1. Home
  2. Articles
  3. Viswajanani
  4. లో చూపు

లో చూపు

Mannava Bucchiraju Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : August
Issue Number : 1
Year : 2012

తొలి రోజుల్లో 1954 నుంచీ తరచు అమ్మను దర్శించుకున్న భాగ్యశాలి శ్రీమన్నవ బుచ్చిరాజు శర్మ వారు వేదవాక్కు `రాజుబావ’ గా అందరికీ సుపరిచితులే. అమ్మ వారిని ‘రాజా’ అని ముద్దుగా పిలిచేది. అలనాటి నుండీ అమ్మను సేవించుకోవటం వారి పురాకృత పుణ్యఫలం,

‘అనుభవసారం’ అనే గీతమాలిక, పావన పరిమళ -సంగీత సాహిత్య సుమమాల, కవితాపరంగా మాత్రమే కాదు; అమ్మ అనుభవసారం, అమ్మ సాహిత్యపరంగా ఆదికవి, నాగేయకారులు శ్రీ రాజు బావ, అమ్మ అమృత హస్తాలతో చేసిన తొలి వివాహశుభకార్యం  రాజు బావగారిచే ఆ సన్నివేశం శ్రీనివాసుడు స్వయంగా అన్నమా చార్యుల కళ్యాణాన్ని జరిపించిన వైనాన్ని తప్పక గుర్తుకు తెస్తుంది. అంతేకాదు. అమ్మ సమక్షంలో తొలిసారిగా, తుది గానామృతాన్ని నివేదన చేసిందీ రాజు బావగారే.

అమ్మ అనుభవసారాలు ఆప్తవాక్యాలు. వాటిని తోడబుట్టిన వారితో పంచుకోవడం, భావితరాల వారికోసం భద్రపరచటం తన కర్తవ్యాంగా ఎంచివారు ముందుకు వచ్చారు. వాటిని సోదరులు శ్రీ రావూరి ప్రసాద్ రికార్డు చేయగా, శ్రీ ఎ.వి. ఆర్. సుబ్రహ్మణ్యం అక్షర బద్ధం చేశారు. ఈవిధంగా రాజు బావగారి స్వార్థిత ఆధ్యాత్మిక జ్ఞానసంపదని అనుభవ విశేషాన్ని ధారావాహికంగా ప్రచురించడం ఎంతో ఆనందదాయకం.

“ఉన్నది ఉన్నట్టుగా కనడమే లో చూపు” అన్నది అమ్మ. అదే ఉపనయన (మూడవ కన్ను) దృష్టిజ్ఞానం దివ్యదృష్టి ఇక అవధరించండి. -సంపాదకులు)

1923 లో అమ్మ అవనీస్థలిపై అవతరించింది. తన బాల్యం నుంచీ అసంఖ్యాకులకు ఎన్నో దర్శనాలనూ నిదర్శనాలనూ ప్రసాదించింది. అయాచితంగా ఎందరో బాధితుల్ని ఆదుకున్నది; పీడితులకు స్వయంగా సేవలను అందించింది. మే దివ్యం’ అన్నట్లు ప్రేమైక స్వరూపిణి అమ్మ ప్రతికదలిక ఒక సందేశం, ప్రతిపలుకు  వేదం వాక్కు. 

అమ్మ చెప్పేది వేదం, చేసేది ధర్మం. అమ్మ వేదం, చేసేది ధర్మం. అమ్మ ఏ  విద్యాభ్యాసము, ఏ సాధనా చేయలేదు, పుట్టుకతోక అద్వైతత్త్వామృత రసాధి దేవత. కాగా 33 ఏళ్ళ తర్వాత అంటే 1956 తర్వాతే విస్తృతంగా తెలియబడటానికి అమ్మ అంగీకరించింది. ఆరోజుల్లో జిల్లెళ్ళమూడి ఒక కుగ్రామం దారీ, దొంకాలేదు; చేను గట్ల వెంబటి రావాలి. వర్షాకాలం అయితే బురదలో, వాగుల్లో దిగి రావాల్సిందే. అమ్మ ఉండేది. పూరిల్లు నేటి సౌకర్యాలేవీ లేవునాడు. ఆరోజుల్లో జిల్లెళ్ళమూడి వచ్చేవారి సంఖ్య బాగా తక్కువే.

వంట వార్పూ చేసుకుంటూ, గృహకృత్యాలు లౌకిక పారమార్ధిక భేదం లేక చరిత్ర ఎరుగని సార్వత్రిక సత్యాలను నాకు ఉగ్గుపాలతో రంగరించి పోసింది. అంటే పసిపిల్ల వానిగా అమ్మ పెంచింది. ఇక్కడ విశేషము.. ఆశ్చర్యకరమూ ఏమంటే అమ్మ ప్రప్రధమంగా స్వీయ అనుభవాన్ని వివరించే సమయంలో అసంఘటనల్లో కూడా ఒక పాత్రధారిగా ప్రత్యక్షసాక్షిగా ఉంచుకుంటూ అమ్మ అనుభవాన్ని నా అనుభవాలుగా పొందాను.

  1. తొలిసారి అమ్మదర్శనం:

1954 సం॥ము జూన్ నెలలో మొదటిసారిగా అమ్మను చూశాను. అపుడు నా వయస్సు 23 సం… కంటే 9 ఏండ్లు పిన్నవాణ్ణి. కొమ్మూరులో మా మామగారు శ్రీ గంగరాజు లోకనాధం గారింట్లో ఉంటూ ఐ.యల్.టి.డి. కంపెనీలో సీజనల్ చేస్తూండేవాడిని. జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మ కుంకుమ పొట్లాల ప్రసాదాన్ని తెమ్మని మా మామగారు కోరిన మీదట నేను జిల్లెళ్ళమూడి బయలుదేరాను. చల్లగా సన్నని తుంపర పడుతోంది. బాపట్ల – పెదనందిపాడు రోడ్డులో 7వ మైలు దగ్గర బస్సు దిగాను. నాడు జిల్లెళ్ళమూడికి రోడ్డు సౌకర్యం లేదు. చేలగట్లపై

నడుచుకుంటూ వెళ్ళాను. అమ్మ ఉండేది ఒక పూరిల్లు.

లోపల హాలులో బోషాణం ప్రక్కన కూర్చొని అమ్మ పొట్లకాయ తరుగుతున్నది. ‘కొమ్మూరు నుంచి వచ్చాను. లోకనాధం గారి మేనల్లుడ్ని. మిమ్మల్ని అడిగి కుంకుమ పొట్లాలు తెమ్మన్నారు. మీరు ఇస్తే తీసికొని నేను వెడతాను’ అన్నాను. అమ్మ ఏమీ మాట్లాడలేదు.

అక్కడ ఒక పడక కుర్చీ ఉంది. కూర్చోమని సైగ చేసింది. ఆ ప్రక్కన 3/4 వడ్ల బస్తాలున్నాయి. వాటిపై ఒక పుస్తకం ఉన్నది. అమ్మ పొట్లకాయ తరుగుతూ నాలుగ ముక్కలు గిన్నెలో, రెండు ముక్కలు నోట్లో వేసుకుంటోంది. 

అమ్మ నన్ను చూస్తూ, “నాన్నా! నేను వంట చేసి వస్తాను. నువ్వు ఈ లోపల ఈ పుస్తకం చదువుతూ కూర్చో” అన్నది. అది భీమవరం, చింతలపాటి సీతారామాంజనేయ వరప్రసాదమూర్తి రాజు, వారి ప్రకృతి వైద్యం గురించి. కాలక్షేపం కోసం మొత్తం పుస్తకం చదివా. అరగంటలో అమ్మ వచ్చింది. “నాన్నా! కాళ్ళు కడుగుకొనిరా. అన్నం తిందువుగాని” అన్నది. ఆ కొద్ది సమయంలో అమ్మ ఎలా వంట చేసిందో ఏమో నాకు తెలియదు. నాకసలు వేరే ఇంట్లో అన్నం తినటం కష్టంగా ఉంటుంది. ప్రక్కనే ఉన్న చెక్క పెట్టెలోంచి నెయ్యి తీసింది, విస్తరి వేసి, పీట వేసి అన్నం పెట్టింది. పొట్లకాయ కూర, కమ్మ సున్ని, కందిపచ్చడి, చారు, గారెలు ఇవీ పదార్థాలు. ‘అమ్మా ! నేను పొట్లకాయ కూర తినను’ అన్నాను. “ఏం, నాన్నా! ఏమిటి? సహించదా ? ఎందుకు తినవు?” అని అడిగింది. ‘సహించక కాదమ్మా. లోగడ తినేవాణ్ణి. ఈ మధ్య పాము మంత్రం నేర్చుకున్నాను. అది తిన వద్దన్నారు. నిషిద్ధం అన్నాను. “దానికీ దీనికీ సంబంధం ఏమీ లేదు, నాన్నా! పొట్లకాయ కూర తింటేరక్తవృద్ధి, రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది, తిను, నాన్నా!” అన్నది. మా మధ్య తదుపరి సంభాషణ ఇలా నడిచింది.

నేను : నిషిద్ధం కదా, అమ్మా !

అమ్మ : నువ్వు పాము మంత్రం బాగా జపిస్తున్నావా? ఎవరికైనా వేసావా ?

నేను: లేదమ్మా. ఇంతమటుకు ఎవరికి వేయలేదు. 

అమ్మ : అది ఏమైనా సిద్ధిపొందిందా ?

నేను : తెలియదమ్మా, నాకు. నేనెవరికీ వేయలేదు. జపిస్తున్నాను. అంతే.

అమ్మ : పొట్లకాయ తింటే ఏమౌతుంది ?

నేను : తింటే అది పనిచెయ్యదుట.

అమ్మ : దానికీ దీనికి సంబంధం ఏమిటి? 

నేను : తెలియదమ్మా. బహుశః ఇది పాములా పొడుగ్గా ఉంటుంది, చారలుంటాయి. అంతకంటే నాకు తెలియదు.

అమ్మ : చూడు, నాన్నా! నువ్వు నిరంతరం జపం చేస్తున్నావు. దీక్షగా చేస్తున్నావు. ఇది పొట్లకాయ. కోసి వండేశాం. వండిన ఈ కూర తినటం వల్ల నువ్వు ఇన్నాళ్ళ నుంచి దీక్షగా చేసిన ఆ మంత్రం నిర్వీర్యం అవుతుందనే కదా నీ ఉద్దేశం. అట్లాంటి పరిస్థితిలో అంతశక్తి ఈ పొట్లకాయకి ఉండేట్లయితే ఆ మంత్రం కంటే ఇదే గొప్పది. దాన్ని వదిలేసి ఈ పొట్లకాయ జపం చెయ్యి, నాన్నా ! దానికంటే ఇదే శక్తి వంతమైనది.

(అమ్మ మాటలకి నేను నిర్ఘాంతపోయాను. నిశ్చేష్ఠుడనైపోయినా.)

అమ్మ: నాన్నా! ఒక వేళ మంత్రం పనిచేయక పోయిందనుకో పోనియ్యి. పొట్లకాయకి చింతకాయని పనిచేయని మంత్రాలు మనకి వద్దు నాన్నా! దానికంటే ఇదే మంచిది. ఇది కనీసం శరీరానికి ఉపయోగం చేస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. ఉపయోగంలేని దానికంటే ఇదే మంచిది, తిను. 

(కూరన్నం తిన్న తర్వాత అమ్మ కమ్మ సున్నివేసింది; అంటే మినప సున్నిపొడి.)

నేను: ఇదికూడా తిననమ్మా!

అమ్మ: ఏం? దీనికేమొచ్చింది?

నేను: దీనికేమీ రాలేదమ్మా! నాకు ఇష్టం ఇది. ఒకసారి స్నేహితుని ఇంట్లో ఉపనయనానికి వెళ్ళి తిని కక్కుకున్నానమ్మా! తర్వాత కూడా ఇది తింటే వాంతులు అయినయ్, తింటే వాంతి అవుతుందని భయం అంతే.

అమ్మ: అట్లాంటిదేమీ లేదు నాన్నా! అప్పుడేదో జరిగి ఉంటుంది. నెయ్యి వేస్తున్నాను కదా. బాగా ఉంటుంది, తిను, తిని నువ్వుకక్కుకుంటావనుకో, కక్కుకో. మళ్ళీతిను, మళ్ళీకక్కుకో. ఎన్నిసార్లు తిని కక్కుకుంటావో అన్నిసార్లు తిను. నేను ఎత్తిపారపోస్తాను, నాన్నా! ఏం ఫర్వాలేదు. తిను.

తిన్నాను. హాయిగా ఉంది. ఏమీ వాంతికాలేదు. గారెలు, కందిపచ్చడి వేసింది. చారు, మజ్జిగ వడ్డించింది. అద్భుతమైనరుచి. అమ్మ చేతివంటకదా! స్వయంగా వండి నాకు పెట్టింది. నా అదృష్టం అది. తర్వాత కుంకుమ పొట్లాలు, డజను గారెలూ మూటకట్టి ఇచ్చింది – మా మామగార్కి ప్రసాదం అని. 

  1. స్త్రీలకు జ్ఞానాధికారమా?

కొమ్మూరు మా మామగారింటికి వచ్చింది ఒకసారి అమ్మ. అపుడు కొందరు చదువుకున్న మగవారు అమ్మతో చర్చించారు. ఆడవారికి వేదం చదవటానికి కానీ ఆధ్యాత్మిక చర్చ చేయడానికి గానీ అధికారం లేదు; అటువంటప్పుడు మంత్రోపదేశం లాంటివి చెయ్యవచ్చా ? అని. అంటే అమ్మ, “అసలు ‘శక్తి’ అనే దాన్ని స్త్రీలింగంగా భావిస్తాం. ధనం కావాలంటే లక్ష్మీదేవికి, జ్ఞానం కావాలంటే సరస్వతీదేవికి, శక్తియుక్తుల కోసం పార్వతీదేవిని పూజిస్తాం. వారంతా స్త్రీలే; వాళ్ళని కొలుస్తున్నాం మనం. వాళ్ళకి ఏ శక్తులు లేనపుడు వాళ్ళని కొలవటం ఎందుకు ? సరే. వీళ్ళు దేవతలు కాబట్టి పూజిస్తున్నాం. మైత్రేయి, గార్గేయి… వీరంతా స్త్రీలే. ఈ చర్చ ఈనాటిది కాదు; ఎప్పటి నుంచో వస్తోంది. జ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకోవడం. అందుకు స్త్రీ పురుష భేదం ఏమీ లేదు. తెలివికి లింగభేదం ఏముంటుంది? స్త్రీలకి ఉపదేశం చేయటానికి అర్హత లేదు అనుకున్నప్పుడు చేయించుకోకు. ఏమున్నది ? చేయించుకోవాలని ఉంది. అంటే చేయించుకో; లేదంటే లేదు. దానిని గురించి పెద్ద చర్చ ఎందుకు? శక్తి ఉన్నది / లేదు; ఉన్నదనుకుంటే చేయించుకో లేదనుకుంటే వద్దు” అని విశ్లేషించింది.

  1. ఆత్మ సాక్షాత్కారము :

అమ్మ వివరిస్తున్నప్పుడు ఆయా సందర్భాలు నాకు. అనుభవం అయ్యేవి. ఉదాహరణకి అమ్మ నడిచి వెడుతోంది అనుకుందాం. ఆ బాటలో అమ్మకి ఒక మల్లు గుచ్చుకున్నది. ‘అబ్బా’ అని అమ్మ వంగి ముల్లు తీసింది. నేనూ అక్కడే ఉండి ముల్లు దిగటం, రక్తం కారటం, అమ్మ వంగి మల్లు తీయటం, మూల్గటం అన్నీ నా సమక్షంలో జరుగుతున్నట్లు ఆ సన్నివేశంలో నేనూ ఒక భాగంగా ఉన్నట్లు అనుభూతమయ్యేది. కనుకనే అమ్మ అనుభవాలు నా అనుభవాలుగా ఉండేవి.

అపుడు అమ్మ వయస్సు 5 సంవత్సరాలు. ఆ రోజుల్లో అమ్మ తిన్నదా, ఉన్నదా అని ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. మన్నవలో రాజ్యలక్ష్మీ అమ్మవారు, చెన్నకేశవస్వామి దేవాలయముల మధ్య రెండు అడుగుల లోపు వెడల్పు గల చిన్నసందు ఉన్నది. అంటే అవి ఇంచుమించు ప్రక్కప్రక్కనే ఉంటాయి. ఒక రోజు రాత్రి అమ్మ వెళ్ళి ఆ సందులో పడుకుంది. ఉన్నట్టుండి పెద్దగాలి దుమారం లాంటిది వచ్చింది. క్రమేణా అందు సమస్త ప్రాణికోటి, చెట్లు, నదులు, కొండలు, గ్రహరాశులు ….. సమస్త సృష్టి నిండిపోయి తనకూ సృష్టికి తేడా లేకుండా తనతో సహా సర్వం నిండిపోయి తిరుగుతున్నట్లు. కనిపించిందని అన్నది. అమ్మ చెప్పినపుడు నేను ప్రక్కనే ఉండి ఆదృశ్యాన్నీ కదలికల్ని చూస్తున్నట్లు నాకు అనుభూతమైంది. ఆ దర్శనం నాకు ఆ సమయంలోనే కానీ ఆస్పృహ అమ్మకి నిరంతరం ఉంటుంది.

మరొక సందర్భంలో “నిద్రను తెలుసుకోవడం చాలా కష్టం నాన్నా! నిద్రను తెలుసుకుంటే సర్వాన్నీ తెలుసుకోవచ్చు. ఆ సమయంలో నిద్ర ఎలా ఉంటుందీ, దానిని ఎలా తెలుసుకోవాలి – అని నాకు అనిపించలేదు. ఒక రోజు కొమ్మూరులో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వచ్చి భోజనం చేసి పడుకున్నాను. నిద్రపట్టింది. కాళ్ళ దగ్గర నుంచి చేతి వళ్ళ దగ్గర నుంచి ధూమ్రవర్ణంలో ఒక పొగ శరీరమంతా వ్యాపించింది. శరీరంలోపలి భాగాలు, ఎముకలు, రక్తనాళాలు అంతా ఆవరిస్తూ, దర్శింపచేస్తూ కళ్ళ దాకా వచ్చింది. అంతే. నిద్రవచ్చింది. తర్వాత కొంతసేపటికి మెలకువ వచ్చింది. అందులో నా ప్రయత్నం ఏమీ లేదు. ప్రసంగవశాన అమ్మ ‘అదేనిద్ర’ అని అన్నది. ఆ అనుభవం నాకు ఇంతవరకు పునరావృతం కాలేదు.

  1. ఆశ్చర్యకరం :

మన్నవలో తూర్పు భాగాన ఊరి వెలుపల రోడ్డుకి ఎడమవైపున వీరాస్వామి కోడు అనబడే చిన్న చెరువు ఉన్నది. ఆ గట్టున కరకట్టలా చింతచెట్టు, వేపచెట్టు… ఉన్నాయి. ఇంకా అరడగుల కైవారంతో సుమారం 20 అడుగుల ఎత్తులు పెద్ద పుట్ట ఉన్నది.

అమ్మ వయస్సు 12 సం||లు. ప్రధమ రజస్వల అయింది. స్నానం అయిన పదో రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బయలుదేరింది. సాధారణంగా ఆ సమయంలో గ్రామాల్లో ఎవ్వరూ ఇల్లు విడిచి బయటికి పోరు. వెళ్ళి చింతచెట్టు క్రింద కూర్చున్నది. ఎవ్వరూ లేరు. బాపట్లు (బాదం పేట) వేసుకుని 15 ని.లు అలాగే కళ్ళు మూసుకుని ఉన్నది. అది ధ్యానమో, తపస్సో, సమాధో నాకు తెలియదు. తర్వాత అమ్మ కళ్ళు తెరవకుండా అదే భంగిమలో గాలిలోకి తేలి 20 అడుగుల ఎత్తులేచి చింతచెట్టు, వేపచెట్టు దాటి పుట్టకు ఒక అడుగు ఎత్తున ఆగింది. అక్కడ తను ఏం చేసిందో తెలియదు. పది నిమిషాలు అలాగే ఉపస్థితి అయింది. పిమ్మట అదే స్థితిలో యధాస్థానానికి వచ్చింది. పది నిమిషాలు తర్వాత సర్దుకుని లేచి ఇంటికి వెళ్ళింది. ఇదంతా అమ్మ ఎందుకు చేసిందో చెప్పలేదు. అమ్మ చెప్పింది వినేవాణ్ణి. అంతే. కాగా అమ్మ నాకు వివరించిన ప్రతి సంఘటనకి నేను ప్రత్యక్షసాక్షినే. 

  1. సర్వం నాగేంద్రమయం :

మన్నవ గ్రామానికి ఉత్తరం వైపున శివాలయం ఉంది. 4వ అంశంలో ఇతః పూర్వం వివరించిన సన్నివేశా నంతరం సుమారు మూడు రోజుల తర్వాత ఉదయం గం. 10.00లు ప్రాంతంలో అమ్మ శివాలయం లోనికి వెళ్ళింది. అక్కడ ఏం చేసిందో తెలియదు. కొంతసేపటికీ వెలుపలికి రోడ్డు మీదికి వచ్చింది. ఉత్తరం వైపుకు తిరిగింది. ఎటు చూసినా నాగేంద్రుడే. అమ్మని ఆవరించుకొని నాగేంద్రుడున్నాడు. నాగేంద్రునిలో అమ్మ ఉన్నది. నాగేంద్రుడు విడిగానూ కన్పిస్తున్నాడు. 5 లేక 7 శిరస్సులతో నాగేంద్రుడు నిలువెత్తున లేచి పడగలు విప్పి అమ్మకి అభిముఖంగా గొడుగ పట్టినట్లుంది. సాధారణంగా దేవతామూర్తుల చిత్రపటాల్లో నాగేంద్రుడు అర్చామూర్తి వెనుక వైపు నుంచి శిరస్సుపైకి గొడుగు పట్టినట్లు మనం చూస్తుంటాం. దానికి భిన్నంగా ఇక్కడ ఉండటం విశేషం. అమ్మ కాలుతీసి పెట్టడానికి చోటు లేదు. ఊరంతా; ఆకాశం – నేల అంతా నాగేంద్రుడే. అమ్మ దృష్టి ఎంతవరకు సారిస్తే అంతా నాగేంద్రమయం. అంటే శిరస్సు – పడగలు అనే కాదు శరీరం. అమ్మ కూడా నాగేంద్రుని లోనే పడగలు కూడా నాగేంద్రుని లోనే. అమ్మ బయలుదేరింది. కొంత దూరం వెళ్ళింది. అక్కడ రోడ్డుకు కుడివైపున తురుమెళ్ళ వెంకటప్పయ్య గారిల్లు ఉంది. అది దాటి ఎడమ వైపు తిరిగి చింతల తోపులోకి వెళ్ళింది. అంతవరకే చెప్పింది. అప్పుడు ధైర్యం చేసి నేను అడిగాను, “అమ్మా! అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను?” అని. “నాన్నా! అప్పుడు నువ్వు నా ప్రక్కనే ఉన్నావు” అన్నది. యధార్థం అమ్మ పలుకు. నా ఉద్దేశం పుట్టిన ప్రతి జీవి అమ్మ వడిలోనూ, గిట్టిన ప్రతి జీవి అమ్మ బొజ్జలోనూ ఉంటుంది; అమ్మ దేశ కాల మాన

అవస్థలకి అతీతమైనది. 

నాగేంద్రుని ప్రభావానికి లోబడి అమ్మ ఉన్నదా? అమ్మ ప్రభావానికి లోబడి నాగేంద్రుడున్నాడా ? అని నాకు ఒక సందేహం. అంటే ఆయన విరాట్ స్వరూపంలో అమ్మ ఉన్నదా? అమ్మ విరాట్ స్వరూపంలో నాగేంద్రుడున్నాడా అని సందేహాన్ని లోలోపల దాచుకుని అమ్మతో ‘అమ్మా ! నాకు పామును చూస్తే భయం ఇప్పుడూ ఎప్పుడూ. మరి నీకు ఏమీ అనిపించలేదా, పాముకదా ?’ అని అన్నాను. “వాడు నన్నేం చేస్తాడు, నాన్నా?” అన్నది అమ్మ. నాగేంద్రుని సైతం శాసించగల శక్తిగలది అమ్మ అని అప్పుడు నాకు అర్థమైంది.

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!