దయాగుణ సంపన్నుడు, స్వధర్మ నిరతుడు, కళాభిమాని, వృక్ష- పశుపోషణానురక్తుడు, శ్రీ మాతృసేవా తత్పరుడు శ్రీ భట్టిప్రోలు చలపతిరావుగారు. – మా నాన్నగారు.
అప్పికట్లలో ఉపాధ్యాయవృత్తిని చేపట్టి. అంకితభావంతో విద్యుక్తధర్మాన్ని నిర్వహిస్తూ విద్యార్థులచే ‘గురుదేవోభవ’ అనీ, బిడ్డలచే ‘పితృదేవోభవ’ అనీ నీరాజనాలందుకున్నారు.
వారి దయాగుణము పరోపకార పారీణత వారిని ”పరమేశ్వరి ‘అమ్మ’ శ్రీచరణ సాన్నిధ్యానికి చేర్చాయి. శ్రీ కొండముది రామకృష్ణ మామయ్య మార్గదర్శనంతో జిల్లెళ్ళమూడికి చేరువైనారు. మదినిండా అమ్మను నింపుకుని, ఆచరణలో రామకృష్ణమామయ్యకు తోడుగా జీవితాన్ని అమ్మ శ్రీచరణకమలార్చనగా సాగించారు.
పదవీవిరమణ చేసిన తరువాత కొన్నాళ్ళు జిల్లెళ్ళమూడిలోనే ఉంటూ తోటవని చూసుకుంటూ ఆలయాలకు అవసరమైన పూలు, కొబ్బరికాయలు సమర్పించేవారు, పశుపోషణ చేస్తూ అన్నపూర్ణాలయ నిర్వహణకి పాలు సమకూర్చేవారు.
వారి సంతానం వివాహాది శుభకార్యములను అమ్మ సన్నిధిలోనే నిర్వహించుకున్నారు. వారికి అమ్మే సర్వస్వం. అమ్మ అలాంటి అనుభవాలను ప్రసాదించింది. : ఒకసారి తిరుపతి వెళ్లామని మ్రొక్కుకుని అమ్మదగ్గరకు వెళ్ళి “అమ్మా! తిరుపతి వెళ్ళాలి, మ్రొక్కుఉంది” అని అన్నారు. అప్పుడు అమ్మ “ఎక్కడికీ అవసరంలేదు, నాన్నా. ఇదే తిరుపతి. కత్తెర తీసుకురా”అని మూడు కత్తెరలతో కేశఖండన (కేశఖండన) చేసింది.
ఆ తరువాత కాలంలో ఆయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్లామని విశ్వప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు.
‘నీ పాదకమల సేవయు,
నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం
తాపార భూతదయయును,
తాపస మందార! నాకు దయసేయగదే’ అని అమ్మను కోరుకున్నారేమో! ఆ మూడింటిని అమ్మ అనుగ్రహించింది. అమ్మ శరీరత్యాగం చేసిన దరిమలా సంస్థ నిర్వహణకోసం రామకృష్ణ మామయ్యతో కలిసి తెనాలి ప్రాంతంలో విరాళాలు సేకరించడంలో ప్రధానపాత్ర వహించారు.
“తండ్రి! హరిజేరు మనియెడి తండ్రి తండ్రి”.. అన్నట్లు మా నాన్నగారి ఆశీః ఫలితంగా వారి సంతానం, మా సంతానం…. అంతా అమ్మ శ్రీచరణ సమాశ్రయ భాగ్యాన్ని పొందాము
తన 92 వ ఏట మా నాన్నగారు 21-04-2021 న తుదిశ్వాసవిడిచి అమ్మలో లీనమైనారు. వారి అంతిమ క్షణాల్లో సహితం ‘అమ్మ’అనుగ్రహ వీక్షణాలు వారిపై ప్రసరించాయి. వారు నిద్రలోనే దీర్ఘనిద్రపోయారు. ‘అనాయానేన మరణం వినాదైన్యేన జీవనం అన్నట్లు ఆ రెండింటిని అమ్మ అనుగ్రహించింది.
ఒక కంటి వెంట కన్నతండ్రి కనుమరుగైనారని దుఃఖాశ్రువులు, రెండవకంటి వెంట అమ్మ బొజ్జలోకి మహాప్రస్థానం చేసినారని ఆనందాశ్రువులు వర్షిస్తున్నాయి.
పితృదేవోభవ అని నాన్నగారికీ, శ్రీమాత్రేనమః అని జగజ్జననీ అమ్మకీ త్రికరణశుద్ధిగా సహస్రాధిక నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను.