అమ్మ పూర్వ నామం అనసూయ. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో మార్చి 28, 1923న శ్రీమతి రంగమ్మ, సీతాపతిశర్మ దంపతుల నోము ఫలంగా జన్మించారు. మే 5, 1936 న వివాహితురాలై శ్రీ నాగేశ్వరరావు గారిని భర్తగా స్వీకరించి బ్రహ్మాండంవారి కోడలై ఆ వంశాన్ని పునీతం చేశారు.
అన్యోన్య దాంపత్య ఫలంగా ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెని సంతానంగా పొందారు. కుమార్తె హైమ సిద్ధి పొంది జిల్లెళ్ళమూడిలోని హైమాలయంలో వెలిశారు.
“నేను నేనైన నేను” అన్నట్టి అమ్మ జీవితం సమున్నత ప్రేరణాన్వితం, వేదాంత సంభరితం. ఆమె కారణ జన్మురాలు. ఆకలిగొన్నవారి – కడుపు నింప దిగివచ్చిన దివ్యమాత. ఆ తల్లి ప్రేమతత్వాన్ని స్వయంగా అనుభూతి చెందిన శ్రీ కొండముది రామకృష్ణ గారు అమ్మ దివ్య చరితను అద్భుతంగా గ్రంధీకరించారు. వారి మాటల్లో ‘అమ్మ మూర్తి ఎంత మనోజ్ఞమో, వాక్కు ఎంత మార్దవమో.. ఆమె సందేశం అంత విశిష్టం, విలక్షణము, విప్లవాత్మకం.
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః…
కారుణ్యధుని విశ్వజనని
ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి ఆ పరాత్పరి, ఆ చల్లని తల్లియే జిల్లెళ్ళమూడి అమ్మ. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో ఈ చిన్న గ్రామమే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విశ్వవ్యాప్తంగా వినబడుతూ ఒక ఔదార్యం, ఒక లాలన, ఒక విశ్వజనని చూపే ప్రేమ, ఇక్కడ దర్శనమిస్తాయి. ఆ తల్లే విశ్వజనని. మన్నవ వారి ఇంట పుట్టి, బ్రహ్మాండం వారికి కోడలుగా వేంచేసిన ఆ యిల్లాలు చిన్న నాటినుంచే భక్తి శ్రద్ధలతో ఆధిదైవిక శక్తితో జన్మాంతర సంస్కారఫలితంగా జనని విశ్వజననియై విశ్వజననీ పరిషత్తును స్థాపించి ప్రేమ, కరుణ, ఓర్పు, ఓదార్పు, ఆకలి దప్పులను తీర్చే నిత్యాన్నదానం నిర్వహించే ఔదార్యం, ఇత్యాది సల్లక్షణాకలిత లలితామణి,
అమృతవర్షిణీ ఈయమ్మ.
బాధే భగవంతుడని భావించి చెప్పింది అమ్మ. ఆమె జీవితంలో సామాన్యులను, అసామాన్యులను సైతం సంభ్రమ పరిచే అనితర సాధ్యమైన మహిమలు, అపూర్వ ఘటనలు, అనుపమ సంభాషణలు.. లౌకికులకు అర్ధంకాని అలౌకిక ఘటనలు ఎన్నో… ఎన్నెన్నో.. అమ్మ జీవితం మహోన్నత, మహిమాన్విత తరంగ సమన్విత మహోదధి.. అది అమృత పూరితం. అమృతదాయిని అయిన అమ్మ ప్రేమ, కరుణ, ఔదార్యం నిరుపమానం. అమ్మ ఆశయాలకు రూపంగా ఉచిత విద్యాలయం, భోజనాలయం రూపుదిద్దుకుని సరస్వతి, అన్నపూర్ణల నిలయాలుగా ఎందరికో జీవనమార్గాన్ని చూపాయి. ఈ సంస్థలు విశ్వజననీ పరిషత్తుగా భాసిల్లుతున్నాయి. ఎందరికో ప్రేరణగా నిల్చిన అమ్మ ప్రేమతత్వం భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వమని చెప్పింది. – మాతృమూర్తిగా అందరికీ ప్రేమ పంచిన జిల్లెళ్ళమూడి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆ తల్లి భావనలు జగద్వ్యాప్తమై, అమ్మ ఆశీస్సులు అందరికీ అన్ని వేళలా లభించాలని అభిలషిస్తూ.. స్వస్తి!