ఆశ్వీజమాసం రాగానే దేశంలో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే విశాఖ అమ్మ మందిరంలో కూడా నవరాత్రి పూజలు జరిగాయి. ప్రతిరోజు సాయంత్రం ‘అమ్మ’ శ్రీ లలితాసహస్రము, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తరం మరియు అంబికా అష్టోత్తరములతో పూజ జరిగింది.
విశేషముగా ‘దుర్గాష్టమి’ రోజున ఉదయం 9-30 గంటల నుండి సా. 4-30 వరకు వివిధరకాలుగా ‘అమ్మ’కు పూజలు జరిగాయి. ముందు రోజు పూల కామేశ్వరరావు గారు తెచ్చిన పూలతో మురళి తదితరులు ‘అమ్మ’ మందిరాన్ని శోభాయమానంగా అలంకరించారు. అష్టమిరోజు ఉదయం 9-30గంటలకు బాలపూజలో సుమారు 25 మంది చిన్నారులకు పూజ జరిగినది. 11-30 గంటలకు కుమారీ పూజలో 9 మంది కుమారీలకు పూజ జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ‘అమ్మ’ ప్రసాదం (భోజనం) స్వీకరించటం తదుపరి 2 గంటలకు సువాసినీపూజ జరిగింది. ఉదయం 9-30 గంటల నుండి అఖండ లలితాసహస్రనామ పారాయణ శ్రీ కామేశ్వరరావు గారు వారి కుమార్తె జ్యోత్సల ఆధ్వర్యంలో జరిగింది. మందిరంలో వచ్చిన వారందరి చేత పురోహితులు శ్రీ రామంగారు అంబికా అష్టోత్తరంలో సాయంత్రం వరకు కుంకుమ పూజలు జరిపించారు. ప్రభుత్వం వారు తుఫాను హెచ్చరిక చేసినప్పటికిని ‘అమ్మ’ దయతో ఎట్టి ఆటంకమూ లేక సాయంత్రం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమమూ అష్టమి పూజలు ముగిశాయి. విశేషముగా M.O.C. ప్రస్తుత విద్యార్థి ప్రవీణ్ వాళ్ళ అమ్మ వాణి శిష్యులు మధురవాడ నుండి సుమారు 30 మంది ‘అమ్మ’ మందిరమునకు వచ్చి లలితాపారాయణలో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలందించిన వారందరూ ‘అమ్మ’, ‘హైమ’ల ఆశీస్సులను పొందుదురుగాక.