ఈ సంవత్సరము అమ్మ నాన్నగారి ఉత్సవ విగ్రహాలు వచ్చిన సందర్భంగా అమ్మ కళ్యాణం జరుప నిశ్చయించాము. విశాఖలో కె. సూర్యనారాయణమూర్తి “నీవేం దిగులు పడకు. నేను దగ్గరుండి అంతా జరిపిస్తానని చెప్పాడు. అతను పౌరోహిత్యం చేస్తున్నాడు. మంచిపేరు తెచ్చుకున్నాడు. అతను మన జిల్లెళ్ళమూడి కాలేజీ విద్యార్థి.
4వ తారీఖు సాయంత్రం అందరం మందిరంలో చేరాము. మందిరం శుభ్రపరచుకోవటం. మామిడి తోరణాలు కట్టుకోవటం. కలశాలు ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయల మీద అమ్మ, నాన్నగారు అని చెమిబిళ్ళలతో అలంకరించుకోవటం, దానితో పాటు పాటలు, పారాయణలు నిజంగా పెళ్ళిసందడియే. ఇదే అమ్మకు కళ్యాణం జరపటం తొలిసారి. ముందు కొంచెం అలజడి. ఎలా జరిపిస్తామోనని కంగారూ.
కానీ మే 5వ తేది ఉ॥ 10 గంటల కల్లా అమ్మ బిడ్డలందరూ వచ్చారు. అంగరంగవైభోవంగా కళ్యాణం జరిగింది. అమ్మ తరపున శ్రీ చక్రవర్తి, కుసుమాచక్రవర్తి దంపతులు, నాన్నగారి తరపున శ్రీ సత్యనారాయణరాజు, లక్ష్మి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. రెండో ప్రక్క బ్రాహ్మణుడు ఎవరూ లేరు అనుకుంటుంటే ఏలేశ్వరపు గోపాలకృష్ణ మొగల్తూరు ఆయన అమ్మ పిలుపే అన్న విధంగా వేంచేశారు. ఆ ఇద్దరు మంత్రాలు చదువుతుంటే అక్కకడంతా కళ్యాణ శోభతో నిండిపోయింది.
సర్వశ్రీ కామేశ్వరరావు, శరభలింగం, జె.యస్.యన్. మూర్తి దంపతిసమేతంగా వచ్చారు. మన జిల్లెళ్ళమూడి కాలేజీ విద్యార్థులు నల్ల అప్పలనాయుడు, బి. దొడ్డి వెంకట నాయుడు, బి. తిరుపతిరావు, ఖాదర్, బులుసు భాస్కర్, చైతన్య మొదలగు వారంతా ఆ కళ్యాణానికి హాజరయి అమ్మ ప్రసాదం స్వీకరించారు. చైతన్యముందు రోజే వచ్చి ప్రతి పనికీ చేదోడు వాదోడుగా వున్నాడు.
వీరేకాక అనేకమంది రవిబాబుగారు, కరుణ, రాజేష్ చుట్టుప్రక్కల వారు వచ్చారు. కన్నుల పండువగా అమ్మ కళ్యాణం జరిగిన తీరు అమోఘం, అద్భుతం.
(జూన్ 12న విశాఖ అమ్మమందిరంలో అన్నాభిషేకం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.)
– మాతృశ్రీ అధ్యయనపరిషత్, విశాఖ