దసరా వచ్చిందంటే దేశమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. విశేషంగా శక్తి పీఠాలలో. “రూపం పరిమితం శక్తి అనంతం” అటువంటి శక్తి పీఠాలలో జిల్లెళ్ళమూడి ఒకటి.
“అయోధ్యా మధురామాయా కాశీ కాంచీ అవంతికా।
పూరీ ద్వారావ త్యర్కపురీ నవైతే మోక్షదాయకాః॥
మోక్షదాయకమై అర్కపురిలో దశరాలలో “అమ్మ హైమలు” త్రిసంధ్యనలతో లలితా, త్రిశతి, ఖడ్గమాల, లలితా, అంబికా అష్టోత్తరాలతో అర్చింపబడుతూ వివిధ రూపాలలో దర్శనమిస్తుంటారు. అదేవిధంగా విశాఖలో ‘అమ్మ’ మందిరంలో కూడా విశేషంగా దశరా పూజలు జరిగినవి. ప్రతిసారి లాగే ఈసారి కూడా మేము సకుటుంబముగా ఇక్కడ అష్టమి పూజ చూసుకొని నవమి, దశమి పూజలకు జిల్లెళ్ళమూడి చేరాము. ‘అమ్మ’ ఈ అవకాశము మాకు కల్పించినందుకు అమ్మ హైమలకు శతధా సహస్రధా నమస్కరిస్తున్నాను.
ఇక 4.10.2011 తేదీ విశాఖలో గల ‘అమ్మ’ మందిరంలో దుర్గాష్టమి పూజ కడు వైభవంగా జరిగింది. ఆ రోజు వివిధరకాలుగా ‘అమ్మ’ బిడ్డలు ‘అమ్మ’ను అర్చించు కొన్నారు. పురోహితులు శ్రీరామంగారు మా దంపతులచే గణపతి పూజా కలశారాధనతో కార్యక్రమమును ప్రారంభింప చేశారు.
‘అమ్మ’ మందిరంలో ఒక వైపు శ్రీ చక్రవర్తి గారి దంపతులు, శ్రీ రామరాజు గారి దంపతులు, ‘శ్రీ మేరువును’
పంచామృతాలతో అభిషేకించగా వచ్చిన వారందరూ అమ్మను అష్టోత్తర పూజించుకున్నారు. మరో ప్రక్క 16 మంది బాలికలకు ఉదయం బాలపూజ, 16 మంది కన్యలకు కుమారి పూజ, సాయంత్రం సువాసినీపూజ 10 మందికి జరిగినది.
లలితాసహస్ర నామస్తోత్ర పారాయణ ప్రారంభింప బడి అఖండంగా సాగింది. మధ్యాహ్నం సుమారు 150 మంది ‘అమ్మ’ ప్రసాదాన్ని స్వీకరించారు. పూర్ణాహుతి కార్యక్రమాలతో అష్టమి పూజా కార్యక్రమము ముగిసినది.
ఈ కార్యక్రమమునకు విశేషముగా దూరప్రాంతాల నుండి మాతృశ్రీ కళాశాల పూర్వవిద్యార్థులు సకుటుంబముగా విచ్చేసి ఆద్యంతము ఆనందముగా పాలుపంచుకొన్నారు. అజ్జాడ, అనకాపల్లి, యస్.కోట, విజయనగరం మొదలగు ఊళ్ళ నుండి విచ్చేసినారు. ఈసారి వచ్చినవారితో 90% మంది కొత్త వారు కావడం విశేషం. పెదమజ్జిపాలెం గ్రామము నుండి సోదరులు శ్యాం సుందరం ఆరోజునకు కావలసిన అరటిపండ్లను వారి తోట నుండి తెచ్చి సమర్పించాడు. పూరి కామేశ్వరరావుగారు. దండిగా పూల దండలను సమర్పించటం వల్ల మందిరమంతా పూలతో కళకళలాడింది.
దశరా పదిరోజులు అమ్మ మందిరంలో శ్రీ చక్రవర్తి దంపతులు, రాజుగారి దంపతులు, కరుణ, రాజేష్, విజయలక్ష్మి, మురళీ మొ||వారు ‘అమ్మ’ సేవలో తరించారు.