1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లో చూపు

లో చూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : January
Issue Number : 6
Year : 2013

(గత సంచిక తరువాయి)

  1. నాడు – నేడు:

మొదటి నుంచీ అమ్మ ఒకే విధంగా ఉన్నది. 1954 అక్టోబర్ నెలలో అమ్మ నాన్నగారితో కలిసి గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ గంగరాజు లోకనాధం గార్ని చూడటానికి వచ్చింది. నాడు అమ్మ ఒక్క చీర, రవికెతో బయలుదేరింది. అదీ నాటి పరిస్థితి. తనతో ఇంకొక పాత చీర ఉందేమో తెలియదు. అమ్మ 7వ మైలు దగ్గర కూర్చొని ఉన్నది ఆ సమయంలో రెడ్డి చిన సుబ్బయ్య రూ. 8లు పెట్టి ఒక చీరకొని, తీసికొని పరుగెత్తు కుంటూ వచ్చి అమ్మకి ఇచ్చాడు. తర్వాత అమ్మ నాతో, “నాన్నా ! ఇవాళ అమ్మకి పట్టుచీరలు పెట్టారు, బంగారం దిగేశారు. ఈ బంగారం, పట్టుచీరలు చూస్తున్నావు కదా! ఇవి వేలల్లో ఉంటాయి. కానీ నాకు అనిపిస్తుంది. ఆ రోజున నేను గుంటూరు వెళుతున్నప్పుడు రు. 8 లు పెట్టి సుబ్బయ్య తెచ్చి ఇచ్చిన చీరకి వీటికీ పోలిక లేదు. ఆ చీర ఖరీదు తక్కువ కావచ్చు. కానీ ఆ రోజున దాని కున్న విలువ చాల గొప్పది – అని. నాన్నా! వీటన్నింటి కంటె ఆ చీర చాలా గొప్పదనిపిస్తుంది నాకు” అన్నది.

‘నాడు అది లేదు, నేడు ఇది ఉన్నది’ అనే భావం అమ్మకి ఎప్పుడూ లేదు. మనవలె సుఖాల్ని, సిరి సంపదల్నీ, స్వర్ణాభరణాల్ని, చీనీ – చీనాంబరాల్నీ, అమ్మ ఎప్పుడూ కోరుకోలేదు. అమ్మకి పట్టుచీరలు కట్టి, బంగారు పట్టాలు కిరీటమూ పెట్టి ఆనందించిందీ, లబ్ధి పొందిందీ మనమే.

నాడు అమ్మకు అంటూ ప్రత్యేకంగా మంచం కానీ, దిండు కానీ లేవు. టైలరింగ్ మిషన్ దగ్గర గుడ్డల్ని కత్తిరించగా వచ్చిన రద్దు, పీలికలతో చేసిన జాన – బెత్తెడు దిండ్లు నాలుగు ఉండేవి. అమ్మకి అయినా, వచ్చిన వాళ్ళకి అయినా ఆ నాలుగే. నలుగురు వస్తే ఆ నలుగురికి వాటిని ఇచ్చి తాను తలక్రింద చెయ్యి పెట్టుకొని పడుకునేది. రెండు మంచాలు ఉండేవి. ఒకటి నాన్నగారికి పెద్ద నవ్వారు పట్టెమంచం. రెండవది నవారుపట్టీ పొట్టి మంచం. దాని మీద ఒకసారే పడుకున్నాను. నరకయాతన అనుభవించా. కాళ్ళు చాపుకోవటానికి కానీ ముడుచుకోవటానికి కానీ వీలు లేని కుక్కిమంచం అది.

మొద్దుగా రెండు, మూడు తుంగచాపలు ఉండేవి. జనం వస్తున్నారని నాలుగైదు రెక్క దుప్పట్లు, కోరా దుప్పట్లు, కొని తెచ్చారు నాన్నగారు. అంతక్రితం అవీ లేవు. చాపలు పరచుకొని అడ్డంగా నలుగురైదుగురు పడుకునే వాళ్ళు. దాదాపుగా అమ్మని క్రింద పడుకొనిచ్చే వాళ్ళం గాదు. నాన్నగారు ఉంటే తుంగచాప మీద పడుకునేది. నాన్నగారు ఊరు వెడితే నాన్నగారి మంచం మీద పడుకునేది. ఒక్కొక్కసారి మాట్లాడుతూ మాట్లాడుతూ కటిక నేలమీద మట్టిగడ్డల మీద అట్లాగే చీర చెరగు కప్పుకొని పడుకునేది. ఆ ప్రక్కన మేమూ పడుకునే వాళ్ళం. ఎట్లా అంటే అమ్మని అట్లా పోల్చడం భావ్యం కాదు కానీ – కుక్కలు, పిల్లులు … ప్రక్కన వాటి కూనలు పడుకున్నట్లు పడుకునే వాళ్ళం. నాడు సుఖం లేదు, కానీ హాయి ఉండేది.

అమ్మ రోజు తెల్లవారు ఝాముననే లేచి, స్నానం చేసి చీర విడిచేది. ఆ చీర చాకలి వాళ్ళకి వేసేవాళ్ళు. రాత్రి గం.6 ల ప్రాంతంలో స్నానం చేసేది. అప్పుడు విడిచిన చీర మామూలుగా దడిమీద వేసేది. అమ్మ బయటికి రాగానే మేము పరుగెత్తు కొని వెళ్ళి ఆ చీర తెచ్చుకునేవాళ్ళం. దాని కోసం నేను నా బావమరిది ఆంజనేయులు దాదాపు పోట్లాడుకునేవాళ్ళం. దాన్ని తెచ్చుకుని కప్పుకునేవాళ్ళం. నేల మీద పడుకున్నా, తుంగచాప మీద పడుకున్నా కప్పుకోవటానికి మాత్రం అమ్మ విడిచిన చీర ఉంటే చాలు, దానిని మించింది లేదు. దానిలోంచి ఒక పరిమళం వచ్చేది. ‘ఏమిటి ? ఆడవాళ్ళు విడిచిన చీర కప్పుకోవటమేమిటి వీళ్ళు ? ఏమన్నా బుద్ధి ఉందా వీళ్ళకి ?’ అని ఎవరైనా అనుకోవచ్చు, అసహ్యించు కోవచ్చు. కానీ ఆ చీర అమ్మది. అద్భుత పరిమళం వచ్చేది.

శ్రీ రాఘవేంద్రస్వామివారి చరిత్రలో స్వామి వారు విడిచిన కాషాయవస్త్రాలను ఉతికి శుభ్రం చేసే సమయంలో చాకలి వానికి దివ్యజ్ఞానం ఉండేదని విన్నాం. నాడూ – నేడూ మాత్రమే కాదు; త్రికాల సత్యం ఒకటి ఉన్నది. ఈ శరీరాన్ని కన్న తల్లికి ‘అమ్మ’కి చాలా తేడా ఉంది. ఏ అంతరాలూ, అరమరికలూ లేని శుద్ధ స్ఫటిక సదృశ ప్రేమా మృత రసాధిదేవత అమ్మ.

ఒక మాతృమూర్తి ప్రక్కలో ఒక పురిటి బిడ్డ ఉన్న ఏ, రెండేళ్ళ వయస్సు గల ఎడ పిల్లవాడు ఉన్నాడు. వాడూ తల్లిని విడిచి ఉండలేడు. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ ఎడ పిల్లవాడ్ని తన కాళ్ళ దగ్గరైనా పడుకోబెట్టుకొని, తన పాదంతో వాడి పొట్టమీద సన్నగా తాళం వేస్తూ ‘నాన్నా ! అమ్మ ఇక్కడే ఉంది. బబ్బో’ అని అంటే ఆ స్పర్శ కంఠధ్వనికి ఆనందపడి ఏడుపు మాని ఆదమరిచి నిద్రపోతాడు. అలా ఉండేది అమ్మకీ మాకూ అనుబంధం. కొత్తగా వచ్చిన వాళ్ళు పురిటి బిడ్డలు అయితే పాతవాళ్ళం మేమంతా ఎడ పిల్లలం. సాకార మమకారాకృతి అమ్మ.

ఆ రోజున రోడ్డు లేదు. రాళ్ళు, ముళ్ళు గుచ్చుకునేవి. వర్షాకాలంలో అయితే బురదలో, నడుం లోతు నీళ్ళలో దిగి వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో సుఖం లేదు కానీ ఎంతో హాయి ఉండేది. సంతోషం ఉండేది. అమ్మ ఏదైనా అనుభవాన్నిస్తే ఆనందంగా ఉండేది.

సుఖం అనేది శరీరానికి సంబంధించినది.

సంతోషం అనేది మనస్సుకు సంబంధించినది.

ఆనందం అనేది ఆత్మకి సంబంధించినది – అని నేను అనుకుంటున్నాను. ఈనాడు సౌకర్యాలు పెరిగాయి. సుఖం ఉంది కానీ సంతోషం లేదు. అనసూయేశ్వ రాలయంలో అమ్మకి ఎదురుగా కూర్చొని వెనుకటి సంగతులు నెమరు వేసుకుంటూంటే సంతోషం కలుగుతోంది. ఆనందం లేనేలేదు. కాగా నాడు లేమి అనీ, నేడు కలిమి అనిపించదు నాకు.

  1. అనుభవైక వేద్యం :

` “ఎవరి అనుభవం వారిది.

ఒకరి అనుభవం మరొకరిది కాదు” అని అమ్మ అన్నది. మొదటి నుంచీ నాది దేనినీ గ్రుడ్డిగా నమ్మే మనస్తత్వం కాదు. ఒకటికి రెండు సార్లు మూడుసార్లు ఎన్ని అవకాశాలుంటే అన్నిసార్లు దృఢపరచుకొని విశ్వసిస్తాను. అప్పటికి నిర్ధారణ చేసికుంటాను. ఒకసారి నిర్థారించు కున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ అది చెదరదు. మరో విధంగా ఎదురుగా కనిపించినా సరే. నేను ఒక పాటలో సుకున్నాను.

“నీ మాటయే అంధ విశ్వాసము

నీ బాసటే జీవ ప్రస్థానము

నివాసంబులో సహవాసంబులో

పరిహాసంబులో నాదు శ్వాసంబులో

నీవే.. —————–

నీవేనమ్మా ! ధరవే ! కదలిరమ్మా!!” అని

విశ్వాసం గుడ్డిది. దాన్ని మనం చీకట్లో వెతుక్కుంటూ నిర్ధారించుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి. అట్టి విశ్వాసం చీకటి లాంటిది. అంధ విశ్వాసం అంటే గుడ్డిలో పరమ గుడ్డిది. నిగ్గు తేల్చుకుంటే కానీ ప్రతీదీ నమ్మేవాడిని కాదు. ఇప్పటికీ అంతే. జిల్లెళ్ళమూడికి ఎందరో సాధువులు, మహితాత్ములు గొప్ప గొప్ప వారు వచ్చారని చెపుతూంటారు. * నాకు వెళ్ళాలనిపించదు. వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేయను. నాకు అనవసరం. వాళ్ళు మహాత్ములు కాదని అనను. వారు ఎవరికంటే గొప్పో నాకు తెలియదు. నాకంటే గొప్పవారే; నేను అట్లా లేను కాబట్టి.

హేదువాతదులున్నారు, నాస్తికులున్నారు. వాళ్ళని కూడా నేనేం తక్కువ చేయను. వాళ్ళ నమ్మకం అది. కాదని ఎట్లా అంటాను ? అట్లాగే వాళ్ళు కూడా నా నమ్మకాన్ని కాదనటానికి వీలులేదు. వాళ్ళు అన్నా నేను అంగీకరించను. నా అనుభవం నాకు సత్యం. ఒక ఉదాహరణ.

ఒకసారి బత్తాయి పళ్ళు తెచ్చారు. ఒక పండు ఒలిచి ఒక తొన నాకు పెట్టి, ఒక తొన హైమ తిన్నది. “తియ్యగా

ఉన్నది మధురం. చక్కెర లాగా ఉన్నది” అన్నది హైమ. నాకు పళ్ళు పులిసినాయ్. ఎవరి అనుభవం వారిది. “నాకు తియ్యగా ఉన్నది” అని అంటున్నది హైమ. మరి నాకు పళ్ళు పులుస్తున్నాయ్. తియ్యదనం నాకు తెలియనప్పుడు – పళ్ళు పులిసే పుల్లదనాన్నే ‘తీపి – తియ్యదనం’ అని అంటారు. అని నేను అనుకోవాలి అంతేకదా!

నేను తన అనుభవాన్ని ఎట్లా కాదంటాను ? అప్పుడు ఒక తొన తీసి రెండు ముక్కలు చేసి చెరి ఒక ముక్కా తిన్నాం. అప్పుడూ మా అనుభవాల్లో మార్పు లేదు. ఒకే పండులో రెండు విధాలు రుచులుంటాయా ? ఉండటానికి వీలులేదు. కాయ ఒకటే – తొనలు వేరు అని అందామా? ఒకే తొనని చెరిసగం తిన్నప్పుడూ అలాగే ఉన్నది. దీనినే అనుభవైక వేద్యం అని అంటారు.

“అనుభవిస్తున్నదే సత్యం” అని అంటుంది అమ్మ. రాజరాజేశ్వరిగా, భువనేశ్వరిగా, గాయత్రిగా, రామునిగా, మహాప్రవక్తగా, అవతారమూర్తిగా, మూర్తీభవించిన మానవత్వంగా, హేతువాదిగా, నాస్తికురాలిగా, స్త్రీజన పక్షపాతిగా, పతివ్రతాశిరోమణిగా, సంఘ సంస్కర్తగా ….ఎన్నో విధాల ఎన్నో కోణాల ఒక్కొక్కరికి అమ్మ అర్థం అవుతోంది. అది నిస్సందేహంగా అనుభవైక వేద్యమే.

– సశేషం.

సమర్పణ: శ్రీ రావూరి ప్రసాద్,

శ్రీ ఎ.విఆర్. సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!