మీ పాదయుగ్మమ్ము శ్రీపూజ కావించి
పూజనీయగ కీర్తిపొందె నమ్మ
మీ పాదతీర్థమ్ము మించి తాసేవించి
తీర్థమిచ్చెడి శక్తి తెలిసె నమ్మ
మీ పాదములు రెండు మెడలోని తాళిగా
అద్వైతదీప్తితో అలరునమ్మ
మీ పాదముల శబ్దమే గుండె చప్పుడై
నిరత (నిత్య) జాగృతిలోన నిలచునమ్మ
భర్తయన భావమంచును పరిగి మీరు
తనువు విడిచిన మిమ్ము భద్రముగ నుంచి
తాను కూడను మిము చేరి దైవ నిలయ
మందున అనసూయేశ్వరమ్మయ్య తండ్రి!
విశ్వజనీనమౌ విమల మాతృప్రేమ
విశ్వజనకుడౌచు వెలిగినావు
కల్పవృక్షమ్మగు కన్నకూతురి చేత
దేవత పితవయినావు నీవు
జగతి కాధారమౌ జనయిత్రి కాధార
మౌటచే జగదీశుడైతినీవు
అన్నపూర్ణాలయమ్మగు చిన్న ఇంటిని
అందరిల్లుగ జేసి అలరినావు
మునుగు బిడ్డల తండ్రివై. మురియు టేన
ముగ్గురమ్మల తండ్రివై మురిసినావు
అమ్మ అనసూయతాలింపు కమ్మదనము
ప్రియత్రిమూర్తులకు రుచి చూపించినావు
పూజా పుష్పములెన్నొ తెచ్చిఇడెకాబోల్ మున్ను బృందావన
శ్రీ జన్ముం డనసూయపాదముల నిశ్రేయః పధోద్దేశుడై
రాజిల్లన్ ఇపుడిచ్చుచుంటి మీదె స్వర్ణాంభోజ పుష్పమ్ములన్
పూజల్ కొండికి నీవు నీసతియు సంపూర్ణానురాగమ్మునన్.
‘ఆటలాడితివయ్య ఆనాడు మాతో జ
గన్నాటకపు సూత్ర మెన్న గల్గి
పాటలు పద్యాలు పాడితివయ్య ఓం
కారశబ్దార్ధ సంకాశుడయ్యు
అమృతము నిడగల్గు అధికారివయ్యు సా
పంక్తి అనగ ముందు సాగినావు
అధికారులందరి కారాధ్యుడయ్యు న
ణకువ నున్నావు వినయమెసగగ
సత్యముగ నీవు ఈశ్వరాంశను జనించి
మహిత నాగేశ్వరాఖ్యతో మసలి – మమ్ము
లోకజననికి బిడ్డలై లోగొనంగ
జేసితిగదయ్య నీకు జేజేలు తండ్రి
ఏ మహాత్ముని దయా హేవాక సంపత్తి
అమ్మ పదాబ్జము లందె మనకు
ఏ పూజ్యుకారుణ్య మింతయై అంతయై
అన్నపూర్ణాదేవి అందె మనకు
ఏ భూసురేంద్రుని ఇష్ట సంతుష్టి చే
అనసూయ మాతయే అందె మనకు
ఏ ఈశ్వరుని కోర్కె యీడేర బడుటకై
అద్వైత ఆలయమ్మందె మనకు
అట్టి జగదేకపావను అమ్మ యొక్క
గుండె గుడిలోన కూర్చున్న కూర్మి దేవు
శతవసంతోత్సవమ్ములు సాగిగండు
అర్కపురికేడుగడ నాన్న అమ్మయయ్యె
లాలించె విద్యార్థి జాలంబునెల్లను
కష్టనష్టాలను కాచి ప్రోచి
తేలించె నానాడు తీర్థప్రజల నెల్ల
తిండితిప్పలు కూర్చి నిండు ప్రేమ
పాలించె సతి నిత్య వాత్సల్య భావము
తన సౌఖ్యసంపత్తి త్యాగమొసగి
ఏలించె తన కూతు లీలావిశేషాల
కల్పవృక్షమ్మయి కాంక్ష తీర్ప
నరుని అవతారమెత్తి ననంతశక్తి
సంతతాశ్రిత పోషణానన్యరక్తి
శాశ్వతుడు నేడొ అనసూయ ఈశ్వరుండు
వెన్నపోలిన మనసున్న నాన్నగారు
స్థానము వారింటి సత్యభామాదేమి
నరసింహరావు సంగాతికాడు
కోనా ప్రభాకరుండానాటి మంత్రి తా
ననుగు స్నేహితుడయి అలరినాడు
నెచ్చెలి కథకుడు బుచ్చిబాబెంతయు
నిస్తుల నేస్తమై నెగడినాడు
నాగులూ అని పిల్చు నంతటి నెయ్యుడు
కోన సుబ్బారావు కూర్మి వాడు
నోరి వెంకటేశ్వరులో అనుంగువాడు
రాజశేఖరమిత్రుడు ప్రాజ్ఞుడతడు
సంగడీండ్రయి నీతోడ చనువరులయి
ఎన్నికెక్కిరి లోకాన నాన్నగారు !
వారు కూడను బిడ్డలైవరలినారు
విశ్వజనకుడవయినీవు వెలుగునపుడు
చందరు డమృతమ్ము విందు కూర్చుచునుండు
నందాక నీ కీర్తి అలరునయ్య
మందరస్థైర్యమ్ము మహిపై వెలంగెడి
నందాక నీ కీర్తి అలరునయ్య
మందారమున తావి మసలుచు నుండెడి
నందాక నీ కీర్తి అలరునయ్య
తామరలో లక్ష్మి స్థావరమ్మయి నిల్చు
నందాక నీ కీర్తి అలరునయ్య
సూర్యుడుదయాద్రి ఉదయించుచున్న వరకు
అంతవరకును నీకీర్తి అలరునయ్య
అమ్మ పతివయి అద్వైత మందువరకు
అంతవరకును నీకీర్తి అలరునయ్య
అనసూయేశ్వర పురమది
అనయ మ్మాదేవళమున అమ్మానాన్నల్
మన కోరికలీడేర్చెడి
తనయ నిడిరి తాము కూడ తగ నిలిచిరితే.
సురపారిజాతాలు విరజాజిపూవులు
పున్నాగ పుష్పాలు పొగడపూలు
మల్లెలు మొల్లలు మాలతీసుమములు
మందారములు నందివర్ధనాలు
శంఖుపుష్పంబుల సౌగంధికమ్ములు
కలువపూవులు దేవకాంచనములు
గరుడవర్ధనములు కనకాంబరంబులు
గడ్డిపూవులు చంద్రకాంతివిరులు
బంతి చామంతి పున్నాగ పద్మచయము
తులసిదళములు బిల్వముల్ తుమ్మిపూలు
మంత్రపుష్పాలు తెచ్చి నోమంగరమ్ము
సంతతి మనమ్ములకును ప్రసాదమగుచు
అమ్మకాధారమై అవనిలో నిలచిన
బంగారుమొలక శ్రీ బ్రహ్మచిలక
అమ్మకై కోవెలై అటచేరి ఘంటలో
కంఠారవమ్ముంచు కర్మయోగి
అంతర్ముఖుండౌచు అమ్మ పేర్మిని మించి
సార్ధదేహుండైన చక్కనయ్య
నాగేశ్వరులె కాదు రాగేశ్వరులు నౌచు
ప్రజ్ఞాప్రభావుల ప్రణవమూర్తి
ప్రేమధామమ్ము నేలిన ప్రియవధూటి
సరసుడవు నిరాడంబర చక్రవర్తి !
వందనంబులు శాబ్దిక స్యందనములు
నందనులపైన ఆశీస్సు చిందుగాక !
జయజయ విశ్వమాత పరిచర్య నిరంతర తృప్తజీవనా!
జయజయ లోక సంతతి ప్రశస్త మహోన్నత దివ్య సద్గుణా!
జయజయసత్యశాశ్వత ప్రశాంత మహాలయ నిత్యపూజితా!
జయ అనసూయ భవ్య గుణసౌరభ కాంతికళా విలాసమా!
జయ అనసూయా నాథా !
జయ లోకేశ్వరి విభూతి సత్యచరిత్రా !
జయ మానవతా పరిమళ !
జయ జగదీశ్వరి హృదీశ ! జయనాగేశా !