1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లో చూపు

లో చూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : February
Issue Number : 7
Year : 2013

(గత సంచిక తరువాయి)

  1. మహత్యాలు అంటూ ఏవీ లేవు:

1954లో అమ్మను మొదటిసారి, రెండవసారి దర్శించా.

1955లో 5,6 సార్లు అమ్మను దర్శించుకున్నా. తొలిసారి అమ్మతో నాకు పెద్దగా అనుబంధం లేకపోయినా, అమ్మ ఒక మహత్తర శక్తి అనే స్ఫురణ ఎల్లవేళలా ఉండేది. అందుకు తగిన కారణాలేవీ లేవు.

సాధారణంగా నేను దేనినీ గ్రుడ్డిగా విశ్వసించను. నాకై నేను కూలంకషంగా నిగ్గుతేల్చుకుని సంతృప్తికరమైన జవాబు, అనుభవం పొందినపుడే నమ్ముతాను. అంతవరకు ‘ఇట్లా ఎందుకు కాకూడదు? అట్లా ఎందుకు కాకూడదు?

– వంటి ప్రశ్నలు వేసుకుంటూ సంశయిస్తూనే ఉంటాను. అదినా స్వభావం.

తొలిరోజులలో జిల్లెళ్ళమూడి వెళ్ళి వచ్చేవాడిని. అంతే. పెద్దగా విశ్వసించటానికి ఆధారాలేమీ లేవు. కానీ అమ్మ చెప్పేదాంట్లో ఏదో విలక్షణమైనది ఉన్నది.సంప్రదాయ బద్ధంగా పరంపరాగతంగా నూరిపోస్తూ ఒక మూసలో పోతపోస్తూన్న ధోరణికి భిన్నంగా ఉన్నది అని అనిపించేది. లేకుంటే జిల్లెళ్ళమూడి రావాల్సిన అవసరం ఏమున్నది? ఏదో మారుమూల ఒక కుగ్రామంలో ఉన్న ఒక సామాన్య గృహిణిని పదేపదే దర్శించి నమస్క రించాల్సిన అవసరం ఏమున్నది? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో గ్రంధస్థమైన విషయాల్నే అమ్మ కూడా తిరగతోడుతూంటే, చిలుక పలుకుల్లా వల్లెవేస్తూంటే అనేక వ్యయప్రయాసలకోర్చి ఇంతదూరం రావటం ఎందుకు? పుస్తకాలు చదువుకుంటే చాలు కదా! ఎవరు ఉద్ఘాటించినా వాటిని మించిపోవటం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో వారికి అందినంతవరకు వారి మానసిక పరిపక్వత మేరకు విశ్లేషించి వివరించటమే కదా! చర్విత చర్వణం – చెప్పుకున్న విషయాలే పునరావృతం కావటం. యమ, నియమ…. యోగాలూ, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు; చిదాకాశం, ఘటాకాశం; దశవిధ నాదాలూ…. ఇవే కదా పడికట్టు పదాలు! ఇవే కదా చెప్పేది ఎవరైనా!!

అమ్మ వీటికి భిన్నంగా చెబుతోందని అనిపించేది. తొలి సందర్శన సమయంలో పొట్లకాయ తింటే పాముమంత్రం నిర్వీర్యమైపోయింది – అనే నా అంధ విశ్వాసాన్ని మూఢ నమ్మకాన్ని తుత్తునియలు చేసింది. ఆనాడే నాలో జ్ఞాన జ్యోతిని వెలిగించింది. నాకళ్ళు తెరిపించింది.

“ఏ వ్యక్తి అయినా సృష్టిలో ఒక విషయం లేదా వస్తువుని ఒకవైపే చూస్తాడు. రెండోవైపు చూడజాలడు. ప్రతి సందర్భంలోనూ రెండవవైపు ఉన్నది. అది తానే అని సత్యస్ఫూర్తి కలిగించింది. అందుకే నేను ఆకర్షితుడ నైనాను. అమ్మ చెప్పేది విరుద్దంగానే విపరీతంగానో నాకు అనిపించలేదు. సర్వసాధారణంగా దీపించే సత్యాన్నే అమ్మ దర్శింపజేస్తుంది. అది మనకళ్ళముందరే ఉన్నది- కానీ కానరాదు. అన్నిటికంటే విశేషము – అమ్మ అసాధారణ వ్యక్తిత్వం, ఆశ్చర్యకర వాత్సల్యం, నిరుపమాన సహనగుణం. ఆ మహిమాన్విత తత్వం నాకు అందేది కాదు. అసందర్భంగా  ఒకసారి అమ్మతో నా సంభాషణ ఇలా సాగింది.

నేను: అమ్మా! నీకు ఈ మహిమలు ఎక్కడి నుండి వచ్చినయ్?

అమ్మ: మహిమలు ఏమిటి నాన్నా! మహిమ అంటే ఏమిటి?

నేను: అణిమ, మహిమ, గరిమ…. అనే అష్టసిద్ధులు ఉన్నాయి కదమ్మా!

అమ్మ: అష్టసిద్ధులేమిటి? అసలు ‘సిద్ధి’ అంటే ఏమిటి?

నువ్వు ఏదైతే అనుకుంటావో దానిని సిద్ధింప జేసుకోవటం. అవి అష్ట- ఎనిమిది ఏమిటి? అష్టాదశ లేక అష్టసహస్ర ఎందుకు కాకూడదు?

నువ్వు ‘ఇది కావాలి’ అని అనుకోవటమే కదా! ‘ఇది కావాలి’ అని నువ్వు అనుకుంటే అది సిద్ధించటం. నువ్వు అనుకోబట్టే కదా! అవి అనుకోవటం ‘ఎనిమిది’ ఏమిటి? మనశ్శుద్ధే మనస్సిద్ధి. నిర్మలంగా, ఎలాంటి వికారాలు లేకుండా, నీ మనస్సు శుద్ధిపొందితే – అదేసిద్ధి. మనశ్శుద్ధి, వాక్సుద్ధి ఉంటేనువ్వు ఏమంటే అది జరుగుతోంది.మనస్సుని శుద్ధి చేసుకుంటే అదేసిద్ధి. అష్టములూ, నవములూ అంటూ ఏమీ లేదు నాన్నా!

ఇంకొకటి, నువ్వు ఏదో ‘మహత్తు’ అంటున్నావు. ‘మహత్తు’ అంటే ఏమిటో చెప్పు నాన్నా!

చూడు ఇప్పుడు నా చేతిలో ఏమీలేదు. ఇందులోకి ఏదో ఉసిరి కాయో, నేరేడు పండో, ఏదో వస్తువు వచ్చిందనుకో, అబ్బ! అమ్మ దగ్గర మహత్తు ఉన్నది. ఇదే కదా అనుకోవటం. లేని దానిని సృష్టించడం, అక్కడలేని వస్తువుని తెచ్చిపెట్టడం – అంతే కదా మహత్తు అంటే ? ఏం నాన్నా! అదికాదు.

నీకు చెట్టు ఎక్కటం చేతనవును. నాకు చేతకాదు. నువ్వు నాదృష్టిలో గొప్పవాడివి. నావద్దలేనిది నీలో ఏదో శక్తి 

ఉంది. 

నావలన కానిది నీకు సాధ్యమౌతోంది. నాకు అనిపిస్తుంది– వీడిదగ్గర ఏదో విశేషం ఉంది. ఒక్కపలుకుని చేతిలోకి తెప్పించావు అనుకో, అదేకదా మహత్తు. నేను చేయలేనిది నువ్వు చేశావు. అది నేనూ చేయగలను. నువ్వు చెయ్యగలిగినపుడు నేను ఎందుకు చేయలేను? కానీ తెలియదు.

ప్రతీదీ ప్రతీవాడూ చేయగలడు నాన్నా! కానీ కొందరే చేస్తున్నారు. ఆ కొందరే చేస్తుండబట్టి వాళ్ళు మహాత్ములని వీళ్ళు అనుకోవటం; వాళ్ళు మహాత్ములు కాబట్టి మహాత్మ్యం ఉంది అని అనుకోవటం. అంతే కానీ మహత్యాలు అంటూ ఏవీ లేవు. ప్రతివాడి దగ్గర ఉన్నదే అందరి దగ్గరా ఉంటుంది. సర్వం సాధారణమైనదే కానీ కొందరి దగ్గర విశేషంగా కనిపిస్తుంది, అనిపిస్తుంది. సర్వ సాధారణమైతే విశేషంగా అనిపించదు. సాధారణమైన అనిపిస్తుంది. నువ్వూ, నేనూ, వాడూ, వీడూ అందరూ చేయగలరు. అపుడు విశేషమేనేది ఉండదు. సాధారణమైపోతుంది.

అంతే నాన్నా! ఇందులో మహత్యాలు అంటూ ఏమీ లేవు. శక్తిని తెలుసుకోవటమే. తెలుసుకున్నవాడు తెలియని వానికి మహాత్మునిలా కనపడతాడు.

అనుభవసారం- పాటలప్రేరణ – వివరణ

  1. ‘ఎంత మంచిదానవోయమ్మా’ అనేది నా మొదటి పాట. దీనికి ది. 15-2-1956లో వ్రాశాను. ‘కన్నతల్లి’

అనే చలనచిత్రంలోని పాట, నేను ఈ పాట వ్రాయటానికి భూమిక. ఆ చిత్రంలో ఒకతల్లి తన కుమారుడు చేసిన హత్యానేరాన్ని తన మీద వేసుకుని ఉరికంబం ఎక్కటానికి బయలుదేరింది. పోలీసులు ఒక హంతకిరూపంలో ఉన్న ఆ త్యాగమూర్తిని ఒక జీపులో తీసుకు వెడుతూంటారు. ఆమె కొడుకులు ‘ఎంతమంచి దాన వోయమ్మా!’ అనే గీతాన్ని ఆలపిస్తూ గుండెలవిసేలా రోదిస్తూ ఆ జీపువెంబడి పడిలేస్తూ పరుగిడుతూంటారు. ఇదీ నేపద్యం.

‘అమ్మ తన (పిల్లల) కోసమే జీవిస్తున్నది’- అని ఎందుకో నాకు మొదటినుంచీ అనిపించేది. తన మాటలతో చేతలలో ‘ఆమెతల్లి – సృష్టి అంతా ఆమె సంతానం. సంతానం అంటే మనుష్యులు అనే కాదు. పశుపక్ష్యాదులూ స్థావర జంగమాదులతో సహా ‘ అనే భావన నాకు తొలినాటినుండీ నిండుగా ఉండేది. “నేనే మిమ్మల్నందరినీ కన్నాను, మీతల్లులకు పెంపుడిచ్చాను” అనే అమ్మ వాక్యం నాటికి వినరాలేదు. నేను ఒకపాట వ్రాయబోతున్నానని అమ్మకి గానీ ఎవరికీగానీ తెలియదు.

పాట వ్రాసిన తర్వాత అమ్మకి వినిపించాను.

‘నీదు హృదయమె నిండుకుండ

నీదు ఓరిమి భూమి ఓరిమి

నీకు నీవేసాటి తల్లీ

నీకు నీవే సాటితల్లీ….. ॥ ఎంతమంచి

దానవోయమ్మా ॥’ – అనే చరణం ఆ కవి అద్భుత రచనే. అనన్య సామాన్యరీతిలో ఘంటసాల గానం చేశారు. ఆ గీతాన్ని.

గారితెన్ను కానకాని,’ ‘పతిత మానవవ్యధాకలిత’ చరణాలు నాభావుకత, నా అనుభవసంజనితాలు. ఆ రోజుల్లో వచ్చీ పోయే వారిసంఖ్య పదిలేక పదిహేను. ఈ రోజున వచ్చే వందలు, వేల జనసమూహం నాడు లేదు. కానీ పతిత మానవ…. జాహ్నవీవె’ అని గానం చేయటంలో ఆ ఆర్తి, ప్రేరణ నాకు అమ్మదయే.

  1. ది 5-8-56 తేదీన ‘వెలలేని నీ గాధ’ అనే నారెండవ పాటను వ్రాశాను. అందులో…

‘జగమంత నీ రూపమై వెలుగులే

జగమంత అణురూపమై మెలగులే

అణురూపమౌ జగతి నీవేనులే….. ॥ వెలలేని నీ

గాధ॥’ – అనేది ఒక చరణం.

“ఆకాశమే అవకాశం” అన్నది అమ్మ. ‘ఆత్మనః ఆకాశః సంభూతః’ అంటుంది వేదం (పరమాత్మ నుంచి ఆకాశం ప్రభవించింది). ఈ విశ్వాంతరాళం లో అసంఖ్యాక నక్షత్రకుటుంబాలు, పాలపుంతలు అస్తిత్వానికి మనుగడకి 

ఆధారమై. ఆవిధంగా ఇముడ్చుకునేశక్తే అవకాశం, అదే ఆకాశం.

అమ్మ ఉండేది ఒక పూరిల్లు. ఇంటి పైకప్పు రంధ్రంలోంచి సూర్యరశ్మి ఒక కాంతి ప్రవాహంలా గోడమీద పడుతోంది. అందుసాధారణంగా మనకంటికి అగుపించని ధూళికణ సమూహాలు అసంఖ్యాకంగా కదులుతూ కనిపిస్తాయి. ఈ సృష్టిలోని గ్రహరాశులూ, గ్రహరాజుల సమిష్టిరూపం తనకు అట్లాకనిపిస్తోంది అని అమ్మ అన్నది.

ఆశ్చర్యం, అద్భుతం! నా పురాకృత పుణ్యఫలమూ, అమ్మ కృపావిశేషమూ! అమ్మ అవి వివరిస్తూన్నపుడు. ఆ విశ్వరూపసందర్శన భాగ్యం నాకూ కలిగింది. కేవలం ఒక శ్రోతగా మాత్రమే లేను. సృష్టి సర్వమూ అమ్మరూపంగా, ఆసృష్టిలో నేనూ ఒక భాగంగా ఉన్నాను. అమ్మ సృష్టి సర్వస్వాన్ని అవలోకిస్తున్నపుడు నేను అమ్మ ప్రక్కనే ఉండి, అమ్మ శరీరంలో ఒక భాగంగా ఉంటూ, ఒక ద్రష్టగా ఆ అనుభవ భాగ్యాన్ని పొందాను. యశోధాదేవి, అర్జునుడు కంటే నేనే అదృష్టవంతుణ్ణి. ఆ అలౌకిక దర్శన విశేషాన్ని మాటలలో వివరించటం సాధ్యంకాదు. నా పాటలోని అక్షరాల కూర్పూ, భావనా స్ఫురణా అమ్మ ప్రసాదమే.

‘అణురూపమౌ జగతి నీ వేనునులే’ అన్న సందర్భంగా ఒక విషయాన్ని వివరించాలి. అనంతసృష్టిగా ఉన్నసాకార దైవ స్వరూపాన్ని, సంకల్పరహితసంకల్పం అనీ, అణురూపంగా నిరాకారంగా ఉన్నదైవ స్వరూపాన్ని సత్సంకల్పం అనీ అంటారు. ఇవి ఒకదాని వెంబడి మరొకటి (చక్రవత్) చరించును.

ఈ సృష్టి పరిధి, పరిమాణం, ప్రభావం మనకు అందదు. ఒకచీమ, దోమ పనికి మాలినవి అని అనుకుంటాం. కానీ ప్రతీదీ ఏదో ఒకకార్యసాధనకి నిర్దేశించ బడినవే; మనకి తెలియక పోవచ్చు. కూపస్థ మండూకాల్లా ఉన్న మనజ్ఞానం ఎంత? దేదీప్యమానోజ్వల అమ్మ ఒక సందర్భంలో “ఏదీ సృష్టిలో వేస్ట్ అనేది లేదు” అన్నది. ఏది సార్థకమో, ఏది నిరర్థకమో మనం నిర్ధారించలేం. – మానవుని దృష్టి, ఆలోచన, అధ్యయనం ఏపాటివి?

-‘నీ మాట నామాట ఒకటేనులే’ – అన్నాను. అంటే అమ్మ చెప్పిందే, చూపిందే నేను వ్రాస్తున్నాను.

‘నీ మాటయౌ పాట పాడేనులే’ – అనటంలో అర్థం నాపాట అంటే అమ్మమాటే.

‘నీపాట లోకాన మ్రోగేనులే’ – అనేది నాస్వోత్కర్ష నా ఆకాంక్ష.

‘నీ మనసు నామనసు ఒకటేనులే’ – అంటే, నేను అమ్మ శరీరంలో ఒక భాగంగా ఉన్నాను కదా!

‘నీ గాధ జగమెల్ల చాటేనులే” – అన్నాను. కానీ అన్ని సంగతులు బయలు పెట్టలేను కదా! మానవనైజం రంధ్రాన్వేషణ, లోపాల్ని వెదకటం. అమ్మ సంస్థ లక్షలు కోట్లు వెనుకవేసుకున్నది కాదు. కానీ లక్షలమంది అమ్మ ప్రసాదంగా అక్కడ అన్నాలు తిన్నారు. తింటున్నారు. చితికిపోయిన అనేక కుటుంబాలను నిలబెట్టి జీవం పోసింది. అమ్మ. ఎలా వస్తున్నది. ఎలాభరిస్తున్నారు. అని ఆరాతీస్తారు. అమ్మ శరీర త్యాగం చేసిన నాటికి సంస్థలక్షల అప్పులో ఉన్నది- అనేది జగమెరుగని సత్యం. ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదో పెట్టుకోవాలనే తపనే అమ్మకి ఎప్పుడూ. అది అందరిల్లు, విశ్వకుటుంబం. ఏసంసారం అయినా గుప్పెడు మూస్తేనే, తెరిస్తే ఏముంటుంది? ఈనాటి సభ్యసమాజంలో అందరికీ అన్ని విషయాలు చాటి చెప్పాల్సిన అవసరం లేదు.

గజేంద్రమోక్షం, కుచేలోపాఖ్యానం, రుక్మిణీ కళ్యాణం, రామదాసు, సక్కుబాయి జీవితగాధలు…. వంటి ఆర్తత్రాణ పరాయణత్వలక్షణాంశాలు, అమ్మ కదలికల్లో కోకొల్లలు; అపి అమ్మ దినచర్యలో భాగాలే. అందలి ఏ ఒక్క లీలా. విభూతిని ఆకళింపు చేసుకున్నా చాలు. గంపెడు విషయాల్ని ఈచెవితో విధి ఆచెవితో వదిలి వేసేకుంటే,

అంతే కాదు. ఆధ్యాత్మికరహస్యాలు గుహ్యంగా ఉంచుకోదగ్గవి. నలుగురిలో నలుగురితో పంచుకోవటానికి వీలు లేనివి. అవి ఆయా భాగవతుల మదిలో నిధి నిక్షేపాలు వలె విరాజిల్లుతాయి. అవి అద్భుతం, అమూల్యం, మహిమాన్వితం, వ్యక్తిగతం అయిన అస్తి. వేరొకరి స్థాయికి అందకపోవటం వలన రుచికరంగా ఉండకపోవచ్చు.

– సశేషం.

సమర్పణ: శ్రీ రావూరి ప్రసాద్,

.శ్రీ ఎ.విఆర్. సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!