అర్కపురి విశేషాలు, అమ్మతో అనుభవాలు, అమ్మ మహిమాన్విత మాతృప్రేమ మధురిమ, దివ్య విశ్వజననీ మహత్తత్త్వము మున్నగు దుర్లభమైన విశేషాలతో ‘విశ్వజనని’, ‘Mother of All’ సంచికలు ప్రచురితమౌతున్న సంగతి మీకు సువిదితం.
అమ్మ పావనదర్శన, స్పర్శన, సంభాషణల మహద్భాగ్యానికి నోచుకున్న వారి సంఖ్య ఒకప్పుడు అసంఖ్యాకము. అది నానాటికీ సన్నగిల్లుతోంది. అమ్మ దర్శనమే వాస్తవానికి జ్ఞానబోధ. అమ్మతో గడిపిన ప్రతిక్షణం ఒక మహోన్నత సందేశం. కొందరు సోదరీ సోదరుల అపూర్వ అనుభవాలు అప్రకటితమై వారితోనే కాలగర్భంలో కలసిపోతున్నాయి.
అమ్మవాక్యాలు అలతి అలతి పదాలతో అలరారుతూ అనంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అవి చూడటానికి సరళంగా, స్వయం బోధకాలుగా, నయనానందకరంగా ప్రకాశిస్తాయి. తరచి చూస్తే అగాధతత్త్వజలధిలోతుల్లోకి తీసుకుపోతాయి.
సర్వశ్రీ ఎమ్.దినకర్, చాగంటి వెంకట్రావు, గోపాల్ అన్నయ్య, వసుంధర అక్కయ్య, ప్రొ.ఎమ్. శివరామకృష్ణ, రాజుపాలెం శేషు, మన్నవదత్తు అన్నయ్య, బి.యల్.యస్. శాస్త్రి, వి. ధర్మసూరి, డాక్టర్ ఎమ్. శ్రీవల్లి, కె.పార్థసారధిశర్మ, డాక్టర్ బి.యల్. సుగుణ, డాక్టర్ యు.వరలక్ష్మి, ఎ.యస్. చక్రవర్తి, యస్. మోహనకృష్ణ, కుసుమక్కయ్య, ఎక్కిరాల రాణీసంయుక్తవ్యాస్, అన్నాప్రగడ లక్ష్మీనారాయణ, ఎన్.రమాదేవి, జి. రామలింగేశ్వరరావు ఎందరో సోదరీసోదరులు ‘విశ్వజనని’, ‘Mother of All సంచికలలో సభక్తికంగా అక్షరరూప మాతృసేవ అనదగుముత్యాలసరాల వంటి వ్యాసపరంపరని సమర్పిస్తున్నారు. ఇకపై కూడా ప్రతి సంచికకు తమ రచనల్ని అందించగలరనిఆశిద్దాం.
అమ్మ ప్రవచనం స్వీయ అనుభవసారం. అమ్మ అలౌకిక మాతృతత్త్వం విలక్షణమైనది, విశిష్టమైనది. కనుకనే డాక్టర్ శ్రీపాదగోపాలకృష్ణమూర్తిగారు ‘అమ్మ సూచించే క్రొత్తదారి’ అనే గ్రంధాన్ని రచించారు. అమ్మ అవతార పరమ ప్రయోజనాల్ని, అమ్మ ప్రవచనామృత ఝరిని భావితరాల కోసం అక్షరబద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అమ్మ సమాజాన్ని ఉద్ధరించింది. మతాల్ని ఉద్ధరించింది, ‘దైవం’ అనే పదానికి క్రొత్త నిర్వచనాన్ని అనుగ్రహించింది. అమ్మ అంటే ‘దయ’, దయ అంటే ‘అమ్మ’. అది మహిమాన్విత మాతృధర్మం.
సామాజికోద్ధరణ:
అమ్మ కాపురానికి వచ్చిన రోజుల్లో జిల్లెళ్ళమూడి కుగ్రామం వర్గవైషమ్యాలతో అట్టుడుకిపోయది. ‘ఐకమత్యమే బలం’ అంటూ అందరి మనస్సుల్నీ అమ్మ ఏకీకృతం చేసింది, ‘ఇంటింటా పిడికెడు బియ్యం పథకాన్ని’ ప్రవేశపెట్టి ఆకలి బాధని, ఆకలి చావుల్ని రూపు మాపి, పదిమందినీ కలిసి కట్టుగా ఒకే త్రాటిపై నడిపించింది. మరి కక్షలూ, కార్పణ్యాలూ… ఆనాడే అంతరించాయి.
అందరింటిని, అన్నపూర్ణాలయాన్ని స్థాపించి నిరాశ్రయ కుటుంబాలకు నీడనిచ్చింది; లక్షలాది మంది బిడ్డల ఆకలి తీర్చింది. కానీ అది అన్నదానం అనే పేరుతో కాదు. ఆదరణని ఆప్యాయతని కలిపి గోరుముద్దలు చేసి తినిపించింది. అందుకే ఆ అన్నం అనుగ్రహరూప ప్రసాదమైంది.
లక్షమందికి ఒక్క పంక్తిన భోజనం పెట్టింది. అమ్మ దృష్టిలో ఆబాలగోపాలం పసిపిల్లలే. కావున అరమరికలు లేక బిడ్డలంతా తల్లి చీరె చెంగుచాటున కష్టసుఖాలు కలిసి పంచుకుంటూంటే ఆ తల్లి సంతోషానికి అవధులుంటాయా? అమ్మ నాడు కోరుకున్నదీ నేడు కోరుకునేదీ అదే ! వర్గం లేని స్వర్గం
లక్షమంది అన్నం తినటం కాదు ముఖ్యం. కోట్లాది మంది సహోదర భావంతో కుల, మత, వర్ణ, వర్గ విభేదరహితంగా కలిసి మెలిసి ఉండాలనేది అమ్మ ఆకాంక్ష. ఆ సర్వసమానత్వ దృశ్యాన్ని తాను చూడాలని అమ్మ ఎదురు తెన్నులు చూస్తుంది, అహరహం శ్రమిస్తుంది.
ఒకేసారి వేయిమంది పసిబిడ్డల్ని ఊయలల్లో వేసి ఊపుతూ జోలపుచ్చే దృశ్యాన్ని చూడాలనే కోరికను అమ్మ వ్యక్తం చేసింది. అది అమ్మకి సహజం, మనకి విశేషం. దేశకాల గుణాలకి అతీతంగా అందరినీ తన ఒడిలో వేసికొని అమ్మ లాలిస్తూనే ఉన్నది. సమస్యల సుడిగుండాల్లో ఉక్కిరి బిక్కిరి అయ్యే హృదయాల్ని తన గుండెలకు హత్తుకుని సేద దీరుస్తోంది. ఆ దృశ్యాన్ని మన కంటికి చూపాలనేది అమ్మ సంకల్పం. ఆ దిశగా శ్రీ విశ్వజననీపరిషత్ ‘డోలోత్సవం’ పేరున ఇటీవల ఒకేసారి వందమంది శిశువుల్ని ఉయ్యాలలో ఊపి అమ్మకి నేత్రోత్సవం చేసింది. ఉయ్యాల ఉద్దేశం మరిపించడం, మురిపించడం.
సమాజంలోని అస్తవ్యస్థస్థితిని, అవతతవకల్ని అమ్మ సరిచేసింది; అంధవిశ్వాసాల్ని మూఢనమ్మకాల్ని ఖండిం చింది; సత్యశోధన చేసి కళ్ళకి క్రమ్మిన మాయ పొరల్ని తొలగించి లోచూపును ప్రసాదించింది.
సర్వులకూ స్వతంత్రమైన సత్రం, విద్యాలయం, వైద్యా లయం, హైమాలయం, అనసూయేశ్వరాలయం, ఆదరణాలయాలను నెలకొల్పింది. మౌలిక అవసరాల్ని తీర్చి ఐహిక ఆముష్మిక సుఖాల్ని ప్రసాదించింది.
“రక్తమంతా ఈశ్వర తత్వమే” అని సర్వ సమానత్వాన్ని అమ్మ. చాటింది.
“తిథులు విధుల్ని మార్చలేవు” అనీ, అన్ని తిధులూ శుభతిధులే అని గుర్తింపచేసింది.
“సంసార బాధ్యతలే ఆధ్యాత్మిక సాధన” అంటూ సామాన్యుని సందిగ్ధావస్థ నుంచి విముక్తుని చేసింది.
“నడుం వంచి తాళి కట్టేది భర్త; తలవంచి తాళి కట్టించుకునేది భార్య” అంటూ భార్యాభర్తల బాధ్యతాయుత పాత్రలని నిర్వచించింది. “భర్తకు భార్య దేవత” అంటూ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి పురుషునితో సమానమైన సముచితమైన స్థానాన్ని ఇచ్చి నరనారీలోకానికి జీవం పోసింది. సమాజం చేత నిర్లక్ష్యం చేయబడే వర్గాలు అంటే అమ్మకు అమితమైన అభిమానం.
కనుకనే వాత్సల్యయాత్రలో అమ్మ అనేక పల్లెలు, పట్టణాలు, నగరాలను సందర్శించినపుడు, వెతుక్కుంటూ నిరుపేదల్ని, వృద్ధుల్ని, రోగగ్రస్థుల్ని, మురికివాడల్ని, ఆస్పత్రులనూ, జైళ్ళనూ దర్శించింది. వారి జీవన స్థితిగతుల్ని విచారించి, కన్నీరు తుడిచి, ఓదార్చి, తన్న చేత్తో ఇంత అన్నప్రసాదం తినపించి తృప్తి చెందింది. అదే వాస్తవంగా త్యాగం, అర్థం, పరమార్థం. దానికి మూలం అమ్మకి సర్వత్రా పరివ్యాప్తమైన మమకారం.
“రెండు విభిన్న మనస్తత్వాలు కలిసి ఉండటమే కాపురం” అన్నది. అంతేకాదు. అన్నదమ్ములూ, భార్యాభర్తలూ, స్నేహితులూ, గురుశిష్యులూ, తల్లీబిడ్డలూ… ఇద్దరిలో ఒకరిది పైచేయి అవుతుందని, రెండవ వ్యక్తి సరెండర్ కావాల్సిందేనని మానవ మనస్తత్వశాస్త్రసారాన్ని తేటతెల్లం చేసింది. ఇతరులు తనని అర్థం చేసికోవటం లేదని ప్రతి వ్యక్తీ బాధపడతాడు. ఏ వ్యక్తి తనను తానే అర్థం చేసికోలేడు.
అమ్మ దేనినీ గ్రుడ్డిగా విశ్వసించదు, అలా అని దేనినీ తేలికగా తీసిపారవేయదు. సత్యస్వరూపిణి, యదార్థ వాది అమ్మ.
మతోద్ధరణ :
“సృష్టే దైవం” అని, దైవం కంటే భిన్నంగా సృష్టి లేదనే సత్యాన్ని, సంపూర్ణత్వాన్ని ప్రప్రధమంగా ప్రకటించింది
పూర్వజన్మ, పునర్జన లేవని ఘంటాపధంగా చెపుతూ “మీరంతా నా సంకల్పంతో నాలోనే పుట్టి నాలోనే పెరిగి నాలోనే లయమౌతున్నారు” అని జగన్మాతృతత్వాన్ని అక్షరాలా అవగతం చేసింది;
“మానవుని నడకకి ఆధారం రాగద్వేషాలు” అని గుర్తింప చేసింది. ఇష్టా యిష్టాలే మానవజీవిత నావకు చుక్కాని, తెరచాప అని కళ్ళు తెరిపించింది.
“దయలేని వాళ్ళంతా దయ్యాలే” అంటూ దయ అంటే దైవం; దైవం అంటే దయ – అని విశదీకరించింది దయార్ద్ర హృదయ అమ్మ.
పురుషకారాన్ని పూర్వపక్షం చేసి “చేతలు చేతుల్లో లేవు” అనీ, “సాధ్యమైనదే సాధన” అని ఘంటాపధంగా చాటింది. సాధన అనేది ఒకరు చెప్పినదీ, వ్యక్తి చేద్దామనుకున్నదీ కాదు; ఆశక్తి (దైవం) చేయించినది – అని విపులీకరించింది. “నువ్వు ఎంతగా చేస్తున్నావని అనుకున్నా, ఆశక్తి అనుకోనిదే చేయించనిదే, నువ్వు అనుకోలేవు చేయలేవు” అంటూ అపోహని తొలగించి అపూర్వ సత్యాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది.
“మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు” అని నిజవిశ్వజననీ విశ్వరూప సందర్శన భాగాన్ని అనుగ్రహించింది; నిత్య సత్య స్వరూప సందర్శనం చేయించింది.
ఇట్టి అనితరసాధ్యమైన జ్ఞానసంపద పత్రిక ద్వారా ప్రాప్తిస్తోంది – అనే సత్యం మనందరికీ సువిదితం. మనం అంతా అమ్మ అనురాగ రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళం. తొలిసారిగా అమ్మ పాదాలను స్పృశించిన రోజే వాస్తవానికి జన్మదినం; అది ఆధ్యాత్మిక పునర్జన్మ. అమ్మ దివ్య సాన్నిధ్యంలో మనం పొందే లబ్దినీ, ఆనందాన్నీ మన అనుజులందరికీ పంచాలంటే పటుతరమైన సాధనం ” పత్రిక’.
పత్రిక విషయమై అమ్మ, “పత్రిక కాదు, పుత్రిక” అని సంభావన చేసింది.
ఇపుడు పత్రికల నిర్వహణలో కొన్ని ముఖ్యాంశాల్ని పరిశీలిద్దాం. ప్రధానంగా ఆంధ్రభాషలో ‘విశ్వజనని’, ఆంగ్లభాషలో ‘Mother of All” పత్రికలు ప్రచురిస్తున్నాం.
పత్రిక స్థాయి గుణాత్మకం (Quality) గా, పాఠకజన హృదయ రంజకం (Reader friendly) గా ఉండాలంటే ఖర్చుతో కూడిన పని. కాగితం, ముద్రణా వ్యయం, తపాలా ఛార్జీలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కానీ సంవత్సర చందా కానీ, జీవిత చందా కానీ మనం పెంచటం లేదు.
కావున ఇతోధికంగా చందాదారులను చేర్పించాలి; ప్రకటనలను ప్రోత్సహించాలి; శాశ్వతనిధిని ఏర్పాటు చేసుకోవాలి. మరొక సున్నితమైన అంశం. జీవితచందా రమారమి పది సంవత్సరాల వరకే సరిపోతుంది; కావున 10 సంవత్సరాల తర్వాత దానిని రెన్యూ చేస్తే పత్రికకు పరిపుష్టి చేకూర్చినట్లు అవుతుంది.
The last, but not the least అంశం : సోదరీ సోదరులు తమ అమూల్య అనుభవాలను వ్రాసి పంపాలి. ఈ సందర్భంగా భావం ముఖ్యం కానీ భాష కాదు. భాష ముఖ్యం అని కనుక భావిస్తే, తమ హృదయాంతరాళాల్లో భద్రపరుచుకున్న అమూల్య అనుభవ వివరాల్ని, విశేషాల్ని తమకు తోచిన విధంగా వ్రాసి పంపిస్తే, అమ్మ అనుగ్రహంతో ఆయా సంపాదకవర్గ సభ్యులు వారి శక్తి మేరకు సాధ్యమైనంతలో ఆమోదయోగ్యమైన రీతిలో వాటిని అక్షర బద్ధం చేసి ప్రచురిస్తారు- అని విజ్ఞప్తి చేస్తున్నాం.
మీరూ ఆలోచించండి. రెండు పత్రికలూ సంస్థకి రెండు కళ్ళు. వాటి సంరక్షణకి మీ చేయూత నివ్వండి.