తెలుగు సారస్వత పరిషత్లో విజ్ఞాన సదుస్సుః డా. సూరిభగవంతం, డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తిగారి ప్రసంగాలు.
ఇద్దరితో నాకు బంధుత్వం వుంది. భగవంతం గారితో పరోక్షమైన బంధుత్వం. వారి శిష్యులు వెంకటరాయుడు గారు నాలుగేళ్ళ కిందట నత్తనడక నడిచిన నా ఆనర్స్ చదువుకి ప్రొఫెసర్. శ్రీపాదవారితో ప్రత్యక్ష బంధుత్వం. వారి అన్నగారి అమ్మాయి రెండేళ్ళ క్రిందట నా భార్య కావడం.
డాక్టర్ సూరి భగవంతంగారు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. 1950 ప్రాంతాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అద్భుతమైన పరిశోధనలకు ప్రాణం పోసిన వ్యక్తి. నాకు తెలుగులో రాయడం తెలీని, వ్రాసినా ఇంగ్లీషులో చెప్తే కాని ఎవరికీ అర్థంకాని పరిశోధనలు స్పెక్ట్రోస్కోపీ, సూపర్ కండెక్టివిటీ వంటి అంశాల మీద దాదాపు 1700 వ్యాసాలు ప్రచురించటానికి మార్గదర్శకులయ్యారు.
ఇవన్నీ ఒక ఎత్తు. ఈయన సత్యసాయిబాబాని దర్శనం చేసుకొని వారి అద్భుతాలకు ముగ్ధులై హేతువాదమే ఊపిరిగా ఉన్న శాస్త్రవేత్త దైవభక్తుడిగా, బాబాగారి అనుయాయిగా మారిపోయారు. ఇది చరిత్రలో కొత్త విషయమేమి కాదు. భారదేశంలో అసలు కాదు. (మన తరంలో ఒక చలంగారు ఉదాహరణ చాలు ఇందుకు). బాబాగారు అవతార పురుషులని సేవించారు.
ఆయన ఓ వ్యాసంలో తన అనుభవాన్ని ఉటంకించారు. అది వినదగ్గది. జపాన్లో ప్రపంచ ప్రఖ్యాత గడియారాల నిర్మాణ సంస్థ ‘సీకో’ ప్రతినిధి ఒక మేలు రకం వాచీని తయారు చేసి, మిగతా పరీక్షలకోసం తన బీరువాలో దాచి. ఇండియాకి వచ్చాడట. బాబా గారి గురించి విని కేవలం కుతూహలంతో ఆయన దర్శనానికి వచ్చాడట. భక్తుల మధ్య బాబా అతన్ని చూసి ఒక చిన్న పార్శిలు గాలిలో సృష్టించి చేతికిచ్చారట. ఇతను తెరచి చూస్తే జపానులో తాను బీరువాలో దాచిన వాచి కనిపించింది. ఆ వాచికి తాను కట్టిన సిల్కు రిబ్బను, వాచి పేరు, ధర అన్నీ చూసి దిగ్భాంత్రుడై స్వామి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేశారట. జపాన్ తిరిగి వెళ్ళాక బీరువా తెరచి చూసుకుంటే, వాచి అక్కడ లేదు. తన పర్సనల్ సెక్రటరీని పిలిచి అడిగాడట. ఆమె సమాధానం అతణ్ణి మరింత నిశ్చేష్టుడిని చేసింది. జుత్తు గుబురుగా ఉన్న ఓ స్వామి ఆఫీసులోకి వచ్చి, బీరువా తెరచి వాచి తీసుకు వెళ్ళారని చెప్పింది.
విశ్వాసానికి వివేచనకి ఆమడదూరం. వివేచన ఆగిన తరువాత విశ్వాసం మొదలవుతుంది. ఏమైనా ఈ కథ డాక్టర్ సూరి భగవంతం గారి వ్యాసంలో భాగం. ఈ విశ్వాసానికి ఆబ్రహం టి. కోవూర్ అనే హేతువాది రిలిజియో మానిక్ న్యూరోసిస్ అని అన్నారు. తెలుగులో చెప్పుకోవాలంటే మత పిచ్చితో వచ్చిన నరాల జబ్బు అని. సరే ! ఎవరి నమ్మకాలు వారివి. యేసు ప్రభవుని ఆయన కాలంలోనే ఆయన దేవుడని నమ్మని వారున్నారు.
డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు మరొక భౌతిక శాస్త్రవేత్త ఒక సారి ఆయన బల్లముందు కూర్చుని రాసుకుంటుంటే సీరాబుడ్డి వొలికింది. కాగితం మీద జిల్లెళ్ళమూడి అమ్మ రూపం ఏర్పడింది. అంతకు ముందు ఆమె గురించి ఎవరో చెప్పడం, ఆ విషయాన్ని ఆయన పట్టించుకోక పోవడం జరిగింది. ఇప్పుడీ సంఘటనకి ఆయన దిగ్భ్రాంతులయ్యారు. అంతకు మించి ఆ అద్భుతానికి చెలించి పోయారు. దరిమిలా ఆయన దైవచింతన వైపు మరలి పోయారు. జిల్లెళ్ళమూడి అమ్మ భక్తులయ్యారు. అమ్మతో వారి సంభాషణలు “అమ్మతో సంభాషణలు” అనే పేరిట 570 పేజీల గ్రంథం ప్రచురితమైంది. సత్యసాయిబాబా సమక్షంలో ఆధ్యాత్మిక ప్రసంగాలుజరిపారు. ఆయన ఆ కాలంలో హఠాత్తుగా కన్నుమూస్తే ఆయన దేహాన్ని బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమానికి తీసుకొచ్చారు. మాతృశ్రీ సమక్షంలో వారి ఏకైక కుమార్తె మా వదిన గారు శ్రీమతి గాయత్రి (ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ వి.పి. రామారావు గారి సతీమణి) తండ్రికి అంత్యక్రియలు జరిపారు.
తొలినాళ్ళలో కృష్ణశ్రీ అనే పేరిట గోపాల కృష్ణమూర్తిగారు సాహితీ చర్చలు జరిపారు. అలనాటి భారతి సంచికల్లో వారి విమర్శక వ్యాసాలు లేని “కలగూరగంప” శీర్షిక వుండేది కాదు. అద్భుతమైన వక్త.
చదువుతో, పరిశ్రమతో అబ్బిన సహేతుకత్వం, స్వానుభవంతో సంతరించు కున్న విశ్వాసం, అభిరుచితో ప్రోదు చేసుకున్న అభ్యాసం – ముప్పేటగా “అమ్మతో సంభాషణలు”లో ద్యోతకమౌతాయి.
భారతీయునికి విశ్వాసం యుగయుగాల పెట్టుబడి. మధ్యలో ఆలోచన, హేతువాదం అటూ ఇటూ నడిపి వెర్రి తలలు వేయించినా – ఒక గీత దాటితే – అతి సులువుగా ‘విశ్వాసం’ విశ్వరూపం దాలుస్తుంది. అందుకు ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు సూరి భగవంతం, శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారలే ఉదాహరణలు. (మరో సమాచరం పట్టభద్రుడు). ఈ వ్యాసకర్త కూడా గణిత, భౌతిక శాస్త్రంలో ఆనర్స్
సేకరణ – “డైరీలోని కొన్ని పేజీలు” మారుతీరావు – మనస్సాక్షి