధారములేలనని ||పాడవేలనే॥
అనేది రెండవ చరణం.
మల్లెపూవు విరిసిన కొద్ది కాలానికే వాడిపోయి రాలిపోతుంది; మొక్క మొదట్లో ఊపిరి విడుస్తుంది. నేనూ అంతే. ఒక అయోగ్యుడను. అమ్మను దక్కించుకోలేను. అటువంటి నిర్భాగ్యునికి యోగ్యతేమున్నది? కృతార్థుడైన వానికి ఉత్తీర్ణుడైనవానికి యోగ్యత; ఆధారం యోగ్యతాపత్రం. పరీక్ష తప్పిన వానికి యోగ్యతేమిటి?
అమ్మను పోగొట్టుకున్న తర్వాత నాకు కృష్ణపక్షమే! నాకు వికాసం ఎక్కడిది? ఇక ఆధారమేది! అయోగ్యుని ‘అయోగ్యుడు’ అనే అంటారు; కోతిని కోతి అనే అంటారు. అంతే. ఎట్లా అంటే దాని ముఖమే అట్లాంటిది. సూర్యప్రకాశం లేనపుడు చంద్రప్రభకు అవకాశమే లేదు; అమ్మ లేనినాడు నేను ఉన్నా లేనట్లే.
‘ఒకటి రెండు అవగానే
ఆ వెనుక అనేకం బని
రెండు ఒకటి అయిన పిదప
మిగులున దింకేమిటని ||పాడవేలనే॥
అనేది మూడవ చరణం.
అమ్మ బాపట్లలో బాల్యంలో స్నేహితురాండ్రతో భావనారాయణస్వామి వారి ఆలయానికి వెళ్ళింది. ఆ సందర్భంగా ఒక కొబ్బరిచిప్పను పగులగొట్టి “చూశారూ! ఒకటే అనేకం అయినది” అన్నది. దీనినే వేదం ‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’ అని వివరిస్తుంది. ఈ సంగతి సృష్టి ఆవిర్భావక్రమానికి మూలసూత్రం.
‘రెండు ఒకటి అయిన పిదప మిగులున దింకేమిటని’ అన్నాను. దీనికి యోగశాస్త్రరీత్యా, కైవల్యోపనిషత్ ననుసరించి కొంచెం వివరణ ఇవ్వాలి.మేరు దండము (వెన్నెముక ) నకు ఎడమవైపు చంద్రశక్తి ప్రవహించే ఇడానాడి,
కుడివైపు సౌరశక్తి ప్రవహించే పింగళనాడి ఉన్నాయి .ఈ రెండూ షట్చక్రాలకి కలపబడి ఉన్నాయి.వీటి నడుమ సుషుమ్నానాడి ఉంది.కుండలినీ జాగరణం అయి యోగశక్తి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రానికి చేరుకునేసరికి అక్కడ రెండు రేకులు ఉంటాయి. సుషుమ్నానాడి చివరిభాగం బ్రహ్మనాడి.ఆ యోగశక్తి ప్రవాహనాళం చివరిభాగం చక్రాకారంగా ఉంటూ సహస్రారమునకు కలపబడి ఉంటుంది. ఆ నాళాన్ని – రేకుల్ని అమ్మ ‘సన్నాయి పీక’అన్నది.
సహస్రాకారకమలం బొడ్డు వజ్రాలు పొదిగిన ‘దుద్దు’ వలె ఉంటుంది. అమ్మ పేర్కొన్న ‘చెవిదుద్దు’ అదే. ‘రెండు రేకులు పలచబడి పోతున్నాయి’ – అన్నది అమ్మ. అమ్మ యోగదృష్టి షట్చక్రాల్నీ అధిగమించింది. ‘తర్వాత ఏమౌతుంది?’ అని అడిగితే, “అయిపోతుంది” అన్నది. సర్వం తానే అయిపోతుంది; సహస్రదళ విభ్రాజత్సారసాంతరవాసిని అవుతుంది. అది యోగీశ్వరేశ్వరులు యోగనిద్ర చేసే పరమేశ్వరుని పరంధామం. అక్కడ అమ్మ వేల లక్షల సంవత్సరాలు ఉండి కావాలనుకుంటే తిరిగి శరీరధారణ చేస్తుంది.
‘వెలుతురు కాధారమైన
చీకటియే వెలుతురని
నీలో నాలో నున్నది సత్యంబౌ ముత్యమని
॥పాడవేలనే||
అనేది చివరి చరణం. చీకటి లేనపుడు వెలుగుకి అస్తిత్వమే లేదు. అంతా చీకటైనపుడు వెలుతురేముంటుంది? గాఢాంధకారము, చిమ్మచీకటి అనేది లేదు. కాంతి సాంద్రత లో హెచ్చుతగ్గులే చీకటి వెలుగులు.
‘నీలో నాలో నున్నది సత్యంబౌ ముత్యమని’ అన్నాను. –
నీలో నాలో ఉన్నది ముత్యము- అంటే స్వచ్ఛమైన బ్రహ్మపదార్థం.
- 6-1-57లో ‘పాడుచు పొడుచు’ అనే నా 11వ పాటను వ్రాశాను.
ఈ పాటకి ‘పాడుచు పాడుచు నీ కథ చాటుచు
పయనించెదనే – నోయమ్మా
ప్రాణము వదలేద నోయమ్మా’ అనేది పల్లవి. ఈ పాట రచనకి ప్రేరణ పూర్వాపరాలు సవిస్తరంగా నవంబర్ 2012 విశ్వజనని పత్రికలో ’11. దూరశ్రవణం దూరదర్శనం’ అనే విభాగం క్రింద లోగడ వివరించాను.
‘మహిమాన్వితమగు నీ జీవితమే
మానవులందిరి కాదర్శంబ సృష్టిస్థితిలయ కారణులైనను
నీ మహిమంబున రేణువులేనని
॥పాడుచుపాడుచు!’
అనేది ప్రధమచరణం. అమ్మ జీవితం మహి మాన్వితమైనది. నేను విన్నదానిని బట్టి చీరాల డా॥ పొట్లూరి సుబ్బారావు గారి అనుభవం; ఒక ఉదాహరణ.
ఒకసారి అమ్మ దర్శనం ఇస్తోంది. ఆ రోజున అక్కడ ఇరవై ముప్పైమంది ఉన్నారు. కొందరు అమ్మకి పూజచేసుకుంటున్నారు. చీరాల డాక్టర్ పొట్లూరి సుబ్బారావుగారు ఆ దృశ్యాన్ని చిత్రీకరించేందుకు కెమెరా సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలో ఒక కుక్క వచ్చింది. సవినయంగా సరాసరి వెళ్ళి అమ్మ.పాదపీఠిక వద్ద ఆసీన అయింది. అక్కడి వారు దానిని ‘ఛీ!’ అని కసిరారు. అది తనను కాదన్నట్లు తదేక దృష్టితో దీక్షతో అమ్మదర్శనం చేసుకుంటున్నది. డా॥ సుబ్బారావు గారు,’ ఏమైనా మానవజన్మే గొప్పది. ‘ఛీ! ఛీ!’ అంటూ అందరిచేత ఈసడింప బడుతోంది. ఏమిటి దీని జన్మ?” అని అనుకుంటున్నారు. అంతలో అమ్మ తన పాదంతో దాని ముట్టెను సన్నగా తాకింది. అంతే. ఆ పాదాంగుళినఖోత్పన్న మహిమాన్విత స్పర్శ చే దానికి లౌకిక స్పృహపోయింది. శ్వాస ఆగింది. శరీరం కొయ్య బారింది. ఏ దివ్యభూమికల్లో విహరిస్తోందో! డా॥ సుబ్బారావు గారు వెళ్ళి దాని కళ్ళముందు చిటికె వేసి, కదిలించి, నాసిక ముందు వ్రేలు పెట్టి పరీక్షించారు. ఏ యోగం సిద్దించిందో, దానికి బాహ్యస్పృహ లేదు. కొంతసేపటికి అమ్మ మరల తన పావన పాదస్పర్శను ఆ అల్పప్రాణికి ప్రసాదించింది. త్వరలో అది యధాస్థితికి వచ్చింది. మహా పురుషసంశ్రయ భాగ్యాన్ని పొందానన్న ఆనందంతో లేచి నెమ్మదిగా తాను వచ్చిన త్రోవన వెళ్ళిపోయింది. ఏది అల్పప్రాణి? ఎవరు మహితాత్ములు? డాక్టర్ గారు నిర్ఘాంతపోయారు. ‘ఇంత’ వయస్సువచ్చి, విచక్షణ – వివేకమూ సాధన చతుష్టయ సంపత్తికలిగినా ఆ యోగసిద్ధి నాకు ప్రాప్తించలేదు.
కేవలం జగన్మాత పాదస్పర్శ చేతనే దానికి లభించింది. ఇది అమ్మ మహిమకి, కరుణకి ప్రత్యక్ష నిదర్శనం’ అని
ధృవీకరించుకున్నారు. ‘ఏవేదంబు పఠించెలూత?
భుజగం బే శాస్త్రముల్ చూచె తానే విద్యాభ్యాసనం బొనర్చె కరి?
….నీ పాద సంసేవాసక్తియె కాక జంతుతతికిన్…” పద్యాన్ని స్మరించుకుంటూ సార్ద్రహృదయులైనారు.
‘సృష్టిస్థితిలయ కారణులైనను
నీ మహిమంబున రేణువులేనని’ – అన్నాను.
అమ్మ పాదాల సువర్ణాంగుళీయకాలపైన ‘మహాలక్ష్మి’, ‘మహాసరస్వతి’, ‘అన్నపూర్ణేశ్వరి’, ‘మహా గణపతి’, ‘కుమారస్వామి’, ‘నాగేంద్రుడు…… దేవతా మూర్తుల స్వరూపాలు ముద్రితమై ఉన్నాయి. ఒక సోదరుడు, ‘మీరు వీటిని ఎందుకు ధరించారు?’ అని ప్రశ్నిస్తే అమ్మ, “వీళ్ళు నా పిల్లలు. మీ సోదరులు. నా పిల్లలను దగ్గర పెట్టు కున్నాను” అని అన్నది. కనుకనే అమ్మను శ్రీరాధాకృష్ణశర్మగారు ‘హైమభూషాస్వరూపాఢ్య దేవతాగణ సేవితా’ అంటూ అమ్మ దేవతా సమూహం చేత సేవించబడేది అని స్తుతించారు; ‘యయాశక్త్యా బ్రహ్మా…. నమామ్యాద్యాం దేవీం ముకుళితకరస్తా మభయదాం’ అనే ప్రార్థనాశ్లోకంలో త్రిమూర్తుల శక్తి సామర్థ్యాలకు మూలము మూలప్రకృతి రూపిణి మన అనసూయమ్మ అని స్పష్టం చేశారు.
‘మృదుమధురం బగు నీ మాటలచే
ఊయలలూగెను హృదయాలేనని
నీ హృదియందలి విశాల అవధిలో
నిదురించెనులే నిఖిల జగంబని ॥పాడుచుపాడుచు!’
– అనేది రెండవ చరణం.
“రక్తమంతా ఈశ్వర తత్వమే”;
“మనుష్యులందరూ మంచివాళ్ళే”…. వంటి అమ్మవాక్యాలు ఆశ్చర్యకరవాత్సల్యానికి, విచక్షణలేని వీక్షణకి దర్పణం పడతాయి. అవి నైరాశ్యోపహతులైన మానవాళిపై అమృతసేచనం చేశాయి; ఊరటని ఉత్సాహాన్ని కలి గించాయి, ఆశాజీవులుగా సార్థకజీవనులుగా తీర్చి దిద్దాయి. అమ్మ హృదయంలో ఎవరిస్థానం వారిదే. అమ్మకు ఏ బిడ్డకు ఆ బిడ్డ ఎక్కువ. అర్హతానర్హతలతో నిమిత్తం లేకుండా అందరిని తన ఒడిలో వేసుకుని లాలిస్తుంది; గుండెల్లో దాచుకుని ఆదరిస్తుంది, ఆదుకుంటుంది, పరవశిస్తుంది.
‘భువనంబులు భూతంబుల తత్త్వము
సర్వము నీవే నీలోవేనని
నీ మహిమంబున కంతము లేదని
నీవేలే మాకాధారం బని ॥ పాడుచుపాడుచు।। ‘
అనేది మూడవ చరణం.
“మీరంతా నా బిడ్డలేకాదు; నా అవయవాలు” అన్న వాక్యం అమ్మ విశ్వరూపసందర్శన భాగ్యాన్ని కలుగజేస్తుంది.
“మీరుకానిది నేనేదికాదు” అన్న వాక్యం జిజ్ఞాసువు లకు వాస్తవ వస్తుతత్త్వాన్ని సుబోధకం చేస్తుంది.
అన్నిటికీ అందరికీ ఆధారమైన అమ్మకి ఆధారం లేదు,
అందరికీ తల్లి అయిన తల్లి అమ్మకి తల్లిలేదు; తొలి.
అయినా సామాన్యగృహిణిలా మన కళ్ళముందు నిలిచింది; మన స్థాయికి దిగి వచ్చింది. ఎక్కడా ఎప్పుడూ ఏ ఆర్భాటమూ, ప్రదర్శనా లేదు.
‘విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం పరిపీడనాయ |
ఖలస్య సాధోర్విపరీతమేతత్ జ్ఞానాయ దానాయచ రక్షణాయ ||’ –
‘ప్రజ్ఞానం బ్రహ్మైతే నేమని
అజ్ఞానం బ్రహ్మెందుకు కాదని
సర్వము నీవని సమతయు నీవని
గుర్తెరిగెడి ఆ జ్ఞానమె నీవని ॥పాడుచుపాడుచు।।’-
అనేది చివరి చరణం.
సంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆర్యోక్తులు పాక్షికంగా ధర్మాన్ని ప్రబోధిస్తున్నాయి. ‘గురుర్ర్బహ్మా’ అని అన్నప్పుడు “గురువుకి శిష్యుడూ పరబ్రహ్మ స్వరూపమే” అని,
‘వైద్యోనారాయణోహరి:’ అన్నప్పుడు “వైద్యునికి రోగీ నారాయణ స్వరూపుడే” అని,
‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని అన్నప్పుడు “అజ్ఞానమూ బ్రహ్మే” అని….
అమ్మసంపూర్ణత్వాన్ని చాటింది.
శక్తి హీనునిసైతం శక్తివంతుని చేసే శక్తి అమ్మ; ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఒక ఉదాహరణ. భార్యావియోగం, భర్తృవియోగం అనే పదాలు అర్థ రహితములు. సతీపతులకు వియోగం లేదని అమ్మ స్పష్టం చేసింది. “యజ్ఞోపవీత రూపేణా భార్య భర్తతోనూ, మంగళసూత్రరూపేణా భర్త భార్యతోనూ సదా ఉంటారు” అనే అమ్మవాక్యం అర్థనారీశ్వరతత్వానికి భాష్యం చెబుతుంది.
యుగాలుగా తరాలుగా అందరూ స్త్రీలకు పాతి వ్రత్యం అనే పరమ ధర్మాన్ని నూరిపోశారు. ‘భర్తకు భార్య దేవత’ అంటూ అమ్మ పరిపూర్ణ ధర్మాన్ని ప్రబోధించింది. కనుకనే అమ్మను ‘గుర్తెరిగెడి ఆ జ్ఞానము’ అని కీర్తించాను.
– సశేషం.
సమర్పణ: రావూరి ప్రసాద్,
ఎ.విఆర్. సుబ్రహ్మణ్యం