1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ యోగా దినోత్సవం)

విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ యోగా దినోత్సవం)

V Pavani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : July
Issue Number : 12
Year : 2022

“వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్ । 

ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్ ||

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ‘యోగా’ అనేది ఒక అత్యుత్తమమైన సాధనం. ప్రపంచ దేశాలన్నీ ఏకమై జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా Spiritual Master, HRM Trainer శ్రీమతి S.P.అన్నపూర్ణ గారు మరియు సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సిద్ధార్థ గారు పాల్గొన్నారు. సభలో శ్రీమతి అన్నపూర్ణ గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ సాధకులకు, జిజ్ఞాసులకు ఆలవాలమైన మన భారతదేశంలో నాల్గవ శతాబ్దంలో పతంజలి మహర్షి యోగసూత్రాలను మనకు అందించారని యోగ సాధనతో సాధించలేనిది లేదని తెలియజేశారు. సత్యం, ధర్మం, శీలం అనే మూడు సూత్రాల కలయికతో జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని పొందాలని వివరించారు. శ్రీ సిద్దార్థ్ గారు తాను తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల గ్రామం నుంచి అందరినీ విద్యావంతులను చేయాలనే ఒక లక్ష్యంతో బయలుదేరి ముందుకు వెళుతున్న తనకు ఈరోజున మన ఆశ్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మ అందించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని జ్ఞాన ప్రమిదలుగా అందరూ వెలుగొందాలని చెప్పారు. అనంతరం కళాశాల చరిత్ర అధ్యాపకులు P. సుందరరావుగారు మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యం ఉంటుందని, అది యోగా ద్వారానే సాధ్యమని పలు ఉదాహరణలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగ ఆవశ్యకత, షట్చక్రాలు, సూర్య నమస్కారాలు వంటి పలు అంశాలలో వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈపోటీలకు డా.A. హనమత్ప్రసాద్ గారు, శ్రీమతి.L.మృదుల గారు, శ్రీమతి.M.కవిత గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగు అధ్యాపకులు I.V.S. శాస్త్రి గారు సభానిర్వహణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.