వసుంధర (బ్రహ్మాండం వసుంధర) ఆ రోజుల్లో మాలో కొంత మందికి ఉత్తరాల ద్వారా జిల్లెళ్ళమూడి ఆవరణలోని సంగతులు సమాచారం యధాతథంగా తెలియపరుస్తుండేది. అలాంటి వుత్తరాలలో నుంచి 24.8.1964లో వ్రాసిన ఉత్తరంలోని ‘అమ్మ’ సమాచారం సోదరీ సోదరులతో పంచుకునే వుద్దేశంతో యీ క్రింద వ్రాస్తున్నాను.
అన్నయ్యా నమస్తే,
జిల్లెళ్ళమూడి
24.8.1964
ఇప్పుడు గం. 10.30 (రాత్రి) అయింది. అమ్మ వరండా (ప్రస్తుతం అలంకార హైమ)లో పడుకున్నారు. డా॥ శ్రీధరరావు (చీరాల) గారు సంస్కృతాన్ని గురించి మాట్లాడుతున్నారు. యోగన్నయ్య, రవి గుంజకానుకుని కూర్చున్నారు. శివరామయ్య (వఝ శివరామయ్య, బాపట్ల) గారు కాళ్ళుపిసుకుతున్నారు. నా పక్కనే కాత్యాయినక్కయ్య పడుకున్నది. కుమారి, సత్యం (వల్లూరి), చంద్రమ్మ సంభాషణ వింటూ కూర్చున్నారు. ఇదీ యిప్పుడున్న వాతావరణం. తతిమ్మావాళ్ళంతా ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
అమ్మ బంతి విషయం అక్కడ చెప్పారా? మొన్న కదూ బంతి! అమ్మ 7 గం.లకు స్నానం చెయ్యగానే ఎవరో తెల్లచీర పెట్టారు. ఆ చీర కట్టుకున్నారు. అప్పుడే శేషగిరిరావన్నయ్య అన్నగారి కూతురు రమణ ముద్దమందార, ఒంటిరెక్క మందార పూలు తీసుకొచ్చింది. అమ్మకు జడవేసి జడనిండ మందార పూలు గుచ్చి రోజా రంగు రిబ్బను పెట్టాం. తలలో మధ్య గులాబీలు పెట్టి చుట్టి మందారపూలతో అలంకరించాం. ఎంత ముద్దుగా వున్నదో!
అమ్మ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. “చూడమ్మా నన్నెట్లా చేస్తున్నారో, చిన్న పిల్లలాగ…” అన్నారు చిరునవ్వుతో – (రామకృష్ణన్నయ్య వాళ్ళ అమ్మ, అక్కయ్య, చెల్లెలు, కుటుంబం అంతా గురువారం నాటి సాయంత్రమే వచ్చారు.) వీళ్లతో…….. హాల్లో కూర్చోగానే జనంతో హాలునిండింది. గజేంద్రమ్మ వాకిట్లో నుంచుని అట్లాపైకి (కప్పువైపు) చూచింది. చదలు పట్టింది. అది పైకి సన్నగా పుట్టలా లేచివున్నది. దాంట్లో పైన ఒక పాము కన్పించి, అమ్మతో చెప్తే అందరం చూశాం – చివరకు అమ్మ బల్లిలే అని మాట మార్చేసింది… చీర పెట్టిన వాళ్ళమ్మాయిది అన్న ప్రాశన చేసింది……. మధు అన్నయ్య తెలుసుగా! వాళ్లత్తయ్య, మామయ్య వచ్చారు. పట్టుచీర తెచ్చారు. వాళ్ళమ్మాయిది గూడ అన్నప్రాశనట. అమ్మ స్నానం చేసి పట్టుచీర కట్టుకుని (చిన్నపిల్లలానే వున్నారు). అమ్మ వచ్చేలోగా, కుర్చీయేర్పాటు చేశాం. అమ్మ రాగానే టెంకాయ కొట్టి, హారతిచ్చి కుర్చీలో కూర్చోబెట్టుకుని అమ్మను, నామం చేసుకుంటూ డాబా (అప్పట్లో అన్న పూర్ణాలయండాబా ఒక్కటే వుండేది) దగ్గరకు తీసుకెళ్లాం – అమ్మనట్లా తీసుకొస్తుంటే, దూరాన్నుంచి చూస్తుంటే, అమ్మ వార్ని తీసుకొస్తున్నట్లుగానే వున్నది. ఎంత బాగుందో చూడాలిగాని, ఎట్లా చెప్పను?
అమ్మరాగానే, నేరుగా వంట యింట్లోకి వెళ్ళింది. లక్ష్మీనరసమ్మగారు, పీటవేసి కూర్చోబెట్టి పసుపు రాసి పారాణి బెట్టి, పదార్థాలనన్నిటినీ నివేదన చేశారు. తోటకూర పప్పు, దోసకాయపచ్చడి ముక్కలు, దోసకాయ కూర, పొంగలి, పులిహోర – ఇవీ పదార్థాలు.
నాన్నగారు వూరుకెళ్లబోతుంటే పిల్చి, నమస్కారం చేసింది…. నాన్నగారు వూరి కెళ్లారు. హాల్లో అమ్మకు వెండి పీట వేసి, ఇస్తరివేసి, ఎ(వె)డి ఆకు (చిన్న ఆకు) పెట్టి, వెండి చెంబు, గ్లాసు పెట్టాం… ఆనుకోటానికి వెనకొక పీట వేశాం. ఇస్తళ్ల ముందర, అరటి వూచలలో సాంబ్రాణి కడ్డీలు గుచ్చి పెట్టాం. పంచ, హాల్లో, ముందు గది – జనం నిండారు. హాల్లో అచ్చగా ఆడపిల్లలమే కూర్చున్నాం అమ్మ ఇస్తట్లో కూడ అన్నం వడ్డించి, పదార్థాలన్నీ వేశారు. అమ్మ గూడ కొద్దిగా నోట్లో వేసుకున్నారు…. మొత్తం కలిపారు…. కలపకముందు మధు అన్నయ్య వాళ్లత్తయ్య, మామయ్య అక్కడే, ఒక కాలికి పసుపు మరొక కాలికి కుంకుమ పూజ చేశారు. తమలపాకులతో గూడ చేశారు. వాళ్ళపాపను తీసుకుని అన్న ప్రాశన చేశారు. అయ్యాక అప్పుడన్నం కలిపారు. మధ్యలో వడ్డించుకునేటప్పుడు “నేనసలే సిగ్గుపడుతుంటే – ఏంటి, ఏమెయ్యరేంటి” అని తలకాయ వంచుకుని సిగ్గునభినయిస్తున్నది. ఆమెకు అభినయంగా వున్నా మనకు అభినయం అనిపించలా – యదార్థం అనిపించేట్లుగా వున్నది.
అంతా అయ్యాక అన్నపురాశి అంటే తన ముందర వున్న అన్నంపై కర్పూరం వేసి వెలిగించారు. చివరకు అందరికీ ప్రసాదం పెట్టారు – అందరిభోజనాలు పూర్తి అయ్యేప్పటికి 2 గం. లయింది. కాగానే అమ్మ మనం పడుకునే గదిలో కూర్చున్నారు. ఒక 15 ని॥లు “అమ్మా ఈసారి ఆడపిల్లలం తీసుకెళ్తామమ్మా” అన్నాం. ‘సరే’ నన్నారు. రుక్మిణక్కయ్య, నేను, కాత్యాయని, కుమారి, ఇంకా ఇద్దరు ముగ్గురు అక్కయ్యలు పట్టుకుని అమ్మ గదికి తీసుకొచ్చాం.
ఇక సాయంత్రం పేరంటానికి ఎవరికివాళ్లు హడావుడిగా వున్నాం. పట్టీలు గట్టేవాళ్ళొకరు – అమ్మకు వేదిక నలంకరించే వాళ్ళొకరు, ఇట్లా అంతా హడావుడి పన్లమీద వున్నాం – వరండాలోనే ఏర్పాటు చేశారు. ఎదురుగా బల్లమీద శనగలు, చిమ్మిలి వుండలు, రిబ్బన్లు, గాజులు, పసుపు, కుంకుమలు అన్నీ అమర్చబడ్డా. గోపాలన్నయ్య తెచ్చిన పెద్ద అంచుగల రోజా పట్టుచీర కట్టుకుని, అలంకారం చేసుకుని వచ్చారు. ఇవాళ వుదయం చీరాల డాక్టరుగారు, రామకృష్ణశర్మగారు, లింగేశ్వరరావుగారు, సుబ్రమ్మణ్యం అన్నయ్య, లైబ్రేరియన్ నరసింహారావు అన్నయ్య, అమ్మకు చీర తీసుకుని వచ్చారు. వాళ్ళు, గోపాలన్నయ, రాధాకృష్ణన్నయ్య, రామకృష్ణన్నయ్య, పాదాలు కడిగి పారాణి పెట్టారు. అప్పుడే శేషగిరిరావన్నయ్య వూరి నుండి వచ్చారు. తమలపాకులు తీసుకు వచ్చారు. తమలపాకులతో పూజచేసి పూలతో పూజచేశారు.
పూజకాగానే చిమ్మిలి తొక్కి అమ్మకు పెట్టి, ముత్తైదువులకు దంపత్సహితంగా తాంబూలాలు ఇచ్చారు. తర్వాత చినపిల్లలకు రిబ్బన్లు ఇప్పించారు. అన్నీ పంచటాలు ఇవి కాగానే అమ్మ స్నానం చేసి చీరాల వాళ్లు పెట్టిన ఎఱ్ఱంచు గల గోధుమవన్నె చీరె, బ్లూ జాకెట్ వేసుకుని డాబా మీదకు వచ్చారు. అందరికీ భోజనాలక్కడ 3 లైన్లుగా ఒకే బంతిగా కూర్చున్నాం. గోడకానించి అమ్మపీట, అమ్మకు వెండి కంచం పెట్టారు. ప్రొద్దుటి లాగానే అమ్మ కలిపారు. అందరూ సరదాగా భోజనాలు చేశాం. అమ్మ ఈ పూట గూడ అన్నం మీద హారతి వెలిగించి చివరకు తనే విస్తళ్ల దగ్గరకు వచ్చి చకచకా పెట్టారు. కార్యక్రమం అంతా పూర్తయ్యేప్పటికి రాత్రి 12 గం.లు. పూర్తవగానే అమ్మ కిందకు వెళ్ళబోయేప్పుడు రెండు తుప్పర్లు పడ్డా పూలవానలా. ఎంత బాగుందో చెప్పాలంటే కష్టం. మర్నాడు రాజమ్మగారి సంభాషణ చదివించి అప్పుడెలా చేసిందో యధావిధిగా అన్నీ అట్లాగే చేసింది. ఇంకరాయలేను. ఓపికలేదు. వెంకటేశ్వరరావు మామయ్య, రాధయ్యకు, కృష్ణశర్మగారికి గూడ చెప్పాల్సింది.
నీ చెల్లెలు
వసుంధర