“విశ్వసాక్షిణి” : ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగినా సాక్షాత్తుగా చూడగలశక్తి లలితాదేవి.
అని లలితా సహస్రనామాలు వ్యాఖ్యానము చదువుతున్నప్పుడు నాకు ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. జిల్లెళ్ళమూడి వచ్చే సోదరీసోదరులలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారి కుటుంబం ఎక్కువ అమ్మ దగ్గరకు వచ్చే వారితో ముఖ్యంగా ఒక కుటుంబం అని చెప్పాలి. వారు వారి నాన్నగారి దగ్గర నుండి వారి మనమల వరకు అమ్మకృపకు పాత్రులైనవారే. శ్రీ లక్ష్మీనారాయణ పెండ్లి అయిన తర్వాత ఒకరాత్రి ఆ దంపతులు గదిలో పడుకొని యుండగా అమ్మ ఫోటో ఆ గదిలో ప్రముఖంగా వుండటం ఆయన భార్య కమల చూచింది. చూచి ఏమండీ చూస్తుందండీ అన్నది. అని లేచి అమ్మ ఫోటో ప్రక్క గదిలో పెట్టి వచ్చి పడుకొన్నారు. తర్వాత ఒక ఆదివారం శలవరోజు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ గదిలో కూర్చొని శ్రీమతి కమల అమ్మఒడిలో పడుకొని తల అటూ ఇటూ త్రిప్పుచుండగా అమ్మ ఆమె తలవెంట్రుకలను చేతితో రాస్తున్నది. అప్పుడు కమల అమ్మా ! మేము ఏమైనా తప్పు చేస్తే క్షమించమ్మా! అన్నది. అమ్మ మీరు చేసింది తప్పు అయితే సృష్టి ఎట్లా కొనసాగుతుంది అన్నది. తర్వాత నా ఫోటో అవతల గదిలో నీవు పెట్టినంత మాత్రాన నేను ఏమీ చూడలేనా ? అన్నది. వారు ఆశ్చర్యపడ్డారు. అమ్మ విశ్వసాక్షిణి అమ్మ చూడలేంది ఏమి ఉంటుంది ? ఒకసారి నేను హైదరాబాద్ నుండి టాక్సీలో వస్తుండగా మధ్యలో యాక్సిడెంట్ అయి ఆ టాక్సీలో నున్న లారీ డ్రైవరు బలవంతాన నన్ను లాక్కుపోయి మరి ఒక నన్ను వశకర్రలు పెట్టి చావకొట్టపోతే ఒక లారీలో అక్కడ నుండి పంపివేసిన వైనం, తర్వాత ఆయాక్సిడెంట్లో ఒక వేళ నేను చనిపోయి వుంటే అమ్మకు ఎట్లా తెలుస్తుంది ? అని నాకు అనిపించటం తర్వాత నేనుజిల్లెళ్ళమూడి చేరి అమ్మను దర్శించే ముందు అమ్మ తన ఇంటిలో నుండి రెండు చేతులు చాపి ఒక ఉరుకున నాకుఎదురు పరిగెత్తుకొని రావటం, అమ్మ పడిపోతుందేమోఅని నేను భయపడి ఎదురుగా వస్తున్న అమ్మను పట్టుకుందామని ఎదురు పరిగెత్తటం, అమ్మ నన్ను అమ్మ కౌగలించుకొని “నాన్నా నీవు బ్రతికి వచ్చావా? అని అనటం
ఆ చుట్టూ వున్న మన సోదరీ సోదరులు ఆశ్చర్యపోవటం మరియొక ముఖ్యమైన ఘట్టము. అటువంటివి ఎన్నో.
లలితాసహస్రనామంతో “విశ్వసాక్షిణి” అన్న నామం, చదువుతూ వాఖ్యానం చూచినప్పుడు ఇవి జ్ఞాపకం వచ్చినవి. అమ్మగా రూపుదాల్చుకున్న లలితాదేవి. విశ్వసాక్షిణి. ఆమె నిష్కారణా అనగా ఆత్మస్వరూపిణి అని కూడా అర్థం. ఆత్మకు కార్యకారణాలు లేవు. అట్లాగే అమ్మ కూడా “మీరు నాలోనే పుట్టి, నాలోనే పెరిగి, నాలోనే లీనమౌతారు అన్న జగజ్జనని. ఆత్మ అన్నింటిలో వుంటూ అంతటా వుంటుంది. కనుక అది విశ్వసాక్షిణి.