వ్యక్తమయ్యేది రూపం, అవ్యక్త మయ్యేది తత్వం, అంటారు. ఇంతకు పూర్వం ఈ తత్త్వ చింతన అంటే నాకేమీ అర్థమయ్యేది కాదు గానీ గత కొన్ని రోజులుగా ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారాగానీ, చదివే పుస్తకాల వల్లగానీ మహానుభావుల వాక్కులలో కొద్ది కొద్దిగా అర్థమౌతున్నదని అనుకుంటున్నాను.
అమ్మ ఎప్పుడూ మన ఊహలకు అందదు. ఇది ఇట్లా జరిగితే బాగుండు అనుకున్నప్పుడు మన ఇష్టప్రకారం నడిపించినట్లే నడిపించి, మనకి ఏది ఎట్లా ఇవ్వాలో అలాగే చేస్తుంది. మన కర్మ ఫలాల ననుసరించి నడిపిస్తుంది. మన పూర్వజన్మ కర్మఫలాలను అనుభవింప చేసి అందరికీ సుగతే నని చెప్పిన అమ్మ మనకు ఆరాధ్య.
అమ్మ రూపం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నాటికీ కూడా ‘అమ్మ’ రూపాన్ని కళ్ళు మూసుకొని ఊహించుకుంటే ఆ ఆనందమే వేరు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటే మనస్సుకి ఎంత తృప్తిగా ఉంటుందో జిల్లెళ్ళమూడి వచ్చిపోయే భక్తులందరికీ అనుభవైక వేద్యమే. అందువల్లనే అందరూ ఎన్నో రకాలుగా తమ అనుభవాలను, భావాలను వ్యక్తీకరిస్తూ ఎన్నో పుస్తకాలను వ్రాస్తున్నారు. ‘అమ్మ’ మనందరికీ మంచి మార్గంలో ఎలా నడుచు కోవాలో దానిని ఆచరించి చూపింది. “నేను మీకు చీరెలను పెడుతున్నానంటే మీరు మరికొందరికి పెట్టమనీ, అందరినీ సమానంగా చూడమని” చెప్పటానికేనని చెప్పింది.
అమ్మను గురించి నాకు తెలిసినది చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మొదట్లో అమ్మను మామూలు మనిషిగానే తలచాను కాబట్టి. అమ్మను గురించి చెప్పాలని నేను సాహసించ బూనటం సూర్యుడ్ని దివిటీతో చూపించటం లాంటిది. లలితా పరమేశ్వరిని గురించి శ్రీ చాగంటి వారు చెబుతుంటే ప్రతి అక్షరం పొల్లు పోకుండా అమ్మకు అన్వయమౌతుందని ప్రతిసారీ నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ అమ్మ నిర్ణయప్రకారం జరుగుతుంది అని అనుకుంటే మనకు బాధ అనిపించదు.
ప్రస్తుతం నేను చెప్పే విషయాలు మా అత్తగారు మాతో చెప్పిన స్వీయ అనుభవాలు. శ్రీ రాజుపాలెపు రామచంద్రరావుగారి ధర్మపత్ని శ్రీమతి సీతారత్నం గారు. వాళ్లకు కలిగిన అనుభవాల వల్లగానీ వారి నమ్మకం గానీ అమ్మను మనసా వాచా కర్మణా దైవంగా గుర్తించి తరించారు. వారికి అమ్మ స్మరణ తప్ప వేరే ఆలోచనే ఉండేదికాదు. నేను కాపురానికి వచ్చినప్పటి నుండి వీలు దొరికినప్పుడల్లా అమ్మను గురించీ, అమ్మతో వారికి గల అనుబంధం గురించీ కళ్ళకు కట్టినట్లు మా అత్తగారు చెపుతూ ఉండేవారు. మా మామగారు కూడా నన్ను అమ్మ సుప్రభాతం, సంధ్యావందనం ప్రతిరోజూ చదవమని నిర్బంధంగా చెప్పేవారు. అప్పుడు నేను దాని విలువ తెలుసుకోలేక పోయినా తరువాత తరువాత ఏ కొద్దిగా నైనా నన్ను నేను సంస్కార పరుచుకోవటానికి ఉపయోగపడతాయనే చెప్పాలి. మా అత్తగారు తనకు, వాళ్ళ పెద్దబ్బాయికి (అంటే మా వారికి) (smallpox) వచ్చినప్పుడు, తరువాత వాళ్ళ చిన్నబ్బాయికి (accident) జరిగిప్పుడు అమ్మ ఎలా కాపాడిందీ కళ్ళకు కట్టినట్లు సినిమారీలులాగా చెప్పేవారు. అవి నా మనసులో అలానే హత్తుకు పోయినాయి. మా మామగారు శ్రీ రామచంద్రరావుగారిని గురించి వ్రాసినప్పుడు అందరూ చదివే ఉంటారు.
1976 ప్రాంతాలలో ఒక రోజు మా మామగారు బల్ల మీద నుండి క్రిందకు పడితే కాలు, చెయ్యి (fracture) అయినాయి. చాలా రోజులకు కట్టు తీసివేసిన తరువాత భోజనం చెయ్యటానికి (table) దగ్గరకు వచ్చేవారు. వచ్చేటప్పుడు హాలులో ఉన్న ‘అమ్మ’ ఫొటో దగ్గర కొంచెం సేపు ఆగి, ఆమెతో మౌనంగా ఏదో మాట్లాడుకొని వచ్చేవారు. అట్లా కొన్ని రోజులు జరిగిన తరువాత ‘అమ్మ’ ఒక రోజు బాపట్లలో శ్రీ దినకర్ గారి ఇంటికి వచ్చినప్పుడు వీరిద్దరినీ పిలిపించారు. అప్పుడు మా అత్తగారితో “వాడు రోజూ నన్ను అడుగుతున్నాడు. దాని పసుపుకుంకుమ కోసం నన్ను ఇట్లా పడేసి పెట్టావు అని. ఏమంటావు నువ్వు అని అన్నదిట. దానికి మా అత్తగారు “అమ్మా! భగవంతుడు మనం భూమి మీదకు వచ్చేటప్పుడే మన ముఖాన రాసి పంపిస్తాడంటారు కదా! ఇన్ని సార్లు రాయడు కదా!’ అని. అమ్మే బ్రహ్మ అని తెలిసిన మా అత్తగారిని కూడా మాయలో ముంచి అలా మాట్లాడించింది అమ్మ. ఆ రోజున తిరిగి వచ్చిన తరువాత మా అత్తగారి ముఖంలో కనిపించిన (glow) నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ తరువాత కొద్ది రోజులకే మా మామగారు పోవటం జరిగింది. ఆయన పోయిన రోజు ఆయన అంత్యక్రియలలో కావల్సిన అన్ని సామాన్లు అమ్మే పంపింది. ఆ రోజు అందరింటి “నాన్నగారు కూడా వచ్చారు. ఆ క్రిందటిరోజు జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ’ చాలాసేపు మా మామగారిని గురించే అక్కడ ఉన్న వాళ్లందరికీ చెప్పిందని ఆ రోజు వచ్చిన వాళ్లంతా చెప్పారు. ఆ తరువాత దాదాపు 25 సంవత్సరాలు మాకే కాకుండా తన మనవళ్ళకి, మనవరాళ్ళకి అమ్మను గురించిన ఎన్నో విశేషాలు మా అత్తగారు చెప్పేవారు. ఆమె మంచి (orator). అమ్మను గురించిన విశేషాలు చెపుతుంటే ఎన్ని గంటలైనా ఇట్లే గడిచి పోయేవి. ‘అమ్మ’ ఆమెను అట్లా ఎందుకు అడిగిందా అని చాలా రోజులు నేను ఆలోచించేదాన్ని. ఆమె అడిగి ఉంటే ఆమె కోర్కె ఏదైనా ‘అమ్మ’ తీర్చేదేమో నని. కానీ తరువాతి కాలంలో మనవళ్ల పెండ్లిండ్లు, మనవరాళ్ళ పెండ్లిండ్లు అన్నీ చూసుకొని చివరికి కొన్ని నెలలు అవస్థపడి చివరకు ‘అమ్మ – హైమ’ కనిపిస్తున్నారు. నీకు కనపడటం లేదా అని ప్రతి రోజూ అంటూనే దాటిపోయింది. మరి ‘అమ్మ’ అందరికీ సుగతిని ప్రసాదించటానికే ఈ భూమి మీద అవతరించింది కదా!
మొట్ట మొదటిసారి అమ్మను చూడగానే మా మామగారికి (తల్లి లేని ఆయనకు అమ్మే తల్లిలాగా కనిపించిందిట. ఆయన మనశ్శాంతి కొరకు ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి చివరకు ‘అమ్మ’ను చూచిన తరువాత సరైనచోటుకి చేరానని తృప్తి పొందారుట. ఆయన ఆధ్యాత్మిక సాధనలు ఎన్నో చేశారు. ఆయన కూచుంటే ఆయన వీపు భాగంలో తేజస్సు కనిపించేదిట. అలాంటి ఆయన కూడా చివరకు కొంత అవస్థపడక తప్పలేదు. అందరికీ సుగతి ప్రసాదించే అమ్మ వారి వారి కర్మ ఫలాలను ఈ భూమి మీదనే అనుభవింప జేసి వారికి మోక్షాన్ని ప్రసాదించే కరుణామయి కదా!
మా మామగారు ఒకసారి 7వ మైలు దగ్గర నుండి నడుచుకుంటూ జల్లెళ్ళమూడి వస్తుంటే జపాన్ తుమ్మముల్లు గుచ్చుకొని (septic) అయి చాలా బాధ పెట్టిందిట. తప్పనిసరి పరిస్థితులలో చీరాలలో డా. శ్రీధరరావుగారి దగ్గరకు వెళ్ళారుట. ఆయన దానిని తీయటానికి ప్రయత్నం చేస్తుంటే ఎంత నొప్పిగా ఉన్నా ‘అబ్బా’ అని అంటున్నారుట గానీ ‘అమ్మా! అని అనటం లేదుట. ఎవరైనా నొప్పిగా వుంటే ‘అమ్మా’ అంటారుగానీ నీవేమిటి ‘అబ్బా’ అంటున్నావు అని డాక్టరు గారు ప్రశ్నిస్తే అమ్మను మన లౌకిక అవసరాలకు వాడుకో రాదు అని అన్నారుట. అమ్మ అంటే అంత భక్తి, విశ్వాసం ఆయనకు. మరి విశ్వాసమే భగవంతుడు కదా!