1. Home
  2. Articles
  3. Mother of All
  4. వాత్సల్య జలధిలో … నేను

వాత్సల్య జలధిలో … నేను

Tangirala Radha
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 2
Month : January
Issue Number : 1
Year : 2003

(గత సంచిక తరువాయి)

ఆ రోజుల్లో, కొన్ని సమయాల్లో, కొంత మందిని నాకు ప్రత్యేకంగా పిలిపించి చూపించేది. అంటే వారికి అమ్మలో ఐక్యతకు కొద్ది కాలమే వుందన్నమాట. ఇలాగే ఒకసారి నన్ను పిలిపించింది. నేను వెళ్ళిన వెంటనే “దా, నాన్నా కూర్చో” అంది. అమ్మ పాదాల దగ్గర కూర్చున్నాను. అమ్మ నావేపు కొంచెం వంగి “ఆ బాబును చూడు” అంది. కొంచెం వెనుకగా 13 ఏళ్ళ కుర్రవాడు కూర్చున్నాడు. ఎరుపు తెలుపు కలిసిన రంగులో, ఎంతో కళగా, బాగున్నాడు. అమ్మ చాలా నెమ్మదిగా “ఎన్లార్జిమెంట్’ అంది. ఖంగారుగా అమ్మవేపు చూసి “ఎప్పుడు” అన్నాను. నాకు చాలా బాధవేసింది. తర్వాత ఆ కుర్రవాడు, తల్లిదండ్రుల్తో భోజనానికి వెళ్లిపోయాడు. ఇలాంటి విషయాలలో అమ్మ నన్నే ఎందుకు చాలా సార్లు పిల్చిందో నాకు నేటికీ బోధపడలేదు. వారంరోజుల తర్వాత ఆ అబ్బాయి తండ్రి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది అమ్మకు “మా అబ్బాయి హార్ట్ ఎన్లార్జ్మెంట్’తో పోయాడని.

ఒకసారి వెంకటేశ్వర రావుగారు, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోల్ నుండి ఆఫీసు పని మీద జిల్లెళ్ళమూడి వచ్చారు. నేను వారికి ఒక రూమ్ ఇచ్చాను. ఆయన చాలా అహంకారంతో, పొగరుగా వున్నాడు. “మీ పనయిం తర్వాత చెప్పండి ‘అమ్మ’ను చూసి వెల్దురుగాని’ అన్నాను. “Let me see. If I find time, I will think it over” అన్నాడు.. ఆ తర్వాత ఆయనపని అయింతర్వాత, పాక యింటి హాల్లోకి తీసుకు వెళ్లేను. అమ్మ అక్కడే వుంది. దర్శనం కోసం వచ్చిన 10 మంది వున్నారు. ఆయన అయిష్టంగానే, వెనుకగా కూర్చున్నారు. అమ్మ తీర్థం యిస్తున్నారు. నేను అమ్మ పాదాల వద్ద కూర్చుని, “రండి, తీర్ధం తీసుకోండి” అన్నాను. “That’s alright. It’s OK” అన్నారు. “ఫర్వా లేదు రండి” నేను మళ్ళీ అన్నాను. ఆయన కొంచెం ఇబ్బందిగానే వచ్చి తీర్ధం తీసుకొని బయటకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన సతీసమేతంగా, పది రోజుల తర్వాత వచ్చారు. ఆవిడ చాలా సౌమ్యురాలు. అమ్మను చూడగలిగి నందుకు ఎంతో ఆనందించింది. నెలరోజుల తర్వాత పిల్లలతో సహా వచ్చారు. ఆవిడ అమ్మతో చెప్పింది. “మావారు ఫారెన్ వెళ్తున్నారమ్మ నెలరోజులపాటు” అని. అమ్మ “పిల్లలకి సెలవులు కదా నాన్నా. నువ్వు వచ్చేంత వరకు పిల్లల్ని, అమ్మాయిని యిక్కడే వుంచవచ్చు. పిల్లలు ఆవరణంలో పిల్లలతో కలసి ఆడుకుంటారు” అని. ఆయన “నేను ఏర్పాటు చేశానమ్మా. ఓడరేవులో గెస్ట్ హౌస్లోలో వుంచుతున్నాను” అన్నారు. అమ్మ “నీ యిష్టం నాన్నా. ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు. ఆవరణం అంతా తిరగ వచ్చు. అమ్మాయి (వారి భార్య) నా దగ్గర వుంటుంది, ఆపైన నీ యిష్టం” అని. తర్వాత ఆయన వెళ్లిపోయారు. 3 నెలల తర్వాత ఆయన భార్యతో వచ్చారు. చాలా చిక్కిపోయాడు. అమ్మ పాదాలపై పడి చాలా యేడ్చాడు. ఆయన కొడుకు (13 సం॥) ఓడరేవులో సముద్రంలో ఆడుకుంటూ అమ్మలో ఐక్యమయ్యాడు. ఇలాంటి సంఘటనలు జరుగుతూండేవి. వీటిలో

చాలా సంఘటనలకు ముందు అమ్మ సూచనలతో నాకు అర్థమయ్యేవి, వారు అమ్మలోకి ప్రయాణానికి సిద్ధమౌతున్నారని.

అక్కడ వుండే రోజుల్లో అనేకమైన శుభకార్యాల్లో వివాహాలు చాలా మందికి చేసేది. ఆర్థికంగా ఇబ్బంది లేక అన్ని వసతులు వున్నవాళ్ళకి ఏ సమస్య లేదు. ఒక్కొక్కప్పుడు ఆర్థికంగా ఏ స్తోమత లేని వారు యిరువైపులవాళ్ళు వచ్చేవాళ్ళు. మాకు వాళ్ళ వివాహం చాలా ఆనందాన్నీ, తృప్తి నిచ్చేది. నేను సన్నాయి కార్యక్రమాలు ముందే టేప్ చేసి రెడీగా వుంచేవాణ్ణి. నేను సరే అర్చకుణ్ణి! మా వాద్యబృందం టేప్ రికార్డర్, ఆవరణంలో వాళ్ళు ఆడపెళ్ళివారుగా, మొగపెళ్ళివారుగా వుండేవారు. అమ్మ పాదాల దగ్గర వారి వివాహం అత్యంత వైభవంగా జరిగేది. అమ్మ పెళ్ళికొడుక్కి బట్టలు పెట్టింది. అంతే కాదు కొత్త దంపతులు కదా, వారి ఖర్చులకోసం కొంచెం డబ్బు కూడా యిచ్చేది. పెళ్ళి కూతురుకి పట్టు చీర, కట్టుడు చీర, తన చేతుల నుండి బంగారు గాజులు యిచ్చేది. ఇవి వాళ్ళు ఎన్నడూ ఊహించనివి. ఎంత అదృష్టవంతులో వాళ్ళు. తర్వాత వాళ్ళందరికి భోజనాలు ఆవరణంలో వాళ్ళు అందరూ, తమ యింట్లో జరుగుతున్నట్లే ఆనందంతో ఆ పెళ్ళి కార్యక్రమంలో పాల్గొనేవారు.

ఇలా నేను అర్చకుడి స్థానంలో సంవత్సరంపైగా కూర్చునే అవకాశం యిచ్చింది. అమ్మ. అనేక కార్యక్రమాలు పసిపాపల అన్నప్రాసన, బాలసారే, నామకరణం, అక్షరాభ్యాసం, తర్వాత ఉపనయనాలు, వివాహాలు, అమ్మకు వివిధ రకాలుగా పూజలు, మొదలైన వాటన్నిటిలోనూ అమ్మ పాదాల దగ్గర కూర్చుని, నేను డ్యూటీగా మాత్రం, నిర్వహించే వాణ్ణి. అమ్మను చూస్తూ వుండటం, అమ్మ మాటలు (ధ్వని) వినడంలో వున్న ఆనందం, సంతోషం, అరక స్థానంలో అనుభవించలేదు. ఇలా చాలా కాలం తర్వాత, ఒక రోజు, అమ్మ పాకయింటి హాల్లో, అమ్మను దర్శించిన సోదరీ సోదరులంతా భోజనాలకి వెళ్ళిపోయారు. అమ్మ, నేను, వున్నాం. ప్రశాంతంగా వుంది. అమ్మ పూల రేకులు తన పాదాలపై వేసుకుంటూ యేవో ఆలోచిస్తోంది. పదిహేను నిమిషాలు.

నేను : అమ్మా ! ఏంటి ఆలోచిస్తున్నావు ?

(అమ్మ దగ్గర నుండి సమాధానం లేదు. నేను మళ్ళీ అదే ప్రశ్న అడిగాను) A

అమ్మ: (నావేపు చూసి నవ్వుతూ) నాన్నా, యింత మంది చేత పూజలు చేయిస్తున్నావు. చేయించావు, నీకు ఎప్పుడూ పూజ చేసుకోవాలని అనిపించలేదా? (ఎంతో వాత్సల్యంతో అడిగింది)

నేను : ఏంటోనమ్మా ! నాకు ఎప్పుడూ ఈ ఆలోచన లేదు. నిత్యం నిన్ను చూడాలని, నువ్వు మాట్లాడుతూంటే నీ స్వరం వినాలి అనే తప్ప, చేసే దంతా, నేను కాదు, నువ్వు చేయిస్తున్నావు. అనే ఆలోచన కూడా లేకుండా, చేతులు కదులుతున్నాయి. కళ్లు చూస్తున్నాయి. నోరు అవసరాన్ని బట్టి మాట్లాడుతోంది. నేనేం చేయ్యనమ్మా. నాకు ఆకలి వేసినప్పుడు నిన్ను దర్శించడానికి వస్తున్న వాళ్ళు వున్నా కూడా, ముందు నేను అన్నం తిన్న తర్వాతే నీ దగ్గర పూజలు చేయించబడతాయి. వీళ్ళందరూ హాల్లోంచి వెళ్ళిన వెంటనే నిద్రలోకి వెళ్ళటం జరుగుతోంది. నీకు ఎలా కావాలంటే అలా నడిపించు. నేను ఎందుకు, ఏమిటి అని ఆలోచించలేదు (ఇది జరిగిన తర్వాత నేను రెండు నెలలు 24 గంటల్లో 20 గంటలు నిద్రలో వుండేవాణ్ణి) ఒక్కొక్కప్పుడు స్నానం చేసి వచ్చి అమ్మ హాల్లోనే నిద్రపోయేవాణ్ణి తలుపులు వేసి. అమ్మను చూడడానికి వచ్చేవాళ్ళు బయట వరండాలోనే నిరీక్షిస్తూ ఉండేవాళ్ళు. అమ్మ హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత వరలక్ష్మి, వసుంధర వచ్చి లేపే వాళ్ళు. నేను నిద్రలేచి, పూజలు నిర్వహించే వాణ్ణి. వాళ్ళు వెళ్లిన వెంటనే మళ్ళీ నిద్రలోకి వెళ్ళేవాణ్ణి. ఈ ప్రక్రియ తర్వాత నేను నిత్యం మెళుకువగానే ఉండేవాణ్ణి. అంటే, అమ్మని స్నానాల గదిలోకి తీసుకువెళ్ళడం, టూత్ పేస్ట్ అవీ యిచ్చి బ్రష్ చేసేంతవరకు, తర్వాత అమ్మ సబ్బుతో మొహం కడుక్కునేది. చంద్రబింబంలాగా ఒక్క సెకండులో చక్కగా బొట్టు పెట్టుకునేది. మంగళ సూత్రాల పై గ్లాసుతో కొంచెం నీళ్ళుపోసి, కళ్ళకద్దుకుని తీర్థంగా స్వీకరించేది. నెమ్మదిగా వెనుకగదిలోకి వచ్చి కూర్చునేది. వరలక్ష్మి అమ్మకు నాకు రెండు గ్లాసుల్లో కాఫీ యిచ్చేది. అమ్మ తను కొంచెం తాగిన తర్వాత నా గ్లాసులో కొంచెం పోసిన తర్వాత నేను తాగేవాణ్ణి. రోజంతా పూజా కార్యక్రమాలతోబాటు ఆవరణంలో పనులు చూసి మళ్ళీ రాత్రి అమ్మ గదిలోనే అమ్మను చూస్తూ కూర్చునే వాణ్ణి. అప్పుడప్పుడు కొంచెం కునుకు వచ్చినా, అమ్మ చెయ్యి కదిలినప్పుడు వచ్చిన గాజుల శబ్దానికి వెంటనే మెళుకువలోకి వచ్చేవాణ్ణి. ఇలా, కంటి రెప్ప వెయ్యకుండా, రెండు నెలలపాటు వున్నాను. కానీ నాకు ఎప్పుడూ శ్రమ అనిపించేదిగాదు. అమ్మ నాకు, యింతకు పూర్వం వివరించినట్లు స్నానాలగదిలో ఒడుగు చెయ్యడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడం కోసమా? అని నవ్వుతూ అమ్మ కళ్ళలోకి చూశాను.

అమ్మ నా తలనిమురుతూ, “నీకు యివన్నీ అక్కర్లేదులే నాన్నా” అంది. (కానీ, నేను అమ్మా ఎందుకు యిలా అంటున్నదా అని ఎప్పుడూ ఆలోచించలేదు. నేటి వరకు పూజ అనేది ఎట్లా చెయ్యాలో నాకు తెలియదు, అందరూ పూజ చేస్తూంటే ఆనందించటం తప్ప). ఈ విషయాలు ఈ రోజు రాస్తూంటే 1967లో జరిగిన చిన్న సన్నివేశం జ్ఞాపకం వస్తోంది. వాటిని గురించి రాసి మళ్ళీ వెనక్కి వస్తాను.. అన్నీ అవసరమే

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!