“రాధ అంటే ఆరాధన” అని అమ్మ అపూర్వంగా నిర్వచించింది. చరిత్రలో కనిపించే ఆరాధనని పరికిద్దాం. గోపికలు, మీరాబాయి వంటి స్త్రీ మూర్తులు శ్రీ కృష్ణపరమాత్మను ఆరాధించారు. త్యాగరాజు, అన్నమయ్య వంటి పురుషులూ జగన్నాథుని ఆరాధించారు. కాగా మహాకవి క్షేత్రయ్య | మువ్వగోపాల స్వామిని తన పతి, గతి అని విరహంతో ఆరాధించారు. శక్తికి స్త్రీ పురుష భేదం లేదుకదా!
కనుకనే వసుంధర అక్కయ్య “శివుడవు నీవు, నీ శ్రీమతి నేను”అని అమ్మకోసం తపించింది. అమ్మ మెచ్చి పరిణయమాడింది. తాను జగద్భర్తనని చేతలద్వారా స్పష్టంచేసింది. వసుంధరా పరిణయంలోని పరమార్థాన్ని వివరించటానికి ఒక సందర్భం- అమ్మ వైద్యం నిమిత్తం నెల్లూరు డా॥ యస్.వి.సుబ్బారావు గారింట్లో కొన్నాళ్ళు ఉన్నది. అమ్మ ఉన్న ఊరు జిల్లెళ్ళమూడి, ఆ ఇల్లు అందరిల్లు. అన్ని పండుగలూ వైభవంగా నిర్వహించారు. కృష్ణాష్టమినాడు అమ్మకి ఊంజల్ సేవ చేస్తున్నారు. ఊయలపై అమ్మ ఆసీన అయి, తనకు ఒకవైపున వసుంధర అక్కయ్యను, మరొకవైపు పాపక్కయ్యను కూర్చుండబెట్టుకుని ‘అటు రుక్మిణి, ఇటు సత్యభామ’ అని ఛలోక్తులు విసిరింది. అంటే అది మధురానగరం, గోకులం. అమ్మ నిస్సందేహంగా జగద్గురువు కృష్ణపరమాత్మే. కాగా, వసుంధరక్కయ్య, పాపక్కయ్యలను రుక్మిణీ సత్యభామలతో పోల్చటంలో అమ్మ ఔన్నత్యం, ఔదార్యం, సముద్ధరణతత్త్వం స్పష్టమవుతోంది.
వసుంధర అక్కయ్యకు సన్మానం అంటే వ్యక్తికి కాదు, వ్యక్తిత్వానికి, ‘గోపీ భర్తృః పదకమలయోః దాస దాసానుదాసః అనే విశిష్టాద్వైత తత్త్వసారానికి.
ఈ నేపధ్యంలో శ్రీ పి.యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్టు సభ్యుల సత్సంకల్పం మేరకు శ్రీ విశ్వజననీ పరిషత్ సహకారంతో సోదరీసోదరుల ఆర్థిక హార్ధిక భాగస్వామ్యంతో 9-1-22న అందరింటి ‘ భవనంలోని సమావేశ మందిరంలో వసుంధరక్కయ్యకు కనకాభిషేక కార్యక్రమం ‘ కన్నులపండుగగా జరిగింది.
– ముందుగా అక్కయ్య ఊరేగింపుగా వెళ్ళి అమ్మ, హైమమ్మ, నాన్న గారలను అర్చించింది, సభాస్థలికి రాగానే ప్రార్ధన, జ్యోతి ప్రజ్ఞలనలతో కార్యక్రమం ప్రారంభమైంది. అందు –
– ‘ఎవరి లోపాలెంచకుండా దయతో ప్రేమతో సేవిస్తావు కనుకనే ‘దయామణి’గా నీ శ్రీవారు నిన్ను సంభావించారేమో! వసుంధరా!’ అంటు సన్మాన పత్రాన్ని అందించి నమస్కరించారు శ్రీ పి.యస్.ఆర్. కె
‘పరమపావనమైన బ్రహ్మాండ వంశాన అమ్మ కిల్లాలిపై అలరినావు’ అంటూ పద్యకుసుమాంజలి ఘటించారు శ్రీ మల్లాప్రగడ.
– ‘ఆ గోదాదేవి కథలు తెలుసుకున్నాం, ఈ గోదాదేవిని ప్రత్యక్షంగా చూస్తున్నాం’ అంటూ అక్షర సుమమాల అర్పించారు – శ్రీ కొండముది సుబ్బారావు.
– ‘అనసూయాదేవికి అనువైన భార్య భర్తృ స్వభావంబు పడయుచుండు’ అంటూ నమస్సుమముల సర్పించారు శ్రీ ఓంకారానందగిరిస్వామి.
– ‘మాతృమూర్తిగా అవతరించిన విశ్వజనని బ్రహ్మాండం అనసూయాదేవికి ఇల్లాలైంది. బ్రహ్మాండం సకల సృష్టికి మూలం. అమ్మ విశ్వానికి ఆధారం. వసుంధరక్కయ్య (భూమి) నిత్యజీవనంలో అమ్మకి ‘ఆధారమైంది’ అని శ్రీ యమ్. దివాకర్స్:
– ‘ఏ వ్యక్తిని ఎట్లాచూస్తే అమ్మ సంతోషిస్తుందో, ఆ వ్యక్తిని అట్లాచూడడం అక్కయ్య ప్రత్యేకత. అమ్మ గదిలో ఆదరణకి రూపం అక్కయ్య అమ్మ చేతి ఉపకరణం. అమ్మని చూసినవాళ్ళు చూడనివాళ్ళు అందరూ అక్కయ్య ఆదరణ పొందుతున్నారు’ – అని శ్రీ బ్రహ్మాండం
– ఆరాధన – సాధన, సేవ, త్యాగం, నవవిధ భక్తి మార్గాలు, దయ . మున్నగు మహోన్నత గుణాలు, ధర్మాలు, లక్షణాలు తెలిస్తేనే వసుంధర అక్కయ్య తెలుస్తుంది; వాటి సమున్నత సమాహారమే అక్కయ్య’ అని శ్రీ DVN కామరాజు;
– 1958 నుంచీ మా కుటుంబం జిల్లెళ్ళమూడి వస్తోంది. నాటినుంచి మా అక్కయ్య ఇక్కడే స్థిరనివాసం చేస్తోంది. మా అక్కయ్యను అమ్మ నలుగురి సమక్షంలో వివాహం చేసుకున్నది; ఆ తర్వాతనే ఆ విషయం మాకు తెలిసింది. అమ్మ నాకు అమ్మగా, బావగా, గురువుగా, దైవంగా నా చదువు, వివాహం, ఉద్యోగం, జీవితంలో ఆదరించింది, ఆదుకున్నది’ అని డా॥ K.S.N.మూర్తి,
– ‘మానవసేవలోనూ, మాధవసేవలోనూ తన జీవితాన్ని సార్లకంచేసుకున్నది అక్కయ్య. అమ్మ అంతరంగాన్ని హృదయ భాషగా అర్థంచేసుకుని వచ్చిన వాళ్ళకి కాఫీ ఫలహారాలూ, భోజనాలూ, మందులు, సేవలనందించింది. అమ్మ – అక్కయ్యల అనుబంధం అపూర్వమైనది’ అని డా॥ B.L. సుగుణ ప్రసంగించారు, అక్కయ్య గుణగణాలను, సేవాతత్పరతని ప్రసుత్తించారు.
ఈ సన్మానానికి స్పందిస్తూ వసుంధర అక్కయ్య “అమ్మ చీరాలలో మా ఇంటికి వచ్చి ‘అది నాది. నేను తీసుకుపోతున్నాను. మీదేమీ బాధ్యత లేదు’ అని చెప్పి 64 సం.రాల క్రితం తీసుకు వచ్చింది. ఆ మాట నేటికీ తీరుస్తోంది, నెరవేరుస్తోంది. “నేను లేనిదే నువ్వులేవు” అన్నది అమ్మ. కావున నేను చేసినదేమీ లేదు. సత్కారాలు, సన్మానాలు, అభిషేకాలు అన్నీ అమ్మకే, నాకు కాదు. పి.యస్.ఆర్. అన్నయ్య తలపెట్టిన ఈ కార్యక్రమంద్వారా అందరి రూపాల్లో అమ్మ నన్ను ఆశీర్వదిస్తోంది’ అన్నది.
వేదమంత్రాలతో నడిచిన ఈ కార్యక్రమంలో అక్కయ్యను సువర్ణ పుష్పాలతో, సుగంధ పుష్ప పరంపరలతో, శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ పంపిన మంచి ముత్యాలతో ఎందరో అభిషేకిస్తే, కొందరు చీరలు పెట్టి సత్కరించారు, మరికొందరు నగదు అందచేసి అభిమానాన్ని వెలిబుచ్చారు. శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం సంతోషంతో అందరికీ చాక్లెట్లు పంచారు.
శ్రీ విశ్వజననీ పరిషత్ వారు అక్కయ్యకు, పి.యస్.ఆర్. ట్రస్టు సభ్యులకు అమ్మ ఆశీఃపూర్వకంగా నూతన వస్త్రాలనిచ్చి సత్కరించారు.
వందన సమర్పణ, మంగళహారతి, శాంతి మంత్ర పఠనాదులతో కార్యక్రమం ముగియలేదు. తనకు జరిగిన సత్కారం – సన్మానం అమ్మకే అని త్రికరణశుద్ధిగా విశ్వసించిన అక్కయ్య సువర్ణపుష్పాలు, ముత్యాలు, నగదు సర్వం శ్రీ విశ్వజననీ పరిషత్క (అమ్మకు) సమర్పించింది.
ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు ఈ సమ్మాన నిర్వహణకి సహకరించారు. అలా ఆసక్తి గల సోదరీసోదరుల అన్యోన్య సహకారంతో శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ ఛారిటబుల్ ట్రస్టు సంకల్పించిన ఈ మహత్కార్యం ఆదర్శంగా నిలిచింది. జయప్రదంగా ముగిసింది.