1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లో చూపు

లో చూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 12
Year : 2013

(గత సంచిక తరువాయి)

  1. ది.5.4.1957 తేదీన ‘అనసూయ అవని అమ్మా!’ అనే నా 12వ పాటను వ్రాశాను.

‘అనసూయవౌ అవని అమ్మా !

సహనంబె నీ సొంత సొమ్మా’ – అనేది పల్లవి.

‘నీ నోటిలో సుధలు కురిశాయిలే

నీ మాటలో పూలు విరిశాయిలే

మోడైన భువి పులకరించిందిలే

తొలకరించిందిలే’ ॥ అనసూయ వౌ||’ అనేది మొదటి చరణం.

అమ్మ వాక్యాలు సార్వకాలిక సత్యాలు. గురుత్వాకర్షణ శక్తి (Gravitational Force) Newton కనుగొనని పూర్వమూ ఉన్నది. సత్యం మన కళ్ళముందే జాజ్వల్య మానంగా ప్రకాశిస్తూ ఉంటుంది; అయినా కనపడదు, అర్థం కాదు. ఈ వాస్తవాన్ని Dante ‘Divine Comedy లో ‘Open Secret; opened to all but found by none’ అని అన్నారు.

అమ్మ ఒక సామాన్య మానవాంగన కాదు; సత్యస్వరూపిణి. కొన్ని ఉదాహరణలు :

  1. ఒకసారి సో॥ శ్రీ కోన సుబ్బారావుగారు, ” మా లోపాల్ని సరిచేయరాదా!” అని ప్రార్థించారు. అందుకు అమ్మ, “నాలో ‘పాలు’ ఇచ్చానా ? నా లోపాలు ఇచ్చానా? మీలో పాలు లేకుండా ఎట్లా ఉంటుంది ?” అని చమత్కరించింది. అమ్మ హాస్యంలో రహస్యం ఉంది. నాలో ‘పాలు’ అంటే భాగం; అమ్మ అంశ (భాగం) బిడ్డలు. నాలో ‘పాలు’ అంటే ఆనువంశికంగా రక్తగతంగా వచ్చే గుణాలు, లక్షణాలు. సృష్టికర్త ఆకారం – వికారం, లక్షణాలు – అవలక్షణాలు … సర్వాన్నీ సృష్టి పంచుకున్నది, పిత్రార్జితం మాదిరిగా. అమ్మ ప్రబోధించిన ఈ సత్యాన్ని తైత్తిరీయోపనిషత్ – 

‘నిరుక్తం చ అనిరుక్తం చ

నిలయనం అనిలయనం చ

విజ్ఞానం చ అవిజ్ఞానం చ

సత్యం చ అనృతం చ సత్యమభవత్’ అని వివరిస్తోంది. అంటే మూర్తము మరియు అమూర్తము (concrete and abstract);

ఆశ్రయము కలది – లేనిది;

చేతనము – చేతనరహితము;

వ్యవహార సత్యము – కానిది (ఉదా: ఎండమావి) … అంతా సత్యమే; పరమార్థ సత్యమే – అని అర్థం.

  కనుక అమ్మ “ఎంత వెదికినా అది కానిది నాకు ఏదీ కనిపించటం లేదు” అని వివరించింది; నిర్థారించింది.

“మీ లోపాలు లేకుండా ఎట్లా ఉంటుంది?” అనే వాక్యానికి మరింత వివరణ “ఆకారమే వికారంతో వచ్చింది” అనే వాక్యంలో లభిస్తుంది. ఈ మంచిమాటను హృద్యంగా అమ్మ మాత్రమే చెప్పింది; శాంతి సుధల్ని కురిపించింది. వ్యక్తిలోని గుణదోషాల్ని ఎంచి ముద్దాయిగా బోనులో ఎవరినీ ఏనాడూ నిలబెట్టలేదు; శిక్షించలేదు. అనుగ్రహైకస్వరూపిణి అమ్మ “చేతలు చేతుల్లో లేవని”, సర్వసంకల్పానికి వికల్పాలకి ప్రేరణ ఆశక్తిదే అని ఘంటాపధంగా చాటింది. కనుకనే ‘మోడైన భువి పులకరించిందిలే, తొలకరించిందిలే’ అన్నాను.

  1. అది వేసవికాలం. అమ్మ దర్శనార్థం కొందరు సోదరీ సోదరులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన ఒక సోదరి, ‘అయ్యో ! పాపం ! ఎండలో పడి వస్తున్నారు’ అన్నది. అందుకు అమ్మ, “రానియ్యి. పాపం ఏముంది ? నన్ను చూడటమే పుణ్యం” అన్నది. తనను గురించి తనంతట తాను తెలియచేస్తే గానీ వాస్తవం మనకి తెలియదు. అలా తెలియజేయటం అమ్మ దయ. ఈ పరమార్థాన్ని తెలియజేస్తూ ‘జన్మ కర్మ చ మే దివ్యం’ అని ప్రవచించారు కృష్ణపరమాత్మ. ఒక అవతారమూర్తి దర్శన స్పర్శన సంభాషణ ప్రాప్తి మహద్భాగ్యమే ఎవరికైనా. వారు ధన్యులు. ఆ విభూతి అందరికీ లభించేది కాదు.

సకల కార్యలకూ కారణమై అకారణంగా సకల కార్యలనూ నడిపే సగుణమూర్తి అమ్మ. ‘ఆశక్తి, ఆ పరతత్త్వం – అనసూయా పేరుతో, స్త్రీ రూపంతో, దివ్యమాతృ ప్రేమాకృతితో, సర్వులనూ ఆదరించి ఆదుకునే గుణంతో, తరింపజేసే తల్లిగా ఒక కార్యాచరణ ప్రణాళికతో ఒక సౌభాగ్యదేవతగా జిల్లెళ్ళమూడిలో విరాజిల్లుతోంది. కానీ దైవం నామరూపరహితుడు, నిరాకారుడు, నిర్గుణుడు, కేవలం సాక్షీభూతుడు అని పండితులు వక్కాణిస్తారు. ఎందుకో!’ అని చమత్కరించారు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు.

‘జిల్లెళ్ళమూడి నాశ్రితులు సేవలు గైకొనుచుం బ్రశాంతి సం

ధిల్లగ జేయు లోకమున దివ్యశుభాకృతి దాల్చి నీవు రం

జిల్లుచునుండ రూపగుణచేష్టలు లింగము లేకయే విరా

జిల్లును బ్రహ్మమంచును వచించెద రేటికొ పండితోత్తముల్

– అనే పద్యంలో.

‘నీ అడుగు జాడలే నా ఆదర్శమ్ము

నీ మనుగడే భువిని నా జీవితమ్ము

గాఢాంధకారంబు బాపావులే

వెలుగు చూపావులే ॥అనసూయవౌ॥ అనేది రెండవ చరణం.

అమ్మ లేకపోతే నాకు అంతా శూన్యంలా ఉండేది. నేను జీవించాలంటే అమ్మ శరీరంతో ఉండాలి. నా ఆవేదనని అర్థం చేసుకొని అమ్మ ఒక వాగ్దానం చేసింది, “నీ కెందుకు ? నేను ఎక్కడికీ పోను. ఇక్కడే ఉంటాను, నాన్నా!” అని. అయినా సమాధానపడక ‘అమ్మా! నువ్వు కనీసం పది సంవత్సరాలు ఉండాలి’ అన్నాను, “సరే” అన్నది. పది సంవత్ససరాలు గడిచాక ‘మరొక పది సంవత్సరాలు ఉండాలమ్మా!” అన్నాను. “నీకు తృప్తి లేదురా. సరే” అన్నది. మళ్ళీ “పది సంవత్సరాలు ఉండాలమ్మా” అని అడుగుదామనుకున్నాను. ఈ లోగా అమ్మ వెళ్ళిపోయింది. నేను కోరినందువల్ల అమ్మ ఉన్నది అని అనను. అంతకు ముందుగానే అమ్మ తనంతట చెప్పింది, “నేను ఎక్కడికి పోతాను, నాన్నా? ఎక్కడికీ పోను” అని, అయినా ఎందుకో . నేను అట్లా అడిగాను. ఒక coincidence అది. అమ్మ శారీరకంగా దూరం అవుతుందనే వేదన, మన కళ్ళముందే ఉండాలనే కామనతో అడిగాను. అంతే. నేను ఎవరిని ? ఒక అల్పుణ్ణి. కనుకనే ‘నీ మనుగడే భువిని నా జీవితమ్ము’ అని అమ్మకి మనవి చేసుకున్నాను.

  1. ది.9.4.1957 తేదీన ‘నీ కొరకై నేనున్నా’ అనే నా 13వ పాటను వ్రాశాను.

నీ కొరకై నేనున్నా

లేరమ్మా భువి నీకన్నా’ అనేది పల్లవి.

‘నీ కొరకై నేనున్నా’ అంటే ‘అమ్మ కోసమే నేనున్నాను’

అని. అమ్మ లేకపోతే నాజీవితం లేదు అని ఒక అర్థం.

ఇక్కడ ‘నువ్వు’ అంటే అనసూయమ్మ అనీ, ‘నేను’ అంటే ‘రాజు’ అనీ అర్థం కాదు. ‘నువ్వు’ ఉన్నప్పుడు ‘నేను’ అనేదీ ఉన్నది. ‘నేను’ అంటే నీలో ఉన్న ‘నేను’, నీవు అంటే నాలో ఉన్న ‘నీవు’ అని మరియొక అర్థం ఉంది.

‘నిర్వికారమౌ నీలాకాశము

నిర్మలమౌ నీ సమభావనయని

ఆధారం బా అవనివి నీవని

సాదరముగ నను సాకిన దీవని |॥ నీకొరకై॥

అనేది ప్రథమచరణం.

“గగనం గగనాకారం సాగర స్సాగరోపజా’ అన్నారు కాళిదాసు. గగనానికి, సాగరానికి, అమ్మకి ఉపమానాలు లేవు. అమ్మ, అమ్మ వలెనే ఉంటుంది.

గగనం అంటే ఆకాశం. అది సృష్టి స్థితికి ఒక అవకాశం. ‘నిర్వికారమైన గగనం’ అంటే సంకల్పరహితమైన అమ్మ సంకల్పం; తాను అనేకం కావాలి అనేది. సర్వమూ తానైన అమ్మ కనుకునే సర్వసమానత్వభావన, దృష్టిని కలిగి ఉన్నది.

‘ఆధారం బౌ అవనివి నీవని’ అన్నాను. సకల ప్రాణి కోటి మనుగడకి ఆధారం భూమి. ప్రకృతి – వికృతి, ఆకారం – వికారం, గుణాలు – దోషాలు … అన్నింటికీ ఆధారం అమ్మ. అమ్మ కనుకనే సర్వాన్నీ ఆచరిస్తోంది, ఆదుకుంటోంది.

‘అనిలము లోని చలనము నీవని

` అనలము లోని జ్వలనము నీవని

సలిలంబందని క్షాళన మీవని

సర్వోత్తమమౌ సహనము నీవని ॥నీ కొరకై॥’ అనేది

రెండవ చరణం. అనిలము అంటే వాయువు, అనలము అంటే అగ్ని, సలిలము అంటే జలం. వాయువు యొక్క గుణం చలనం, అగ్ని లక్షణం ఉష్ణాన్ని కాంతిని ప్రసాదించడం, జలం యొక్క ధర్మం కడిగి వేయటం. నీరు సార్వత్రిక ద్రావణి (Universal solvent). హృదయాంతరాళములోని మలిన మంతయు వెలిగి లాగి కడిగి వేసే గంగానది అమ్మ. పంచభూతాల ధర్మాలకంటే ఉత్తమమైనది శక్తివంతమైనది సహనం. సహనమే ఉపాసనకి, ఆరాధనకి, తపస్సుకి ప్రాణం. తపస్సే బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఏకైకసాధనం. తరుణం వచ్చేవరకు సహన గుణం అంత్యంతావశ్యకం. ఆ సహనానికి ప్రత్యక్షరూపం భూమి; కళ్ళ ఎదుట కరచరణాదులతో నడయాడే రూపం అమ్మ.

‘నీ అవలోకనె ఆలాపనగా

సుందరవీణానాదము నీవని

సత్యము నీవని నిత్యము నీవని

సర్వము నిండిన బ్రహ్మవు నీవని ॥నీ కొరకై॥ అనేది మూడవ చరణం.

‘నీ అవలోకనె ఆలాపన’ అనటంలో నా భావం – అమ్మదర్శన మాత్రం చేతనే జీవులకి పరమ పదలక్ష్య ప్రాప్తి సిద్ధిస్తుంది – అని. ‘సుందర వీణానాదము నీవని’ అన్నాను. వీణానాదం వేదనాదం; రాగతాళ భావబంధురమైనది. అది అమ్మ అని నా భావం. నేడు Music Therapy అనేది ప్రచారంలో ఉంది. వీణా తంతులను మీటినపుడు వెలువడిన క్రమబద్ధమైన ధ్వనితరంగాలు శరీరంలోని మనస్సులోని అస్తవ్యస్తమైన స్థితిని యధాస్థితికి తెస్తాయి. స్వస్థతతో పాటు మనోనిశ్చలత కూడా కలుగుతుంది అనేది ఆ సూత్రం (Principle).

సృష్టిలోనూ ఒక క్రమం (Order) దిశ- దశ… ఉన్నాయి. ఉదా: ఒక క్రమంలో ఋతువులు ఏర్పడటం, పరస్పరావలంబులై జీవులు – నిర్జీవులు మనుగడ సాగించడం. ఈ ‘విధి విధానం’ లో అంతర్లీనంగా నినదిస్తున్న వంశీనాదం అమ్మ.

‘సత్యము నీవని నిత్యము నీవని

సర్వము నిండిన బ్రహ్మవు నీవని’ అన్నాను.

ఈ సందర్భంగా అమ్మకి సహజం మనకి విశేషం అయిన ఒక వాస్తవాన్ని వివరించాలి. అమ్మను అర్థం చేసుకోవటం అసాధ్యం. ఒక కోణం లోంచి చూస్తూ ఇదే అమ్మతత్త్వం, అమ్మ ప్రబోధం, సరళి, విధానం, సంప్రదాయం ఇదే అనుకుంటే సరికాదు. అమ్మ సహస్రకోణాల సహస్రరీతుల ప్రకాశించే సువర్ణజ్యోతి.

అమ్మలో సంప్రదాయ వేదాంత పోకడ ఉన్నది; నాస్తిక వాదన ఉన్నది. పురుషకారాన్ని ప్రశ్నిస్తుంది; పురుషాహంకారాన్ని నిలదీస్తుంది. పాతివ్రత్యాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధిస్తుంది, స్త్రీ పురుష సమానత్వాన్ని నొక్కి వక్కాణిస్తుంది, స్త్రీ జన పక్షపాతియా అనిపిస్తుంది.

“అశుద్ధంలో కూడా పరమాత్మని చూడమని ఆవు పేరుతో సందెగొబ్బెమ్మను చేసి మంగళగౌరిగా ఆరాధించమన్నారు” అన్నపుడు సనాతన ధర్మంలో సదాచారాల్లో ఉండే మర్మాల్నీ పరమార్థాన్నీ అరటిపండు వలిచి తినిపించినట్లుంటుంది. ఆ వెనువెంటనే “తిథులు విధుల్ని మార్చవు”, “మానవుని నడకకి ఆధారం నవగ్రహాలు కాదు – రాగద్వేషాలు, ఆ రెంటికీ ఆధారం ‘నేను’ అన్నపుడు హేతువాదిగా నాస్తికురాలిగా కనిపిస్తుంది.

“ఇది ఏమిటి ?” “అసలు ఇది ఏమిటి?’ ప్రశ్నల ద్వారా సదసద్వివేచన చేయమన్నపుడు సత్యాన్వేషిగా దర్శనం ఇస్తుంది. “జన్మలు లేవు” అన్నపుడు రక్తగతమూ అస్థిగతమూ అయి కరడుగట్టిన విశ్వాసానికి విద్యుద్ఘాతం తగిలినట్లుగా అవుతుంది. ‘పునిస్త్రీ’ ‘అర్ధనారీశ్వరతత్వం’ వంటి పదాలకి అమ్మ అందించిన నిర్వచనాలను – విశిష్టత వినూత్న సత్యాలను వింటే గుండె ఆగిపోతుంది. అమ్మ మాటలకి బలం అవి స్వీయ అనుభవసారాలు కావటమే.

కట్టు – బొట్టు పద్ధతులూ చూస్తే హిందూ మతావలంబిని అనిపిస్తుంది. కానీ “సర్వసమ్మతమే నామతం” అంటూ అన్ని మతాల్ని అందరి అభిమతాల్ని గౌరవిస్తుంది. అన్ని పద్ధతులూ తనకు నచ్చుతాయంటుంది; ఏ పద్ధతికీ తాను నొచ్చుకోనంటుంది. ‘యే యథా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం’ అన్నట్లు వ్యక్తిగత స్వరూప స్వభావాలే అమ్మ దర్శన దర్పణంలో ప్రతిబింబిస్తాయి. ‘అన్నీ అమ్మే; ఏ ఒక్కటి అమ్మకాదు’ అనే నిశ్చయాత్మక భావనే సత్యం. కనుకనే

‘సత్యము నీవని నిత్యము నీవని

సర్వము నిండిన బ్రహ్మము నీవని’ అమ్మను కీర్తించాను. సత్యం, జ్ఞానం,,అనంతం బ్రహ్మ; అదే అమ్మ.

– సశేషం.

సమర్పణ : రావూరి ప్రసాద్,

ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!