సమస్త ప్రాణికోటినీ సృష్టించడం చేత శ్రీ లలిత మాతా;
సమస్త విశ్వానికీ (అందరికీ, అన్నిటికీ) తల్లి కనుక శ్రీమాత విశ్వమాత. మూడడుగుల్లో ముల్లోకాలనూ కొలిచి చూపించిన వామనావతారుడైన విష్ణువు విశ్వరూపుడు. “విశ్వం విష్ణుర్వషట్కారో…..” అంటూ విష్ణు సహస్రనామ స్తోత్రం భీష్ముని నోట వెలువడింది. విష్ణువునకు తల్లి కనుక విశ్వమాత – భారతీవ్యాఖ్య.
మాత అంటే తల్లి. ప్రతి స్త్రీ తన సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తి అవుతోంది. తల్లిగా తన బిడ్డలను ప్రేమిస్తుంది, లాలిస్తుంది, పెంచి, పోషిస్తుంది. తన బిడ్డ సుఖాన్ని కోరుకుంటుంది. తన సంతానం పదికాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తుంది. తన పిల్లల సుఖసంతోషాల కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధపడుతుంది. నిరుపేదరాలు అయిన తల్లి కూడ తన పొట్ట మాడ్చుకుని అయినా, తన బిడ్డ ఆకలిని తీర్చటానికే ప్రయత్నిస్తుంది. తన కుమారుడు దొంగ అయినా, హంతకుడే అయినా మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. ఆశ్రయమిస్తుంది, అవసరమయితే రక్షణను కూడా కల్పిస్తుంది. తల్లిగా అది తన బాధ్యత అని భావిస్తుంది. సమస్త సృష్టికీ తల్లి అయిన శ్రీమాత విశ్వమాత. ఆ తల్లి మనలను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది.
“అమ్మ” మాత, విశ్వమాత. “అమ్మ” ప్రతి కదలికా విశ్వమాతృభావాన్నే ప్రదర్శించేది. “అమ్మ” ప్రతి పలుకూ విశ్వజననీత్వాన్నే ప్రకటించేది. విశ్వమాత అంటే సకల చరాచర సృష్టికీ తల్లి అని అర్థం చెప్పుకున్నాం కదా ! “అంతటా ఉన్న అమ్మను తెలియజేయడానికే ఈ అమ్మ” అనే వాక్యం “అమ్మ” విశ్వమంతటా నిండి ఉన్నది అనే అర్థాన్ని కూడా అందిస్తోంది. “జిల్లెళ్ళమూడిలో మంచమ్మీద కూర్చున్న అమ్మ కాదుగా. అమ్మ అంటే ఆది అంతమూ లేనిది. ఈ సర్వానికీ ఆది, అంతమూ అయినది” అని తన విశ్వమాతృతత్త్వాన్ని వివరించింది “అమ్మ”. “మీరెవరమ్మా?” అని ప్రశ్నించిన వారికి “అమ్మను నాయనా… నీకూ, మీకూ, అందరికీ” అని ఈ సమస్త సృష్టికీ తాను “అమ్మ”ను అని స్పష్టంగా చెప్పింది. ‘సుబ్బారావు, హైమా, రవిల అమ్మవూ…” అని తన అమ్మదనాన్ని పరిమితం చేయబోతే, మధ్యలోనే అందుకుని” కాదు. ఆ విషయంలో పిల్లల తల్లిని” అని నిర్ద్వంద్వంగా చెప్పిన “అమ్మ” విశ్వమాత. ఈ విషయంలో ఇంకా వివరణను ఇస్తూ “మీరందరూ నా బిడ్డలే… మీ అందర్నీ నేనే కని, మీ మీ తల్లులకు పెంపుడిచ్చాను” అని స్పష్టంగా ప్రకటించింది “అమ్మ”. తన పొట్టను చూపిస్తూ “ఈ పొట్ట మాతృత్వానికి చిహ్నం” అనీ, తానెప్పుడూ బాలెంతను, చూలింతను అనీ చెప్పడంలోని ఆంతర్యం తన విశ్వమాతృత్వాన్ని తెలియజేయడమే.
“వాత్సల్యం అంటే అనసూయ,” “మాతృత్రయం కలిస్తేనే అనసూయేమో!” అని తన పేరులోని అంతరార్థాన్ని విశ్లేషించిన “అమ్మ” విశ్వమాత. ఆకుపూజ సమయంలో తమలపాకు మీద ఉన్న పురుగును దులపబోయిన అక్కయ్యను వారిస్తూ, “ఫర్వాలేదమ్మా. ఆ పురుగేం చేస్తుంది?” అని క్రిమికీటకాదులపై కూడా తన మాతృప్రేమను ప్రదర్శించింది. ఎలుక కొరికిన మామిడిపళ్ళు నివేదనకు పనికిరావని బాధపడుతున్న ఒక అన్నయ్యతో “ఫర్వాలేదు నాన్నా! ఎలుక తింటే ఏం ? ఎలుకరూపంలో అమ్మే వచ్చి తిన్నదేమో!” అంటూ, ఒక పండు తాను తిని, అంతటా వ్యాపించి ఉన్న “అమ్మ” తత్త్వాన్ని ఎరుక పరచిన విశ్వమాత మన అనసూయమ్మ. “అందర్నీ ఒకటిగా ఆదరించటం అంటే తల్లి స్వభావమే” అని చెప్పిన “అమ్మ” స్థావర జంగమాత్మకమయిన సృష్టిలోని ప్రతిప్రాణినీ తన బిడ్డగానే భావించి, ప్రేమించి, ఆదరించింది. అందుకే, జనని అంటే మూలస్థానమేగా” అని తానే ఈ సకల జగత్తుకూ మూలమని తెలియజెప్పింది. ఇదే అర్థంలో “తల్లి అంటే తొల్లి” అని ఈ సమస్త సృష్టికీ మొదట ఉన్నది తానే అని చిన్నవాక్యంలో సూత్రప్రాయంగా చెప్పింది. “నాకు
బిడ్డగా కాక మరోరకంగా కనబడరు” అని చెప్పిన “అమ్మ” పసితనంలోనే ఆబాల గోపాలాన్ని తన బిడ్డలుగానే ప్రేమించింది. ఆ రోజుల్లోనే వృద్ధులు కూడా “అమ్మ”లోని మాతృత్వపు మధురిమను గ్రోలి పరవశించిన సంఘటనలు ఎన్నో “అమ్మ” జీవిత మహోదధిలో తరంగాలుగా ఎగసి పడుతున్నాయి.
విశ్వమాత అయిన “అమ్మ”కు విశ్వరూపుడు అయిన (విష్ణువు) రంగనాథుడు కూడా బిడ్డే. నెల్లూరు సీమలో చల్లగా శయనించిన శ్రీరంగనాథుని దర్శించిన “అమ్మ”కు తన ప్రియపుత్రుని చూసినా ఆనందం వెల్లువ అయింది. ఆలయప్రవేశం చేసిన వెంటనే, గర్భాలయంలోకి వెళ్ళి, ప్రేమతో రంగనాధుని విగ్రహాన్ని నిమురుతున్న “అమ్మ” కళ్లల్లో అంతులేని పుత్రవాత్సల్యం పొంగులు వారింది. ఆ విగ్రహాన్ని స్పృశించిన “అమ్మ” పారవశ్యంతో పులకించి పోయింది. పుత్రగాత్ర స్పర్శసుఖానుభూతిని పొంది, ఆనందిస్తున్న “అమ్మ” అర్చకుడు తన చేతిలో పోసిన నీళ్ళను ప్రేమతో స్వామిపై చిలకరించింది. తన గళసీమను అలంకరించిన పుష్పమాలికను స్వామికి కానుకగా ఇచ్చి, సహజ సుందరమూ, నిర్మలమూ అయిన తన పుత్రప్రేమను ప్రకటించిన “అమ్మ” విశ్వమాత.
విశ్వమే మాతగా అవతరించిన “అమ్మ” తన పాదాలు-అగ్నితత్త్వం, పొట్ట – వాయుతత్త్వం, తల పృథ్వితత్వం, చక్షువులు జలతత్త్వం, శరీరం ఆకాశతత్త్వం” అని వివరించింది. “అమ్మే స్టేజికాని, అమ్మకో స్టేజిలేదు” అని స్పష్టంగా ప్రకటించింది. స్టేజి అంటే రంగస్థలం (ఆధారం). తాను నడుపుతున్న ఈ జగన్నాటకానికి రంగస్థలం కూడా తానే అయిన “అమ్మ”కు వేరే రంగస్థలం అంటూ ఏమీ లేదు. (ఆమె నిరాధార కదా!). జగన్నాటక సూత్రధారిణి అయిన “అమ్మ” పాత్రధారణిగా కొద్దికాలం మన కనులముందు కదలాడి, మనతో కలసిమెలసి నటించి, మనలను మురిపించి, మైమరపించింది. అంతలోనే, “నిర్ణయించినవాడు కూడా నిర్ణయానికి బద్ధుడే” అని చెప్పినట్లుగా – తన పాత్రకు తానే ముగింపు చెప్పుకుని, మనకు మాయపొరలు కప్పి, తాను కనుమరుగు అయింది.
విశ్వమాత అయిన అర్కపురీశ్వరి అనసూయా మహాదేవికి ప్రణమిల్లుతూ…
(మాతృసంహిత రచయితకు కృతజ్ఞతలతో…)