1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లో చూపు

లో చూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2013

(గత సంచిక తరువాయి)

  1. ‘పాడనా నాహృదయ వీణపై

నీ యశోగానలహరి సామగానంబులో” అనేది నా మూడవ పాట.

అందులో ‘నీకంకణ నిక్వణంబు – తెలుపు నాకు సందేశం 

మంజీరపు శింజితంబు- తీర్చునాదు సందేహం

నీ అనుభవ సందేశము- నూత్ననూత్న భావములతో ॥పాడనా॥ ప్రతి పదం అర్థవంతమైనది; పారమార్ధిక విలువల్ని పెంచి పోషిస్తుంది. అమ్మ అనుభవపూర్వకంగా అందించే సందేశం మానవ నవజీవన వేదమే. ఒక ఉదాహరణ.

ఒకనాటి రాత్రి ఏ సమయంలోనో అమ్మని తేలు కుట్టింది. ఉదయాన్నే యధావిధిగా లేచింది. స్నానం చేసి గృహకృత్యాలు చేసుకుంటోంది. మధ్యమధ్యలో కుడిచేతితో, ఎడమచేతికణుపుపై మెల్లగా రాస్తోంది. తెల్లటి శరీరం కదా ఆ కణుపు అంతా విషప్రభావం వలన నల్లగా కమిలిపోయి ఉంది. “ఏమిటమ్మా! అది?” అంటూ దగ్గర వెళ్ళి చూశాను. “నాన్నా! తేలు కుట్టింది.” అన్నది. తేలుకుట్టిన చోట కొండి చివరిభాగం చర్మంలోకి దిగబడి విరిగిపోయి అక్కడే ఉంది; దాన్ని మెల్లగా తీయాలి. అదీ వేలిని రుద్దటంలో అమ్మ చేసే ప్రయత్నం. బాధతో ‘అబ్బా! అమ్మా! బాబో! స్!’ అనే ఒక్క పలుకు గానీ, కనీసం ముఖ కవళికల్లో ఆ ఛాయగానీ లేదు. తేలు కుట్టినా, కుట్టనట్లే ఉన్నది. ఆ విషయం ఎవరికీ తెలియదు. అమ్మ ప్రతికదలిక ఒక సందేశాన్నిస్తుంది. ఒక సందేహాన్ని తీరుస్తుంది.

‘మంజీరపు శింజితంబు తీర్చునాడు సందేహం’- అన్నాను. అమ్మ నడయాడేది నేలమీద కాదు, వేదవీధులలో. ఆ పావన పాద మంజీర నాదము అనూహ్య అగ్రాహ్య సృష్టి రహస్యాల్ని ఛేదించి, సత్యాన్ని కళ్ళముందు సాక్షాత్కరింప జేస్తుంది. ‘తల్లి బుగ్గగిల్లి త్రాగించదా ఉగ్గు?’ అన్నట్లు లాలన, పాలన, పోషణ, రక్షణ, శిక్షణ…. అన్న ప్రసాదం, జ్ఞానప్రసారం, స్వస్వరూపాను సంధానం……. అన్నీ అమ్మ కర్తవ్యం, అమ్మధర్మం. అవసరమైతే బిడ్డని రెండుతన్ని అయినా దారిలోకి తెస్తుంది తల్లి. అమ్మ సుబ్బారావుని కందికట్టెతో ఒక్కదెబ్బ వేసింది ఒక్కసారే. అంతే. మరెప్పుడూ మరెవర్వరినీ కొట్టలేదు. తర్వాత “నాన్నా! ఇంతదెబ్బ కొట్టానా!” అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది ఆ మధుర వాత్సల్య పరీవాహం.

‘ప్రచండ ఝంఝూ నిలయమున – సైకత రేణువుల భంగి

నింగినంట తరంగాల -పొంగు పయోరాశి భంగి

నీ జీవిత సంక్షోభం- రాగతాళ భావములతో ॥పాడనా!॥’

చరణంలో పెనుతుఫానులో ఇసుకరేణువుల మాదిరిగా, ఆకాశమంత ఎత్తుకి ఉవ్వెత్తున లేచే పాలపొంగు మాదిరిగా నీ కల్లోలిత జీవితాన్ని గానం చేయనా- అని అన్నాను. అమ్మ అసిధార వ్రతాచార నిజ జీవితంలో బరువైన పాత్రలంటేనే ఇష్టం. అమ్మ విధానం మానవ సహజప్రవృత్తికి పూర్తిగ విభిన్నం. ఇతః పూర్వం ఏ జ్ఞానీ, ” ఏ ప్రవక్తా, ఏ అవతారమూర్తి ఈవిధంగా ప్రబోధించలేదు. సహనమనే దేవతను బాధలనే పూజాద్రవ్యాలతో ఆరాధించమన్నది.

అమ్మకి బాధితులే బంధువులు; పీడితులే ఆప్తులు; సంతప్తులే సఖులు. మహిమాన్విత మమకారాకృతి అమ్మ. దైవోపహతులను ఉద్ధరించటానికే ఊపిరి పీల్చింది. ఊపిరి విడిచింది. అమ్మ పయనించే ఈ మార్గంలో ఎన్నో అవరోధాలూ అడ్డంకులూ ఎదురయ్యాయి. స్వపరభేదం లేక అందరూ అమ్మను అపార్థం చేసికున్నవారే. ఫలితంగా ఎన్నో అనుమానాలు, అవమానాల పాలబడ్డది. ఈ వైపరీత్యాలు శరీరాన్ని హింసించాయి కానీ, మనస్సు మానస సరోవర నిశ్చల గంగాజలంలా శుద్ధస్ఫటికంలా భాసించేది. వాస్తవం ఏమంటే జగన్నాటకం ఏక పాత్రాభినయం కాదు. ఆయాపాత్రలను సృజించి తానూ ఒక పాత్రను ధరించి వచ్చింది. తాను విధించుకున్న నిర్ణయానికి తానూ కట్టుబడే ఉంది. కనుకనే అమ్మ ఎవరినీ నిందించదు, తృణీకరించదు. వారి గుణాలతో పాటు దోషాలను ఆప్యాయంగా గుండెల్లో దాచుకుంటుంది.

‘కుంభగత ప్రదీపకళిక- చందంబగు నీ హృదయము

రాగ ద్వేషాసూయల- పారద్రోలు అనసూయవు

అరుణారుణ, ఓ జోమయ- కరుణారస యశోగాధా.

॥పాడనా’

‘దీవ్యతే ఇతి దైవః(దైవం స్వయం ప్రకాశమాన మూర్తి)- అని నిర్వచించారు. ‘కుంభగత ప్రదీపకళిక’ అంటే కార్తీకమాసంలో కోవెలలో ధ్వజస్తంభంపై వెలుగొందే సహస్రఛిద్ర కార్తీకదీపం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ‘నానాఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభా భాస్వరం’ అని కీర్తించబడిన కార్తీకదీపమే అమ్మ హృదయం. ‘అరుణారుణ ఓ జోమయం’ అంటే ఆ సవితృతేజమే. అరుణ కాంతి ప్రభలు అంధకారాన్ని రూపు మాపుతాయి. అమ్మ అనురాగసంజనిత అనుగ్రహరోచిస్సులు రాగద్వేషా సూయలను పారద్రోలి అమృతత్వాన్ని ప్రసాదిస్తాయి. అదే అనసూయతత్త్వం.

24-8-56తేదీన ‘నా హృదయవీణా – ఆలాపనా’ అనే నాల్గవ పాటను వ్రాశాను.

‘దారి చూపు దీపికవై

దిక్కు చూపు ధృవతారవై

జగమందున అణువీవై

అణువు చేయు మహిమాన్విత కార్యాలాపనా

‘’నాహృదయ ‘’

అనేది ప్రధమ చరణం. ‘దారి చూపు దీపిక, దిక్కు చూపు ధృవతార’- అంటే పరమపదసోపాన అధిరోహణ ప్రస్థానానికి అమ్మ సద్గురువు. “చేతలు చేతుల్లో లేవు” అని అమ్మ సిద్ధాంతీకరించింది. ప్రేరణ కన్పించటంలేదు – ప్రయత్నం కనపడుతోంది అని విశదీకరించిన జ్ఞాన జ్యోతి అమ్మ. పురుషకారాన్ని విశ్వసించి కష్టనష్టాల్ని పాపఫలంగా స్వయంకృతాపరాధాలుగా ఎంచి అతలాకుతలమయ్యే మానసిక నరకయాతన నుంచి మానవాళిని వెలికి తీసి శాంతి సాగరంలో ఓలలాడించింది అమ్మ. అట్టి దిక్కు, దిక్సూచి, చుక్కాని, ధృవతార అమ్మ.

‘అణువు చేయు మహిమాన్విత కార్యాలాపనా – అన్నాను. ‘అణోరణీయాన్ మహతోమహీయన్’ అని వేదం దైవాన్ని ఒక విలక్షణ విశిష్ఠశైలితో స్తుతింస్తుంది; ‘ఆ పరాశక్తి అణువు కంటే చిన్నది, మహత్తు కంటె పెద్దది’ అని. అంటే పరోక్షంగా సర్వం అదేనని. సూర్యదేవుని కాంతిశక్తి, ఉష్ణశక్తులకు హేతువు పరమాణుకేంద్రక చర్యలని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు; అదే మహిమాన్వితకార్యం, విశ్వసంచాలక శక్తి లీలావిలాసం. సృష్టికర్త సంతానం (ఆత్మావై పుత్రనామాసి) గా పరిణమించిన ఈ అనంత విశ్వంలో ఏవస్తువూ ఏ కణమూ అల్పంకాదు. పదార్ధమూ శక్తి పరస్పరం పరిణామం చెందునని ఆవిష్కరించిన సూత్రం ఈ సత్యాన్నే విస్పష్టం చేస్తుంది.

‘ఈ సర్వం బ్రహ్మమనే

ఈ ఆత్మే బ్రహ్మమనే

ప్రజ్ఞానం బ్రహ్మమనే

ఆ బ్రహ్మవు నీవ యనే- ఆత్మావలోకనా

‘’నాహృదయ’’

అనే ఐదవ చరణం.

ఈ ఆత్మే బ్రహ్మ మనే (అయమాత్మా బ్రహ్మ అధర్వవేదం);

ప్రజ్ఞానం బ్రహ్మమనే (ప్రజ్ఞానం (బ్రహ్మ- ఋగ్వేదం),

ఆ బ్రహ్మవు నీవయనే (తత్త్వమసి – సామవేదం);

ఆత్మావలోకనా (అహంబ్రహ్మాస్మి – యజుర్వేదం)

ప్రబోధిస్తాయి. ఇవి నాలుగు మహోవాక్యాలు “చూస్తున్నదంతా నిజ స్వరూపమే” అని తేటతెల్లం చేసింది. అమ్మ; సర్వం ఖల్విదం బ్రహ్మ – అని. ఆత్మావలోకిని అమ్మ సత్స్వరూపాన్ని, సంపూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

‘పయోధర ప్రచండ ఘోష – ఝంఝూనిల షడ్జధ్వని

ప్రళయ జాజ్వల్య జ్వాల- కెదురీదిన నీ పవిత్ర చరిత్రాలాపనా’ – అనేది నాల్గవచరణం. ఒక సందర్భంలో 140 సెం. భయంకర ఉష్ణోగ్రత గల పొగాకు బేరన్ (అగ్నిగుండం)లో ఒకరాత్రి అంతా ఉండి, భరించి, ఎదురీదింది. అగ్నిలో పుటం వేసిన బంగారంలా నిగ్గుదేలింది. అది ముమ్మాటికీ మానవాతీత మహతత్త్వమే. అందుకు నేను సాక్ష్యం.

మన వేదనలే అమ్మకి మహానివేదన. బిడ్డల బాధల్ని తల్లి భరిస్తుంది; అది భారం అని కాదు- బాధ్యత అని.ఏ 

వెతల్ని- అగ్ని కీలల్ని చూసి మనం భయపడి పారిపోతామో వాటినీ అమ్మ ఆదరిస్తుంది, ఆశ్రయాన్నిస్తుంది, భరిస్తుంది; తన సంతానమేనంటూ లక్షణంగా లక్ష్యంతో చూస్తుంది. సర్వదా సర్వదా తనను తాను నిర్లక్ష్యం చేసుకుంటుంది.

11-11-56 తేదీన ‘హే అఖండ దివ్యజ్యోతి’ అనే నా ఐదవ పాటను వ్రాశాను.

ఈ సృష్టి సర్వం పంచభూతాత్మకమైనది. మన దేహమూ అంతే. ఈ సృష్టికి హేతుభూతమైన పంచభూతాలకీ అమ్మకీ తాదాత్మ్యం ఉన్నది; వాటికీ అమ్మకీ అభేదం. ఈ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని పంచభూత తత్వాల్ని అమ్మకి 

అన్వయిస్తూ ఈ పాట, తదితర పాటలూ వ్రాశాను. అమ్మ “అన్నది.”

పాదాలు – అగ్నితత్త్వము,

పొట్ట- వాయుతత్త్వము,

తల- పృధివీతత్వము,

చక్షువులు – జలతత్వము

శరీరమంతా– ఆకాశతత్వము”  – అని. “కోటి కోటి దీపికలకు, వెలుగుదివ్వెనీవె”- అన్నాను.

సకలజీవులలో ‘నేను’, ‘నేను’ అని ప్రకాశించే అసంఖ్యాక ఆత్మ జ్యోతులను ప్రజ్వలింపజేసే స్వయంప్రకాశమాన దివ్యజ్యోతి అమ్మ.

‘అఖండ దివ్యజ్యోతి’ అంటే ఆత్యంతాలు లేని అక్షర పరబ్రహ్మరూపం, జ్యోతి స్వరూపం. దీనినే వేదం ‘సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ’ అని నిర్వచించింది. ఆ నిత్యసత్య సద్వస్తువే అమ్మ; దేశకాలమాన అవస్థలకు అతీతమైన

దివ్యశక్తి.

పంచభూతాలు అంటే పృధి వ్యాప స్తే జో వాయురా కాశములు. వాటి ధర్మాలు శబ్ద స్పర్శ రూపరసగంధాలు. పృధివీతత్వం – గంధం; జలతత్వం – రసం, అగ్నితత్వం – రూపం, వాయుతత్వం స్పర్శ; ఆకాశతత్వం- శబ్దం. “పంచభూత గుణాతీతమౌ – పరతత్త్వమగు ఆనందమీవే”— అంటే పాంచభూతికమైన శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మనే కోశాలు ఉన్నాయి. వీటికి అతీతంగా ఆనందమయ కోశంలో దైవం ప్రకాశిస్తూంటాడు. “ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్” – ఆ ఆనందస్వరూపమే బ్రహ్మ- అమ్మ.

సృష్టిలో అడుగడుగునా అణువణువునా ద్వంద్వాలు కనిపిస్తాయి. అదేవిధంగా పంచభూతాల్లోనూ:

సముత్తుంగ సాగరతరంగం (ఉప్పెన) – శాంతి సాగర కెరటం;

భీకరవహ్ని(దావానలం) – దారిజూపే కాంతిరేఖ;

విధ్వంసకర పెనుతుఫాను – మందమలయానిలం;

పుష్కలావర్తక మేఘాలు- నిర్మలాకాశము… రెండూ బ్రహ్మే; ఆ ఒక్కటే.

– సశేషం.

సమర్పణ : శ్రీ రావూరి ప్రసాద్,

శ్రీ ఎ.విఆర్. సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!