పూజ్యసద్గురు శ్రీ శివానన్దమూర్తి గారి హితోక్తి “కన్నులు తెరిస్తే సమాజసేవ చెయ్యి, కన్నులు మూస్తే ఈశ్వరుని స్మరించు” – శ్రీ భట్టిప్రోలు రామచంద్ర (రాము) గారికి అక్షరాలా వర్తిస్తాయి.
విశేషలోకజ్ఞానం, స్మితపూర్వాభిభాషణం, వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు – ఆత్మీయ బంధాలు, మంచి మనస్సు, పరోపకారపారీణత, అలుపు లేని అవిశ్రాంత కృషి, కార్యదీక్షాదక్షత వంటి ఎన్నో ఆదర్శ గుణాల మేలుకలయిక శ్రీ రామచంద్ర.
‘పితా త్వం మాతా త్వం త్వ మసి సకలో బాంధవ జనో
గురుస్త్వం దేవస్త్వం త్వ మసి విభుర్మిత్ర మపి చ
మదీయం సర్వస్వం త్వమసి పరమేశాని! జనని!
వినా త్వాం త్రైలోక్యే నహి నహి శరణ్యం మయి శివే – (శృంగారలహరి – 12వ శ్లోకం) – అని అమ్మను త్రికరణశుద్ధిగా ప్రార్థించారు, విశ్వసించారు. కానీ వ్యాసాలు వ్రాయలేదు, ప్రసంగాలు చేయలేదు, మండల దీక్షలు, పారాయణలు చేయలేదు.
మరి, అమ్మను ఏ రీతిగా ఆరాధించారు? ‘ప్రపంచ అభ్యుదయానికి జిల్లెళ్ళమూడి పుణ్యక్షేత్రం, కేంద్రం, మూలం. అచ్చట అమ్మ నెలకొల్పిన ప్రజాహిత సంస్థల నిర్మాణము – నిర్వహణ, అందరింటి సభ్యుల శ్రేయోభి వృద్ధుల గురించి శ్రమించడం అంటే శ్రీ మాతృ శ్రీచరణసేవే కదా!’ అనే సాధనా మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక ఉదాహరణ. జిల్లెళ్ళమూడిలో T.T.D. కళ్యాణ మంటపానికి అనుబంధంగా Kitchen – Dining Hall కోసం Budget మంజూరైనది. కాని, ఆ budget చాలనందున Contractor ఎవరూ ముందుకు రాలేదు. తదనంతర కాలంలో రాముగారు ఆ file ని తిరగతోడి, అదనంగా అవసరమైన 10/15 లక్షల నిధిని సమకూర్చి శ్రమకోర్చి ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా నిలబెట్టారు.
రాముగారికి అమ్మ ఉపనయనం చేసి జ్ఞానభిక్షతో పాటు, సకల సంపదలను ప్రసాదించింది. శ్రీ రామచంద్ర సార్థక నామధేయులు. శ్రీరామచంద్రుని దివ్యగుణగానం చేస్తూ వాల్మీకి మహర్షి, ‘రక్షితా జీవలోకస్య స్వజనస్య చ రక్షితా’ – అన్నారు. అదే బాటలో రాముగారు భార్యాబిడ్డలకు బంధువులకే కాదు, యథాశక్తి ఆపన్నులకు తమ సేవలు, సహాయ సహకారాల్ని అందించారు. వారందరికీ అవి చిరస్మరణీయములు. వారి కార్యదీక్ష అనన్య సామాన్యం. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కార్యదర్శిగా పనిచేస్తూ కార్యాలయ కార్యభారాన్ని భుజాన వేసుకుని విశ్వవిద్యాలయానికి వెళ్ళి సామ దాన భేద దండోపాయాల్ని ప్రయోగించి సాధించేవారు. మంచి మాటలు చెప్పేవారు, Rule position గుర్తు చేసేవారు, మొండికేస్తే రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధుల చే మొట్టికాయలు వేయించేవారు. కనుకనే వారంటే ఎందరికో భయభక్తులున్నాయి.
వ్యక్తిగతంగా ఆయన నా యొక్క క్లిష్ట సమస్యలను అవలీలగా పరిష్కరించి గట్టెక్కించారు. ఎదుటి వ్యక్తిని గౌరవించటమే తన గౌరవంగా భావించారు. ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకమండలిలో వారి ధర్మపత్ని శ్రీమతి బి. యల్. సుగుణగారిని చేర్చుటకు వారి అంగీకారాన్ని కోరాను. వెంటనే ఆయన చిరునవ్వుతో “సరే, నా అనుమతి ఎందుకండి ? మీరు ఏది మంచి దనుకుంటే అలాగే చేయండి” అన్నారు.
అసహాయులైన పిన్నలు, పెద్దలు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు…. ఎందరికో ఆయన దన్నుగా నిలిచి నిలబెట్టి, వారి జీవనయానంలో వెలుగులు నింపారు. “విరామం లేనిది రామం” అనే అమ్మ ప్రబోధానికి ప్రత్యక్ష ఉదాహరణ రాము గారు. వారి తపన, కృషి అంతా దీనజనావని అమ్మ ఆశయసాధనే, శ్రీమాతృ వదార్చనే!
విశ్వకళ్యాణకారక తన లక్ష్యసాధనకు అహరహం శ్రమించే వారంటే పరాత్పరి అమ్మకి చాలా ఇష్టం. అందుకేనేమో – పూర్తిగా వండని నిండని వయస్సులో 6-6-23 న ‘సర్వానుల్లంఘ్యశాసన’ అమ్మ రాము గారిని తనలో ఐక్యం చేసుకున్నది.
విరామం లేని ‘రాము’ గారికి ఆత్మీయ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
—
అమ్మలో ఐక్యం
- మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆఫీసు సీనియర్ అసిస్టెంటుగా సేవలందించిన అందరింటి సోదరులు, సౌజన్యమూర్తి శ్రీ వన్నాల లాల్బాదరీకేదార్ నాథ్ గారు 20.6.2023వ తేదీ సాయంత్రం : అమ్మలో ఐక్యం అయ్యారు.
- విశ్రాంత మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ విఠాల రామచంద్రమూర్తి, గారి ధర్మపత్ని శ్రీమతి శేషారత్నం గారు 4-7-2023న జపాన్లో కుమారుని చెంత అమ్మలో ఐక్యమైనారు. శ్రీమతి శేషారత్నం గారు అమ్మకు సన్నిహితంగా ఉంటూ ఎన్నో సేవలు చేశారు. ఆమె కళాశాల విద్యార్థులను కన్నబిడ్డలుగా ఆదరించారు.
పై వారి కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తోంది.