రక్తబంధంతోపాటు అనురక్తబంధంతో అమ్మకు దగ్గరయి అనన్యచింతనతో అమ్మను ఆరాధిస్తూ అమ్మ తత్త్వాన్ని పుణికిపుచ్చుకుని వాత్సల్యంతో ఆదరించి అందరి మనస్సులలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన ధన్యజీవన దుర్గపిన్ని. అమ్మ తరువాత అంతటి ప్రేమను పంచేది పినతల్లి అంటారు. అలా తన ఆదరణ ఆచరణల ద్వారా ఆ పదాల్ని సార్ధకం చేసిన వాత్సల్యమూర్తి. పిన్నికి నేనంటే ఇష్టం – అనే అభిప్రాయం ఎవరికివారికి ఉండేది. ఆబాలగోపాలానికి అలా అనిపించగలగటమే పిన్ని విశిష్టత.
అమ్మపట్ల అచంచల విశ్వాసంతో అమ్మచూపిన బాటలో ప్రయాణం సాగించి నల్గురికీ పెట్టుకోవడంలో ఉన్న తృప్తినీ, ఆనందాన్ని నిండుగా అనుభవించిన పుణ్యదంపతులు పిన్నీ, బాబాయిగారు.
అమ్మ అనంతోత్సవ కార్యక్రమాన్ని సుమారు మూడు థాబ్దాలకాలంగా నిరాఘాటంగా వైభవంగా నిర్వహించడం వీరి అకుంఠిత దీక్షను తెలియచేస్తుంది. ఆ కార్యక్రమానికి పిన్ని పేరుపేరునా అందరికీ ఫోన్‌చేసి పిలిచేది. ‘ప్రతి ఇల్లు అన్నపూర్ణాలయం కావాలి. ప్రతి గృహిణి అన్నపూర్ణ కావాలి’ అన్నమాటకు నిదర్శనమే వారి ఇల్లు.
1983 లో అమ్మ వజ్రోత్సవాల సందర్భంగా సంస్థకు ఆర్ధికతోడ్పాటుకోసం అందరం అన్ని ఊళ్ళకు కలెక్షన్స్‌కోసం వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ సందర్భంగా నన్ను, వరలక్ష్మి మేడం గారిని విజయవాడు పంపమని పిన్ని అమ్మను అడిగింది. అప్పుడు పిన్నివాళ్ళు విజయవాడలో ఉండేవారు. అమ్మ మమ్మల్ని వారింటికి పంపింది. వారింటిలో వారం రోజులున్నాము. పిన్ని, బాబాయిగారు విరాళసేకరణ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో మాటల్లో చెప్పలేమనిపిస్తుంది. ఏరోజు ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని కలవాలో తానే ఒక ప్రణాళిక రూపొందించేది. బాబాయిగారు ఒకవైపు, మేము మరొకవైపు వెళ్ళేవాళ్ళం. రూ.1,116/-లు ఇస్తామనగానే ఎంతసంతోషాన్ని పొందేరో ఇప్పటికీ కళ్ళముందు కన్పిస్తున్నట్లే ఉంటుంది. కుటుంబసభ్యులందరూ అదే స్ఫూర్తితో ఉండేవారు.
‘అమ్మ’కోసం ఏదయినా చేయాలి అని తాపత్రయ పడేవారు. వత్సల, వాత్సల్య అప్పుడు చిన్నపిల్లలే. అయినా మేము బయటనుండి వచ్చేటప్పటికి ఎంతో బాధ్యతతో భోజనాలు సిద్ధం చేసేవారు. ఎంతో ఆనందంగానూ, హాయిగానూ గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేనివి.
అందరూ తనకు కావాలి, అందరికీ తాను కావాలి అన్నట్లుగా మనందరిమధ్య మసలి మనకు దూరమయిన పిన్నికి, బాబాయిగార్కి, వారి బిడ్డగా అదేబాటలో నడచి మనందరి మనస్సులలో అనునిత్యం మెదులుతూ ఉన్న వత్సలకు నివాళులర్పిస్తున్నాను. జయహోమాత.