జగన్మాత అమ్మ పావన పాదసన్నిధిలో గాయత్రీ యాగం నిర్వహించాము. ఆ సందర్భంలో యజమానిగా సోదరుడు తంగిరాల కేశవశర్మగారిని అమ్మ నియమించింది. గాయత్రీ మంత్ర ద్రష్ట, స్పష్ట విశ్వామిత్రమహర్షి, విశ్వామిత్రుడు అంటే అర్థం కోపోద్రిక్తమూర్తి అని కాదు; ప్రపంచానికి హితుడు, మేలు చేసేవాడు అని. అమ్మ దివ్యసన్నిధిలో విద్యారణ్య ప్రోక్త శ్రీసూక్త పారాయణ, హోమము, తర్పణము, శ్రీ విశ్వజననీచరితమ్ పారాయణ, హోమము, తర్పణము మొదలైన ఎన్నో దీక్షలను తాను స్వీకరించి అమ్మ దయతో కృతకృత్యులు కావటంతో పాటు ఎందరినో భాగస్వాముల్ని చేసి తరింపచేశాడు. “అక్షరలక్షలు దీక్షతో జపం చేస్తే కానీ ఒక మంత్రం సిద్ధించదు” అంటూ ‘ఓం జయహోమాత శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పర స్వాహా’ అమ్మ మూలమంత్రం జపం, హోమం, తర్పణం అవశ్యం ఆచరణీయమైనవని విస్తృతంగా ప్రచారం చేశారు.
శ్రీ విశ్వజననీపరిషతికి తొలి కార్యదర్శి గోపాలన్నయ్య. తాను సంస్థ కార్యకలాపాలతో సతమతమౌతుంటే అమ్మ “కేశవని తీసుకురా. నీకు అండగా ఉంటాడు” అని సలహా ఇచ్చింది. కేశవశర్మగార్ని “కేశవ” అని ముద్దుగా పిలుచుకునేది అమ్మ. నాటి నుంచి 4.6.10తేదీ వరకు అలాగే జరిగింది. సూర్యదేవుని రధసారధి అనూరుడైతే జగన్మాత రధసారధి కేశశన్నయ్యన్నట్లు అమ్మ అవయవాలైన అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయం, ఆదరణాలయం, వేదపాఠశాల, అనసూయేశ్వరాలయం, హైమాలయం… అన్నిటి పురోభివృద్ధికి ప్రణాళికల్ని రచించి అవి కార్యరూపం ధరించేవరకు మధనపడిన అవిశ్రాంత సైనికుడు సేవకుడు అన్నయ్య. అమ్మ సంకల్పమే తన హృదయస్పందనలు; కరచరణాద్యవయవాల కదలికలు. కేశవన్నయ్య ఇంటికి వెడితే ఆయన కనిపించేది రెండుచోట్ల: 1) లాప్టాప్ ముందు తన కార్యశాల(workshop) లో 2)శ్రీ చక్రార్చన చేస్తూ పూజాగృహంలో. తనకి తన సహధర్మచారిణికి వయోభారం, షుగర్, బి.పి. గుండె, కంటి జబ్బులు… ఎన్నో ఎంతగా కృంగదీసినా అమ్మ పని (సంస్థ పని) అంటే 18 ఏళ్ళ యువకునిలా పంచకళ్యాణి గుర్రంలా ఉరుకులూ పరుగులూ తీసేవారు. తీయించేవారు. ఆయన పెద్దవారు కదా!’ అని అంటే సో॥ యానాదిగారు మనమే పెద్ద. ఆయన Young అనేవారు. క్రమశిక్షణ, కార్యాదీక్ష, సమయపాలన, జవాబుదారీతనం, నిష్పక్షపాతవైఖరి, నిరాడంబరత కలగలిపి పోతపోస్తే కేశవన్నయ్య. ఆబాలగోపాలం కేశవన్నయ్య అంటే భయభక్తులతో మెలిగేవాళ్ళు Big Brother అని.
‘అమెరికా నుంచి విరాళం వచ్చింది. తెల్లవారి మెయిల్ చెక్ వేశారా?’ (ఆఫీసువారితో)
‘దర్భలూ, పరిస్తరణలూ ఏవండి ? ఎలా చేస్తున్నారు హోమాలు ?’ (అర్చకులతో)
వేదపండితుని కోసం, విద్యార్థుల కోసం ఏం చేద్దామనుకుంటున్నారు?” (సుబ్రహ్మణ్యంతో)
– ‘అనసూయేశ్వరాలయ కుంభాభిషేకం గురించి ” ఏం ఆలోచించావు?’ (వీరభద్రశాస్త్రిగారితో)
ఇలా ప్రశ్నించేసరికి ఏమి సమాధానం చెప్పాలో తెలియ నిశ్చేష్టులయ్యేవారు వారందరూ. శ్రాంతిని చూస్తే విశ్రాంతికి, సత్యాన్ని చూస్తే అనృతానికి భయమే. అమ్మ పని నిరాటంకంగా జరగాల్సిందే. అందులో నిర్లక్ష్యం వహించేవారి నెవరి నైనా కానీ ఉపేక్షించేది లేదు. కేశవన్నయ్యకి కోపం బహుజనహితాయ మాత్రమే.
అన్నయ్య ఆత్మీయతా పిలుపుకూడా ఘాటుగానే ఉంటుంది. ఒక ఉదాహరణ. అది మాతృశ్రీ వజోత్సవాల సంరంభ సమయం. కేశవన్నయ్య నేను మరి నలుగురు ఒక పందిట్లో అశేష సందర్శకులకు భోజనం వడ్డిస్తున్నాము. సమయం మధ్యాహ్నం 2 గంటలు దాటింది. రద్దీ కొద్దిగా తగ్గింది. ‘సుబ్రహ్మణ్యంగారు ! రండి ! భోజనం చేద్దాం’ అన్నారు ఆయన. ‘మీరు చేయండి. నేను తర్వాత చేస్తాను’ అన్నాను. వెంటనే కేశవన్నయ్య కోపంగా ‘అలా అయతే మేము చేయము’ అని భీష్మించారు.
బాపట్లలో చిదంబరరావు తాతగారింటి స్థానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనే చిరకాల సంకల్పం సిద్ధించటానికి ఒక యజ్ఞంలా అక్కడ వరుసగా మూడు బుధవారాలు పూజ చేసి అమ్మకి ఇష్టమైన (అన్నయాగం) రుచికరమైన అన్న ప్రసాదాన్ని సభక్తికంగా జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులకు, స్థానికులకు ఆప్యాయంగా అందించారు.
అనేక మంది జిల్లెళ్ళమూడి సోదరీసోదరులలోని ఆదర్శలక్షణం అని సంభావన చేసే ఒక విశిష్టగుణం వారి నుంచి నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తీ తన సంతానాన్ని (వచ్చే తరాన్ని) అమ్మ సేవకు అంకితం చేయడం; అందుకు ప్రేరణనివ్వడం. కేశవన్నయ్య కుమారుడు చిరంజీవి. తేజోమూర్తి ఆదరణాలయ నిర్మాణ నిమిత్తం 10 లక్షలు రూపాయిల, వేదపాఠశాల నిమిత్తం 2 లక్షల రూపాయిలు, కుమార్తె ఆదరణాలయం నిమిత్తం 2 లక్షల రూపాయిలు విరాళాన్ని అందించారు. అట్టి స్ఫూర్తి ప్రదాత నిస్సందేహంగా చిరస్మరణీయులే.
ఏప్రియల్ నెలలో నాకు కబురు చేశారు. నాతో వారి కడసారి పలుకులు : “శ్రీ విశ్వజననీ చరితమ్” ప్రథమాధ్యాయంలో విష్ణుసహోదరి శ్యామలాంబ అమ్మగా అవతరించెనని వ్రాయటం తనకు మనస్తాపం కలిగించిదని భాస్కరరావు అన్నయ్య అన్నారు. ఆయన ఋషితుల్యుడు. ఆయన మాటని మనం గౌరవించాలి. మనం సర్వసంగపరిత్యాగులం. మనకి పట్టింపు ఎందుకు ? ఏం చేస్తే బాగుంటుంది? ఆలోచించండి. నేనూ, పి.యస్.ఆర్. పారాయణ చేసేటప్పుడు మాతృశ్రీ సప్తశతి అన్నట్లు 700 శ్లోకాలనే ఎంపిక చేశాము. అందులో ప్రధమాధ్యాయం లేదు; ప్రధమాధ్యాయాన్ని తొలిగించి పునర్ముద్రణ చేద్దామా? పన్నాలవారితో మాట్లాడండి. వారేమైనా వివరించింది. మార్పుచేద్దామంటే రచయితతోనే చేయిద్దాం.
వేదశాస్త్ర పండితులతో నేను సంప్రదించాను. ‘మామూలుగా ఆలయ శిఖరానికి నాలుగేళ్ళకి ఒకసారి కుంభాభిషేకం నిర్వహిస్తారు. కానీ సర్వస్పర్శనావకాశం ఉన్న ఆలయానికి ప్రతి ఏటా చేయాలి,’ అన్నారు.
4.6.10వ తేదీన కేశవన్నయ్య తన పాంచభౌతిక శరీరానికి వీడ్కోలు పలికి అనంతమ్మలో లీనమైనారు; ఆప్తవాక్యంతో గొంతు కలిపారు.
“మీరంతా నా సంకల్పంతోనే పుట్టి, నాలోనే పెరిగి, నాలోనే లయం అవుతున్నారు” అని ప్రకటించిన అద్వైత తత్త్వరసాధిదేవత అమ్మ ప్రకటన ప్రకారం అన్నయ్య విశ్వాంతరాత్మ అమ్మ గర్భస్థ శిశువుగా ఒడిగిపోయి, అమ్మ మమకార సాగరంలో వటపత్రసాయిలా విశ్రాంతి తీసుకుంటున్నారు; అమ్మ కళ్ళలో, కరాలలో, పాదాలలో అణువణువుతో తాదాత్మ్యం చెంది సాక్షీభూతంగా ఉన్నారు.
అన్నయ్యకి కాషాయగుడ్డలంటే అమితమైన ప్రేమ. అన్నయ్యకీ భోగభాగ్యాలకీ, అర్థానికీ, అపార్థానికీ మధ్య ఉన్నంత దూరం ఉంది. స్వంతవూరులో దర్జాగా తిరగగలిగిన స్తోమత ఉంది; అయిన సాగరకెరటంలా పడుతూ తీస్తూ చిన్న మోపెడ్ మీద శరవేగంతో బాపట్ల – జిల్లెళ్ళమూడి మధ్య దూసుకు పోయేవారు. శరీరం ఎక్కడ ఉన్నా చిత్తం అనసూయమ్మ శ్రీ చరణాల్లోనే. “తిరిగేది సంస్థ పనిమీదే కదా ! నా కారు వాడుకో,” అని బ్రహ్మాండం రవి అన్నయ్య చెవిన ఇల్లు గట్టుకొని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.
అందరింటి పరువు ప్రతిష్ఠల కోసం; అమ్మ కార్యసిద్ధి కోసం నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. నేను ‘అన్నపూర్ణాలయం’ గ్రంధరచన చేసినపుడు ‘నాన్నగారిని తక్కువ చేసి చూస్తేకానీ అమ్మ స్థాయి పెరగదా?’ అంటూ ఫలానా వాక్యాల్ని తిరగవ్రాయమన్నారు. ‘కేశవన్నయ్య మాట అంటే అది శిలాశాసనం’ అని రూఢిగా పలికారు సో॥ మోహనకృష్ణ ఆ సందర్భంలో.
“దైవం పంపిన మనిషి దైవం ఇష్టప్రకారం దైవంలోకి పోతే మధ్యలో మన ఏడుపు ఎందుకు?” అని అమ్మ ఒక సందర్భంలో ప్రశ్నించింది. దానికి సమాధానం మరొక సందర్భంలో “మీ మంచితనమే నన్ను ఏడిపిస్తుంది” అని
అమ్మ స్పష్టపరిచినట్లు ప్రతి ఒక్కరు కారణజన్ములే. అన్నయ్యని అమ్మ దేనికి ఎంపిక చేసుకున్నదో ఆ పని వేరొకరికి సాధ్యం కాదు.
– మత్తోభవతి, తప్తోభవతి, ఆత్మారామోభవతి’ అనే – అర్థవాక్యానికీ అన్నయ్య ప్రతిరూపం;
– జగన్మాతృసేవాభావానికి, పారదర్శక మనస్తత్వానికి సాకార రూపం. అన్నయ్య అస్తమించటంతో;
– బలమైన అండ విరిగి పడిపోయింది; పెద్ద దిక్కు శూన్యంలో కరిగిపోయింది.
– ఒక పాశుపతాస్త్రం కనుమరుగైంది; ఒక ఆరాధన జ్యోతి ఆరిపోయింది.
– ఉపాసనా రూప ఆదిత్య బింబం మృత్యురూప రాహుగ్రస్తమైంది. అక్కడ మృత్యువు అమ్మే: రాహువు అమ్మే. నానావిధ పరిమళ పత్ర మంత్రపుష్పం మట్టిలో కలిసింది. మట్టి అమ్మే, పుష్పమూ అమ్మే,
– విడివడిన అమ్మ అనురాగరక్తం తిరిగి గూటికి చేరింది. రక్తమూ అమ్మే. నిత్యనైమిత్తిక కర్మలలో, వేదవిహిత కర్మలలో, సంస్కారోద్దేశిత కర్మలలో, శుభపుణ్యతిథుల్లో, సంకల్పంలో భాగంగా ‘ఓం కేశవాయ స్వాహా’ అని ప్రపధమంగా అనటం ఆర్షధర్మం, ముందుగా ఉచ్చరించేవి ‘కేశవ నామాలే’. అలాగే అందరింటి, సంస్థ కార్యకలాపాలు, వివిధ పధకాల రచన, నిర్వహణ పరంగా కేశవన్నయ్య మార్గదర్శకత్వం నిరుపమానము, అమూల్యము. ఉదా: 5.6.10వ తేదీన అన్నయ్య పార్థివ శరీరానికి పంచామృతాలతో అభిషేకం జరుగుతోంది. శ్రీ అనసూయేశ్వరాలయ రజతోత్సవ ఆహ్వానలేఖను రూపొందించాలి. అప్రయత్నంగా ఆఫీసువారు కేశవన్నయ్య వ్రా…స్తా…డు….’ అని అర్థోక్తిలో ఆగిపోయారు.
ఈ విశ్వనాటకరంగం నుంచి తన నిష్క్రమణ ముందుగానే తనకు స్ఫురించింది. కనుకనే తన వివాహమై 50 సంవత్సరాలైన శుభసందర్భంగా జిల్లెళ్ళమూడిలో రక్త సంబంధ బంధువులు, ఆత్మీయబంధువులతో సంతోషంగా వంటివి. భక్తితో శ్రీ అనసూయావ్రతాన్ని అమ్మ కళ్యాణవేదిక పై జరుపుకొని వారందరికి అన్నం, గుడ్డలు పెట్టి ఆనందించారు.
తన జీవిత చరమాధ్యాయంలో శ్రీ అనసూయేశ్వరాలయంలో పంచాయతన, శ్రీ చక్రప్రతిష్ఠల కోసం స్వయంగా అనేక పల్లెలు, పట్టణాలు, నగరాలుకి పోయి అమ్మ అనుంగుబిడ్డల్ని, మహితాత్ముల్ని చివరిసారిగా తన కళ్ళతో చూచుకున్నారు; అది అమ్మ సంకల్పమని ఎలుగెత్తి చాటారు; తపించారు; పరిపూర్ణ జీవితాన్ని పూర్ణాహతి చేశారు.
‘స్థిత – స్థితా ఉచ్చలిత; ప్రయాతాం
నిషేదుషీ దాసన బంధ ధీరః
జలాభిలాషీ జలమాదదానాం
ఛాయైవ తాం భూపతి రన్వగచ్చత్’ – అన్నారు కాళిదాసు మహాకవి. (దిలీప చక్రవర్తి నందినీ ధేనువును సేవించిన తీరు అది. ధేనువు నిలబడితే తానూ నిలబడి, నడిస్తే తానూ నడిచి… నీడవలె వెన్నంటి సంచరించెను) అదే విధంగా కేశవన్నయ్య సంస్థ పనే అమ్మ పని (Ser vice to Institution is the service to the Viswajananee) అని అనవరతము సేవాతత్పరులై ఉండేవారు.
– ‘ఒక అమాయకపు తల్లి తన కన్నప్రేమను తన సంతానము వరకే పరిమితం చేయకుండా అందరికీ పుక్కిట బంటిగా పంచింది’ అని వాత్సల్యతరంగితమైన అమ్మ మనస్సుకు దర్పణం పట్టిన బ్రహ్మ మానసపుత్రుడు అన్నయ్య.
– అన్నయ్య మేటి కవి. తాను అమ్మ శ్రీ చరణాలకు సమర్పించిన సాహిత్య కుసుమాలు కొన్ని, 1) పదార్చన 2) అక్షరాంజలి 3) విశ్వజనని 4. అంతరంగ తరంగాలు
– ‘యో వేదా’ స్వరః ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః’ అనే వేదవాక్కుని ఆచరణాత్మకంగా ప్రబోధించిన సర్వసంగ పరిత్యాగి అన్నయ్య.
– “గతులన్ని ఖిలమైన కలియగుమందున గతి ఒక్కటే. అనసూయామాతశ్రీ చరణ శరణాగతి ఒక్కటే” – అని దర్శించిన భాగవతోత్తముడు, జగజ్జనని శ్రీ చరణ రేణువు, తత్త్వతః అమ్మ అంతరంగిక కార్యదర్శి కాదు అనంతరంగ కార్యదర్శి ఆ తపస్వి మహాప్రస్థానం అమ్మ హృదయస్థానమే.