1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లో చూపు

లో చూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : December
Issue Number : 5
Year : 2012

(గత సంచిక తరువాయి)

  1. అమ్మకి అంతా వర్తమానమే:

1973 సంవత్సరము రవి వివాహానికి వస్తున్నాను. నంద్యాలలో రైలు ఎక్కాను. పైన పడుకున్నాను. బాగా నిద్రపట్టింది. రైలు ఆగినపుడల్లా తరచు అడుగుతున్నాను ‘ఇది ఏ స్టేషన్?’ అని. నరసరావుపేటలో దిగాలి. రైలు ఒక స్టేషన్లో ఆగింది. మరల బయలుదేరింది. ‘ఇది ఏ స్టేషన్?” అడిగాను మాములుగా. ‘నరసరావుపేట’ అన్నారు. ఉలిక్కిపడి లేచి క్రిందికి దిగాను. రైలు కొంచెం కొంచెంగా వేగాన్ని పుంజుకుంటోంది. ప్లాట్ఫారం చివరగా పరుగెడుతోంది. సంచీతీసికొని శక్తి నంతటినీ కూడగట్టుకుని ధైర్యం చేసి దూకేశాను. చుట్టుప్రక్కల వారు జరుగకూడనిది జరిగింది అన్నట్లు నిర్ఘాంత పోయి చూస్తున్నారు. తరచుగా ఆరోజులలో నేను వాడేవాణ్ణి. ఆ సీసా వచ్చి పొత్తి కడుపు క్రింది భాగంలో ఒక నరాన్ని బలంగా దెబ్బతీసింది బోర్లపడటంలో. కొన్ని క్షణాలు విలవిలలాడి పోయినా, నెమ్మదిగా లేచి రిక్షాచేసికొని బస్టాండుకు వచ్చి, చీరాల మీదుగా జిల్లెళ్ళమూడి చేరాను. చెప్పులు రైలులోనే మరచిపోయినా గానీ బాగానే ఉంది. పైకి వెళ్ళలేక క్రిందనే ఉన్నాను. పెళ్ళికదా! కోలాహలంగా ఉంది. అమ్మ గదిలో ఎక్కువగా స్త్రీలే ఉన్నారు. నేను వచ్చానని ఎవరో అన్నారు అమ్మతో వెంటనే అమ్మ ‘రాజును పిలుచుకురా!’ అని పంపింది. ఎలాగో ఇబ్బందిగానే మెట్కన్నీ ఎక్కి అమ్మ గదిలోకి వెళ్ళా. అమ్మ నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసింది. కొంచెం తటపటాయించాను. అమ్మకి అన్నీ తెలుసుకదా! ఆడవాళ్ళు ప్రక్కకి తప్పుకున్నాక అమ్మ దగ్గరికి వెళ్ళాను. “సాహసం చెయ్యొద్దు, నాన్నా!” అంటూ 

అమ్మ తన అమృత హస్తాలతో ఒళ్ళంతా నిమిరింది. ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఆసాహసకృత్యాన్ని గుర్తుచేస్తూ ‘నేను సాక్షిగా ఉన్నాను’ అంటూ స్వల్పంగా ఉబ్బుఉన్నది. ఆ రోజు నేను ఒంటరిగానే ప్రయణంచేశా. ప్రక్కన ఎవరూలేరు. మరి అమ్మకి ఎలాతెలిసింది? అమ్మకి తెలియనిది లేదు. వాస్తవం చెప్పాలంటే ఆ క్షణంలో అమ్మయే నాకంటే ఎక్కువ గిలగిలలాడి ఉంటుంది. ఏదో ఘోరం జరిగి ఉండాల్సిందే చేతులు, కాళ్ళు, కీళ్ళు, ఎముకలు, ఏదీ విరగలేదు. ఏ రక్షక కవచాన్ని కప్పిందో, ఆ నా బాధని తాను అనుభవించిందో ఏమో! నాకు తెలియదు. “ఎందుకట్లా చేశావురా? తర్వాత స్టేషన్లో దిగితే ఒకగంట ఆలశ్యంగా వచ్చేవాడివి. రైలు రెండు గంటలు ఆలశ్యంగా వస్తే ఏంచేస్తావు? ఇప్పుడు నువ్వు కంగారు పడాల్సినదేదీ లేదు” అంటూ భరోసానిచ్చింది. “సాహసం చెయ్యొద్దు, నాన్నా!” మరల హెచ్చరించింది; మరల గుర్తుచేసింది. అమ్మకి ఈ గోడలు అడ్డుకావు. అమ్మకి నిన్న, నేడు, రేపు అనే కాల విభజనలేదు. అంటే అమ్మకి భూతభవిష్యద్వర్త మానములు వర్తమానమే. “సాహసం చెయ్యొద్దు” అని లోగడనే నన్ను హెచ్చరించింది. 38 ఏళ్ళ క్రితం ఒకసారి అమ్మతో, ‘గుంటూరులో ఉన్నపుడు స్నేహితులతో పందెము వేసుకుని డాబా పైనుంచి దూకేవాడినమ్మా. క్రింద ఇసుక గుట్టలుండేవి’ అని అంటేఅమ్మ, “సాహసం చెయ్యొద్దు, నాన్నా!” అన్నది. భవిష్యత్ లో ఈ ప్రమాదాన్ని చూస్తూ అలా అన్నది అనిపిస్తుంది నాకు.

  1. దివ్యమాతృప్రేమ : :

ఒకసారి అమ్మతో ‘అమ్మా! ‘కాయకల్ప చికిత్స’ అనేది ఒక వైద్యశాస్త్రప్రక్రియ. మనశరీరంలో ఎన్నో జీవకణాలు నశించిపోతూంటాయి. ఈ విధానంలో కొత్తశరీరం వస్తుంది; అది 60/80 సంవత్సరముల పాటు దృఢంగా ఉంటుంది. 60ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకుంటే మళ్ళా 60/80 సంవత్సరములు దృఢంగా జీవించవచ్చు” – అనిఅన్నాను.

అందుకు అమ్మ, “ఉంటాను, నాన్నా! దాని దేమున్నది? ఏంచేయాలి, ఉండి? రోజూ ఇదేపనికదా! నాన్నా! ప్రొద్దున్నే లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, భోజనం చేయటం, మళ్ళీ పడుకోవటం- దీనికి 100సంవత్సరములు కావాలా, చెప్పు, నాన్నా! 100 సంవత్సరములే కాదు 200 సంవత్సరములు అయినా చెయ్యొచ్చు. ఇదేపని కదా! దీనికి అంత సమయంకావాలా?

అప్పటికి మీరంతా ఉండరు, కదా నాన్నా! మీరంతా పోతారు. కొత్తవాళ్ళు వస్తారు. వాళ్ళూ పోతుంటారు. వాళ్ళకోసం, వీళ్ళకోసం ఏడ్వాలా? ఇలా ఏడుస్తూఉండటం- ఇదేనా పని? నాన్నా! చెప్పు. దానివల్ల ఉపయోగం ఏమిటో చెప్పు. ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల ఈ కష్టం ఉంది, నష్టంఉంది. లాభంఉంది, ఇదిమంచీ- ఇది చెడూ…. అని ఉంటాయి కదా, నాన్నా! అవి ఏమిటో చెప్పు. ఇవే పనులు కదా మనం చేసేది. దానికి 100సం.లు మామూలుగా పెట్టారు. ఇదే చాలు అనుకుంటున్నారు చాలమంది. ఇది చాలక ఇంకొక వందేళ్ళు కావాలంటున్నారు చాలమంది. ఇదిచాలక ఇంకొక వందేళ్ళు కావాలంటావా? మీరు ఎవరూ ఉండరు కదా, నాన్నా! మీరు లేని తర్వాత నేనెందుకు? ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా నీకు? అని- అన్నది. పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ. నేను నిరుత్తరుడనైనాను.

అమ్మ జీవించేది మనకోసం. మనం శ్వాసించేదీ మనకోసమే. అమ్మకి పరమార్థమే. సార్ధం, మనకి స్వార్థమే పరమార్థం. అమ్మ శారీరక సుఖానికి ఏనాడూ విలువనివ్వలేదు; కడుపునిండా తినాలి కంటినిండా నిద్రపోవాలి అని ఏనాడూ అనుకోలేదు. తనకు పెట్టిన అన్నాన్ని యాచకులకూ, వ్యాధిగ్రస్థులకూ జంతువులకి పెట్టిఆనందించేదిబాల్యం 

నుంచి 

“మీరు లేని తర్వాత నేనెందుకు?” అనేప్రశ్న, “ఇవన్నీ పిచ్చిఆలోచన” లనే వేదన అమ్మ దివ్యమాతృప్రేమకు దర్పణం పడతాయి. తల్లికి గర్భశోకాన్ని మించిన బాధ ఏముంటుంది? అందరినీ తన కన్నబిడ్డలుగా ఎంచి ఆరాధించే అమ్మ అలౌకిక ప్రేమను పొందిన అదృష్టవంతుల కంటికి “అమ్మ ఒక దేవత” అనే పదము – పదవి చాల చిన్నది అనిపిస్తుంది. ఆశ్చర్యకరవాత్సల్య అమ్మ శ్రీ చరణాలకు శత సహస్రాధిక వందనములు.

  1. పరిపూర్ణ దృష్టి:

ఒకనాడు “అమ్మా! జిల్లెళ్ళమూడి జగత్ప్రసిద్ధమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అవుతుంది. గొప్ప పవిత్ర తీర్థం, పుణ్యక్షేత్రం అవుతుంది” అని అన్నాను. అటుపిమ్మట మామధ్య సంభాషణ ఇలా నడిచింది.

అమ్మ: ఎట్లా చెబుతున్నావురా?

నేను: నువ్వు ఇక్కడ ఉన్నావు కదమ్మా.

అమ్మ: నేను ఉన్నచోటల్లా పవిత్ర మౌతుందా?

నేను: ఎందుకు కాదమ్మా?

అమ్మ: లేదు, నాన్నా!

నేను: కొన్ని ప్రదేశాలు అలా మహిమాన్వితంగా ఉంటాయమ్మా. ఉదాహరణకి – విజయనగర సామ్రాజ స్థాపన సంకల్పంతో అందుకు రాజధాని నిర్మాణం ఎక్కడైతే బాగుంటుందని హరిహరరాయలు బుక్కరాయలు వేటకుక్కల్ని తీసికొని బయలుదేరారు. ఒక ప్రదేశానికి వచ్చేసరికి అక్కడ ఉండేకుందేళ్ళు ఆ వేటకుక్కల్ని తరిమితరిమి కొట్టాయి. భీకరంగా దేనిమీదకైనా విజృంభించే వేటకుక్క, కుందేళ్ళ పరాక్రమానికి భయపడి తోకలు ముడిచి పరుగెత్తినయ్. ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క ప్రభావంఉంటుందమ్మా 

అమ్మ: లేదు, నాన్నా! ప్రతిచోటా రెండూ ఉంటాయి. నువ్వు చెప్పిన దానిలోనే రెండోది కూడా ఉంది. నువ్వు అది గమనించలేదు. నేను అడుగుతున్నాను. నాన్నా! వేటకుక్కల్ని తరమ కలిగిన శక్తి ఈ కుందేళ్ళకి వచ్చినది కదా ఆ స్థలంలో, మరి ఉన్న వేటకుక్కలకి ఆ పిరికి తనం ఎక్కడి నుంచి వచ్చింది? పిరికి తనం ఉన్న కుందేళ్ళకి పౌరుషం వచ్చింది. పౌరుషం కలిగిన వేటకుక్కలకి పిరికితనం వచ్చిందా లేదా?

(నేను బిత్తర పోయాను. అవాక్కయ్యాను)

నేను: అవునమ్మా! నిజమే. ఇది నా ఆలోచనకురాలేదు.

అమ్మ: నాన్నా! ప్రతిచోటా రెండూ ఉంటాయి. మంచి *ఎక్కడ ఉంటుందో, చెడు అక్కడే ఉంటుంది. జిల్లెళ్ళమూడికూడా అంతే, నాన్నా! ఇక్కడా ఇక్కడే కాదు భూమి మీద ఎక్కడైనాసరే – రెండూ ఉంటాయి. ఒక్కటే ఉన్నస్థలం నువ్వు చెప్పు. రూపాయనాణానికి మనం ఒకవైపు బొమ్మని చూస్తాం. అంటే రెండవవైపు బొరుసు ఉన్నదా? ఆ రెండవవైపు ఎవరన్నా చూశారా? కనపడుతుందా? కనపడదా? దృశ్యమాన ప్రపంచంలో, ఈసృష్టిలో ఈ కన్నులకి కనిపించే ప్రతివస్తువుకి రెండవవైపు ఏమిటి? 

నేను: తెలియదమ్మా, ఆ రెండవ వైపు ఏమిటో!

అమ్మ: రెండవవైపు ఏమిటో తెలుసా? “తనే”. ఇంతటినీ చూచేవాడు తనని తాను చూసుకోలేడు. ఇంత చూసే కన్నులు రెండవవైపు తనని చూసుకోలేవు. రెండవవైపు తనే. తనను తాను తెలుసుకున్నవాడు సర్వాన్నీ తెలుసుకున్న

వాడు అవుతాడు. 

– సశేషం.

సమర్పణ:  శ్రీ రావూరి ప్రసాద్,

 శ్రీ ఏ వి ఆర్ సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!