1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విశ్వజనని – అమ్మ

విశ్వజనని – అమ్మ

Dr T Raja Gopalachari
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : November
Issue Number : 11
Year : 2013

‘ఓం తారాపుష్పలసధ్వాంత శ్యామలాంబర వేణికాయైనమః ‘ అని అమ్మను స్తుతించారు శ్రీరాధాకృష్ణశర్మగారు. అంటే- అమ్మజడ నీలాకాశము; అందు నక్షత్ర సమూహాలు తెల్లని పూలమాలలుగా విరాజిల్లుతున్నాయి’- అని. నాకు అందినంత వరకు అమ్మయొక్క విశ్వరూప లక్షణాన్ని శ్వేతాశ్వరోపనిషత్ నందలి శాంతిపాఠం సహాయంతో వివరిస్తాను.

‘పూర్ణమధః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే।

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే ॥

అనేది శాంతి మంత్రం. అంటే ఆశక్తి సంపూర్ణంగా ఉన్నది; ఈ సృష్టి సంపూర్ణమై ఉన్నది. సంపూర్ణమైన దానినుండి సంపూర్ణమైనది వచ్చినా అది నిరవధికంగా సంపూర్ణమయ్యే ఉంది – అని.

ఆ శక్తి రూప, లింగ భేదం లేదని ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు కూడా చెపుతున్నాయి (ఉదా: విద్యుచ్ఛక్తి, కాంతిశక్తి, అయస్కాంతశక్తి…). శక్తి నుండి నామరూప గుణాత్మకమైన ఈ విశ్వం వెలువడిందని వేదాంతము, ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు రెండూ ఒప్పుకుంటున్నాయి.

కేవలం రెండు బిలియన్ సంవత్సరాలకు ముందు మాత్రమే స్థూలపదార్థాల వలన జీవులకు లింగత్వ లక్షణం కలిగింది. అతః పూర్వము రెండు పదార్థాల కలయిక వలన సరికొత్త జీవులు ఉచ్ఛవించాయి. మన భూగోళంపై ఉండే అతి ప్రాధమిక జీవరాశి అన్ని జీవరాశులకు మాతృత్వాన్ని వహించింది. డి.యన్.ఎ. అనే జనటిక్ కోడ్ సూక్ష్మంగా అవ్యక్తంగా ఉంటూ అందు ఉద్భవించబోయే జీవుల రూపురేఖలు లిఖించబడ్డాయి. శాస్త్రరీత్యా – అనంత ఆకాశంలో అతి ప్రాచీనమైన విశ్వాలు భ్రమిస్తూ ఉన్నాయి. 400 అసాధారణ విశ్వాలు ఒక్కొక్కటి పెక్కు నక్షత్ర మండలాలను కలిగి ఉన్నవి- అని ఒక అంచనా. ఈ విశ్వాల కూడలినే “పూర్ణమిదం” అని అంటున్నారు. మనం నివసిస్తూన్న భూగోళం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితంది. దీనిని కలిగియున్న విశ్వం పదిబిలియన్ల సంవత్సరాలనుండి ఉన్నది. ఇక ప్రాచీన విశ్వాలు ఏనాటివో? ఇలా అనేక విశ్వాసముదాయాల్ని ఆవరించి, సకల సృష్టి ఆవిర్భానికి కారణమైన ఆ శక్తి ఎంత ఉన్నదీ, ఎట్లా ఉన్నదీ, ఎప్పటినుండి ఉన్నదీ అని వివరించలేము. అనంతంగా ప్రజ్ఞానఘనంగా ఉంటూ స్థూల సూక్ష్మశక్తులకు మూలమై కారణమైనదే ఈ ఆద్యంతరహిత విశ్వకూడలిని కన్నది. వ్యక్తావ్యక్తమైన విశ్వసర్వస్వం ఆ శక్తి సంజనితం. అందుకే ఆ శక్తి తల్లియై ఉన్నది. తల్లి అనటంలో జన్మకు కారణమైనదనే గాని స్త్రీమూర్తి అని కాదు. జన్మించిన ప్రతిదీ మరణిస్తుంది. కానీ సృష్టి ఆద్యంతరహితమైనది. ఈ సృష్టిలోని పదార్థం (మాస్) మరియు (శక్తి) ఎనర్జి పరస్పరం మార్పుచెందు తుంటాయి. మూలకారణశక్తి ప్రజ్ఞానఘనం, ద్వంద్వాతీతం. సృష్టీ ఏకత్వ భావననే సూచిస్తోంది. అమ్మ, “రెండుగా కనిపిస్తుంది, ఒకటిగా అనిపిస్తుంది.” – అని వివరించింది ఈ వాస్తవాన్నే.

‘పూర్ణమిదం’ అన్నపుడు ఈ ప్రకృతి పూర్ణము; లింగభేదము లేనిది అని తెలుస్తోంది. వ్యక్తావ్యక్తమైన, దృశ్యాదృశ్యమైన ఈ స్థూలసూక్ష్మసృష్టికి కూడా తరుగు వొరుగు లేదు. రూపానికి మార్పుఉంది. ఈ రూపం రూపరహిత శక్తియుక్తమైన పదార్థంతో తయారైంది. రూప నాశనంతో పేరూ నశిస్తుంది; వేరొక రూపం, నామం వస్తాయి. అవి ఇలా మార్పు నిరంతరం చెందుతూనే ఉన్నవి. COSMOS అనే పదానికి, విశ్వం అనే పదానికి పెద్ద తేడాలేదు. ఈ బృహద్విశ్వం యొక్క వైశాల్యము, దూరము, వయస్సు, పరిమాణములను అంచనా వేయలేము. శాస్త్రజ్ఞులు అంటారు – నక్షత్రమండలాలన్నీ గ్యాస్, ధూళి, నక్షత్రాలతో నిండి ఉన్నాయి. సుమారు నూరు బిలియన్ల నక్షత్ర మండలాలు, అందు పదిబిలియన్ ట్రిలియన్ల గ్రహాలు ఉండవచ్చు. బిలియన్ అంటే 10; ట్రిలియన్ అంటే 10 ఖగోళ నక్షత్ర మండలాలతో పోలిస్తే సూర్యుడు అతి చిన్న నక్షత్రం. ఇక భూమి సూక్ష్మాతి సూక్ష్మ గ్రహం; ఒక చుక్క ప్రమాణం. అందులో మన దేశం; రాష్ట్రం; పట్టణం; పల్లె ఎంత, ఎంతెంత? భూమికి కొన్ని మిలియన్ల కాంతిసంవత్సరాల దూరంలో 20 నక్షత్ర కూటములు ఉన్నాయి. మన విశ్వమూ వేల విశ్వాలలో ఒకటి. ఈ సకల సృష్టిని, ఆవరించి ఉన్న శక్తినే ‘పూర్ణముదచ్యతే’ అనీ, ఇలాంటి విశ్వాన్ని ‘పూర్ణమిదం’ అని ఉపనిషత్తులు అభివర్ణిస్తున్నాయి. ఇంతటి సృష్టిగా ఉన్నప్పటికీ అది పూర్ణంగానే ఉన్నది; దానికి తరుగూ వొరుగూ లేదు. కాల ప్రవాహ చైతన్య సముద్భవరూపాలు మాత్రం మారుతుంటాయి. మార్పుసృష్టికి సహజమైన గుణము. కనుకనే అమ్మ,

“సృష్టి పరిణామశీలం కలది. దీనికి పరిణామం ఉన్నది, కానీ నాశనం లేదు” అని ఎలుగెత్తి చాటింది. ఈ నిరవధిక నిత్య వినూత్నకరణ ప్రక్రియ కాలం ఎంతవరకు ఉన్నదో అంతవరకు సృష్టిస్థితిలయాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మ కాలం మరియు సృష్టితో తాదాత్మ్యం చెంది “ఈ సృష్టి అనాది, నాది” అనీ, “నాకు మూడు కాలాలు లేవు. అంతా వర్తమానమే” అనీ తన దివ్యతత్త్వాన్ని చాటింది.

ఆ మహిమాన్విత మాతృమూర్తి శక్తిని అవగాహన చేసికొని ఉపనిషత్పారం, జ్ఞాన కణికెలు అనదగు పాటలను శ్రీమన్నవ బుచ్చిరాజుశర్మ వ్రాశారు. ‘అనుభవసారం’ అనే వారి గ్రంధంలోని 41వ పాట శ్వేతాశ్వతరోపనిషత్ సారానికి, పరిమిత రూపంలో కనిపించే అమ్మ అనంతశక్తికి దర్పణం పడుతోంది. అందు – 

‘ఎంత దూరమమ్మా ఈ పయనం

దృష్టిసారు దూరమా,

సృష్టిసాగు దూరమా – అంటూ గానం చేశారు. సృష్టి, కాలము, శక్తి తానే అయిన అమ్మ సర్వకాల సర్వావస్థలలోను లీలగా సాక్షీమాత్రంగా సృష్టి స్థితి లయాలను అవలోకిస్తోంది. కనుకనే అమ్మను ‘ఎంత దూరమమ్మా?’ అని ఆర్తితో పాడారు; ప్రశ్నించారు.

పాంచ భౌతిక కాయంతో ఉన్నా పరిమితరూపంతో ఉన్నా అమ్మ దృష్టి అతిశక్తి వంతమైనది; అవధులు లేనిది. కనుకనే దృష్టిసారు దూరమా? అని ప్రశ్నించారు. మానవ దృష్టికి పరిమితులు, అవధులు ఉన్నాయి. అమ్మ, ” మీరంతా

నేనే. మీదంతా నేనే. ఇదంతా నేనే” అని అంటుంది. కనుక కాలంతో సృష్టితో తాదాత్మ్యం చెందిన సృష్టిసాగు దూరానికి, అమ్మ దృష్టిసారు దూరానికి భేదం లేదు. అమ్మ శక్తిగా పూర్ణము, సృష్టిగా పూర్ణము. కనుక రాజుగారి భావన ‘పూర్ణమధః’ ‘పూర్ణమిదం’ అనే దానికి సరిపోయింది.

‘సకల చరాచర జీవుల సృష్టి స్థితుల సర్వసాక్షి,

కాలగర్భ మెరుగు లేని కాలమంత దూరమా? అనే చరణం అద్భుతంగా ఉన్నది.

జీవులలో సాక్షీభూతంగా ఉండే ఆత్మ బృహదాత్మతో కలిసే ఉంది. సృష్టి స్థితిలయాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. పరిణామం నిరంతరాయంగా కాలగర్భంలో జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ‘ఆకాశము (SPACE), కాలము (TIME) రెండూ అవినాభావ సంబంధంతో ఉన్నవి – అని అంటారు. గతించిన కాలంలోకి పోకుండా మనం SPACE ను చూడలేము. కాంతి ఒక సెకనుకు 1,86,000 మైళ్ళ దూరము ప్రయాణిస్తుంది. సూర్యకాంతి భూమిని చేరటానికి ఎనిమిది కాంతి నిముషాలు పడుతుంది. అంటే మనం భూతలంపై చూస్తున్న కాంతి ఎనిమిది నిముషాల పూర్వానిది. ఈ మధ్య కాలంలో సూర్యునిలో జరిగే మార్పులు మనకి తెలియవు. కాలగర్భంలో జరిగే ఈ మార్పులు అమ్మకి మాత్రమే తెలుసు. అమ్మ పయనానికి అంతులేదు.

మరింత స్పష్టతకోసం శ్రీరాజుగారు –

‘వీలుగాని వీలు చేత, చేతకాని చేత చేత

జగతి నేలు జనని గుండె లోతులంత దూరమా?’- 

అని అమ్మనే ప్రశ్నిస్తున్నారు, తమ ప్రశ్నలోనే సూటిగా సమాధానాన్ని అందించారు.

వీలు కాని వీలు అంటే అమ్మ ప్రయాణం -విధి విధానం- దానిని తెలుసుకునే శక్తి మనకి లేదు. అది వీలు కానిదని తెలిసికూడా తెలుసుకోవాలనే ఆర్తి ఉన్నందున వీలు చేసుకుని చేతకాకున్నా ప్రయత్నాన్ని చేస్తున్నాము. “తల్లీ! నువ్వు ఎంత దూరంలో ఉన్నావు? ఎంత ఎత్తున ఉన్నావు? నువ్వు ఈ జగత్తునంతా ఏలే జననివి. జగత్తు నంతా నీ గుండెలో దాచుకున్నావు. మాకంటికి కనిపించే ఈ జగత్తు ఎంతగా నీ గుండెలోతుల్లో ఉన్నదో మాకు తెలియదు”- అని వేడుకుంటున్నారు, విన్నవించు కుంటున్నారు.

అమ్మ అంటుంది; “మరుగే నా విధానం తెరలోపల తెర ఎప్పుడూ ఉన్నది. నాకూ తెర ఉన్నది. నేను వేషం వేసుకోవటానికి ఒక తెర. నావేషం మీకు చూపటానికి మరొక తెర. మాటలతో తొలగని తెరలు. మూటలతో లోపలకు రానివ్వని తెరలు” అని. అది వైష్ణవమాయ. లీలానాటక సూత్రధారి లీల. అమ్మగుండెలోతు ఇంత అని అంచనా వేయలేము. అంతటా వ్యాపించి ఉన్నా ఆ శక్తి పూర్ణమై నిత్యమై శాశ్వతమై ఉన్నది. ‘పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే’ అనే ఉపనిషత్సారానికి సాకారరూపం అమ్మ.

శ్రీ రాజుగారు రెండవ చరణంలో – 

‘మన్నులోన మిన్నులోన సన్నలేని కన్నులోన

కానుపించుదృశ్య మవలి తీరమంత దూరమా’ – అని అన్నారు.

ఈ దృశ్యమానసృష్టి లోతు ఎంతో తెలియదు. దానిని చూస్తూ కూడా దాని పరిమాణము ఇంత అని అంచనా 

వేయలేము. ఉనికిని బట్టి వస్తువును గుర్తిస్తాం. భూమి లోపల, ఆకాశంలోపల, దృశ్య అవధికి అందినంత వరకు వస్తువులు కనిపిస్తాయి. వాటి విస్తీర్ణం తెలియదు. తీరం తెలియదు. ఒడ్డు ఉందో లేదో తెలియదు. తీరము ఉంటే ఆవలి తీరము ఎంత దూరంలో ఉందో అసలు తెలియదు.

విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంటారు- “చూడటం అనే ప్రక్రియ అంత సులభమైనది కాదు. వస్తువును చూచే దృష్టీ, గ్రహించేశక్తీ, బుద్ధి శక్తిపై ఆధారపడి ఉంటాయి. మనం చూసేది వాస్తవంగా అక్కడ ఉన్నది కాదు. మన బుద్ధికి ఉన్నదని తోచిన దాన్ని నమ్మి దానిని అక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం చూస్తున్న దృశ్యం గతంలో చూసిన దృశ్యాన్ని పోలి ఉంటుంది. కాని ఒక్కొక్కసారి కాదనీ తెలుస్తుంది; తెస్తుంది” అని. చూడటం అనేది ఒక విశిష్టమైన అసాధారణ ప్రక్రియ.

ఈ కన్నులతో అమ్మ నిజతత్త్వాన్ని చూడలేము. అమ్మని ఒక మాతృమూర్తిగా సామాన్యగృహిణిగా మాత్రమే చూడగలుగుతున్నాము. అమ్మకి అవధులు లేవు. అమ్మ ప్రేమకి పరిమితులు లేవు. అమ్మ పయనం కాలమంత అనంతదూరం. అమ్మ ప్రేమ, మమకారం అనంతం. జగత్తే అమ్మ – జగజ్జనని అమ్మ. మన అమ్మ విశ్వజనని.

సేకరణ : : ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!