(గత సంచిక తరువాయి)
- 11-11-56 తేదిన ‘ఏకాకినై నిదురచెందేనా” అనే నా అరవపాటను వ్రాసాను.
పద్యాలకి ఛందస్సు, యతి ప్రాసలు ఉంటాయి. చంపకమాల పద్యానికి ‘న-జ-భ-జ-జ-జ-ర’ గణ విభజన, 11వ అక్షరంయతి, రెండవ అక్షరం ప్రాస.. అట్లా. ఈ ఛందస్సు, సూత్రాలు పాటల కేమి ఉంటాయిలే అని అనుకునేవాడ్ని. కానీ కరుణశ్రీగారి పాటలు, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి సినిమా పాటలు వింటుంటే అంత స్పష్టంగా కాకపోయినా దానికీ ఒక మీటర్, రాగ తాళాలకి అనుకూల్యత ఉంటాయి అని పించింది. ఈ సంగతి దృష్టిలో పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఒక మంచి పాట వినవస్తే, ముందుగా పల్లవి ఆ ట్యూన్ వ్రాసేవాడిని. ఆ పాటకి ఆధారం ఆ ట్యూన్. తర్వాత దానికి ఏరాగం అయినా పెట్టుకోవచ్చు. దీనిని ట్యూన్ స్టోన్ (గీటురాయి) మెథోడ్ అని అనవచ్చు. బంగారం వన్నెను పరీక్షించడానికి ఆ రాయిమీద ముందుగా మేలిమి బంగారం గీత గీసి, దాని -ప్రక్కన ఒక ఆభరణం గీత పెట్టి పోలిస్తే దాని నిగ్గుతేలుతుంది. ఒక ఉదాహరణ.
శ్రీ ఎం.ఎస్. రామారావుగారు తాజ్మహల్ మీద ‘ ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం…’ అంటూ ఒక పాట వ్రాశారు. చాలా శ్రావ్యంగా మనోరంజకంగా ఉంటుంది ఆ ట్యూన్. అదే బాణిలో అమ్మపై ‘నీ నిర్మల నిశ్చల విశాల హృదయంలో ఏకాకినై నిదుర చెందేనా”- అనే పల్లవిని సమకూర్చు కున్నాను. చరణాల నడక, పొందికలో మార్పు ఉంటుంది. రాగ తాళపరంగా కాస్త అటూ ఇటూ ఉండొచ్చు; మరినాకు ఆ ఛందస్సు నియమాల జ్ఞానం లేదు. ఆ కవి పంధాలోనే పోతున్నపుడు ఒకచో భావసాదృశ్యం కూడా ఉంటుంది. ఆయన ‘ఏకాంత’ అని అంటే నేను ‘ఏకాకినై’ అని వ్రాశాను. భగవంతుడు ఒక్కడే ‘ఏకాకి’. ‘సకః’-వాడు ఒక్కడే; అద్వితీయుడు అని నిర్వచించింది వేదం.
‘నీకాంతి పుంజములు
లోకాల వెలుగివ్వ
అజ్ఞానమను జ్ఞానదీపికను చేబట్టి
ఈ నిర్గమ నిశీధితిమిరంలో
ఏకాకినై బాట వెదికేనా ||నీ నిర్మల||’
అనే చరణంలో ఒక చమత్కారం ఉంది.
‘అధాతో బ్రహ్మ జిజ్ఞాసా’- అనేది మొదటి బ్రహ్మసూత్రం.
ఒక అర్హత ఉన్నవానికే బ్రహ్మవిద్యను ఉపదేశించాలనేది కొందరి అభిప్రాయం. ‘అధ’ మరియు ‘ఓంకార’ పదాలు కవలపిల్లలు; ఒకేసారి బ్రహ్మదేవుని ముఖతః వెలువడ్డాయి; ఒక శుభారంభానికి నాంది. జిజ్ఞాస ఉన్నవానికి బ్రహ్మవిద్యను ఉపదేశించవచ్చు (జిజ్ఞాసే అర్హత) అనేది కొందరి అభిమతం. ఈ సత్యాన్నే “ముముక్షుత్వమే మోక్షం” అని అమ్మ స్పష్టీకరించింది. బ్రహ్మజ్ఞానం పొందాలనే తృష్ణ నిన్నలేదు; ఇవాళ కలిగింది. ఏశక్తి అయితే నీకు ఆ ప్రేరణ కలిగించిందో, అదే తరుణం వచ్చినప్పుడు గమ్యాన్ని చేరుస్తుందని అమ్మ వివరిస్తుంది. ఆ కాంతిపుంజములు – ఆ జ్ఞానప్రకాశం లోకాలకు వెలుగునిస్తోంది; మూడవ కన్నును తెరిపిస్తోంది.
కానీ నేను అజ్ఞానమనే జ్ఞానదీపిక (Torch Light) ను తీసికొని గాఢాంధకారంలో ఏకాకినై బాట వెదుకు తున్నాను. ‘ఏకస్తపః’ – తపస్సు చేసుకునేటప్పుడు ఒక్కడే ఉండాలి. అట్టి నిర్మల నిశ్చల విశాల హృదయంలో జగన్మాత అమ్మ సుప్రతిష్ఠితయై విరాజిల్లుతుంది.
అమ్మ జ్ఞానరోచిస్సులను కరుణతో వెదజల్లుతూంటే, నేను అజ్ఞానదీపికతో తత్త్వ చింతన చేస్తున్నాను అనే భావన ఆశ్చర్యకరం అసందర్భం అనిపించవచ్చు. వాస్తవాన్ని మనవిచేస్తా. అజ్ఞానమే జ్ఞానానికి ఆధారం. అమ్మ జ్ఞానామృతాన్ని ధారపోయటానికి నావద్దకు వచ్చినప్పుడు నా మనస్సు అనే పాత్రను ఖాళీగా ఉంచుకోవాలి ముందుగా. నాకేమీ తెలియదు అనే ప్రపత్తి ఆరూఢతతో ఉండాలి. మిడిమిడి జ్ఞానంతో గర్వాంధుడనైతే నాహృదయాన్ని అమ్మ ఏపదార్థంతో నింపగలదు ?
‘నీయశోచంద్రికల
చాటు మాటున నున్న
హృదయ విదారక కష్టగాధలను తలపోసి
ఈ నీరస వ్యధాకలిత హృదయంతో
ఏకాకినై బ్రతుకు గడిపేనా ॥నీ నిర్మల॥’ – అనేది పాటలో రెండవ చరణం. అమ్మని ‘బాధల భగవంతుడని కొందరు తలపోస్తారు. అంటే ఆపదల్లో చేయూత నిచ్చి ఉద్ధరించే ఆపద్భాంధవి అని. కానీ స్వవిషయానికి వస్తే అమ్మ అందుకు భిన్నంగా ఉంటుంది. అమ్మకి కన్నీళ్ళు కొత్త కాదు; “నాకు కన్నీళ్ళే లేకపోతే మీకు త్రాగటానికి నీళ్ళు ఉండవు” అన్నది ఒక సందర్భంగా. మన కనువిప్పు కోసమే; విశ్వశ్రేయః కామనతో కన్నబిడ్డను స్వహస్తాలతో ఆలయ ప్రవేశం చేయించింది; తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది. అది చరిత్ర ఎరుగని త్యాగం. ఆ హృదయవిదారక గాథ – కోత వర్ణనాతీతం.
వేదనా సంతప్త హృదయాలు తరచుగా ‘దేవుని కేం హాయిగ ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు’ అని నిందారోపణ చేయడం, నిష్ఠుర వచనాలాడటం సహజం. కానీ ద్విమాతృప్రేమైక రసామృత మూర్తి అమ్మని మాత్రం ఎవ్వరూ ఎట్టిస్థితి లోనూ అలా అపార్థం చేసికోకూడదు. అలాచేస్తే అది మహాపరాధం, మహాపాతకం. అందుకు కారణాన్ని సోదాహరణంగా వివరిస్తాను.
అది ఒక వర్షాకాల సాయం సమయం. కరెంటు లేదు. పెట్రొమాక్సైట్ చుట్టూ వేలాది రెక్కపురుగులు వచ్చిచేరి అదేదో కాయో ఫలమో అని భ్రమించి రెక్కలు తెగి శరీరాలు మాడి ఫలితంగా రాలిపోయిన వాటి మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి.
అతఃపూర్వం కృష్ణాజిల్లా హంసలదీవి ప్రాంతంలో నడిరేయి ఉప్పెన వచ్చింది. ఆ కాళరాత్రి అసంఖ్యాకులు నిస్సహాయంగా నిర్దయగా సాగర గర్భంలోకి కొట్టుకుపోయారు. ఎంతో జననష్టం ప్రాణనష్టం జరిగింది. ఆప్తులను కోల్పోయి ఎందరో అనాధలుగా జీవచ్ఛవాలుగా. మిగిలారు. ఈ దారుణ ప్రకృతి వైపరీత్యాన్ని తలచుకొని ఒక సోదరుడు తన ఆవేదను వ్యక్తం చేశాడు.
అందుకు అమ్మ, “నిజమే, నాన్నా! అక్కడా ఇక్కడా వేలాది మూగజీవులు క్రిములు, కీటకాలు ఎన్నో అంతరించి పోయాయి. మనుషుల గురించి పడినంతగా వాటిని గురించి మనం బాధపడుతున్నామా ?” అన్నది. అసలైన అమ్మ కాబట్టి సిసలైన జీవకారుణ్య లక్షణాన్ని బోధపరిచింది. మానవ దృష్టిలో అవి అల్పప్రాణులు. యదార్ధాన్ని బోధపరిచింది. మానవ దృష్టి అల్పమైనది. అమ్మ హృదయంలో వాటి స్థానం ధృవుడూ, మార్కండేయుడూ, ప్రహ్లాదుడు వంటి భాగవతోత్తముల సరసనే. అవి ఉన్నా, పోయినా పట్టించుకునే వాళ్ళులేరు. అనల్పమైన అమ్మగాథని హృదయబాధని అర్థంచేసుకునే వాళ్ళూ లేరు. వీడు పతితుడు – వీడు పావనుడు అనీ;వీడు చరిత్రకారుడు వీడు చరిత్ర హీనుడు అనే బేధం మనకి. లోపాల్ని వెదకటం మానవ ప్రవృత్తి; లోపాల్ని ఎంచకపోవటం అమ్మ సహజాత లక్షణం.
- 10-11-56 తేదీన అమ్మా ! అమ్మా ! అద్వైతమూర్తీ!” అనే నా ఏడవ పాటను వ్రాశాను.
హృదయాల వెలిగించు జ్యోతి
హృదయాల వెలుగొందు జ్యోతీ – అన్నాను పల్లవిలో.
‘తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః ! మన హృదయ కుహరాల్లో వెలుగొందే పరమాత్మ అమ్మ. అన్ని హృదయాల్లో వేవేల జ్ఞానదీపాలను వెలిగించేదీ అమ్మే. వెలుగుతున్న దీపమే అనేక ఇతర దీపాలను వెలిగించగలదు.కనుకనే దేవతార్చన లేక ఒక వ్రతాచరణకి ముందుగా దీపారాధన చేస్తాం. జ్యోతి స్వరూపంగ ఆ పరాశక్తిని ధ్యానిస్తాం, ఆవాహన చేస్తాం, ఆరాధిస్తాం.
‘నీవేనీవే జగమందు ప్రగతి
జగమంత నీవౌచు కలిగించుసుగతి |॥ అమ్మా॥’- అని అన్నాను.
మోక్షము, కైవల్యము, నిశ్రేయసము… జన్మకర్మ బంధాలను త్రెంచుకుని దానిని పొందటం కష్టతమం అని సంప్రదాయ వేదాంతం బోధిస్తుంది. ఈ ప్రవచనం యుగాలుగా తరాలుగా సకల జీవాళి మనసుల్ని బాధిస్తోంది. ఆ లక్ష్యం ఎన్నటికో ఎప్పటికో కానీ పొందరానిది అనే నైరాశ్యభావంతో కృంగదీస్తోంది. ఈ నేపధ్యంలో “అందరికీ సుగతే” అని బేషరతుగా ఒకవరాన్ని అయాచితంగా అనుగ్రహించింది అమ్మ. ఎవరైనా వచ్చిన చోటుకి పోకతప్పదు. ఎవరికైనా సుగతే అంటే – లక్ష్యం, గమ్యం ఆ ఒక్కటే. అదే అమ్మ – అని.
‘నీవే నీవే నీవే చిచ్ఛక్తి
నీలోని ‘నేనే’ ను నీ ఆత్మక్తి పరమాత్మ శక్తి
నాకంబు నాకేల వసుధైకమూర్తి “అమ్మా” – అనేది
రెండవ చరణం. అన్నిరూపాల్లో, అన్ని ప్రాణుల్లో ప్రకాశించేశక్తి ‘చిచ్ఛక్తి’. ‘నీవే నీవే నీవే’ అని ముమ్మారు నొక్కి వక్కాణించటంలో ఆ చిచ్చక్తి రూపిణి ‘అమ్మే’ అని.
అమ్మను ‘వసుధైకమూర్తీ’ అని సంబోధించాను. సహనంలోను, గాంభీర్యంలోను, వరదానలక్షణ పరంగాను అమ్మను అనేకసార్లు భూమాతతో పోల్చాను. మన శరీరం నిలబడటానికి అత్యావశ్యకమైన గాలి, నీరు, ఆహారం…. ఇంకా సకల వస్తుసంపద… సర్వం భూమాత అనుగ్రహమే.
‘నీలోని ‘నేనే’ ను నీ ఆత్మ శక్తి పరమాత్మ శక్తి’ – అన్నాను.
అమ్మ, “నేను నేనైన నేను” అన్నది. “ ‘ అన్నారు.
ప్రతిదాంట్లో ఒక ‘నేను’ అన్నది. ప్రతివారికి ‘నేను’ అనేది ఒకటే. అదికాక మిగిలినవన్నీ ‘నువ్వు’లే. ఎవరికి
వారికి ‘నేను’ ఒక్కటే. ‘నువ్వు’ కూడా ఒక ‘నేనే’. నాకు,నీకు, అతనికి, దానికి, ఆమెకి… ‘నేను’, ‘నేను’లు ఉన్నాయి. మూలానికి వెడితే ఈ ‘నేను’, ‘నేను’… లు అన్నిటిని కలిపితే – అదీ అమ్మ అనే ‘నేను’ (పరమాత్మ శక్తి).
నీలోని ‘నేనే’ ను నీ ఆత్మశక్తి పరమాత్మ శక్తి. నీలోని ‘నేనే’ను అంటే రాజు అని కాదు అక్కడ; అన్ని నేనులూ తానైన నేను అమ్మ. నేను + నేను + నేను + నేను +… = అమ్మ .
మనందరం మేను (శరీరం) నేనైన నేనులం. ఈ దేహమే ఆత్మ అనే భావంతో ఉంటాం; అది ‘అహంబ్రహ్మాస్మి’ అనే ఆత్మసాక్షాత్కారానికి దర్పణం పట్టదు; అది అహంకారబ్రహ్మను తెలియజేస్తుంది.
నిత్య అనిత్యవస్తు వివేకీ
సత్యంబు గానీవు – నీవే – ఏ కాకీ
నిత్యంపు సత్యంపు ఆత్మావలోకీ ॥ అమ్మా॥ – అనేది మూడవ చరణం.
‘ఇది నిత్యము – ఇది అ ని త్యము; ఇది క్షణికం ఇది శాశ్వతము; ఇది జడము ఇది చైతన్యము; ఇది అల్పము ఇది అనల్పము; ఇది కనిపించేది. | ఇది కనిపించనది; ఇది జీవము – ఇది నిర్జీవము…’ అంటూ సంప్రదాయవేదాంతం ఒక విభజన చేసింది. ఈ విభజన ని అమ్మ నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చింది. అమ్మ ప్రవచనం సెన్సుతో కూడిన సైన్సు.
అంతా చైతన్యమే – సజీవమే; జడమేమీ లేదు,
కనిపించేదంతా నిజస్వరూపమే,
సృష్టికిపరిణామమే కానీ నాశనం లేదు,
కనిపించేదంతా (ఆశక్తే) అదే అయినపుడు కన్నులు మూసుకోవడం ఎందుకు ?, సృస్టే దైవం,
పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటారేమి ? పిపీలిక బ్రహ్మకాకపోతే కదా !… అని విస్పష్టంగా చాటింది పలువిధాలుగా.
అమ్మ అంటే సంపూర్ణత్వం.
అమ్మ అందరికీ, అంతటికీ అమ్మ. ఏచోటా అమ్మకి లోపం కనిపించదు. అందరి అభిమతాలూ, అన్నిమతాలూ
అమ్మకి నచ్చుతాయి; తాను దేనికీ నొచ్చుకోదు.
ఇతఃపూర్వం ఉటంకించిన సంప్రదాయ భావనని ‘నేతిమార్గం’ అని అంటారు. ఇదికాదు, ఇదికాదు. నేను, నేను అనిపించేది అసలు ఏమిటి ? అనే విచికిత్సను చేసుకోవాలని అంటారు.
‘ఈ జ్ఞానేంద్రియములు ‘నేను’ కాదు, ఈ కర్మేంద్రియములు ‘నేను’ కాదు, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం. నేనుకాదు అంటూ సాగమని ఉద్భోధిస్తారు.
అమ్మ ఈ మార్గాన్ని వెనకేసుకువస్తూ, సమర్థిస్తూ, “అలా పోగా, పోగా చివరకు అంతా ‘నేనే’ అని అనిపిస్తుంది. తననితాను తెలుసుకున్ననాడు సర్వాన్నీ తెలుసు కుంటాడు” అని అన్నది. అమ్మ సత్యస్వరూపిణి. ‘సత్యం – జ్ఞానం – అనంతం’ అయిన బ్రహ్మ తత్వాన్ని అలతి అలతి పదాలతో నిర్వచించింది. అలా ఆత్మావలోకనం చేసిన అమ్మ – ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కనుకనే ‘బ్రహ్మసత్యం – జగన్నిధ్య అని అంటే,
“మిధ్యఏమీ లేదు, నాన్నా! అంతా సత్యమే” అన్నది. అమ్మ సూనృత వాక్యాలు బోధపడాలంటే కావలసినది శాస్త్రజన్య జ్ఞానం (Book learned skill) కాదు; దైవానుగ్రహం. ‘ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసనా’ – అన్నారు శంకరులు. నా దృష్టిలో అమ్మయే సత్యం; బ్రహ్మయే మిధ్య.
– సశేషం
సమర్పణ : శ్రీ రావూరి ప్రసాద్,
శ్రీ ఎ.విఆర్. సుబ్రహ్మణ్యం