2011 మే నెలలో ఉషాముళ్ళపూడి కార్డియాక్ సెంటర్, హైదరాబాద్లో నేను Total Health Checkup పరీక్షలు చేయించుకున్నాను. T.M.T. ద్వారా గుండెకు సంబంధించిన సమస్య ఉందనీ Angiogram తీస్తే తెలుస్తుందని చెప్పారు వైద్యులు.
కారణాంతరాల వలన ఆలశ్యం అయింది. 2012 మే నెలలో స్టార్ ఆస్పత్రిలో Angiogram తీశారు. ఒక రక్తనాళం పూర్తిగా block అయిందనీ, త్వరలో stent వేయించుకోమనీ అందుకు లక్షరూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. సరే నన్నాను.
ఆ రోజుల్లో మాతృశ్రీ పబ్లికేషన్స్ సమావేశానికి హాజరు కాలేనని నా అనారోగ్యం గురించి సో॥ శ్రీ పి.యస్.ఆర్ గార్కి చెప్పాను. ‘నాయనా! అదంతా అమ్మవారు చూసుకుంటుంది. నీకెందుకు? నువ్వు రావయ్యా’ అన్నారు.
మరికొన్నాళ్ళకి శ్రీ దినకర్ అన్నయ్య ఫోన్ చేసి ‘వేదపాఠశాల ఉపసంఘ సమావేశాన్ని నువ్వు ఏర్పాటు చేయాలి. జిల్లెళ్ళమూడి రావాలి’ అన్నారు. ‘నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది. ఎప్పుడు వస్తానో చెప్పలేను’ అన్నాను. ‘నాన్నా! నువ్వు వచ్చి అమ్మకి కొబ్బరికాయ కొట్టుకుని దణ్ణం పెట్టుకో. ఏమీ ఉండదు’ అన్నారు.
ఏటా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి stent లు వేస్తున్నారు bypass surgery లు చేస్తున్నారు. కాగా ‘నేను క్షేమంగా ఉండాలి’ అని కోరుకోవటం మానవ సహజం. వాస్తవానికి నా పరిస్థితి భిన్నమైనది. మా అమ్మ, అన్నయ్య, మేనమామ…. అంతా గుండె జబ్బుతోనే మరణించారు. కనుకనే ‘ఈ జబ్బు నుంచి నన్ను విముక్తుడ్ని చెయ్యి’ అని అమ్మను అడగటానికి నోరు రావటం లేదు.
‘మాతర్భవాని! మమదేహి కరావలంబమ్’ అని ప్రార్థించినా, విధి నిర్వహణలో పనిభారంలో ప్రార్థించకపోయినా అడుగడుగు గండాల నుంచి అనేక సార్లు అమ్మ నన్ను రక్షించింది. రిటైర్ అయిన తర్వాత వివాహాది శుభ కార్యాలకి, అవసరాలకి ప్రభుత్వ సొమ్ము లక్షలు తెచ్చి దోసిట్లో పోసింది; ఉరితాడును పసుపుతాడుగా మార్చింది; కంట్లో దిగాల్సిన ముల్లును కాలిలో దిగటంతోనే సరిపెట్టింది.
ఏం ముంచుకొచ్చినా అమ్మ మీదే భారం వెయ్యటం అలవాటు. కాగా. నాకు మాత్రం stent గానీ, ఆపరేషన్ గానీ వద్దని ప్రార్థించటం సమంజసమా? – అని మనస్సు పరిపరి విధాల పోతోంది.
2014లో మళ్ళీ Angiogram తీశారు. ఈసారి two blocks ఉన్నాయన్నారు. మానసికంగా అన్నిటికీ సిద్ధపడ్డాను. రెండు లక్షల రూపాయలు సమకూర్చుకున్నా. జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మకు ప్రణమిళ్ళి హైదరాబాద్ చేరుకున్నా. ఈ రోజుల్లో విద్యారంగం, వైద్యరంగం… అన్ని రంగాల్లో వ్యాపార దృష్టి ప్రబలిపోయింది. డబ్బు ఖర్చు అయినా సరైన వైద్యం లభిస్తుందనే నమ్మకం లేదు. అలా. లభ్యమైతే దైవానుగ్రహమే. మా అమ్మాయి అనసూయ, మా అల్లుడు SUNSHINE ఆస్పత్రిలో చూపించుకోమన్నారు second opinion కోసం.
2014 డిసెంబర్ నెలలో వెళ్ళాను. డా॥ ఎం. అనిల్ కుమార్, హృద్రోగనిపుణులు, medical reports చూశారు. కంప్యూటర్ మీద Angiogram ను పరిశీలించారు. ‘డయాబెటిస్ ఎన్ని సం॥ల నుంచి ఉంది? ఎంత దూరం నడవగలరు? కాళ్ళకి నీరు పడుతోందా? వంటి ప్రశ్నల్ని వేశారు. మోకాలి నుంచి పాదాల వరకు చూశారు. B.P. చూశారు. ఆ సందర్భంలో నా చేతి వ్రేలున ఉన్న ఉంగరంలో అమ్మ ఫోటోను చూసి ‘ఎవరీమె?’ అని అడిగారు. ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ అని అన్నాను. ‘చిన్న పిల్లవానిగా ఉన్నపుడు నన్నూ అక్కడికి తీసుకెళ్ళారు’ అన్నారు. నా కంఠానికి ఇరువైపుల ఉన్న రక్తనాళాల్ని తాకి పరిశీలించారు. ‘మీకు problem లేదు అని నేను అనను. మధుమేహం వలన సమస్య ఎక్కువగా ఉంది. దానిని control చేయాలి. మీకు stent కానీ surgery కానీ నేను suggest చేయను. రోజూ ఉదయం, సాయంకాలం walking చేయండి. మందులు అవే వాడండి. చాలు’ అన్నారు..
Stent కానీ operation కానీ అవసరం లేదు అని అనటం నాకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. తర్వాతే చెప్పుకోతగ్గ అసలు విషయం ఉంది. files. C.D., తీసుకుని లేచి నిలబడ్డాను. వెనుతిరిగి ఒక అడుగు వేయబోతున్నాను. డాక్టరుగారు లేచి నిలబడి ‘అయినా మీకు విచారం ఎందుకు? మీ అమ్మవారు చూసుకుంటారు అన్నీ’ అన్నారు. నాకు కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. డాక్టర్ గారి కుర్చీకి ఎదురుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో ఉన్నది. నిజమైన భక్తికి ఉదాహరణ డా॥ అనిల్కుమార్. ‘ఇదిగో బాబా వారి విభూతి పెట్టుకోండి, తగ్గిపోతుంది’ – అని అనలేదు. ‘మీకు విచారం ఎందుకు? మీ అమ్మవారు చూసుకుంటారు అన్నీ’ అనే దివ్యౌషదాన్ని ఇచ్చారు; విశ్వాసము అనే పదాన్ని తత్వతః నిర్వచించారు.
నాటి నుంచీ నా ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉంది. భవిష్యత్లో ఏదైనా జరుగుగాక! ‘మీకు విచారం ఎందుకు? మీ అమ్మ వారు చూసుకుంటారు అన్నీ’ అనే మాట, ఒక ఉపదేశం, మహోదాత్తమైన సందేశం. ఆ విశ్వాసం కలగటమే
విశ్వాసం, ప్రార్థన.. అన్నపుడు ఒక పరమభాగవతోత్తములు అన్న మాట.
‘అశిధిల కరణేస్మిన్ అక్షర శ్వాస వృత్తా..
వపుషి గమనయోగ్యే వాసమాసాదయేయం’ – గుర్తుకు వస్తుంది. ఓ వేంకటాచలపతీ! ప్రభూ! నా ఇంద్రియాలు – కళ్ళు, కాళ్ళు, కీళ్ళు, చేతులువగైరా శిధిలం కాకుండా, నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిర్విరామంగా నిరాటంకంగా సాగుతూండగా, శరీరం స్వాధీనంలో ఉండగా నీ శ్రీచరణ సన్నిధిలో ఉండి నీ సేవ చేసుకుంటాను అని అర్థం.
నిజమే. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా శేషజీవితాన్ని అమ్మ సేవలో ఉంది అనే ఆకాంక్ష ఎండ మావిలో నీరే. పాంచభౌతిక దేహపటిమ – క్షీణించు, ధైర్యంబు తగ్గు ఉత్సాహంబులుడుగు, వయసు మీరిన వేళ వచ్చునా బలిమి? ఉపవాసాలూ, ఉపాసనలూ హుళక్కి, శరీరమాద్యంఖలు ధర్మ సాధనం. అదే పట్టు దప్పినపుడు సాధించగలిగింది ఏమీ ఉండదు.
ఆకటి వేళల – అలపైన వేళలను కరుణాంతరంగ తరంగా, అమ్మా! నీ విచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకోతల్లీ, నా శ్వాసను నీయందలి విశ్వాసంతో నింపు’ – అని ప్రార్థిస్తాం సాధారణంగా; మరొకదారి లేదు, దిక్కు లేదు.
కాగా బంగారు తల్లి, శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబక్కయ్య, ఎంచుకున్న మార్గమే వేరు. ‘అమ్మా! నాకు ఆపరేషన్ చేయిస్తావా? చేయించు. అక్కర్లేదా? మానెయ్యి. నా బాధ్యత నీది కాబట్టి ఏం చేసుకుంటావో చేసుకో. మధ్యలోనాకు బాధ ఎందుకు? ఆ బాధేదో నువ్వే పడతావు. ఆ నా బాధ్యతని నువ్వే మోస్తావు. నాకెందుకు ఆలోచన, ఆవేదన?’ – అంటుంది. అనన్య శరణ్య అమ్మ కర్తవ్యాన్ని విలక్షణ మాతృధర్మాన్ని అమ్మకే గుర్తుచేస్తుంది, అమ్మనామం చేసుకుంటూ నిమ్మకి నీరెత్తినట్లు ప్రశాంతంగా ఉంటుంది. మహిమలు అమ్మకి సహజం, మనకి విశేషం. Miracles are incidents that promote faith. (Bermand Shaw – St. Joan)
విశ్వాసమే సర్వజీవజీవన సంజీవని, దివ్యౌషధం.