1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వినిర్మల హృదయ – శ్రీమతి విఠాల శేషారత్నంగారు

వినిర్మల హృదయ – శ్రీమతి విఠాల శేషారత్నంగారు

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : August
Issue Number : 1
Year : 2022

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారి ధర్మపత్ని శ్రీమతి శేషారత్నం గారు. ఆమె 16 ఏళ్ళ వయస్సులోనే జిల్లెళ్ళమూడి కాపురానికి వచ్చారు. కాగా ఆమెకు 12 వ ఏటనే మాతృవియోగం కలిగింది.

శ్రీరామచంద్రమూర్తి గారు ప్రప్రథమంగా శేషారత్నంగారిని అమ్మ దర్శనానికి తీసికొని వెళ్ళారు. అది ఒక మహనీయమైన చిరస్మరణీయ సందర్భం. ఆ సమయంలో రామకృష్ణ అన్నయ్య అమ్మతో, “అమ్మా! శేషుకి అమ్మ లేదమ్మా. తల్లిలేని పిల్ల” అన్నాడు జాలిగా. వెంటనే అమ్మ, “శేషుకి నేనే అమ్మని” అంటూ ఆమెను దగ్గరకు తీసికొని, “నేను నీకు అమ్మని. నువ్వు నాకు హైమవు. అమ్మ లేదని ఎప్పుడూ నువ్వు అనుకోకమ్మా” అని చెప్పింది.

ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏమంటే “నేను నీకు అమ్మని, నువ్వు నాకు బిడ్డవు” అని మాత్రమే అనలేదు. “నేను నీకు అమ్మని, నువ్వు నాకు హైమవు” అన్నది. ఇది ఒక విలక్షణమైన విశిష్టమైన మాతా. శిశు బంధ విశేషం.

అంతేకాదు. “అనంత సంతాన సౌభాగ్యశాలి,

పరిమిత సంతాన మేల కన్నావూ?” అని “తులసీదళాలు” గేయంలో వేసిన ప్రశ్నకు ఇక్కడ అద్భుతమైన సమాధానం గోచరిస్తుంది. బాహ్యదృష్టికి అమ్మ ముగ్గురు బిడ్డల తల్లిగా కనపడుతుంది.

తన కడుపున పుట్టిన ‘హైమ’ ఉన్నది కాబట్టే తనకు ‘హైమ’ ఎంతో ‘శేషు’ కూడా అంతే అని పోల్చి స్పష్టంగా చెప్పడానికి ఆధారం ఉన్నది. కార్తీక దీపప్రభ వలె ఇందు ఒక అద్భుత సత్యం అంతర్లీనంగా ప్రకాశిస్తోంది. అమ్మ మాట సార్వత్రికము, సార్వజనీనము. ఆడపిల్లలందరూ ‘హైమ’ వంటి వారే, మగపిల్లలందరూ ‘సుబ్బారావు అన్నయ్య’, ‘రవి అన్నయ్య’ వంటివారే – అని తెలుస్తోంది.

ఒక ఆడపిలకి వివాహమై కాపురానికి వెళ్ళినతర్వాత, ముఖ్యంగా తనూ ఒక తల్లి అయిన తర్వాత, కన్నతల్లి అవసరం ఆదరణ ఎంతో ఆవశ్యకం. ఆ లోటుని, వెలితిని అమ్మ భర్తీ చేసింది. కనుకనే సోదరి శేషారత్నం ‘అమ్మ’నే తన కన్నతల్లిగా తన మనోమందరింలో ప్రతిష్ఠించుకున్నారు. వారి పాప చి|| పావని అమ్మని ‘మా బామ్మ’, ‘మా బామ్మ’ అంటూ సుబ్బారావు అన్నయ్య, రవి అన్నయ్యగారి పిల్లలతో పోట్లాడేది. చిన్నారి అమ్మకి దణ్ణం పెట్టుకుని “నాకు ఒక ఆపిల్పండు తే” అనేది అంటే అంత చనువు, బంధం ఉన్నాయి.

సోదరి శేషారత్నం ఆరుగురు అన్నయ్యల మధ్య గారాబంగా పెరగటం వలన ప్రేమలు, విలువలు, అనుబంధాలు బాగా తెలుసు. పూజలూ, అభిషేకాలూ, అర్చనలూ పై అంత మక్కువ లేదు. జిల్లెళ్ళమూడి వచ్చిన తర్వాత అమ్మ సన్నిధిలో జరిగే పూజలు, ఉత్సవాలు, పండుగలు, సేవాకార్యక్రమాలలో స్వచ్ఛందంగా ఇష్టంగా పాల్గొనేవారు. అందువలన భర్తకి వండి, వడ్డించటంలో జాప్యం కలిగేది.

ఆ సందర్భంలో అమ్మ, “అబ్బాయి (నీ భర్త)కి చేసుకోవడమే నీకు పూజమ్మా. అబ్బాయిని చూసుకుంటే నీవు అన్ని పూజలూ చేసినట్లే. చేసి బాధ పడవద్దు. చేయకుండా సంతోషంగా ఉండు” అని ఒక మహోూపదేశం చేసింది. అమ్మలో సహజంగా దీపించే విశేష లక్షణాంశం ఇదొకటి. ఎవరికైనా స్వధర్మాచరణే కర్తవ్యం / దైవారాధన – అనేది అమ్మ దివ్యప్రబోధ సారం.

అమ్మ ఆచరణాత్మక ప్రబోధాన్ని సోదరి శేషారత్నం యధాశక్తి ఆచరణలో పెట్టారు. కాలేజీ విద్యార్థులు జబ్బుపడితే వాళ్ళ పథ్యపానాదులు ఆదరంగా చేసిపెట్టేవారు. శ్రీలక్ష్మణ యతీంద్రులు వంటి విశిష్ట అతిథులు వస్తే వారికి భోజనభాజనాదులను వారింట్లోనే ఏర్పాటుచేసేవారు. ఇంటికి వచ్చిన వారికి ఆదరంగా అన్నంపెట్టడం, బట్టలు పెట్టి సమ్మానించిడం వారికి అలవాటైంది. అలా చేయకపోతే తప్పుచేసినట్లు భావించేవారు. సోదరి శేషారత్నం గారు – ప్రత్యక్షంగా అమ్మను (దైవాన్ని) పూజించారు, భర్తను దైవంగా సేవించారు, విద్యార్థులను కన్నబిడ్డలుగా ఆదరించారు.

సోదరి శేషారత్నం నిండైన వ్యక్తిత్వం, పరిపూర్ణ మానవత్వం గల యోషారత్నం. వారు 04-07-2023న జపాన్లో కుమారుని చెంత అమ్మలో ఐక్యమైనారు.

ఆదర్శ ఆత్మీయ సోదరికి ఇదే సాశ్రునివాళి.

– సంపాదక మండలి (రచన: ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!