“విశ్వమంతా పరమేశ్వరీ స్వరూపమే. సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే జగత్తుతో అభేదం గల దేవీతత్త్వం అర్థమవుతుంది అలాంటి దేవి విశ్వరూప” – భారతీవ్యాఖ్య.
శివసహస్రనామాల్లో ఒక నామం “విశ్వరూపః”. అంటే, విశ్వమే రూపంగా కలవాడు – అని అర్థం. విష్ణుసహస్ర నామాలు ‘విశ్వం’ అనే నామంతో ప్రారంభ మవుతాయి. అంటే విష్ణుమూర్తే విశ్వం. విష్ణుమూర్తికి విశ్వానికి భేదం లేదు. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం “ప్రకృతి” నామంతో మొదలవుతుంది. అంటే, కనిపిస్తున్న ఈ ప్రకృతే లక్ష్మీదేవి. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపమే ఈ చరాచర జగత్తు అని స్పష్టమవుతోంది. సృష్టి, భగవంతుడు వేరు కాదు. అందువల్లనే విశ్వరూపసందర్శనంలో – పర్వతాలు, నదులు, సముద్రాలు, భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రులు, చెట్లు, సకల జీవరాశులూ కనిపిస్తాయి. సృష్టి నుంచి భగవంతుణ్ణి, భగవంతుని నుంచి సృష్టినీ వేరుచేయలేం.
భగవంతుణ్ణి “అమ్మ” నిర్వచించిన తీరుకూడా ఇదే భావాన్ని ప్రకటిస్తోంది. “అన్నీ తానే అనుకునే మనస్తత్వమే భగవంతుడు”, “రెండు లేనివాడు, రెండూ అయినవాడు భగవంతుడు”, “అన్నింటిలో ఇమిడి ఉన్నశక్తి భగవంతుడు”. “విశ్వరూప సందర్శనమంటే ఈ కనపడే దానిని భగవంతునిగా చూడటమే”, “అన్ని రూపాలూ ఒకటే నన్న స్థాయి రావడమే దైవత్వం” అని భగవంతునికి, సృష్టికి గల సారూప్యాన్ని చక్కగా వివరించింది “అమ్మ”.
“అమ్మ” విశ్వరూప. జగన్మాత అంటే “జగత్తుకు తల్లి కాదు. జగత్తే తల్లి” అని వివరించి, తాను విశ్వమాతగా, విశ్వరూపగా సాక్షాత్కరించింది. “అమ్మ”. “మీరుకానిది నేనేదీ కాదు,” “మీరంతా నేనే, మీదంతా నేనే, ఇదంతా నేనే”, “నేను నేనైన నేను, ‘నేను అంటే అనసూయమ్మ’ అని కాదు. అన్ని నేనులు నేనైన నేను,” “మీరు నా అవయవాలు”, “అంతా నేనే అనుకుంటున్నప్పుడు ప్రత్యేకించి భక్తులు ఎవరు ?” “తనలో నేననేది అంతటా ఉంది,” “నేను మీలో దైవత్వం చూస్తాను”, “నేను మీలో నన్ను చూసుకోనప్పుడుగా చిక్కు” ఇలా “అమ్మ” ఈ సృష్టితో తనకు గల అభేదాన్ని ఎన్నో రకాలుగా వ్యక్తీకరించింది. “మీరు” అన్నప్పుడు. మానవులమయిన మనం మాత్రమే కాదు. సకల చరాచరసృష్టినీ పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఇంకా బాగా అర్థం కావడం కోసం “చీమగా, దోమగా” ఉన్నది తానే నని చెప్పింది. అందుకే “నాకందరూ ముద్దోస్తారు. చక్కదనం వల్లనా ? కాదు. పందిపిల్ల కూడా ముద్దోస్తుంది… నన్ను ప్రేమించని వాళ్ళు కూడా ముద్దోస్తారు. “ఇలా “అమ్మ” చెప్పడంలోనే అంతా తానే అయి ఉన్నది అని అర్థమవుతోంది. అందుకే – విశ్వరూప.
విశ్వరూప అయిన “అమ్మ”కు ప్రకృతికి సంబంధించిన సమస్తమూ స్వానుభవమే కదా ! అందుకే ప్రకృతి వైపరీత్యాలు జరిగే ముందు “అమ్మ”కు శరీరంలోమార్పులు గోచరిస్తాయి. ఒక్కొక్కసారి “అమ్మ” ఆ మార్పును సూచిస్తుంది కూడా. ఎంత చల్లగా ఉన్న ప్రకృతి అయినా “అమ్మ” సూచన చేసిన మరుక్షణం వడగాడ్పులతో ప్రాణికోటిని వడలిపోయేలా చేస్తుంది. 23.6.1967న “నేను ఏదన్నా కాస్త తొణకానంటే మీ పని ఏమవుతుంది ?” అని ప్రశ్నించింది “అమ్మ”. 24.6.1967 ” ఒళ్లు తిరుగుతున్నది. ఇవ్వాళ ఏమిటో నాకు భూకంపం వచ్చినట్లుందర్రా” అని చెప్పింది. ఈ మాట అమ్మనోటి నుంచి వెలువడిన రెండు గంటలు కాకుండానే భూకంపం సంభవించింది. ఈ భూకంపం రాబోతుందనగానే ముందురోజూ, ఆరోజూ “అమ్మ” శరీరంలో మార్పు వచ్చింది. విశ్వరూప అయిన “అమ్మ”కు భూకంపం రావడమంటే అందుకే “భూకంపం వచ్చినప్పుడు “అబ్మ” మంచం కూడా కదిలిందా” అని అడిగితే “ముందు నా మనస్సే కదలింది”. అని భూదేవికి తనకు గల అభేదాన్ని స్పష్టం చేసింది “అమ్మ”. తాను కంపించటమేగా మరి. విశ్వరూప అయిన అనసూయమ్మ ఈ నూతన సంవత్సర శుభసమయంలో మనకందరికీ తన అనుగ్రహాశీస్సుమవర్షాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, “అమ్మ”కు నమస్కరిస్తున్నాను. జయహోమాతా! శ్రీ అనసూయా! (అమ్మ అమ్మ వాక్యాలూ శ్రీపాదవారికి కృతజ్ఞతలతో)