1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వివిధ ప్రాంతాల వార్తలు (శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో అమ్మ తత్వ చింతన సదస్సు)

వివిధ ప్రాంతాల వార్తలు (శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో అమ్మ తత్వ చింతన సదస్సు)

Arkapuri Vilekari
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : August
Issue Number : 1
Year : 2013

అమ్మ సందేశం విశ్వవ్యాప్తం కావాలనే లక్ష్యంతో శ్రీ విశ్వజననీ పరిషత్కు అనుబంధంగా ఇటీవల “అమ్మ తత్త్వప్రచారసమితి” రూపుదిద్దుకున్న సంగతి పాఠకులకు విదితమే. అమ్మ సంకల్పం మేరకు ఏర్పడిన ఈ సమితిలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులదే ప్రధాన భాగస్వామ్యం. గత సంవత్సరం జూన్ విశాఖపట్నంలో మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పూర్వ విద్యార్థులే కీలకమైన పాత్రను నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జూన్ 23వ తేదీ ఆదివారం నాడు “ప్రచార సమితి పాలకొండ” ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు “అమ్మ తత్త్వచింతన సదస్సు”ను నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మపూజతో సదస్సు శ్రీకారం చుట్టుకున్నది. పూర్వ విద్యార్థులు సర్వశ్రీ బౌరోతు శంకరరావు, దత్తి సూర్యనారాయణ, పట్నాన కృష్ణ, టి. సూర్యనారాయణ, అరటికట్ల కామేశ్వరరావు ప్రభృతులు సదస్సు నిర్వహణ బాధ్యతను స్వీకరించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పూర్వవిద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.

శ్రీ వేంకటేశ్వర మిని ఫంక్షన్ హాలులో జరిగిన ఈ సదస్సు రాజాం సోదరులు శ్రీ బాలాజీ చేసిన జ్యోతి ప్రజ్వలనంతో ఆరంభమైంది. మాతృశ్రీ విద్యాపరిషత్ అభివృద్ధి సంఘాధ్యక్షులు శ్రీ బి. రామబ్రహ్మం సదస్సుకు అధ్యక్షత వహించి, ఆద్యంతం దీక్షతో నిర్వహించారు.

శ్రీ అరటికట్ల కామేశ్వరరావు స్వాగత వచనా లందించగా, శ్రీ పట్నాన కృష్ణ ప్రార్థన చేశారు. పాలకొండ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ శ్రీ సామంతుల దామోదరరావు, విశాఖ గ్రామీణ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ సి. లక్ష్మీ నారాయణ, మాజీ సర్పంచ్ డాక్టర్ రమాదేవి, ఐ.ఎ.ఎస్. అధికారి డాక్టర్ పట్నాయక్ ప్రభృతులు అతిధులుగా పాల్గొన్నారు.

సదస్సులను నిర్వహించవలసిన ఆవశ్యక్తతను వివరిస్తూ అధ్యక్షులు శ్రీ రామబ్రహ్మం పూర్వవిద్యార్థులను అభినందించారు. అమ్మ ఆశయాలు అమలు చేయడానికి కార్యకర్తలు, పూర్వ విద్యార్థులు తరచుగా సమావేశమై, సమాలోచన జరపాలని, ఆ ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలని హితవు చెప్పారు.

సదస్సులో కీలకోపన్యాసం చేసిన రాజాం సోదరులు శ్రీ బాలాజీ మాట్లాడుతూ, “సాధ్యమైనదే సాధన”, “ఇష్టం లేనిదే కష్టం” వంటి అమ్మ వాక్యాలను వివరించారు. “అమ్మను దర్శించి, అమ్మ ప్రబోధం తెలుసుకున్న తర్వాత మనస్సుకు క్రమంగా ప్రశాంతత కలుగుతోంది. ‘నేను చేస్తున్నాను’ అని కాక, “నా ద్వారా జరుగుతోంది” అనిపిస్తోంది అని తమ అనుభవాలు ఆధారంగా అమ్మ తత్త్వాన్ని వివరించారు.

ముఖ్య అతిధి శ్రీ సామంతుల దామోదరరావు తమ ప్రసంగంలో మంచిసభలో పాల్గొన్న సంతృప్తిని వ్యక్తం చేశారు. జీవనం యాంత్రికంగా మారిపోతున్న నేటి వ్యవస్థలో ఇలాంటి సమావేశాలు ఎంతైనా అవసరమని, నైతిక విలువలు తెలుసుకుని, సంస్కారాన్ని పెంపొందించు కోవడానికి ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయని అన్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలో మార్కులు పెరుగు తున్నాయి గాని, వ్యక్తిత్వ వికాసం లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు సంస్కారాన్ని కలిగిస్తుందన్న పెద్దలమాటకు సాక్షులుగా నిలిచిన జిల్లెళ్ళమూడి పూర్వ విద్యార్థులను అభినందిస్తూ, నెలకు ఒక్క పర్యాయమైనా ఇలాంటి సభలు జరగాలని కోరుతూ, తమ వంతు సహకారం తప్పక అందిస్తామని హర్షధ్వానాల మధ్య వాగ్ధానం చేశారు.

గౌరవ అతిధిగా పాల్గొన్న శ్రీ సి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమ్మ సన్నిధిలో జరిగే అన్ని సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో విశిష్టమైనవని, అమ్మ ఒడిలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులలో ఆ విశిష్టత వ్యక్తిత్వ రూపంలో ప్రతిబింబిస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఆత్మీయ అతిధి డాక్టర్ రమాదేవి తమ ప్రసంగంలో జిల్లెళ్ళమూడి పూర్వ విద్యార్థుల సంస్కారం సమున్నతమైనదని, తమ గ్రామం నుంచి జిల్లెళ్ళమూడి వెళ్ళి చదువు కున్న విద్యార్థులు ఆదర్శప్రాయులుగా ఉన్నందుకు తాను గర్విస్తున్నాని చెప్పారు.

విశిష్ట అతిధిగా పాల్గొన్న హరిదాస కళాసమితి వ్యవస్థాపకులు డాక్టర్ పట్నాయక్ క్లుప్తంగా ప్రసంగిస్తూ “అమ్మ కన్న విలువైనది అవనిలో లేదు” అని మధురగీతం ఆలపించారు.

సభలో తొలి ప్రసంగం చేసిన అమ్మ తత్త్వప్రచార సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ బి.ఎల్. సుగుణ “అమ్మ విశ్వమాతృత్వాన్ని” హృద్యంగా విశదీకరించారు. “తల్లి ధర్మం నిర్వర్తించడానికే వచ్చాన”ని ప్రకటించిన అమ్మ తన యింటిని ‘అందరిల్లు’గా చేసి, విశ్వప్రేమకు నమూనా చూపించిందని పేర్కొన్నారు.

సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొన్న అమ్మ తత్త్వ ప్రచార సమితి కార్యదర్శి డాక్టర్ యు. వరలక్ష్మి ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ప్రేమసేవగా వ్యక్తమైనప్పుడే సమాజాభ్యుదయం సాధ్యమని, అలాంటి చక్కని వ్యవస్థకు పునాది అమ్మ నెలకొల్పిన అందరిల్లు అని వ్యాఖ్యానించారు.

విశేష సంఖ్యలో సభలో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించిన పూర్వవిద్యార్థులు సర్వశ్రీ గంటా కృష్ణ, గౌరునాయుడు, రమణమూర్తి, అప్పారెడ్డి, పి. మధుసూదన రావు, పి.చైతన్యకుమార్, టి. సాయి, జె.బి. తిరుమలా చార్యులు, శ్రీమతి కస్తూరి మొదలగు వారు అందరిదీ ఒకే మాట. అమ్మ సన్నిధిలో చదువుకున్న తమకు బ్రతుకుతెరవు దొరకటమే కాక, బ్రతుకు విలువ తెలిసిందని, తృప్తిగా, ధైర్యంగా జీవిస్తున్నామని, అమ్మ ఋణం తీర్చుకోలేనిదని, అమ్మ చేస్తున్న నిరతాన్నదానం, సాటిలేనిదని, నిరంతరం మాతృయాగం చేస్తున్న విశ్వజననికి జీవితాంతం కృతజ్ఞులుగా ఉంటామని, ఆదిశంకరుల అద్వైతం, రామకృష్ణ పరమహంస ప్రబోధం శిష్యుల ద్వారానే విశ్వవ్యాప్తమై నట్లుగా, అమ్మతత్త్వాన్ని లోకానికి అందించే బాధ్యత తమ భుజస్కంధాలపైనే ఉన్నదని, ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అన్ని సంక్షేమ పధకాలను ఆ పేర్లు లేకుండా ప్రవేశపెట్టిన అమ్మ ప్రేమ నిరుపమానమని, ఈనాడు పుణ్యక్షేత్రాలలో యాత్రికులకు ఉచితభోజన సౌకర్యం ఏర్పాటయిందని, జిల్లెళ్ళమూడిలో ఆనాడు అమ్మ నెలకొల్పిన వ్యవస్థే అందరికీ ప్రేరణ అని, చదువుతో పాటు సంస్కారాన్ని ప్రబోధించిన అధ్యాపకుల వల్ల, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దిన సంస్థ కార్యక్రమాల వల్ల తాము ప్రయోజకులం కాగలిగామని, తమ తమ కుటుంబాలను నిలబెట్టుకోవడమే కాక, సమాజానికి మార్గనిర్దేశం చేయగల వ్యక్తులుగా ఎదిగామని నిండుగుండెతో పలికారు. తమ అభ్యుదయానికి బాటలు వేసిన అమ్మకు భక్తి పుష్పాంజలులు సమర్పించారు.

సమావేశమందిరానికి సౌజన్య దాత అయిన శ్రీ తిరుపతి సాహెబ్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు.

ముగింపు ప్రసంగం చేసిన ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ అమ్మ రూపం పరిమితం, అమ్మ శక్తి అనంతం అని ఇలాంటి సన్నివేశాలు నిరూపిస్తాయన్నారు. కత్తిమీద సాము లాంటి పనులను కూడా మెత్తని చిరునవ్వుతో నిర్వహించగల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. సమావేశానికి విచ్చేసిన అతిధులందరికీ సమితి పక్షాన పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు. భౌతికంగా అమ్మరూపం కనుమరుగైనా, ఆ అనంతశక్తి, ఆ అపరిమిత ప్రేమ, ఆ వజ్ర సంకల్పం సంస్థను నడిపిస్తున్నాయని, ఆకలి మీద యుద్ధం ప్రకటించిన అమ్మ ఆశయసాధనకు పూర్వ విద్యార్థులే వీరసైనికులని ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా పాలకొండ విభాగం విద్యార్థులకు ప్రచార సమితి సత్కరించింది. పూర్వవిద్యార్థులు అతిధులను, అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు అందరికీ అమ్మప్రసాదంగా విందుభోజనం అందించారు. స్థానికుల సహకారంతో విద్యార్థులు నిర్వహించిన ఈ సదస్సు అందరి హృదయాలలో అనుభూతి మాధుర్యం నింపింది.

– విలేఖరి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!