విశ్వరూప సందర్శనం అనగానే ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో శ్రీ కృష్ణభగవానుడు అర్జునునికి ప్రసాదించిన దివ్యదర్శనం మనకి గుర్తుకు వస్తుంది. ‘దివ్యందదామి తే చక్షుః’ (నీకు దివ్యదృష్టిని అనుగ్రహిస్తున్నాను) అన్నారు కృష్ణపరమాత్మ. పిమ్మట అర్జునుడు ‘పశ్యామి దేవాం స్తవ దేవదేహే’ అంటూ, ఆది మధ్యాంతరహితుడవైన నీ దేహమునందు బ్రహ్మది దేవతలు, మహర్షులు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, సకల ప్రాణికోటిని ‘ దర్శిస్తున్నాను’ అన్నాడు. ఆ విరాట్ స్వరూపుని వేదాలు ‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్’ అని అత్యంత సరళంగా, నిర్దుష్టంగా కీర్తిస్తాయి; అనేక శిరస్సులు, అనేక కళ్ళు, అనేక పాదాలు.. అంటే అన్ని రూపాలూ తానే ఉన్నట్టు కనడమే లో చూపు; అదే దివ్య దృష్టి. అని ఉన్నది.
అమ్మ అనుగ్రహించిన దివ్యదృష్టిని ప్రస్తావిస్తాను. ‘అమ్మా! నువ్వు జగన్మాతవు’ అని అంటే, “జగన్మాత అంటే జగత్తే. పులికడుపున పులి పిల్ల పుట్టినట్లు జగన్మాత కడుపున జగత్తు పుట్టింది” అని ప్రవచించింది. 2 సం॥లు ఎదిగిన తర్వాత పులి పిల్లను చూస్తే మాతా శిశువులు మధ్య ఏ భేదం కంటికి కనిపించదు. అలాగే జగన్మాతకి జగత్తుకి అభేదమే అని అమ్మ మాత్రమే సంపూర్ణత్వాన్ని చాటింది.
ఇక్కడ మరొక విశేషాంశం ఉన్నది. ఒక పులికడుపున అనేక శార్దూల కిశోరాలు జన్మించినట్లు జగన్మాత కడుపున కంటికి కనిపించే సృష్టి మాత్రమే కాక అనేకం ఉద్భవించాయి. “ఈ కుర్చీ దేవుడే. కానీ దేవుడు కుర్చీ మాత్రమే కాదు” అన్న అమ్మ వాక్యం ఈ ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తుంది. ‘త్రి పదాధారయద్దేవః యద్విష్ణోరేక ముత్తమం’ (వ్యక్తా వ్యక్తమైన సృష్టిలో మూడు భాగాల్ని మాత్రమే విష్ణువు ధరించి ఉన్నాడు) అనేది శృతి వాక్యం.
పులికి పులిబిడ్డకి ఏ తేడా లేదు అవే కళ్ళు, అవయవాలు, రక్తం, లక్షణాలు, స్వభావం, ప్రవృత్తి. “సృష్టే దైవం” అంటూ సృష్టికీ, సృష్టికర్తకీ అభేదత్వాన్ని ప్రకటించింది అమ్మ: అద్వైత రసామృతమూర్తి, “తొలి” అమ్మ. సృష్టి కర్తకి లేని గుణాలు సృష్టికీ లేవని అమ్మే స్పష్టపరిచింది. నిజం లోతుకు వెళ్ళి ఆనువంశిక లక్షణ మూలాన్ని ప్రస్తావించాలంటే అది సృష్టికర్తే. కనుకనే ‘పితాZహం అస్యజగతః మాతా ధాతా పితామహః’ – అని అన్నారు పరమాత్మ.
సృష్టిలో అజ్ఞానం, చీకటి, దారిద్ర్యం, దౌష్ట్యం…. వంటి భయానక అంశాలు కూడా ఈశ్వర దివ్యలీలా విభూతులే. పొరపాట్లతో కూడినదే మానవత్వం. మానవునికి బురద పూయాలంటే ముందుగా అది మాధవునికీ అవసరమైంది. దేవతలు, మానవులు, పంచభూతాలే కాదు రాక్షసులు, పిశాచాల్ని కూడా (యా విప్రుషావి పరాపతన్, తాభ్యో అసురా రక్షాగ్ంసి పిశాచాశ్చోద తిష్ఠన్) సృష్టికర్తే స్వయంగా సృష్టించాడు అని వేదం వివరిస్తోంది.
ఒక సందర్భంలో అమ్మ, “శ్రీ కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు కదా, నాన్నా! ఏం చూపించాడు? ఈ చెట్లు, కొండలు, నదులు, గ్రహాలు, జీవకోటి, నక్షత్రాలు… ఈ సృష్టినేగా అని అన్నది. కనుకనే “చూస్తున్నదంతా నిజస్వరూపమే” అనీ, “నా దృష్టిలో జడం అనేది లేదు; అంతా చైతన్యమే, సజీవమే” అని విశ్వరూప సందర్శన సారాన్ని సరళంగా సూటిగా స్పష్టంగా చాటింది అమ్మ.
ఇక్కడే ఒక ప్రధానాంశంపైన మనం దృష్టి సారించాలి. సృష్టి రచనకి, నడకకి ద్వందాలే ఆధారం. చీకటి వెలుగులు, మానావమానాలు, న్యూనతాధిక్యాలు, లాభనష్టాలు, జనన మరణాలు, వృద్ధిక్షయాలు, సృష్టికి మూలం, ఆధారం. ఈ పరమసత్యాన్ని బందరు సో॥ శ్రీ చంద్రశేఖర రావుగారితో అమ్మ “నడక అంటే ఒక పాదం ముందు, ఒక పాదం వెనుక, నాన్నా! రెండు పాదాల్ని ఒకేసారి ముందుకుసాచి అడుగులు వేయగలమా?” అని విశ్లేషించింది. కాగా సుకుమార సున్నిత హృదయాలకి తమ కళ్ళ ఎదుటి నేరాలు, ఘోరాలు, ఆకలి చావులు, అరాచకాలు, అసంఖ్యాక జీవుల దైన్యం… కనబడుతూంటే దైవాన్ని ఒక నియంతగా, నిర్దయునిగ, కర్కశ హృదయునిగ తలపోయటం అతిశయోక్తి కాదుకదా సహజం, సమర్ధనీయం. అది భగవంతుని లీల అన్నా, విలాసం అన్నా, సృష్టివైచిత్రి అన్నా…. అది వారికి సరిపడు సమాధానం కాదు. ఈ అంశంపై సుదీర్ఘమైన ఆలోచన చేయాలి.
సాధారణంగా ఏ వ్యక్తినైనా ఏ అంశాన్నైనా అర్థం చేసికోవటం కంటె అపార్ధం చేసికోవటం తేలిక. కాగా అవాజ్మానసగోచర తత్వాన్ని అపార్థం చేసికోవటం అత్యంత సహజం. కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన, జపాన్ సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల్ని విధివంచనలుగానూ జెలియన్వాలాబాగ్ హత్యలూ, ఊచకోతలూ, కులమత ప్రాంతీయ దురభిమానంతో సామ్రాజ్య విస్తరణ కాంక్షా పూర్వక రక్తదాహంతో సాటి మనుష్యుల్ని నరికి పోగులు పెట్టటం – స్త్రీ, బాల, వృద్ధ విచక్షణ లేకుండా గొంతు పిసికి చంపిపారవేయటం… వంటివి దానవ పైశాచిక ప్రవృత్తిగానూ – వర్గీకరించినా అవన్నీ నిస్సందేహంగా హృదయ విదారకములే.
దైవం ఒక అప్రతిహతమైన అమోఘమైన శక్తి అని భావిస్తున్నాం కనుక ఈ వైపరీత్యాల్ని, అకృత్యాల్ని అరికట్టవచ్చుకదా – అని అనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో అమ్మ, “అవసరమైతే మారుస్తాను” అన్నది. సృష్టి రచనా వ్యూహాన్ని, సంచాలక రహస్యాల్నీ అర్థం చేసుకోవటం సామాన్యులకు అతీతమైనదే. విధి అంటే తప్పనిసరి అయినది. విధియే దైవం. ఆ దైవం “అమ్మ”గా భూమి పై అవతరించినది. “అమ్మ”గా ఉన్న ఆ దైవాన్ని అర్థం చేసికోవటం అసాధ్యమైనది. ఒక ఉదాహరణ.
కృష్ణాజిల్లాలో దివిసీమలో సంభవించిన విధాత నిర్దయ విధ్వంసక చర్య ఉప్పెనలో అసంఖ్యాక జనులు, జంతువులు, చెట్లు, క్రిమికీటకాదులూ… సాగర గర్భంలో కలిసి పోయాయి. ఒడ్డు మీద ఎందరో దిక్కులేని వారుగా మిగిలారు. అన్నీ తానైన తల్లి అమ్మ. కానీ తల్లడిల్లి పోయింది. విలపించింది; బాధితులను గుండెలకు హత్తుకుని ఓదార్చింది; తన కన్నీటిని తానే తుడుచుకున్నది. అమ్మని ఓదార్చిన వారే లేరు. ‘జగమేలే పరమాత్మ! ఎవరితో మొరలిడుదువు? అంటే “నాతో నేనే” అని సమాధానమిచ్చింది.
ఒక మొగ్గ పుష్పంగా వికసింప దర్శించటం సాధ్యం కాదు. అలాగే “అమ్మ” మాత్రమే చేపట్టిన సృష్టిసంచాలక క్రియాశీల సవరణలు, మార్పులు… ఆ నిమిత్తంగా వేసిన బీజాలు, జారీ చేసిన ఆదేశాలు… అల్పమైన మన బుద్ధికి అందేవికావు. “విధి వర్షం లాంటిది. కొందరికి అనుకూలం. కొందరికి ప్రతికూలం” అనే అమ్మ వాక్యాన్ని ఈ వెలుగులో అర్థం చేసుకుంటే భాగ్యవంతునిగా ఆనందిస్తున్నదీ జగన్మాతే; నిర్భాగ్యునిగా ఆక్రోశిస్తున్నదీ తానే – అనే వాస్తవం తేట తెల్లం అవుతుంది.
ఒకసారి రోటరీక్లబ్ సభ్యులకు సందేశమిస్తూ, అమ్మ, “తమ బ్రతుకు తాము బ్రతకలేని అనేక విధాల బలహీనులు ఉన్నారు. తమ కాళ్ళ మీద నిలబడలేని వారికేగా కఱ్ఱ ఆసరా! వారికి తోడు పడండి. అయితే అది వారిపై జాలితో చేసే సహాయమని అనుకోక, వారిని భగవత్స్వరూపులుగా భావించి వారికి సేవ చేయండి. కనిపించని దేవునిపై మనసు నిలవడం లేదనీ ఏకాగ్రత కుదరటం లేదనీ బాధపడక, కనిపించే ఈ దేవుళ్ళను ప్రేమతో ఆరాధించండి. ఆ సేవలో కలిగే తృప్తే ముక్తి” – అని యదార్థాన్ని సూటిగా వ్యక్తం చేసింది. ఇందు మూలంగా స్పష్టమైన అంశం ఏమంటేః
సేవించే వాడూ- సేవలు పొందేవాడూ; దాత – గ్రహీత; దిక్కులేని వానిగా అలమటించేవాడూ – అందరికీ దిక్కు అయి అలరారే వాడూ తానే. ఇంతా, అంతా.. ఎంత చెప్పినా ఆ అద్వైత స్థితి అర్ధమయ్యేది కాదు. కనుకనే అమ్మ, “ఏదీ చెప్పను, నాన్నా! ఏదీ చెప్పకపోవటమే నా సందేశము” అని స్పష్టంగా చాటింది.
గురువూ – శిష్యుడూ, భగవంతుడూ – భాగవతుడూ, మార్గదర్శీ – బాటసారీ ; సాధకుడు – సాధన – సాధ్యం; కార్య కారణాలూ – సంకల్పవికల్పాలూ, శబ్దమూ – శబ్దార్థమూ; ప్రాపంచికమూ పారమార్థికమూ… సర్వం తానే. ఇదే విశ్వరూప సందర్శనం. ఈ వైభవాన్నే ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు వర్ణిస్తూ.
‘జిల్లెళ్ళమూడి నాశ్రితుల సేవలు గైకొనుచుం బ్రశాంతి సం
ధిల్లగ జేయలోకమున దివ్య శుభాకృతి దాల్చి నీవు రం
జిల్లుచు నుండ, రూపగుణ చేష్టలు లింగము లేకయే విరా
జిల్లును బ్రహ్మమంచును వచించెదరేటికో ! పండితోత్తముల్’
అని ఆశ్చర్యచకితులైనారు. వారి భావం ఏమంటే అనంతశక్తి పరిమితరూపంలో ఉంటే ఎలా ఉంటుందీ; సంకల్ప రహితుడు సంకల్ప సహితునిగ వస్తే ఎలా ఉంటాడు; రూపం లేనిది రూపం ధరిస్తే ఎలా కనిపిస్తుంది: నిన్న మొన్నటి వరకు తండ్రిలా కఠోరంగా శాసించిన సృష్టి సంచాలక శక్తి నేడు ఆశ్చర్యకర వాత్సల్య రసార్ణవగా అవతరిస్తే ఆ అనుగ్రహస్వరూపం ఎలా ఉంటుంది; అన్నీ తెలిసిన జ్ఞాన ప్రసూనాంబ ఏమీ తెలియని, ఏమీ చేతగాని ఒక సామాన్య గృహిణిగా ఆవిర్భవిస్తే ఈ కళ్ళకి ఎలా కనిపిస్తుంది. అనే జిజ్ఞాసువుల ప్రశ్నలకు సాకారరూపమే “అమ్మ” అని.