“నీరాగాం రాగమథనం నిర్మదాం మదనాశినీం
నిశ్చింతాం నిరహంకారాం వందే అర్కపురీశ్వరీం॥
భక్తుల కోరికలను నెరవేర్చే శ్రీమాత వాంఛితార్ధ ప్రదాయిని – భారతీవ్యాఖ్య భక్తుల కోరికలు పలురకాలు. అన్నిరకాల భక్తుల కోరికలను తీర్చే తల్లి కనుక శ్రీ లలితాపరమేశ్వరి వాంఛితార్ధప్రదాయిని.
ఆర్తో జిజ్ఞాసు రర్ధారీ జ్ఞానీ చ భరతర్షం” భగవద్గీత. అర్హుడు అంటే ఆపదల్లో భగవంతుని అర్చించేవాడు. జిజ్ఞాసువు అంటే పరతత్త్వాన్ని తెలుసు కోవాలనే కోరికతో ప్రార్ధించేవాడు. అర్థార్థి అంటే ధనాన్ని కోరి దేవదేవుని పూజించేవాడు. జ్ఞాని అంటే ఆత్మజ్ఞానం పొంది, పరమాత్మను ధ్యానించేవాడు – అని భక్తులను గురించి గీత ప్రవచిస్తోంది.
“అమ్మ” వాంఛితార్ధ ప్రదాయిని. “అమ్మ” మనల్ని భక్తులుగానో, శిష్యులుగానే అంగీకరించలేదు. మనల్ని, తన బిడ్డలుగా భావించింది. తన బిడ్డల కోరికలను తీర్చడం తల్లిగా తన కర్తవ్యం అనుకుంది “అమ్మ”, లోకంలో సామాన్యమైన తల్లి కూడా తన పిల్లల కోరికల్లో ఉచితమని తనకు తోచిన వాటినే నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. తన బిడ్డకు హానికలిగించేవి, వాడికి అనవసరమైనవి అని తాను అనుకున్నవాటిని తీర్చే ప్రయత్నం చేయదు; సరికదా ! తన బిడ్డ మనస్సును అటువంటివాటి నుంచి మరల్చడానికి తీవ్ర కృషి చేస్తుంది. “అమ్మ” కూడా మన యిష్టాయిష్టాలకు ప్రాధాన్యమీయకుండా, ఎప్పటి కేది ఉచితమో, అప్పటికి దాన్ని తీరుస్తూ వాంఛితార్ధప్రదాయినిగా ప్రకాశించింది.
విశ్వజనని అయిన “అమ్మ”కు ఆమె రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ముగ్గురు. వారిలో మనందరమూ మన ఆరాధ్యదేవతగా ఈనాడు ఎవరిని పూజిస్తున్నామో ఆ హైమక్క ఒకతె. “అమ్మ”ను హైమక్క తల్లిగా కంటే కూడా దైవంగా ఆరాధించింది. “ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగామారి” అని తాను “అమ్మ”కు బిడ్డగా పుట్టడం తన పూర్వజన్మ పుణ్యమని ఎన్నోసార్లు తలపోసింది. “అమ్మ”కు సేవచేసుకుంటూ “అమ్మ” సన్నిధిలో ఎక్కువగా కాలం గడపాలని కోరుకునేది. అలా గడుపుతున్న వసుంధర అక్కయ్యలాంటి వారి అదృష్టానికి “వారెంత పుణ్యం చేసుకున్నారో” అని భావించేది. అనారోగ్య కారణంగా హైమక్కడ వైద్యం నిమిత్తం ఎక్కడికో అక్కడికి పంపించేది. “అమ్మ”, అందుకు బాధపడే హైమక్క “అందుకోజాలనీ ఆనందమే నీవు, ఎందుకో చేరువై దూరమౌతావు” అని పాడుకునేది. “అమ్మ”కు ఎంత సన్నిహితంగా ఉండాలనుకుంటున్నానో అంత దూరంగా ఉంచుతోంది “అమ్మ” నన్ను అని బాధపడేది. అయితే, హైమక్క బాధ గ్రహించినా, “అమ్మ”మాత్రం హైమక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టి, వైద్యం కోసం వేరే వేరే ఊళ్ళల్లో ఉంచుతుండేది. “నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే (జోల) పాట వినిపించు నీ వేళ” అని శారీరకంగా దూరంగా ఉన్నా, మనస్సంతా “అమ్మ” భావనతో “అమ్మ” లాలనలో కాలం గడిపే హైమక్క ఎంతో గొప్ప “మిస్టిక్”. (నీలిమేఘాలలో పాట హైమక్కకు చాల ఇష్టం. దాన్ని అమ్మ పరంగా అన్వయించుకుని, పాడుకుని పరవశించేది).
“అమ్మ”కు సన్నిహితంగా ఉండాలనే కోరికతో పాటు, హైమక్కలో షిరిడీసాయిని దర్శించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అంత దూరాన ఉన్న సాయినాథుణ్ణి చూడటానికి, అనారోగ్యం కారణంగా తాను వెళ్ళడం చాలకష్టమని, తన కోరిక తీరదేమో అని అనుకునేది. ‘అమ్మ’పై అపరిమితమైన భక్తిగల హైమక్క ఆ కోరిక తీర్చే పూర్తి బాధ్యత “అమ్మ”దే అనే సంపూర్ణ విశ్వాసంతో ఉండేది. భక్తుల నమ్మకాన్ని భగవంతుడు వమ్ము చేయడు కదా! అందుకే వాంఛితార్ధప్రదాయిని అయిన “అమ్మ” షిరిడీనాథుని చూడాలనే హైమక్క కోరికను నెరవేర్చి, ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ తర్వాత కొద్దికాలానికి ఆమెకు ప్రాణాపాయ పరిస్థితిని కల్పించి, హైమక్క కోరికపైనే ఆమెను ఇహలోక కష్టాల నుంచి, దుఃఖాల నుంచి దూరం చేస్తూ, బాధల బారి నుంచి తప్పిస్తూ, హైమక్క చిరకాలవాంఛను తీరుస్తూ, తనలోకి లీనం చేసుకుంది – (5.4.1968). “అమ్మ”కు దూరంగా ఉండలేనని వ్యధచెందే హైమక్కను తనలో కలుపుకుని, హైమక్క కోరికను నెరవేర్చిన “అమ్మ” వాంఛితార్ధప్రదాయిని.