“వందారు జనులంటే తనకు నమస్కరించేవారు. అలాంటి వారిపై తన వాత్సల్యామృతాన్ని వర్షించే శ్రీమాత వందారు జనవత్సల” – భారతీవ్యాఖ్య
భగవంతునిపై మనకు గల భక్తిని ప్రకటించే విధానాలలో ఒకటి నమస్కారం చేయడం. రెండు చేతులూ జోడించి, భక్తిపూర్వకంగా నమస్కరించడం మన సంప్రదాయం. ముకుళిత హస్తాలను హృదయానికి దగ్గరగా ఉంచి, శిరస్సుకు ఆనించి, కన్నులకు తాకించి రకరకాలుగా నమస్కరిస్తూ ఉంటాం. భగవద్భక్తిని ప్రకటించడంలో నమస్కారం ప్రముఖస్థానం వహిస్తోంది. ఒక చేతిని మాత్రమే గుండెకు ఆనించి నమస్కారం చేయడం ఈనాడు ఎక్కువగా కనిపిస్తోంది. అది ఆంగ్లేయుల ‘శాల్యూట్’ వంటిది. అది నమస్కారం అనిపించుకోదు. రెండు చేతులను దగ్గరకు చేర్చి పదివేళ్ళనూ ఒకదానితో ఒకటి తాకించి చేసినపుడు మాత్రమే నమస్కారం అవుతుంది. ఈ పద్ధతినే అంజలి ఘటించడం అని కూడా అంటాం. కేవలం చేతులతో మాత్రమే కాక, బోర్లా పడుకుని సర్వావయవాలూ భూమికి తాకించి, సాష్టాంగ నమస్కారం చేయడం కూడా ఉంది. నమస్కరించిన భక్తకోటిపై తన వాత్సల్యామృతాన్ని వర్షించే శ్రీమాత వందారు జనవత్సల.
“వాత్సల్యా, అనసూయా ఇద్దరూ ఒక్కటే” అని ప్రకటించిన “అమ్మ” వందారుజనవత్సల. “అమ్మ”ను దర్శించి, నమస్కరించిన అశేష ప్రజానీకంపై విశేష వాత్సల్యామృత ధారలను వర్షించిన “అమ్మ” అయితే, మనం “అమ్మ”ను చూడకపోయినా, అడ్డుగోడలు లేని “అమ్మ” తన వాత్సల్యామృత దృష్టిని మనపై ప్రసరింప చేయగలదు. “మీరు ఇక్కడకు వచ్చి నన్ను చూస్తారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను. “అమ్మ” ఈవాక్యంలోని “ఎప్పుడూ” అనే పదం ఇప్పుడు కూడా అన్వయిస్తుంది. భౌతికంగా “అమ్మ” ఈనాడు మన కళ్ళకు కనిపించకపోయినా, “అమ్మ”ను స్మరించి నమస్కరించినంత మాత్రం చేతనే ఆ ‘అవ్యాజ కరుణామూర్తి’ తన వాత్సల్యామృత దృష్టిని వర్షిస్తూనే ఉన్నది.
మల్లికార్జున అన్నయ్యను తొక్కి ఎద్దు అతనిపై నిలబడిందిట. అన్నయ్య “అమ్మా! అమ్మా!” అని ఆర్తితో ప్రార్థించాడుట. అంతే, స్మరణమాత్రంచేతనే అతనికి గుండె చిక్కబట్టడం లాంటిదేమీ జరుగలేదుట. “అమ్మే” చెప్పిందిగా “ఆవేదనే నివేదన” అని. మనం ఎలా నివేదించుకున్నా ఆ ‘దయామూర్తి’ మనసై తన వాత్సల్యాన్ని చూపించే వందారు జనవత్సల. “పూజ అంటే ఏముంది నాన్నా! నమస్కారం పూజ కాదూ? నమస్కారం పూజే” అని కేవలం నమస్కారం చేతనే సంతుష్టాంతరంగ అయిన “అమ్మ”. వందారు జనవత్సల. మన్నవలోని చంద్రశేఖరరావు అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళింది “అమ్మ”. ఆ అన్నయ్య ‘అమ్మా! నేనేమీ పెట్టలేనుగా!” అన్నాడు. “నువ్వేమీ పెట్టవద్దురా ! దణ్ణం పెట్టావుగా. చాలు.” అని పలికి, ఆ అన్నయ్యను తన వాత్సల్యాంబుధిలో తేలియాడించిన వందారు జనవత్సల “అమ్మ”.
ఫిబ్రవరి 1977సంవత్సరంలో “అమ్మ” గుంటూరు ప్రాంతంలో పర్యటించింది. ఆ సందర్భంలో ఎందరో అన్నయ్యలు, అక్కయ్యలు “అమ్మ”ను తమ తమ ఇళ్ళకు తీసుకువెళ్ళి, పూజించి, సంతోషించారు. అయితే, వందారు జనవత్సల అయిన “అమ్మ”- నిరుపేదల మనస్సులలోని భావం గ్రహించి, వారు పిలవకపోయినా, తానే వారి ఇళ్ళకు వెళ్ళి, వారికి ఆనందం కలిగించింది. చాలా పేదవాడైన కొండయ్య అనే సోదరుని ఇంటికి వెళ్ళి, వారి పూజను స్వీకరించి, తానే వాళ్ళ వంట యింట్లోకి వెళ్ళి, అన్నమూ, పులుసూ కలుపుకుని తిని, చాలా బాగుందని ఆ ఇల్లాలిని మెచ్చుకున్నది. “అమ్మ”ను తన ఇంటికి పిలువలేని తన దుస్థితికి తన మనస్సులో బాధపడుతున్న సంగావు శ్రీనివాసు అనే సోదరుని గురించి- “పిచ్చివాడు, “అమ్మ”ను పిలవడానికి ఒక తాహతు కావాలి అనుకుంటున్నాడు. అవేమీ అవసరం లేదు” అంటూ వాళ్ళింటికి వెళ్ళింది. “అమ్మ”, “వాళ్ళ గుడిసెలోకి దూరి వెళ్ళి, వాళ్ళు పెట్టిన చీర కట్టుకుని, “నాకెందుకో మేడల్లో కంటే, గుడిలో కంటే, గుడిసెలోనే హాయిగా ఉంటుంది.” అని చెప్పి, వారిని ఆనంద పరవశులను చేసిన వందారు జనవత్సల “అమ్మ”.
తమ ఇంటికి “వస్తాను” అని “అమ్మ” అంటే, ‘రాకుండా ఉంటే బాగుండును’ అని కోరుకున్న నిరుపేద భక్తురాలు శ్యామల. ఆమె చిన్న అద్దె ఇంట్లో ఉండేది. ఆ ఇంటికి వెళ్ళే దారి కూడా చాలా ఇరుకుగా ఉండేది. అలాంటి చోటికి “అమ్మ” వచ్చి, కష్టపడటం ఆ బిడ్డకు ఇష్టం లేదు. అందువల్లనే అలా కోరుకుంది. అయితే, “అమ్మ” మనం రమ్మంటే వస్తుందా? వద్దు అంటే ఆగుతుందా? ఆ ఇంటికి వెళ్ళే దారిలో ఒక అరుగు, దాని పక్కనే ఒక చెట్టు, దానికి పక్క ఒక గోడ. అందుకనే ఆ ఇంటికి వెళ్ళడం చాలకష్టం. చీకటిలో, ఇరుకు దారిలో “అమ్మ” ఎలా వెళుతుందా ? అని అందరూ అనుకునే లోగానే, అరుగుకు చెట్టుకు మధ్య ఉన్న చిన్న ఖాళీగుండా “అమ్మ” సువ్వున వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. తన బిడ్డల ఆనందం కోసం ఆ “తల్లి” ఎంత చిన్నగానైనా మారిపోగల వందారుజనవత్సల.
“నేను బయలుదేరడానికి చాలా ఉండాలి. ఒక గుడిసెకు వెళితే – వాడికి పెట్టడానికి తీసుకుని వెళ్ళాలి. “అమ్మ”కు ఏమీ పెట్టకపోతినే అని వాడు బాధపడకుండా వాడిచేత పెట్టించుకోవడానికి నేనే తీసుకుని వెళ్ళాలి.” అని చెప్పిన “అమ్మ” వందారు జనవత్సల. “ఇక్కడి వారే కాదు. దూరంగా ఉన్నవాళ్ళు కూడా నాకు బిడ్డలే. నేను అందరినీ చూసుకోవలసిందే. పొలం వెళ్ళినవాడికి సమయానికి అన్నం అందించాలా? పంపకపోతే ఎలా? ఇక్కడ మీరు చూస్తున్నది మీకు కనిపిస్తోంది. అక్కడ జరిగింది మీకు కనిపించదు” – అని చెప్పిన “అమ్మ” వందారు జనవత్సల.
లక్షమందికి పైగా ఉన్న ఒక బహిరంగ సభలో దర్శనం ఇస్తున్న “అమ్మ”కు ఎండతగులకుండా గొడుకుపట్టబోయిన ఒక సోదరునితో “లక్షగొడుగులు తీసుకునిరా నాన్నా!” అని పలికిన “అమ్మ”ను దర్శించి, నమస్కరించుకుందామని వచ్చిన ఆ లక్షమంది బిడ్డలకు రెప్పపాటు కాలంలో తన కరుణామృత దృష్టితో మబ్బుల గొడుగులు పట్టిన “అమ్మ” వందారు జనవత్సల.
అర్కపురిలోని అందరింటిలో కొలువై ఉన్న వందారు జనవత్సల అయిన అనసూయమాతకు వందనం.
“జగముల చిరునగవుల పరిపాలించే జననీ!
అనయము మము కనికరమున కాపాడే జననీ!
మనసే నీ వశమై, స్మరణే జీవనమై
మాయని వరమీయవే పరమేశ్వరి! మంగళనాయకి!”
(మాతృసంహిత రచయితకు కృతజ్ఞతలు.)