1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విరామం ఎరుగని ‘రాము’

విరామం ఎరుగని ‘రాము’

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : September
Issue Number : 2
Year : 2015

అమ్మకి సహస్ర ఘటాభిషేకం, ధాన్యాభిషేకం, అన్నాభిషేకం వంటి ఉత్సవాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందు పాల్గొనే వారికి సహాయం చేయటమే తనకి తృప్తిగా నిలిచిన సంతృప్త జీవనుడు;

పగలూ రాత్రీ అనీ; ఆవరణలోని వారూ – గ్రామస్థులూ అనీ తేడా లేక ఎల్లరూ తత్కాలవైద్యం కోసం, మందుల కోసం, ప్రధమ చికిత్స కోసం దరిజేరే బంధువు.

వరదలూ, అగ్నిప్రమాదాలూ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు బాధితులకు అమ్మ ఆపన్నహస్తాన్ని అందించిన మనస్వి;

మాతృశ్రీ మెడికల్ సెంటర్కి అనుబంధం ఉండే అంబులెన్సును నడిపి అత్యవసర సమయాల్లో రోగులను గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ సైతం తీసుకువెళ్ళి వైద్యనిపుణుల సహాయాన్ని కల్గించిన ఆప్తుడు;

హైమాలయ ప్రాంగణంలో అఖండనామసంకీర్తన సౌలభ్యం కోసం చక్కని అమ్మ నామాన్ని ట్యూన్ చేయించి స్టూడియోలో రికార్డు చేయించి ఒక ఆదర్శనమూనాను అందించిన అనుజుడు; తప్పనిసరి పరిస్థితిలో సంస్థ పనిమీద సరకులను చేరవేయడం, వ్యక్తుల్ని గమ్యం చేర్చడం వంటి క్రియల నిస్వార్థసేవారూపం ఎవరు? సో॥మతుకుమల్లి రాము.

“విరామం లేనిది రామం” అంటుంది అమ్మ. ‘రామ’ శబ్దం ఎవరి నామధేయంలో ఉంటుందో వారు నిర్విరామంగా గ్లాని, శ్రాంతి లేకుండా శ్రమిస్తారు. అమ్మ సూక్తి సో॥రాముపరంగా అక్షరసత్యం.

సో॥మల్లు, సో॥రాము ఇరువురు రైట్ సోదరులవలె కలసి మెలిసి ఆ రోజుల్లో సంస్థ వ్యాన్ నడపటం దగ్గర నుంచి, విద్యుత్ సరఫరా – పరికరాలు, యంత్రాల వాడకం, బాపట్ల వెళ్ళి అన్నపూర్ణాలయానికి అవసరమైన తాజాకూరగాయల్ని బేరం చేసి తేవడం, ధనుర్మాసంలో చలిగాలిలో గ్రామచెరువు నుంచి బిందె తీర్థం తేవడంవరకు అమ్మ సేవాకార్యక్రమాల్లో దూసుకుపోయేవాళ్ళు – కష్టనష్టాలూ – సాధ్యాసాధ్యాలూ లెక్కచేయకుండా.

  ‘విశ్వజనని’ అమ్మ టెలిఫిల్మ్ నిరుపేద పాత్రను పోషించాడు. ఆ చిత్ర నిర్మాణబృందానికి 15 రోజులూ తన సహాయ సహకారాల నందించాడు.

ఎమ్.ఎమ్.సి.లో డాక్టర్ ఎ. ఇనజకుమారి, ఎమ్.బి.బి.యస్, పాపక్కయ్య వద్ద కాంపౌండర్గా పనిచేస్తూ రోగులకు మందులివ్వడం, సేవచేయడం, జిల్లెళ్ళమూడి పరిసర గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాల్ని వైద్యనిపుణుల సహకారంతో నిర్వహించటంలో విశేషమైన కృషిచేశాడు. 1980లో అమ్మకి Lung Abscess వలన తీవ్రఅనారోగ్యం చేసింది. అమ్మకి తరచు X-Ray తీయటం తప్పనిసరి అయింది. కనుక జిల్లెళ్ళమూడిలో ఎక్స్ ప్లాంట్ని స్థాపించారు. ఆ యంత్ర పనితీరు అధ్యయనం కోసం గుంటూరు వెళ్ళి ప్రత్యేక శిక్షణ పొందాడు. అమ్మ తన అమృతహస్తాలతో ఎక్స్ ప్లాంట్ని ప్రారంభించాక, అమ్మకే తొలి ఎక్స్రే తీశాడు; తర్వాత అనేకసార్లు అమ్మకీ అమ్మ బిడ్డలకీ. సో॥ శ్రీ మతుకుమల్లి రాము అమ్మకి బంధువు. మేనల్లుడు; అమ్మ పెద్దకోడలు శ్రీమతి బ్రహ్మాండం శేషు తమ్ముడు. అయినా తనకి ఏ భేషజమూ లేదు. అతి సామాన్యునిలా అందరింటి సోదరునిగా కలిసి మెలిసి తిరిగేవాడు.

అంత ఉత్సాహంగా పనిచేసే సో॥రాముకి 2010లో హృద్రోగం వచ్చింది. గుండె సంబంధమైన నరం బాగా బలహీనంగా ఉందని, అతడు జీవించి ఉండటమే ఆశ్చర్యకరమని వైద్యులు స్పష్టం చేశారు; మందులు వాడితే కొంత ఉపయోగం అన్నారు.”

13 ఏళ్ళ ప్రాయంలోనే అమ్మ సేవలో ప్రవేశించి, అమ్మయందలి అచంచలభక్తి విశ్వాసంతో ఆఖరిక్షణం వరకు శ్రమించి అమ్మ నడయాడిన పవిత్ర స్థలి జిల్లెళ్ళమూడి గడ్డపై జీవించి 14.8.2015వ తేదీన సో॥రాము అంతిమశ్వాస విడిచాడు. అన్నిరంగాల్లో అన్నిపాత్రలకి న్యాయం చేసిన రాము తన సహధర్మచారిణి శారదకి అన్యాయం చేశాడు. ఆ సోదరి అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది. ‘అమ్మ పూజావిధానం’ గ్రంథ ప్రచురణకు తనే కారణం. నిత్యం హైమాలయంలో పూజలూ, వ్రతాలూ, అభిషేకాలూ, అర్చనలూ, ఆరాధనలను దీక్షగా చేస్తుంది. అటు శేషు అక్కయ్య మాట, ఇటు శారదమాట రాము లక్ష్యపెట్టలేదు. తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి “నాకేంటండీ? నాకేమీలేదు. వీళ్ళందరికీ భయం” అనేవాడు.

అమ్మ పావన పాదపద్మ సమాశ్రయులంతా సార్థక జీవనులే; సంస్కారరూప మాణిక్యప్రకాశాలే; దివ్య మాతృతత్త్వ రూప సానబెట్టిన వజ్రాలే – అలా కనిపించినా, కనిపించకపోయినా.

నిరాడంబరమూర్తి, సౌజన్యస్ఫూర్తి అనుంగు సోదరుడు రాముకి ఇదే సాశ్రునివాళి.

(“Matukumalli Ramu, the adorable’ వ్యాసరచయిత శ్రీదినకర్ అన్నయ్యకి కృతజ్ఞతలు)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!