అది 63-64వ సంవత్సరము. రోజూ రాత్రిళ్ళు కాకుండా ఆదివారం కూడా జిల్లెళ్ళమూడి వస్తూ వుండేవాడిని. ఒకరోజు నేను మధ్యాహ్నం వచ్చేటప్పటికి పూరింటి హాలులో అమ్మదర్శనం ఇస్తున్నది. నేను ఎళ్ళి హాలులో ఖాళీ లేకపోవటంతో హాలులోనే అమ్మ మంచానికి ఎదురుగా గోడను ఆనుకొని అమ్మకు సరిగా ఎదురుగా కూర్చున్నాను. ఒకామె అమ్మకు పూజ చేసికొంటోంది. హాలు నిండా కిక్కిరిసి ఉన్నారు. గోడకు ఆనుకొన్న నాకు అమ్మను నిమీలిత నేత్రాలతో కనురెప్ప వేయకుండా చూడాలని పించింది. అనుకొన్నట్లుగానే అమ్మ ముఖము వంక ప్రత్యేకముగా అమ్మ బొట్టును చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి ఆ బొట్టు అమ్మ ముఖముతో సహా వికసించటము అనగా వ్యాకోచించటము ప్రారంభించింది. అమ్మ బొట్టు ఎర్రగానే కనపడుతూ అమ్మ ముఖము అనేకరంగుల సమ్మేళనముతో వికసిస్తూ పోతున్నది. అది ఎంత వ్యాకోచము చెందింది అంటే ఆ బొట్టు, ముఖము నాకంటికి కనపడనంత, మానసిక నేత్రంకు కూడా అందకుండా పోయింది. వికసించి, వికసించి సమస్త విశ్వంలో లీనమై పోతుంది. ఇక చూడవలసింది చూచేది శూన్యమే “చూడ చూడగ కనపడే శూన్యమవుగా” అని రాజు బావ అన్నట్లుగా. ఆకాశం గగనం శూన్యం అన్నారు. శూన్యమంటే ఏమీ లేదని కాదు. అంతటా నిండి ఆవరించి ఉన్నదనే అర్థం. అది అవాఙ్మనస గోచరం. ఈ పరిమితమైన నేను నేను గానే ఉంటూ అపరిమితమైన ‘నేను’ లో లీనమయ్యాను. ఇక అపరిమితమైన “నేను” శూన్యమై పోయింది.
తరువాత ఏమిటో నాకు తెలియదు. కొంతసేపైం తర్వాత మరల అమ్మ ముఖము, బొట్టుతో సహా సంకోచము జరుగుతూ జరుగుతూ అసలు అమ్మ అదివరకు వున్నట్లు గనే ఉండిపోయింది. ఇది జరిగేటప్పటికి హాలులో ఉన్న వారందరు అన్నపూర్ణాలయమునకు వెళ్ళిపోయారు. హాలులో ఎవరూ లేరు. ఆ పూజ చేసికొంటున్న ఆమె తప్ప. ఆమె కూడా అమ్మకు హారతిస్తున్నది. అమ్మ ఆమెను భోజనానికి వెళ్ళి రమ్మనమని సంజ్ఞ చేసింది. అమ్మ మంచం మీద నుండి లేస్తున్నట్లుంది. వెంటనే నేను లేచి అమ్మ మంచం దగ్గరకు వెళ్ళి అమ్మకు పాదుకలు అందిచ్చాను. నా తలపైన చేయి వేసి పాదుకలు తొడుక్కొని లోపలకు వెళ్ళిపోయింది. తలుపులు వేసేసారు. నేను అత్యంత ఆనందంతో యున్నాను. ఈ ఆనందాన్ని ఎవరితో నైనా పంచుకొంటేగాని నాకు తృప్తి నివ్వదు. ఆకాలంలో ఏది వచ్చినా నాతో పంచుకొండేది మా సోదరుడు రామకృష్ణతోనే. రామకృష్ణ అమ్మ ఆలయం ఫౌండేషన్స్ మీద స్నానం చేస్తున్నాడు. ఒరే కృష్ణా ! స్నానం త్వరగా కానిచ్చి అర్జంటుగా ఒక్కసారిరా ! అన్నాను. వాడు గుడ్డలు కట్టుకొని త్వరగానే వచ్చాడు. వాడిని చేయి పట్టుకొని అన్నపూర్ణాలయం వెనుకకు లాక్కుపోయాను. అప్పటికి అమ్మ పూరింటి నుండి అన్నపూర్ణాలయందాకా అన్నీ పొలాలే. అన్నపూర్ణాలయం వెనుక కూడా పొలాలే. ఆ పొలాల్లోకి తీసికొని వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్పాను. దీనికి ఏమైనా Spiritual Signifi cance ఉంటుందా ? అన్నాను. అమ్మనే కనుక్కో అన్నాడు. ఆ పూజ చేస్తున్న ఆవిడ దేవీ ఉపాసకురాలేమో అన్నాను. వెళ్ళి కనుక్కొందాం రా! అని నన్ను అన్నపూర్ణాలయంకు తీసికెళ్ళాడు. ఇద్దరు వెళ్ళి ఆమె అన్నపూర్ణాలయం హాలులో కూర్చొని భోజనం చేస్తుంటే ఆమె ప్రక్కనే కూర్చొని మీది ఏ ఊరు? అన్నాము. నెల్లూరు అంది. మీరు ఏమైనా దేవీ ఉపాసకులా ? అని అడిగేము. ఆమె ‘ఔను’ అంది. మరల ఇద్దరం అమ్మ పర్ణశాలకు వచ్చాము. అమ్మ అప్పుడే స్నానం చేసి లోపలి గదిలో కూర్చొంది. తలుపులు తీసారు. నేను మెల్లిగా అమ్మలోపలి గదిలోకి ప్రవేశించాను. అమ్మ మంచం వద్ద అమ్మ దగ్గరగా కూర్చున్నాను. అమ్మ ఒళ్ళో తలకాయ పెట్టి అటు, ఇటు త్రిప్పుతున్నాను. అమ్మ నా తలకాయ పట్టుకొంది. ఏం నాన్నా! ఏంటి ఇంత ఆనందంలో వున్నావు ? అంది. జరిగిన విషయమంతా పూస గ్రుచ్చినట్లుగా అమ్మతో చెప్పాను. అమ్మ సావధానంగా విన్నది. దానికి ఏమైనా spiritual significance ఉన్నదా? అని అమ్మను అడిగాను. అమ్మ ఏముంది నాన్నా! నీవు పరిమితంగా ఉన్న అమ్మను అపరిమితంగా చూచావు. ఇదే విశ్వరూప దర్శనం అంటే” అన్నది. “మరి కృష్ణుడు. అర్జునునికి విశ్వరూప దర్శనం చూపించినప్పుడు అన్నీ కొండలు, నదులు మొదలగునవి అంతా చూపిస్తున్నారు కదా!” అని అన్నాను. అదేముంది సర్వసృష్టిని చూపించటమేగా! ఇప్పుడు నీవు చూచింది అదే – అన్నది. నాకు చాలా ఆశ్చర్యం ! సంతోషం ! ఆనందం వేసింది. “అమ్మా ! కృష్ణుడు అర్జునునికి విశ్వరూపదర్శనం యివ్వటంలో కొంత కారణం వున్నది. అవసరము ఉన్నది. మరి నాకు నీవు ఎందుకు చూపించినట్లు?” అన్నాను. అమ్మ “ఏమో! నీకు ఇవ్వాలనుకొన్నాను ఇచ్చాను” అంది. దీనికి కారణం అకారణం అవ్యాజము అదృష్టం మరి దాన్ని ఇంకేమనాలో!
అమ్మ అనేకసార్లు ‘అమ్మ అంటే ఈ జిల్లెళ్ళమూడిలో ఈ మంచం మీద కూర్చొన్న అమ్మయే కాదు. అంఆ అంటే అంతులేనిది, అడ్డులేనిది, సర్వానికి ఆధారమైంది. అంతా అయినది’ అన్నది కదా! దానికి Demonstration గానే నాకు ఈ దర్శనం ఇచ్చిందేమో ! అమ్మ సర్వాంతర్యామి, సర్వవ్యాపస్, సర్వేశ్వరి, సర్వసాక్షిగా ఆదిశక్తి, సర్వరూపిణి.
ఈ దర్శనం ఆధారంగానే మా సంస్థలన్నింటికీ అదే చిహ్నం ఏర్పరచాను. మా crest అదే. అమ్మ పతాకానికి కూడా ఇదే చిహ్నం ఏర్పరచాడు రామకృష్ణ మా పబ్లికేషన్సు అన్నింటికి కూడా అదే గుర్తు.