భక్తి: కిం న కరోతి:- భక్తి సాధించలేనిదేముంది? – అని అన్నారు శంకరులు. భగవంతుని మీద ప్రేమనే భక్తి అంటాం. అమ్మ మనకి భగవంతుడు. కానీ, మనకి అమ్మమీద కంటే అమ్మకి మన మీద ప్రేమ ఎక్కువ. అమ్మ ప్రేమకి మన ప్రేమకి పోలిక ఏమిటి? ఆ ప్రేమ అపారమైనది, అవ్యాజమైనది, స్వచ్ఛమైనది, ప్రతిఫలాపేక్ష లేనిది.
మన ఆర్తి, ఆవేదన, ప్రార్ధన అమ్మ హృదయాన్ని కదిలిస్తాయి అని విశ్వసిస్తాం. వాస్తవం ఏమంటే- మనం పిలవక పోయినా వచ్చి ఆదుకుంటుంది అమ్మ. మన అవసరం మనకంటే అమ్మకే ఎక్కువగా తెలుసు. అడగకుండానే అవసరాన్ని గమనించి పెట్టేది అమ్మ కదా! ఈ నేపథ్యంలో నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను.
2015లో మా అబ్బాయి ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళాడు. దరిమలా పెళ్లి సంబంధాల కోసం అన్వేషిస్తున్నాం. కానీ ఏదీ నచ్చటం లేదు. మరొకపక్క మా అమ్మగారు శ్రీమతి నందిగాను అనంతలక్ష్మి కాన్సర్ వ్యాధితో చివరి దశలో బాధ పడుతున్నారు. ఆమెకు తన మనుమడి వివాహ వేడుక కళ్ళారా చూడాలని కోరిక. కనుక అబ్బాయికి సంబంధాల అన్వేషణ ముమ్మరం చేశాం. అమెరికా నుంచి మా చెల్లెలు, మా అమ్మాయి అందరూ వచ్చారు. సంబంధాలు చూస్తున్నాం, నచ్చటం లేదు.
వాళ్ళు తిరిగి అమెరికా వెళ్ళే సమయం దగ్గరికొస్తోంది.
కిం కర్తవ్యం? మానసికంగా అమ్మను అభ్యర్థిస్తూ ఉన్నాను. 2017 జూన్ చివరివారంలో- తెల్లవారు జామున ఒక కల – ఒంగోలులో మా ఇంటి ముంగిట్లో సాక్షాత్తూ ‘అమ్మ’ తెల్లచీర ధరించి, పెద్ద కుంకుమ బొట్టుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ రెప్పపాటు కాలంలో కనపడి మాయమైంది. మాకుటుంబ సభ్యులు ఇది విని చాల ఆనందించారు. ‘అబ్బాయి వివాహం నిశ్చయ మవుతుందని అది ఒక శుభదర్శనం, నిదర్శనం – అని.
ఆ కల సాకారమైంది. నిజంగానే అదే వారంలో మాకు ఒక సంబంధం రావటం, పెళ్ళిచూపులు కావటం, అమ్మాయి నచ్చటం, నిశ్చయతాంబూలలు పుచ్చుకోవడం, అక్టోబరు 7 న వివాహం అయింది. అనసూయావ్రతం, హైమవతీవ్రతం చేసుకుని అక్టోబరు చివరివారంలో అమెరికా శుభప్రదంగా వెళ్ళారు. బంధుమిత్రులు అంతా హాజరై, వివాహానంతరం వెళ్ళారు.
ఆశ్చర్యం ఏమంటే నాకు కాబోవు కోడలు గురించి లక్షణాలు గురించి కొన్ని కోరికలు- B.Tech/M.Tech చదువు, సంప్రదాయం, సంగీతం – పాటలు వచ్చిన అమ్మాయి – ఉండేవి. వాటిని ఒక కాగితం మీద వ్రాసి అమ్మ పాదాల చెంత ఒక Purse లో ఉంచాను. వివాహం గురించి ఆతృత- కోలాహలంలో ఆ సంగతి మరిచిపోయాను. యధావిధిగా నిత్యకృత్యంగా అమ్మను లలితా పరమేశ్వరిగా, రాజరాజేశ్వరిగా, అన్నపూర్ణేశ్వరిగా ఆరాధిస్తున్నాను. ఏ దేవాలయానికి వెళ్ళినా అమ్మ రూపాన్నే, అమ్మ నామాన్నే ధ్యానిస్తా, జపిస్తాను. సకల దేవీ దేవతలందరూ అమ్మకి బిడ్డలే కదా! నా కష్ట సుఖాలు అమ్మకే చెప్పుకుంటాను. నా జీవన యానంలో సదా సర్వదా అమ్మ నన్ను లాలిస్తూ, పాలిస్తూ, సంరక్షిస్తోంది. ఏ సమస్య తలెత్తినా పరిష్కారాన్ని అనుగ్రహిస్తోంది. నేను మరచిపోయినా, నా అభ్యర్ధనని అమ్మ మరచి పోలేదు; సరికదా- అనుగ్రహించింది.
నేను కోరుకున్న లక్షణాలు కలిగిన అమ్మాయినే నాకు ప్రసాదించింది. మరీ ఆశ్చర్యం – ఆ అమ్మాయిది మా ఒంగోలు పట్టణమే.
ఈ సందర్భంగా మరొక సంగతిని ప్రస్తావించాలి. నా అభిష్టాన్ని అమ్మ సిద్ధింపజేసింది. అంతేకాదు. మా అమ్మగారు 2017 ఏప్రిల్ వరకే ఉంటారని వైద్యులు స్పృష్టంగా చెప్పారు. కానీ కరుణామయి అమ్మ తన ఆయుర్దాయాన్ని పొడిగించింది. ఘటనాఘటన సమర్ధ కదా అమ్మ! మా అమ్మ తన మనవడి వివాహాన్ని కళ్ళారా చూసి ఆనందించింది, 3-2-2018న తుదిశ్వాస విడిచి అమ్మలో ఐక్యమైంది. ఇదంతా ఆశ్చర్యకరమైన అమ్మ వాత్సల్యమే, అనుగ్రహమే.
ఆపద్బాంధవి, శాంతి సౌఖ్యప్రదాయిని, కళ్యాణ కారిణి అయిన అమ్మ శ్రీచరణాలకు కృతజ్ఞతా పూర్వకంగా వందలు, వేల నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను.